Previous Page Next Page 
నరుడా ఏమి నీ కోరిక పేజి 62

 

    'సంతోషం' అన్నాడు ఏమనలేక.


    అతనికిదంతా అయోమయంగా ఉంది.


    ఇదంతా విష్ణుమాయ అని, బామ్మను మార్చడానికి, యమధర్మరాజుకు బామ్మ వల్ల కలిగే కష్టములు కడతెర్చడానికి ఆడిన మాయా నాటకం అని తెలీదు.


    వైకుంఠంలో వున్న శ్రీ మహవిష్ణువు చిర్నవ్వు చిందించాడు.


    "ఎందులకా చిరుదరహాసం స్వామీ!" అడిగింది కళ్ళు వొత్తుకుంటూ శ్రీమహాలక్ష్మి.


    
    "యముడిపాట్లు తలచుకుని"


    "బాగుగానే వున్నది. ఆ ముసలి బామ్మకు యమ రహస్యం తెలియజేసి బట్టబయలు చేసితిరి."


    శ్రీమహావిష్ణువు నవ్వి.


    "ఈ క్షణం నుంచి ఆమెకు అంతక్రితం జరిగినవేవీ గుర్తురావు. కేవలం తను మారిన విషయం తప్ప. ఎందుకలా మారిందో కూడా మరచిపోతుంది. అంతా విష్ణుమాయ" అన్నాడు.


    తధాస్తు దేవతలు ఆనందంగా తధాస్తు అన్నారు.


    
                                                                 * * *


    బిజినెస్ కొద్దికొద్దిగా డెవలప్ అవ్వడంతో శ్రీచంద్ర ఉత్సాహం రెట్టింపయ్యింది. ఆత్మవిశ్వాసం మరింత ఎదిగి అతని గుండెలో ఒదిగిపోయింది.


    తల్లి మారింది.


    కారణమేమిటో తెలియదు గానీ బామ్మ మారింది. ఇక మారాల్సింది తన తండ్రి గరుడాచలం.


    అందుకే నాటకం అడదల్చుకున్నాడు.


    ఆ నాటకంతో ముఖ్యపాత్రధారి యమధర్మరాజే.


    
                                                           * * *


    "నేను నాటకమాడవలయునా? కుదర్దుగాక కుదర్దు. అయినా నువ్వు చచ్చుతానని మాటిచ్చావు. ఇంకనూ చచ్చుటలేదు" అన్నాడు కోపంగా యమధర్మరాజు.


    "అలా అయితే నేను చచ్చుట కూడా కుదర్దు" అన్నాడు బుంగమూతి పెట్టి శ్రీచంద్ర.


    బుర్ర గోక్కున్నాడు యమధర్మరాజు.


    "మానవా! నీతో నాకు చిక్కొచ్చి పడింది" అని "సరే ఏమి నాటకం? ఒక్క విషయం. నువ్వు తొందరగా చచ్చువలయును" అన్నాడు.


    "అలాగేలే మొగుడా" అన్నాడు విసుగ్గా శ్రీచంద్ర.


    "ఏమది?"


    "ఏమిలేదు"


    "సరే నాటకమేమిటో చెప్పు."


    "చెవిలో చెప్పాడు శ్రీచంద్ర.


    "శివ...శివా.....ఆ ప్రౌడ వయసు లలనామణికి జోడిగా నటించవలయునా? అసాధ్యం"


    "సరే. మరయితే...నేనూ చచ్చుట అసాధ్యమే"


    "ఆ....మానవా! ఇరకాటంలో పెట్టుచున్నావు" అని "సరే.....అటులనే" అన్నాడు తప్పనిసరిగా యమధర్మరాజు.

 

                                                                * * *


    పూలరంగడిలా ముస్తాబయ్యాడు గరుడాచలం.


    ఈరోజు తన ఇంట్లో, తన పడగ్గదిలో గడుపుదామని చెప్పింది జెన్ని.


    ఆమె ట్రాన్స్ లో నుంచి బయటకు రాలేకపోతున్నాడు. హుషారుగా ఈల వేసుకుంటూ నీట్ గా తయారయ్యాడు. ఫెర్ ఫ్యూమ్ స్ప్రే చేసుకున్నాడు.


    ఆటోని పిలిచి అడ్రస్ చెప్పాడు.


    అటో పీలూ ఇంటివైపు వెళ్తోంది.


    ఆ వెనుకే మరో ఆటోలో శ్రీచంద్ర, అతని తల్లి వెళ్తున్నారు.

 

                                                            * * *


    అటో దిగి మీటర్ చూసి డబ్బులిచ్చిన తన చేతికి కట్టుకున్న మల్లెపూల వాసన చూసి ఒక్కసారిగా పీల్చి "ఆహా" అనుకుని తలుపు తట్టాడు.


    తలుపులు దగ్గరగా వేసి వున్నాయంతే! వెంటనే తెరచుకున్నాయి.


    "అంటే తనకు వెరైటిఆహ్వానం అన్నమాట" అనుకున్నాడు సంతోషంగా గరుడాచలం.


    పీలూ పడగ్గది వైపు వెళ్ళి లోపల్నుండి మాటలు విని ఆగిపోయాడు.


    ఓ గొంతు తనకు సుపరిచితమైంది. పీలూది మరో గొంతు.....ఎవరిది?


    మెల్లిగా కిటికిలో ఉంచి లోపలికి తొంగిచూసాడు.


    ఓ పురుషుడి వీపు వెనుక భాగం కనిపిస్తోంది.


    "నీ పేరేమిటన్నావ్ డియర్?" మత్తుగా వుంది పీలూ గొంతు.


    "యం.డి. రాజు" అన్నాడు యమధర్మరాజు. ప్యాంటూ, షర్టుతో వున్నాడు.


    "ఎంత స్మార్ట్ గా వున్నావు? ఎంత ముద్దుగా వున్నావు. ఎంత ముద్దోస్తున్నావు." అంది అతని దగ్గరికి వచ్చి. అతని మెడ చుట్టూ చేతులు వేసి.


    "వద్దొద్దు....దగ్గరికి రావద్దు" కంగారుగా అన్నాడు యమధర్మరాజు.


    "యూ నాటి డాళింగ్" అంది మరింత దగ్గరగా వచ్చి పీలూ.


    "మరి ఆ గరుడాచలం?" అడిగాడు యమధర్మారాజు.


    రెండు నిమిషాలపాటు నవ్వింది.


    "వాడా....వాడొట్టి ఫూల్. ఓ చిర్నవ్వు విసరగానే ఐస్ అయిపోయాడు. నన్ను హోటళ్ళకు తిప్పడానికి, డిస్కోలకు తీసుకెళ్ళడానికి ఓ బక్రా కావాలి. వాడు దొరికాడు అయినా ముసలి, డొక్కు మనిషి, ఓ సరసము తెలియదు, ఓ సరదా తెలియదు. వట్టి దద్దోజనం, ముద్దపప్పు. రెండు మాటలు పొగడగానే ఉబ్బిపోతాడు. ఓ చిటికె బుగ్గన వేస్తె మురిసిపోతాడు. పూర్ ఫెలో" అంది పీలూ.


    
    "తప్పు కదూ...." యమధర్మరాజు అన్నాడు.


    "వాట్ తప్పు? ఇంట్లో బుద్దిమంతురాలైన, అందమైన భార్యను పెట్టుకుని నాలాంటి ఆడదాని దగ్గరకు రావడం వాడి తప్పు. మగాళ్ళ సైకాలజీ అంత. పెళ్ళామెంత అందంగా ఉన్నా పరాయి వాడి పెళ్ళాం ముద్దుగా కనిపిస్తుంది. అయినా వాడి గోల ఎందుకు డియర్....కమాన్" అంది పీలూ.

 

                                                              * * *


    తూలి కిందపడబోయాడు గరుడాచలం.


    అతనా షాక్ లో నుంచి కోలుకోలేదు.


    తనని ఎంత మాటన్నది? నిజమే....తను ఫూల్ లా బిహేవ్ చేసాడు. ఈ వయసులో భార్యను కాదని, ఎదిగిన కొడుకుని పెట్టుకుని....చీ...చీ....


    ఒక్కో దృశ్యం అతని కన్నుల ముందు కనిపించింది. ఎంత తేలిగ్గా తనని ఫూల్ చేసింది.


    ఇప్పుడా సంఘటన చూడకపోతే తాని భ్రమలోనే బ్రతకాల్సి వచ్చేది.


    ఒక్కసారిగా అతనికి ఏడుపోచ్చేసింది. నిలబడ్డానికి కూడా ఓపిక లేదు.


    మెల్లగా బయటకు వచ్చాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS