దానికి కారణం జయంతి కాకపోవచ్చు.
కారణం ఏదయినా వాళ్ళిద్దరూ అందరితో పాటే ఒకే ఇంట్లో వుంటున్నప్పటికి విడిగా వుంటున్నట్లే లెక్క,
సురేంద్ర వైఖరి గమనించిన సర్వోత్తమరావు తన ముగ్గురు తమ్ముళ్ళ పేరుమీద నున్న పొలాన్ని వేరే వ్యక్తికి కౌలుకి ఇచ్చాడు.
ఇది గిరిజకు మరింత కంటగింపుగా మారింది.
సర్వోత్తమరావు కూడా కాంట్రాక్టు పనులు పూర్తిగా మానేశాడు. ప్రస్తుతం వాళ్ళ జీవనాధారం ఆ పోలమే.
ఏడాదికి సరిపోయే ధాన్యం వస్తుంది. కాయగూరలు వస్తాయి. కౌలు ద్వారా కొంత రొక్కం రూపంలో వస్తుంది. అది కుటుంబం నడపటానికి సరిపోతుంది. ఇక జయంతి పెళ్ళి చేయాలంటే పొలంలో కొంత భాగం అమ్మాల్సిందే. ఈ మధ్య ఆయనకు ఈ దిగులు పట్టుకుంది.
మాధవరావు మాత్రం ఇంటికి సరిపడా సరుకులన్నీ తనే తెస్తున్నాడు. దాక్షాయణి మాత్రం ఆ విషయంలో భర్తకు పూర్తీ సహకారాన్ని అందిస్తుంది. కస్తూరికి కూడా ఈ మధ్య కూతురి పెళ్ళి విషయం దిగులు పట్టుకుంది.
జయంతి మాత్రం అందర్నీ ఎదిరించి టెన్త్ పాసయిన తరువాత కాలేజిలో చేరింది. ఎఫ్.ఎ. పూర్తి చేసిన తరువాత డిగ్రి కూడా చేసి మంచి ఉద్యోగం సంపాదించాలనేది ఆమె పట్టుదల. కాలేజికి రోజు పట్టణం పోయివస్తుంది. బస్సులో పోయి బస్సులో వస్తుంది.
రామశేషు మరణం, సోమసుందరం విడిపోవటం సురేంద్ర, గిరిజలు అసలేం పట్టించుకోకపోవటం సర్వోత్తమరావుని బాగా కుంగదిసాయి. అప్పటికి మాధవరావు ఆయనకు ధైర్యం చెపుతూనే వుంటున్నాడు. అన్నగారి ఆరోగ్యం విషయం అతను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాడు.
ఆ ఇంటి వాతావరణం అంత గంభీరంగా, నిశ్శబ్దంగా మారిపోతుందని ఆ కుటుంబ సభ్యులు ఎవరూ వూహించలేదు.
"దాక్షాయణి, దాక్షాయణి" కస్తూరి కేకేసింది.
"వస్తున్నానక్కా" అంటూ దాక్షాయణి వంటగదిలోకి వెళ్ళింది.
"ఏంటక్కా" అంది దాక్షాయణి.
"ఈ కూరగాయలు తరిగి కాస్త కూరలు చేయమ్మా. నేను స్నానం చేసి వస్తాను. జయంతెంటి ఇంకా రాలేదు" అంది కస్తూరి.
"అయిదేకదక్కా టైము ....వచ్చేస్తుంటుందిలే" అంది నవ్వుతూ దాక్షాయణి.
"ఏంటో దాని పంతం దానిదే. మనకెందుకే ఆ చదువులు వద్దని ఎంత మొత్తుకున్నా వినిపించుకోకుండా మొండిగా చదువుతోంది" అంది కస్తూరి దిగులుగా.
"మంచిదే కాదక్కా! మన కుటుంబంలో కాలేజి చదువులు ఎవరు చదవలేదు. జయంతి చదువుతుంటే మనకే కదా గొప్ప" అంది దాక్షాయణి.
"గోప్పెనమ్మా రేపు ఆ చదువులకు తగినవాడినో ఆవిడకు రెట్టింపు చదినవాడినో చూసి పెళ్ళిచేయాలి కదా! మన కుటుంబపరిస్థితి ఇదివరకులా వుందా చెప్పు! ఎంత కట్నం ఇచ్చి చేయాలి?" అంది కస్తూరి.
ఒకవిధంగా ఆమె అన్న మాటల్లో కూడా నిజం లేకపోలేదు. జయంతికి తగిన సంబంధం చూడాలంటే వేలకువేలు కట్నం పోసే చేయాలి అనుకుంది దాక్షాయణి.
పైకి మాత్రం కస్తూరికి ధైర్యం చెపుతూ,
"ఉద్యోగం చేసి తన కట్నం తనే సంపాదించుకుంటుందక్కా నీ కూతురు. నువ్వేం దిగులుపడకు....అయినా మన పొలం కొంత అమ్మి అయినా సరే జయంతి పెళ్ళిచేద్దాం" అంది దాక్షాయణి.
"ఉన్న ఆ ఒక్క ఆధారం కూడా అమ్మేస్తే మిగిలిన పిల్లలు అనధలైపోతారు." అంటూ బక్కేట్టులో వేడినీళ్ళు పోసుకుని పొయ్యిమీద బియ్యం కడిగి పెట్టి, నేను స్నానం చేసొస్తా దాక్షాయణి అంటూ బక్కెట్టు తీసుకుని పెరటివేపు వెళ్ళింది కస్తూరి.
అక్క చెప్పింది వాస్తవమే....జయంతి తరువాత ఇంకా ముగ్గురు పిల్లలున్నారు. వాళ్ళంతా పెద్దయి వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు చేయాలంటే కూడా ఇప్పుడున్న పొలం సరిపోదే పెదబావగారు కాంట్రాక్టు పనులు మొత్తం మానేశారు. ఆయనకు జీవితం మీద విరక్తి పుట్టింది. కస్తూరక్క భయపడటంలో తప్పులేదు. మేము ఏదైనా సాయం చేద్దామన్నా ఇద్దరు పిల్లలున్నారు. వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే వుంది. ఏంటో, ఎలా జరగాలని రాసిపెట్టి వుందో అలానే జరుగుతుంది అనుకుంది దాక్షాయణి.
"ఏంటి పెద్ద పిన్ని వంట చేస్తున్నావా?" అంటూ వచ్చింది జయంతి టవల్ తో ముఖం తుడుచుకుంటూ.
"ఇంకా పెద్దపిన్ని, చిన్నపిన్ని అనటం ఎందుకమ్మా మిగిలింది ఇక్కడ ఒక్క పిన్నే కదా!" అంది విచారంగా దాక్షాయణి.
"అవును పిన్ని! ఏంటో అలా అలవాటయిపోయింది. పాపం చిన్న పిన్ని ఎలా వుందో....తనకు అసలు ఇష్టం లేదు వెళ్ళటం.....అప్పుడప్పుడు కాలేజి నుంచి పిన్ని దగ్గరకు వెళ్ళి పలకరిస్తున్నప్పటికి తృప్తి వుండటం లేదు. ఇదివరకు మనం ముగ్గురం డాబామీద వెన్నెల్లో పడుకుని ఎన్ని కబుర్లు చెప్పుకునేవాళ్ళం" అంది దిగులుగా జయంతి.
"నువ్వు అపుడప్పుడు వెళ్ళి పలకరించి వస్తున్నావు....నా సంగతి మరీ అద్వాన్నంగా తయారైంది. పగలంతా ఒంటరిగా గదిలో ఒక్కదానినే విసుగు పుట్టి చస్తున్నాను" అంది దిగులుగా దాక్షాయణి వంకాయ ముక్కల్ని తరుగుతూ.
"గిరిజక్క ఎందుకలా తయారైంది? అసలు మాట్లాడటమే మానేసింది" అంది జయంతి.
"దాని సంగతి ఎందుకే నీకు, మనతో దాని అవసరం తీరిపోయింది. మొగుడ్ని కొంగున కట్టుకుని వూరేగుతుంది. ఉరేగని " అంది అప్పుడే వంటగదిలోకి వచ్చిన కస్తూరి కూతురితో.
"మనుషుల్లో ఇంత స్వార్ధముంటుందా మమ్మీ" అంది జయంతి.
"ఉంటుందే....ఎందుకుండదు......ముందు ముందు మనం ఇంకా ఎన్ని అనుభవాలు ఎదుర్కోవాలో....అయినా మమ్మీ ఏంటే ఆ పిలుపు దమ్మిడిలా....అంటే దమ్మిడికి కూడా కోరగాననా నీ ఉద్దేశం?" అంది కస్తూరి కూతురి మీద కయ్ మనిలేస్తూ.
"అయ్యో మమ్మీ అంటే ఇంగ్లీష్ లో అమ్మా అని అర్ధమే" అంది నవ్వుతూ.
