చలికాలపు రాత్రి
ఆలోచిస్తూ, మజ్డాదీపం వెలుగులో జనవరి రాత్రి
గుండెలు కొట్టుకుంటున్నట్లు గడియారం టిక్ టిక్ మంటూ,
రేడియో నిశ్శబ్దంలో సంగీత సముద్రాలు, ఈలలు, కేకలు,
కూనిరాగాలు, నాట్యాలు నింపాదిగా, పేలాపన, ఆహా
అందమైన సిగరెట్, గజ్జల గుర్రం ఏ ఊహనీ ఎగరేసుకు
పోకుండా, ఆకాశాలు దాటేసే అమిత వేగంతో, అందమైన
మృత్యువు అందించే ముద్దుల రుచి వొస్తుందా?
మృత్యువులోని అందం వస్తుందా? ఎవరొస్తారో ఎవరొస్తారో
అందరు పిల్లల మొగాలూ తుడిచిపెట్టుకు పోవలసిందే,
అందరు బిడ్డలూ తమ చిన్న పాదాలతో ప్రపంచాన్ని దాటి
పైకి పోవలసిందే, అందరు పిల్లలూ నిష్ర్కమించవలసిందే.
ఆలోచిస్తూ, జనవరి రాత్రి అన్ని ముఖాలూ, అన్ని ఆకారాలూ, అన్ని ఊహలూ పోవలసిందే పోవలసిందే; వొచ్చేదేదీ లేదు. మెల్లిమెల్లిగా వేగంగా క్షణం బద్దలై చచ్చిపోవడం, క్షణం యొక్క, మృత్యువుయొక్క, యొక్క యొక్క మృత్యువెవరిది? ఆలోచిస్తున్నదెవరు? ఎక్కణ్నుంచి చీకట్లో, భరతనాట్యపు ప్రశాంతిలో, గందరగోళపు నిశ్శబ్దంలో, ఎవరు వారు, ఎవరు ఎక్కణ్నుంచి ఏ జీవనప్రమదావనం, ఏ మృత్యువు ఇరుకుసందు పొడుగాటి ఏడుపుముఖాల యూకలిప్టస్ చెట్లు జనవరి గాలిలో కొన్ని శతాబ్దాల పిమ్మట సంగీతయుక్తంగా ఏ దుఃఖం లేనిదే ఏడుస్తూ.
ఆవులిస్తున్న గ్రామొఫోన్ చూసే తేరిచూపు ఊసుపోనితనపు అపశ్రుతుల నీడలు గోడనానుకొని సున్నపు పెల్లలూడి పోతున్న గోడలు. ఒంటరితనాన్ని దాచడానికి గోడలు. మనుష్యులందరూ మాయమైపోయే క్షణాలవేపు నడవవలసిందే-మనుష్యులందరూ అక్షరాలలోంచి భూమివైపు చుట్టుకుపోవలసిందే-చూస్తున్న కళ్ళు చూడరాదు, వింటున్న చెవులు సముద్రపు హోరు మాత్రమే వినాలి. ఆకాశాలు బద్దలైనప్పటి విశ్వ్వీణా నిశ్శబ్దాన్ని వినాలి. చేతులన్నీ లోతుగా మంటలో పూడ్చుకుపోయి కుళ్ళిపోవాలి. మనుష్యుల కళేబరాలమీద బట్టలు తీసి షాపుల్లో అమ్మెయ్యాలి. అయిపోతూన్న రాత్రి ఎప్పటికీ అయిపోదు. శిథిలాలమధ్య నిద్రపోకుండా కూర్చున్న మనిషి మళ్ళీ దెయ్యమై వచ్చి తన బట్టల్ని షాపులో అమ్మజూపుతూన్న దృశ్యం చూడాలి.
ఓ మంచి మజాగా ఉంది జనవరి మాసం. రేపటి యూకలిప్టస్ చెట్లు ఇవాళ చచ్చిపోతూన్న మనుష్యుల కోసం అనాలోచితంగా ఏడుస్తున్నాయి. ఇవాళ చచ్చిపోతున్నారు. రెండువందల ఏళ్ళ కింద చచ్చిపోయారు. అంటే క్రితం క్షణం అన్నమాట. అడుగో ఆ సిగరెట్టు కాలుస్తున్న కుర్రాడొకడు. ఇందాకా అక్కడున్నది వాడే. అక్కడే ఆ యింట్లో ఆవిలిస్తూన్న గ్రామొఫోనుని చదువుతూ, ఏడి ఇప్పుడా అబ్బాయి? ఏదీ వాడి కోటు?
ఎవరితోను చెప్పకుండా చచ్చిపోవడంలో ఓ లాలిత్యం వుంది. ఒక జీవిత శకలం మధ్య. ఇంకొకడి మృత్యుశకలం మధ్య. రెండువేల సంవత్సరాల కిందట ఇంకొక మృత్యువులో భాగం మజ్డా వెలుతురులో నిలబడ్డంలో కొంత నాగరికత లేకపోలేదు. రాత్రిళ్ళు నిద్రను చంపడానికి మనం కనిపెట్టిన గొప్ప యంత్రం విద్యుద్దీపం. నిలుచున్నపాటున చనిపోయే కుర్రాళ్ళకి మనం సమర్పించే నివాళి. నిద్రలేకుండా మజ్డావెలుతురు నిలబడే కుర్రాళ్లు మేలుకొని చచ్చిపోవడం. నిద్రలో జీవించడం. నాగరికత కూడా ఓ రకం నిశ్చలత్వమే. చెప్పకుండా చచ్చిపోవడం లాంటిది. అదో భరతనాట్యం, శిలాభంగిమ, కఠినపాషాణం, ప్రవాహం కాదు. కదలిక లేదు. ఎగసిపడే కెరటాలు కావు. పర్వతం బద్దలైనట్టు నాట్యం, నాజూకైన ఆకాశం, ముద్దొచ్చే అర్థంలేని మాట.
ఇప్పుడేమంటున్నారో అప్పుడూ అదే అంటారు. అంతర్ముఖులుగా తిరిగి ఒకమాటు బహిర్ముఖులుగా తిరిగి ఇంకోమాటు భావనేత్రాన్ని ముందరికి తిప్పి, వెనక్కి పట్టుకొని ఇప్పటిలాగే అంటారు అప్పుడు కూడా. ఏమనంటే ఒక సిగరెట్టు క్షణంలో, మజ్డా నిద్రా దరిద్రతలో, ఇక్కడే ఇక్కడే, నిద్రపోకుండా నిలుచున్నాడు హఠాత్తుగా మేలుకున్నాడు. హఠాత్తుగా మృత్యువులో జీవించాడు. కాని ఇంతట్లోనే ఏమయింది ఇక్కడ వున్న ఇల్లు కనబడదు. ఎటొచ్చీ ఒక చెట్టు ఒక పెద్ద బలిసిన, దళసరి, ఒంటెత్తు, జాలిలేని, బలిష్ఠమైన యూకలిప్టస్ చెట్టు గాలిలో మూర్ఛపోతూ, పిట్టల్ని ధరించి, ఇదిగో ఇక్కడే ఒక్కక్షణం క్రితం వాడి మొగాన్ని చూశాం వెలుగులో. నెమ్మదిగా, మృత్యువును పరిహసిస్తూ, మృత్యు సమక్షంలో వినమ్రత ప్రదర్శిస్తూ, మృత్యువును కాంక్షిస్తూ, వేళాకోళం చేస్తూ, ఇదిగో ఇక్కడే మహాపర్వతాల్ని తన ఊపిరితిత్తులలోకి పీల్చుకోవడం విన్నట్టే వుంది. మళ్లా ఊహల రూపంలో పైకి పంపించివెయ్యడం కూడా. అదేదో కాలంలో, మానవునిలో తనలోనే ఒక భావమైనట్టుకాని ఇంతట్లోనే ఇక్కడ ఇల్లులేదు. ఈ చెట్టుమాత్రం మిగిలింది. ఏది నిజం ఏది అబద్ధం కాదని మనం అనగలం. సాక్ష్యం కోసం చెప్పిన అబద్ధం అసలదేమిటి? అసలనేది ఎప్పుడూ అబద్ధమేనా ఇక్కడే నిలబడ్డాడని స్పష్టంగా ఎరిగి ఉన్నప్పటికీ?
ఈ క్షణాలన్నీ గడచిపోకుండా ఇంకా మనకి వినబడే ఈ సంభాషణ. ఇంకా కొన్ని పర్వతాలు కూలిపోయి, కొన్ని సముద్రాలు వేరయిపోయి, కొన్ని మహాఖండాలు కొత్తగా బయలుదేరి ఇప్పుడు మనం వింటూన్న ఈ సంభాషణ నిశ్శబ్దానిది, మాటలు తుడుపులతో కనబడతాయి. అర్థం లేదు. అర్థం లేదు. అంతా అస్పష్టం. జబ్బుపడి పోయినట్టు. ఒకచోట ఈ చెట్టు మాత్రం బలంగా నిలబడి మానవుడి లక్ష్యం లేకుండా ఏడుస్తూ ఇల్లున్నచోటే నిలబడి ఏడుస్తూ సంభాషణ నింపాదిగా వినబడుతోంది. మరీ సరళంగా మంద్రంగా వుంది. అంచేతే చెప్పలేము. ఆ కుర్రాడే అంటున్నాడో లేక అనేక సంవత్సరాల అనంతరం ఆ చెట్టు మూలుగుతోందో అసలు నిజమన్నదే కనబడదే తోకపట్టుకొని ఎత్తి నిచ్చెనమీద నిలబెట్టింది చూపించడానికి. అసలు నిజమన్నదే లేదు. ఆకాశంలోంచి, నిశ్శబ్దం లోపలవచ్చేదంతా ఊహల చల్లని సంస్పందనం. ఎవరో మనిషి మాట్లాడినట్టే, చెట్టు చిటారుకొమ్మల కదలికలు జీవితాన్ని పీల్చుకుంటూ కుర్రాడి చావును స్మరిస్తూ.
