Previous Page Next Page 
మట్టి మనిషి పేజి 61


    ఇంతకీ ఆ పిల్ల ఎవరూ? బలరామయ్యగారి కూతురేగా? ఎన్నోదీ? దాంతర్వాత లేరుగా? అంటే అది ఆఖరుదేగా? అదే! అదే! ఆడే "వరూథినా?" బిగ్గరగా అనేశాడు.
    వెంకటపతి కుర్చీలో ఎగిరిపడ్డాడు. చుట్టూ కలయ చూసుకున్నాడు. ఎవరూ దగ్గర్లో లేరు. తనన్నది ఎవరూ వినలేదు. అవును! ఆ పిల్లే వరూధిని ఆ తర్వాత  ఏం జరిగిందీ? వెంకటపతి గుర్తుచేసుకోసాగాడు. ఆ తర్వాత ఏమయిందీ?
    సుబ్బడు కాసేపటికి రెండు నేల టిక్కెట్లు తీసికొచ్చాడు. వాడి బనీను చిరిగి పోయివుంది. వాడి గుప్పెట్లో టిక్కెట్లు నలిగి తడిసిపోయి వున్నాయి. ఆ పిల్లను.... అదే వరూథిన్ని.... వాడెత్తుకొని టిక్కెట్లు తన చేతికిచ్చాడు. ఇద్దరూ పరుగులు తీసుకుంటూ నేల గేటు దగ్గర కొచ్చారు. అక్కడ మళ్ళీ ఆలస్యం. సినిమా హాల్లోనుంచి మాటలు వినపడుతున్నాయి. తను తొంగి చూశాడు. పెద్ద పెద్ద బొమ్మలు మనుషుల్లాంటివి - పెదవులు కదిలిస్తూ మాట్లాడుతున్నాయి. గేటులోవాడు తనను వెనక్కు నెట్టాడు.
    "టిక్కెట్లియ్యి! హ!" జీతగాడు అనేదాకా తన చేతిలో టిక్కెట్లు ఉన్నట్లే గుర్తులేదు. హాల్లోకి వెళ్ళి జీతగాడి పక్కనే బాసింబట్ల వేసుకూర్చున్నాడు నేలమీద. తన బట్టలు చల్లగా వున్నాయి. కింద గచ్చు చల్లగా వుంది. తెరమీద బొమ్మలు మెరిసిపోతున్నాయి. మెదడంతా వెచ్చ వెచ్చగా అయిపోయింది. గడ్డాలమీసాలవాడు విశ్వామిత్రుడు. కిరీటం పెట్టుకున్న రాజు - హరిశ్చంద్రుడు మాతంగకన్యలను వద్దంటున్నాడు - హరిశ్చంద్రుడు భార్యను అమ్మేశాడు. లోహితాస్యుడ్ని పాము కరిచింది - హరిశ్చంద్రుడు కాటికాపరివేషంలో వచ్చాడు.
    హాల్లో ఆడవాళ్ళు ముక్కులు చీదేస్తున్నారు.    
    "దళమౌపయ్యెదలో..... అది మాంగల్యంబు కాబోలు!" ఘంటశాల వెంకటేశ్వరరావు కంఠంలో హాలంతా మోగిపోతోంది. ప్రాజెక్టర్ ఆపరేటర్ సౌండు  పెంచాడు. చంద్రమతి, 'హ! నాథా వీడు మన లోహితుడు!" వెంకటపతి తన స్మృతిపథంలో తిరుగుతున్న సినిమాలోంచి, తెరమీద కళ్ళకు కనిపిస్తోన్న "హరిశ్చంద్ర" లోపడి లీనయిపోయాడు.
    "ఆ తర్వాత ఏమైంది?" వెంకటపతి మళ్ళీ మనస్సును వెనక్కు తోయటానికి ప్రయత్నం చేశాడు. కాని, అది తిరిగి తిరిగి హాల్లోకే వచ్చింది.
    ఇంత పెద్ద సినిమా హాలుకు ఈనాడు తను యజమాని! ఓనరు! ఇంకో ఆరునెలలో, సంవత్సరమో పోతే ఇంతకంటే పెద్ద సినిమా హాలుకు, అందులోనూ హైదరాబాదు పట్టణంలో, భాగస్తుడు కాబోతున్నాడు.
    ఇంత అదృష్టం, హోదా తనకు ఎలా వచ్చాయి? దానికి కారకు లెవరు? ఆనాడు తన చొక్కాలాగూ తడిసిన బలరామయ్య కూతురు! తనను మొదటిసారిగా దయతలచి సినిమాకు పంపిన షావుకారు బలరామయ్య కూతురు, తన భార్య వరూథినే! ఇదంతా దాని తెలివీ, సామర్ధ్యం, ప్రయోజకత్వమే! అది లేకపోతే తను ఎక్కడుండేవాడు? టౌన్లో తనకిప్పుడు ఎంత హోదా, పరపతీ వుంది? పెద్ద పెద్ద అధికారులూ, ధనవంతులూ, రాజకీయ నాయకులూ, మంత్రులు కూడా తనకు తెలియడానికి కారణం వరూధినే మరి!
    హరిశ్చంద్ర సినిమా పూర్తయేసరికి వెంకటపతి ఆలోచనలూ, తర్కమూ ఓ  కొలిక్కి వచ్చాయి. సాయంత్రం తాగిన సారా నిషాకూడా దిగిపోయింది. హాల్లోనుంచి బయటకొస్తుంటే కాళ్ళు పీకాయి. నరాలు గుంజాయి. మెట్లమీద నిలబడి హాల్లోనుంచి కళ్ళు తడుచుకుంటూపోయే జనాన్ని చూస్తూ వున్నాడు.
    రెండో ఆటకు బుకింగ్ మొదలైంది.
    శివరాం నలుగుర్ని వెంటబెట్టుకొని వెంకటపతి ముందుకొచ్చి నమ్రతగా నిలబడి అన్నాడు:
    "వీళ్ళు ఏ.సి.టి.వో. గారి తాలూకు. పంపించమంటారా?"
    వాళ్ళవైపు చూడకుండానే వెంకటపతి తలెగరేశాడు. అందులో ఎంతో ఆనందం, తృప్తీ పొందాడు! వెనక్కుతిరిగివెళ్తున్న శివరాంను పిల్చి "ఈరోజు కలెక్షన్ ఎంతయిందీ?" అని అడిగాడు.
    "ఇంకా బుకింగ్ క్లోజ్ చెయ్యలేదు. చెయ్యగానే చెప్తాను." అన్నాడతను.
    వెంకటపతి, బుకింగ్ క్లోజ్ చేసేంతవరకూ వుండే ఓపికలేక "అయినంతవరకు చెప్పు. మొత్తం లెక్కచూసి పట్టుకురా! నేను వెళ్తాను" అన్నాడు.
    "అలాగే" అంటూ శివరాం బుకింగ్ ఆఫీసుకేసి పోబోతుండగా "నేను చెప్పింది ఏం చేశావ్?" అన్నాడు.
    "ఇంతకు ముందే తెప్పించి పెట్టాను. కుర్రాడిచేత పంపించమంటారా ఇంటికి?" అన్నాడు శివరాం.
    "మళ్ళీ కుర్రాడెందుకూ? నేనే తీసుకెళ్తాలే" అన్నాడు వెంకటపతి.
    వెంకటపతి రిక్షాలో వచ్చి ఇంటిముందు దిగాడు. అప్పటికే కారు ఆగివుంది. వెంకటపతి ఇంట్లో కాలు పెడ్తుండగా, లోపలనుంచి వస్తూ రామనాథబాబు ఎదురయ్యాడు. అతని ముఖం వెలవెల పోయింది.
    "అప్పుడే బుకింగ్ క్లోజ్ చేశారా? హౌస్ ఫుల్ గా వుందా? హరిశ్చంద్రలాంటి పౌరాణికాలు ఎన్నిసార్లు తీసినా జనం చూస్తారు." అన్నాడు రామనాథ బాబు.
    "హాలు నిండలేదు. ఇంకా బుకింగ్ క్లోజ్ చెయ్యలా!" అన్నాడు వెంకటపతి తనేదో తప్పుచేసిన వాడిలా అయిపోయి.
    "అయితే కొంపేం మునిగిపోయిందని? బుకింగ్ క్లోజ్ కాకముందే పరుగెత్తుకొచ్చారు?" వెంకటపతిని నిలదీసి అడిగింది వరూధిని.
    "వస్తే ఇప్పుడేమయిందేమిటి? శివరాం నమ్మకస్తుడే!" అన్నాడు రామనాథబాబు వెంకటపతిని సమర్ధిస్తూ.
    "ఆయనే నయం దానికంటే!" అనుకున్నాడు వెంకటపతి.
    "ఏమిటా సంచీ?" తీవ్రంగా చూస్తూ భర్తను అడిగింది వరూధిని.
    "ఏం లేదులే! ఏం లేదులే!" అంటూ డ్రాయింగ్ రూంనుంచి వెళ్ళిపోయాడు వెంకటపతి.
    రామనాథబాబు నవ్వుతూ వరూధినికేసి చూశాడు.
    "మీకేం మీరు నవ్వుతారు. ఎందుకు నవ్వరూ?" అంటూ వరూధిని వచ్చే నవ్వును ఆపుకోలేక ముఖం పక్కకు తిప్పుకొంది.
    రామనాథబాబు బయటకొచ్చాడు. అతనివెనకే వరూధిని వచ్చింది. కారెక్కుతున్న రామనాథబాబుతో "రేపొస్తారుగదూ?" అన్నది.
    "తప్పుతుందా? రాణీగారి ఆజ్ఞ!" అంటూ కారుస్టార్టు చేశాడు రామనాథబాబు.
    వరూధిని హృదయంలో అమృతం చిలికినట్టయింది. నీటిమబ్బులో దాక్కుంటున్న చందమామను చూస్తూ గేటు పట్టుకొని నిలబడిపోయింది. అలా ఎంతసేపయినా నిలబడాలనే అనిపించింది.
    ఇంట్లోకి వస్తూనే వరూధిని వెంకటపతి కూర్చొని వున్న గదిలోకి వెళ్ళింది. అప్పటికే వెంకటపతి బుడ్డిలో సగం ఖాళీ చేశాడు.
    "రాను రాను మీ కసలు బుద్దిలేకుండా పోతోంది!" విసురుగా అంటూ వెంకటపతి ముందున్న బాటిల్ లాక్కుంది.
    "ఉంటేగా పోటానికి?" వెంకటపతి సమాధానానికి వరూధిని బిత్తరపోయింది.
    ఇతడు సమబయ్య కొడుకేగా అన్నట్టు చూసింది. తాగిన నిషాలో పుట్టిన తెలివితేటలేమో అనుకొంది.
    "ఎంతవర కయిందీ?" అడిగాడు వెంకటపతి.
    "ఏమిటయింది?" అన్నది వరూధిని.
    "కొంతవరకన్నా అయిందా అని?"
    "సగానికి పైగా అయింది. ఇదే పనా?" బాటిల్ చూస్తూ వరూధిని.
    "మరింకేం పని?"
    "చాల్లే ఊరుకోండి."
    "మరింకేం పనిమీద హైదరాబాదు వెళ్ళావ్?"
    అప్పటికిగాని అర్ధంకాలేదు వరూథినికి భర్త దేన్నిగురించి అడుగుతుంది.
    "ఏం తీసుకొచ్చావ్?" అని "ఏం జేసుకొచ్చావ్" అన్నానని అనుకొన్నాడు వెంకటపతి.
    వరూధిని పుల్లారెడ్డి స్వీట్సు ప్యాకెట్ తెచ్చి భర్తముందు ఉంచింది.
    "బాబుకు పెట్టావా?" అడిగాడు వెంకటపతి.
    "అయ్యో ప్రేమ!" అనుకొంది వరూధిని.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS