ఈ రోజు రీటా.....
ఇంకేవారీ పేరు వినవలసివస్తుందో.....!
"నా కళ్ళు తెరిపించిన విష్ణు మహా యోగి....అందుకే నా విధి నిర్వహణలో నేను క్రుతక్రుత్యురాలునయ్యాను. కానీ ఇప్పుడు తెలిసిన పచ్చి నిజాలను నాలో నేను జీర్ణించుకోలేకపోతున్నాను. అందుకే నాకు తెలిసిన నిజాన్ని మీ దృష్టికి తేవాలనిపించింది" చెప్పడం ఆపింది రీటా.
ఇప్పుడు విష్ణు పూర్తిగా మారిపోయాడు మేడమ్! నిజానికి నిన్న మొన్నటి వరకు ప్రచారం అంటే గిట్టని వ్యక్తీ ఇప్పుడు ప్రతి చిన్న పనీ పది మందికి తెలియాలని ఆరాట పడిపోతున్నాడు. భోగాభాగ్యలంటే ఇష్టపడని వ్యక్తీ భక్తులు ఇచ్చే కానుకలను స్వికరిస్తున్నాడు. నిత్యమూ, పూజాది కార్యక్రమాలలోనే నిరంతరమూ మునిగితేలే విష్ణు ఇప్పుడు తనను పరామర్శించడానికి వచ్చే విదేశీ అతిదులతోనే ఎక్కువగా కాలక్షేపం చేస్తున్నాడు. అదేమంటే హిందూ ధర్మ ప్రచారం కోసం ఆధ్యాత్మిక గోష్ఠి నిర్వహిస్తున్నానంటున్నాడు......ఇలా చెప్పుకుంటూ పొతే చాలా వున్నాయి......."
ధీరజకు తాను వింటున్నది కలో నిజమో అర్ధం గాకుండా వున్నది.
ఒక విధంగా తాను సెలవుపై వెళ్ళి పోవాలనుకుంటున్నది. విష్ణు ప్రవర్తన అర్ధం కాకపోవడం వలన ప్రభుత్వానికి ఆ విషయం ఎలా సమర్పించి చెప్పాలో నన్న మీమాంస, ఇక ముందు విష్ణు స్థావరంపై ఇన్ కంటాక్స్ దాడులు వగైరా తాబే సిఫారస్సు చేయాల్సి రావచ్చు......అని అదీగాక ఒకప్పుడు ఎంతో ఆత్మీయంగా పలకరించే విష్ణు ఇప్పుడు ముక్తసరిగానే మాట్లాడుతున్నాడు. తనంటే అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నాడు కూడా.
ఇంతవరకు ఆప్యాయతను వర్షించిన కళ్ళు నేడు తన పొడ గిట్టనట్టు ప్రవర్తిస్తుండే సరికి మానసికంగా నలిగిపోయింది తను.
అందుకే తాను విష్ణుకు దూరంగా వెళ్ళిపోవాలనే నిశ్చయానికి వచ్చింది.
కానీ, ఇప్పుడు రీటా చెప్పిన మాటలు ధీరజలో ఆలోచనను రేకెత్తించాయి.
తాను ఇంతవరకు ఆ కోణంలో నుంచి ఆలోచించలేదు........ఆలోచిస్తే నిజంగానే విష్ణులో మార్పు కొట్టవచ్చునట్టు కనిపిస్తున్నది. ఆ మార్పు వలన ఇతరులకు నష్టం, కష్టం కలగనంతవరకూ ఫరవాలేదు. కానీ, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా చట్ట వ్యతిరేకమయిన వాళ్ళకు ఆశ్రయం కలిగించినా తాను ఏమాత్రం సహించలేదు.
"మిస్ రీటా.....నీ మాటలను బట్టి చూస్తుంటే విష్ణులో స్వార్ధం పుట్టుకొచ్చినట్టు అనిపిస్తుంది. నిజానికి అతను మొదట తను తన కోర్కెలను జయించే యోగి కాగలిగాడు. బహుశా ఇప్పుడు అందలం ఎక్కాడు . పై పెచ్చు అవకాశం వచ్చింది కనుక అతనిలో స్వార్ధం తిరిగి మేల్కొంటే మేల్కొనవచ్చును......"
"ఎస్, మేడమ్......యూ ఆర్ రైట్.......మీకు తెలియని ఇంకొక రహస్యం కూడా వుంది. ఆశ్రమంలోని ప్రతి అంగుళాన్ని ఎప్పటికప్పుడు వీడియో తీయించే ఏర్పాట్లు చేశాడు ఇన్స్ పెక్టర్ వినయ్ కుమార్. అతనికి మొట్టమొదటి నుంచీ విష్ణు పై సదభిప్రాయం లేకపోవడానికి ఇదే కారణం. విష్ణుకి తెలిసి కాని తెలియక కాని కొందరు దేశ ద్రోహులు ఆశ్రమంలోనే వుంటూ అనుమానాస్పదంగా సంచరించడం వలనే అతను ఈరోజు వరకు విష్ణును అనుమానిస్తూనే వున్నాడు.......నేను బయలుదేరే ముందే అతనికి ఫోన్ చేసి ఆ క్యాసెట్స్ తీసుకుని రమ్మని చెప్పాను. వాటివలన ఇప్పటి వరకు ఆశ్రమంలో జరిగిన ప్రతి సంఘటన మనం ప్రత్యేక్షంగా చూసే వీలుంటుంది" అంటూ చెప్పింది రీటా.
ధీరజ మౌనం వహించింది.
అదే సమయంలో ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్ వచ్చాడక్కడకు......
అతను తెచ్చిన క్యాసెట్స్ ప్లే చేయడానికి ఏర్పాట్లు చేసింది ధీరజ.
క్యాసెట్లలో విష్ణు ఆశ్రమం స్పష్టంగా కనిపిస్తుంది.
విదేశీయులతో ఆ ఆశ్రమం కళకళ లాదిపోతున్నాడు.
భక్తులు అడిగిందే తడవుగా శూన్యంలో నుంచి విభూది సృష్టించి ఇస్తున్నాడు. వాళ్ళకు కావలసిన పండ్లు, కుంకుమలు, కూడా అపూర్వమయిన రీతిలో మూసినా గుప్పటి తెరచి మరీ ఇస్తున్నాడు.
భక్తుల విన్నపాలను చిరునవ్వుతో స్వీకరిస్తూ బంగారు ఆభరణాలను కూడా గాలిలో మ్=నుంచి రప్పించడం చూసి సాష్టాంగ ప్రణామాలు చేస్తున్నారు. లక్షలకు లక్షలను కానుకలుగా సమర్పించుకుని, విష్ణు ప్రసాదించిన ఆ నగలను దైవ మందిరంలో వుంచుకోవడానికి కళ్ళకు అద్దుకుని మరీ తీసుకుని వెళుతున్నారు.
అలాంటి ఎన్నో సంఘటనలు......దృశ్యాలు!
అంతక్రితం వరకు లేని కొత్త శిష్యులు ఆశ్రమంలో కనిపిస్తున్నారు.
పాత శిష్యుల మాటకు విలువలేకుండా పోతున్నది.
వీడియో కాసెట్స్ అయిపోవడంతో వి.సి.ఆర్ ఆఫ్ చేశాడు వినయ్ కుమార్.
"ఒకప్పుడు విష్ణు ఇలా కానుకలను కురిపించేవాడు కాదు.......స్వీకరించేవాడు కాదు.......మరి ఇప్పుడెందుకు తీసుకుంటున్నాడు అని ప్రశ్నిస్తే ధర్మ ప్రచారం కోసం అనే సమాధానం వస్తుంది." అన్నాడతను చిరునవ్వుతో.
అప్పుడే ధీరజకు ఫోన్ వచ్చింది.
"వెల్ కమ్"
ధీరజ ఫోన్ పెట్టేసింది."
"మేడమ్ ఎవరు ఫోన్ చేసింది?" రీటా అడిగింది.
"ఏసిపి కిరణ్మయి...."సరిగ్గా ఆమెకు కూడా మనకొచ్చిన అనుమానమే వచ్చింది.'
మాటలలోనే వచ్చిందామే.
నలుగురూ చాలా సేపటివరకూ విష్ణు గురించే చర్చించుకుంటూ వుండిపోయారు.
విష్ణులో కలిగిన స్వార్ధమనే దాహాన్ని ఎలా రూపుమాపాలి? అతనికి కళ్ళు ఎలా తెరిపించాలి? అనుకుంటూ ఆ నలుగురూ అపూర్వమయిన రీతిలో ఒక్కటై.....విష్ణును ప్రతిఘటించే బాటలో సమాయత్త మవుతున్న తరుణంలోనే.......
