"అమ్మా! ఏదైనా చూసే కళ్ళనుబట్టి ఉంటుంది. నాన్నకు కూడా నువ్వంటే ప్రేమే. కాకపోతే అయన తత్వమే అంత. నువ్వు సర్దుకుపొతే సమస్య సమసిపోతుంది. భార్యభర్తల మధ్య నువ్వెంత అంటే నువ్వెంత అనడం సమస్యల సృష్టికి దారి తీస్తుంది" అన్నాడు.
అది నిజమే అనిపించిందేమో......మొదటిసారిగా పట్టుచీర కట్టుకుని మొగుడి కాళ్ళకు నమస్కరించింది. గరుడాచలం కదిలిపోయాడు. నోరు పెగల్లేదు. మనసు చేమర్చింది. ఆప్యాయంగా భార్య భుజాలు పట్టి లేపి దగ్గరకు తీసుకున్నాడు.
పెళ్ళయిన చాలా సంవత్సరాల తర్వాత భర్త కౌగిలిలోని ప్రేమని చూసింది ఆవిడ.
తర్వాత అత్తగారికి కూడా నమస్కరించింది. బామ్మ షాకయింది. తర్వాత ఆనందంతో కోడల్ని గుండెలకు హత్తుకుంది.
మరుసటిరోజు నుంచి ఆమె దినచర్యలో మార్పొచ్చింది. తను కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గరకెళ్ళి తనకు తోచిన సహాయం చేయసాగింది.
పనిచేయడంలో వున్న అనందం ఏమిటో ఆమెకు తెలిసొచ్చింది.
ఇక మారాల్సింది బామ్మ ఒక్కర్తే. అందుకు సమయం ఆసన్నమయింది.
* * *
నాలుగు రోజుల్లో ఇరవై కిలోల బరువు తగ్గాడు యమధర్మరాజు. గడ్డం పెరిగింది. నారదుడు యముడి గెటప్ చూసి షాకయి "ఏమిటిది యమధర్మరాజా! మీకీ దురవస్థ ఏల?" అనడిగాడు బాధగా.
దాదాపు బావురుమనే స్టేజిలో వున్నాడు యమధర్మరాజు. బామ్మ తనని ఎన్ని విధాలుగా చిత్రవిచిత్ర హింసలు పెట్టిందో ఏకరవు పెట్టాడు. ఉదయాన్నే నీళ్ళు పట్టించడం, పప్పు రుబ్బించడం, లైబ్రరి నుంచి అద్దె పత్రికలు తెప్పించడం, సినిమా టిక్కెట్లు తెప్పించడం లాంటివి.
"నారదా! ఇక ఆవిడ హింసలు భరించడం నా వల్ల కాదు. ఎప్పుడూ చూసినా తన మొగుడ్ని తనెంత ప్రేమగా చూసుకుందో ఏకరవు పెడుతుంది. నేను కూడా నరకంలో పాపులను ఇన్ని హింసలు పెట్టి ఎరుగను" అన్నాడు.
"ఆవిడ జ్ఞానోదయానికి సమయం ఆసన్నమైంది సమవర్తి!" అన్నాడు.
తధాస్తు దేవతలు తధాస్తు అన్నారు.
* * *
ఎప్పటిలానే ఆరోజు కూడా బామ్మ హరికధ వినొస్తానని చెప్పి ఓ ఇంగ్లీషు సినిమాకు వెళ్లింది. టైటిల్స్ పడ్డాయి. సినిమా మొదలైంది. హటాత్తుగా తెరమీద దృశ్యం మారిపోయింది.
నరకం సెట్టు కనిపిస్తోంది తెరమీద. పాపులు కనిపిస్తున్నారు. యమభటులు పెట్టె చిత్రహింసలు కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరూ తాము చేసిన పాపాల లిస్టు చెబుతున్నారు. తలకిందులుగా వేలాడదిసి కొందర్ని, నూనెలో మరిగిస్తూ కొందర్ని, శిక్షిస్తున్నారు. హటాత్తుగా తెరపై తన భర్త కనిపించాడు.
తలకిందులుగా వేలాడదిసారు. తన ప్రతిమ అతని ఎదురుగా "భ్రమరా! ఈ కష్టాలు నేను భరించలేనే.....భరించలేను. నీవల్లే నేను మా అమ్మానాన్నలకు దూరమయ్యాను" అని పలవరిస్తున్నాడు.
ఉలిక్కిపడి చుట్టూ చూసింది. తన చుట్టూ వున్న మనుష్యులు తన్మయత్వంగా చూస్తున్నారు. అందరికి అదే కనిపిస్తోందా?
నిజమే బ్రతికివున్న రోజుల్లో తన భర్తను అతని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళనివ్వలేదు.
వాళ్ళను చూసుకునేవారు లేక కొడుక్కి దూరమై ఆ వ్యధతో చనిపోయారు. తన భర్తని నానా మాటలు అంది. తన చెప్పు చేతల్లో వుంచుకోవాలని ప్రయత్నించింది. ఆమెలో పశ్చాత్తాపంతో పాటు చిన్న అనుమానం.
ఇంటర్వెల్ లో పక్కనే వున్న అతన్ని అడిగింది "మీరే సినిమా చూసారని'?
సినిమా పేరు చెప్పారు వాళ్లు
అంటే తెరపై తనకు మాత్రమే అలా కనిపిస్తోందా? మళ్ళీ సినిమా మొదలైంది ఇప్పుడు యమలోకమే.
యముడు కనిపించాడు. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అయ్యాయి.
తనింట్లో వున్న దుక్కబ్బాయ్, తన మానవుడి స్నేహితుడు, ఇది.....ఇదెలా సాధ్యం?
"ముసలి బామ్మా" యముడి గొంతు వినిపిస్తోంది. అది తనని ఉద్దేశించే.
"నేను యమధర్మరాజుని. నీ వల్ల నీ భర్త ఈరోజు శిక్ష అనుభవిస్తున్నాడు. వృద్దాప్యంలో వున్న తన తల్లిదండ్రులను నిదారణకు గురిచేసిన పాప ఫలితమిది? కేవలం నీ కారణంగా అతను తల్లిదండ్రులను నిరాదరణ చేసాడు. నువ్వు సాధించింది ఏమిటి? ఇప్పుడు నువ్వు వృద్దాప్యంలో వున్నావు. నీ కొడుకు నిన్ను నిర్లక్ష్యం చేస్తే నీ పరిస్థితి ఏమిటి? సుక్ష్మాసుక్ష్మములు, మంచిచెడులు తెలియక పొరపాట్లు చేస్తున్నావు. నీ భర్తకు నేటితో నరకంలో విముక్తి కలుగుతుంది. రేపట్నుంచి స్వర్గంలో అతను తను చేసిన పుణ్యములకు సరిపడా భోగములు అనుభవించును. నీ భర్తను రాచిరంపాన పెట్టిన పాపం ఊరికే పోదు. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని జ్ఞానజ్ఞాన విచక్షణలను తెలుసుకుని సత్ప్రవర్తనతో మెలుగు, ఆద్యాత్మిక ధోరణితో ఇతరులకు సాయం చేస్తూ ......పుణ్యమును సంపాదించుకునుము....."
స్క్రీన్ మీద నరకలోకం మాయమైంది. యముడు మాయం అయ్యాడు.
బామ్మ ఆలోచనలో పడింది.
ఇది నిజమా? అబద్దమా?
ఇది కలా? వాస్తవమా?
ఇది భ్రమా? కనిపించే కఠోర సత్యమా? ఇవన్ని ఆలోచించడం మానింది.
ఇది ఏమైనా కావచ్చు. కానీ తనకు కనువిప్పు కలగడం నిజమే. ఏ లక్ష్యమూ లేకుండా గడిపింది. ఈ వృద్దాప్యంలో మనవడ్ని, చూసుకుంటూ మురిసిపోవచ్చు. ముని మనవలను ఆడిస్తూ అనందించోచ్చు.
సినిమా ఇంకా పూర్తీకాలేదు. మధ్యలోనే ఇంటికి వెళ్లింది. వెళ్ళేసరికి చెమట్లు కక్కుతూ మయధర్మరాజు బట్టలు ఉతుకుతున్నాడు.
అతని చేతిలోని బట్టలు లాక్కుంది బామ్మ.
"ఏంటి! కొత్త పనేమైనా చెబుతుందా?" ఆ ఆలోచనతోనే వణికిపోతూ అడిగాడు.
"వేరే పనేమైనా చేయాలా?"
అంతే! సాష్టాంగపడిపోయింది బామ్మ.
"మహానుభావా క్షమించు. తొందరపాటుతో, స్వార్ధంతో నేను నీపట్లనే కాదు, నా భర్తపట్ల ఇతరుల పట్ల హేయంగా ప్రవర్తించాను" అంది.
యమధర్మరాజు బిత్తరపోయి చూసాడు.
"ఏమిటిదంతా! నేనెవరుకొనుచున్నావు?" అడిగాడు.
"అంతా తెలుసు యమధర్మరాజా!" అంది బామ్మ.
"అంతా అంటే, ఎమిటంతా తెలుసు?" అయోమయంగా అడిగాడు యమధర్మరాజు.
"మీరేకదా మహానుభావా! సినిమా థియేటర్ లో నా కళ్లకు కనిపించునటుల తెరపై అన్నియు చూపించియున్నారు. జ్ఞానోదయం కలిగింది ప్రభూ" అంది.
"నేనా?"
"హాస్యాలోద్దు. ఇక నుంచి బుద్దిగా వుంటాను. నా కోడలికి పనిలో సాయం చేస్తా. నా మానవుడికి తోడుగా వుంటా" అంది.
