చిరకాలం కిందట మనం నియమాలను ఏర్పరచుకున్నాము. ఇప్పుడు, ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత, అవి సరైన నియమాలు అవునో కాదో అని అనుమానిస్తున్నాము. మొదట్లోనే తప్పుచేసి వుండకూడదా అనుకుంటున్నాము. ఇది కళ అని మనకు తెలుసు. ఒక పిసరు జీవితంలా కనబడవచ్చునని కూడా తెలుసు. అయితే జీవితంకన్నా విస్పష్టం కాబట్టి కళ జేవితం కానేరదని తెలుసు.
మన ఔన్నత్యం ఇలాగే ఎప్పుడూ తోలుబొమ్మలాటగా సాగిపోవలసిందేనా? అదీ మనం తేల్చుకోవలసిన విషయం.
ఫిలిం కెమీరా టామ్ సెక్రటరీ మొగానికి క్లోజప్ ఇస్తుంది. ఈ ముసలి సెక్రటరీ చిన్నప్పట్నుంచీ టామ్ ని కంటికి రెప్పలా కనిపెట్టుకున్నవాడు. టామ్ దురవస్థని మరింత తీవ్రంగా కనపరచడమే ఈ షాట్ ఉద్దేశం. మీ మనస్సులో గొప్ప సందిగ్ధం కలిగించడమే ఇందులో ఉద్దేశం.
తర్వాత పానింగ్, మాంటేజ్, కాలం పారిపోవడం క్రైసిస్, అంతిమ క్షణాలు, సెక్రటరీ మొగం, వందలగజాల సెల్లులాయిడ్ లో జరిగితీరవలసినవి జరిగి తీరడాలు, టామ్ కొడుకు టామీవచ్చి సెక్రటరీముందు నిలబడతాడు. స్టెడీ, నాన్నకి ఒంట్లో బాగులేదట నిజమేనా అని అరుస్తాడు. నాన్నకి తెలుసునని అబ్బాయికి తెలియదు. అదో గొప్ప హాలీవుడ్ ఘట్టం. సముచితమైన సంగీతం వినిపిస్తుంది.
తలుపు దగ్గరికి పరుగెత్తుతాడు తండ్రిని కలుసుకుందామని. తండ్రిగారి పడుచు భార్యతో మదనతంత్రం సాగించి స్వాభావికమైన సృష్టిక్రమాన్ని తలకిందులు చేసిన ఈ కుర్రాడు అంతట్లోకే ఢాం, పిస్తోలు పేలిన చప్పుడు.
షికాగో అండ్ సౌత్ వెస్టర్న్ కంపెనీ ప్రెసిడెంటు కథ తుదముట్టిందని మీకు అవగతమవుతుంది. అతని మర్యాద దక్కింది. అతని గొప్పతనం స్థిరపడింది. సినీమా పరిశ్రమకి ఇంకో విజయం. జీవిత గౌరవం నిలిచింది. అన్నీ సలక్షణంగా జరిగిపోయాయి. ప్రజారంజకమైన చిత్రాలివి ఇంకో శతాబ్దం దాకా హాలీవుడ్ వాళ్ళు నిరాఘాటంగా తియ్యవచ్చు.
అన్నీ అతిస్పష్టం. ఆగింది బొమ్మ. వినబడింది మ్యూజి. నిలబడింది టామీ చెయ్యి గది గుబ్బమీద కొంకరవారిపోయి.
ముసలి సెక్రటరీకి తెలుసు ఏంజరిగిందో. టామీకి తెలుసు. నీకు తెలుసు. నాకు తెలుసు. కానీ ఏదైనా చూడడంతో సాటికాదు. ముసలి సెక్రటరీ తన ముసలి మెదడుకి ఆ పిస్తోలు దెబ్బ అర్ధమయినట్లు నటించి, తలుపు తియ్యడానికి శక్తిలేకుండా టామీ భయపడి నిలబడిపోయినందువల్ల తానే బలవంతంగా తలుపు తియ్యబోతాడు.
జరిగిన పని ఎలా జరిగిందో చూడాలని మనమంతా ఆవురావురు మంటున్నాము.
తలుపు తెరుచుకుంటుంది. మనమంతా గదిలోపలికి ప్రవేశిస్తాము. మనం అందరం, అమెరికా జనాభా అయిదుకోట్ల మనుష్యులం. ఇంకా ఈ భూలోకం అంతటా కోటానుకోట్లు ప్రజలం. గదిలోకి చూస్తాం.
పాపం టామ్! మొదలు నరికినట్లు దిగజారిపోతున్నాడు. అదేం చిత్రమోగాని తెరమీద ఇది శరవేగంతో జరిగిపోతున్నా, ఈ చిన్నపని, ఒక మహా పురుషుని చరమకృత్యం ఈ దిగజారిపోవడం ఎందువల్లనో ఇలాగే ఎప్పుడూ సాగిపోతున్నట్లు కనబడుతుంది. గదిలో వెలుతురు తగ్గించారు. సంగీతం హోరెత్తుతోంది. నెత్తురు లేదు. గలభా లేదు. టామ్ దిగజారిపోతున్నాడు. ఉదాత్తంగా మరణిస్తున్నాడు. నామట్టుకునేను విన్నాను. ఇద్దరు ముత్తయిదువులు నాపక్కనే కూర్చుని ఏడుస్తూండడం వాళ్ళకి తెలుసు ఇది సినిమా అని ఇదంతా కృత్రిమం అని, అయినా ఏడుస్తున్నారు. టామ్ అంటే మానవుడు. టామ్ అనగా జీవితం. జీవితం చేసేదేమీలేక దిగజారిపోవడం చూస్తుంటే వాళ్ళకి ఏడుపొచ్చింది. ఇంకో నిమిషంలో ఫిలిం ముగిసిపోయి వాళ్ళింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. తమ పనుల్లో తాము నిమగ్నులవుతారు. కాని ఇప్పుడుమాత్రం, పవిత్రమైన ఈ చీకటిలో మాత్రం, వాళ్ళేడుస్తున్నారు.
నాకు తెలిసిందంతా ఒకటే. ఆత్మహత్య సక్రమమైన సంఘటన కాదు. డానికి నేపథ్యగానం ఉండదు. నేను తొమ్మిది పదేళ్ళ కుర్రాణ్ణిగా ఉన్నప్పుడు మాయింటిపక్క ఒక అబ్బి ఉండేవాడు. ఒక సాయంత్రం అతను ఆత్మహత్య చేసుకున్నాడు. కాని ఆత్మహత్య చేసుకోవడాని కతనికొక గంటసేపు పట్టింది, ఛాతీలోకి గుండేసి కొట్టుకున్నాడు. గుండెకి గురితప్పింది. పొట్టలోకి మళ్ళీ గుండు పేల్చాడు. రెండు ధ్వనులూ నేను విన్నాను. రెండింటికీ మధ్య సుమారు నలభయి సెకండ్ల విలంబనం జరిగింది. ఆ వ్యవధిలో అతను చచ్చిపోవడమా లేక ఆసుపత్రికి పోయి కట్టు కట్టించుకొని బదకడానికి ప్రయత్నించడమా అని నిర్ణయించబోయి ఉంటాడని తర్వాత నేననుకున్నాను.
ఇంతట్లో అతడు గావుకేకలు వెయ్యడం మొదలుపెట్టాడు. అంతా పెద్ద గందరగోళమైపోయింది. భౌతికంగానూ, ఆధ్యాత్మికంగానూ కూడా. ఆ మనిషి అరుపులు జనం పరుగెత్తడం, కేకలు వెయ్యడం, ఏదో చెయ్యాలనుకోవడం, ఏం చెయ్యడమో ఎరక్కపోవడం, ఎంత గట్టిగా అరిచాడని! ఊళ్లో సగం జనాభా అతని కేకలు విని ఉంటారు.
సామాన్యంగా జరిగే ఆత్మహత్యలను గురించి నాకు తెలిసిందంతా ఇంతే. ఆడమనిషి ట్రాంబండికింద పడిపోవడం నేను చూడలేదు కాబట్టి ఆ సంగతి నేను చెప్పలేను. సికగమైన భోగట్టా నాకు తెలిసిన ఆత్మహత్య ఇదొక్కటే. ఆ అబ్బి అరిచిన అరుపుల ఫిలింలో ఎవరికీ ఆనందం ఇవ్వవు. వాటిని వింటే ఎవ్వరూ సరదాగా ఏడవరు.
మొత్తంమీద నాకేమనిపిస్తుందంటే, చలన చిత్రాలలో ఆత్మహత్య చేసుకోవడం మనం మానివెయ్యాలి.
* * * *
