Previous Page Next Page 
మట్టి మనిషి పేజి 60


    "బాబు వచ్చేదాకా ఉండే టైం లేదే మరి?"
    "చిన్నబాబుగార్కి మీతో తీసుకెళ్ళడం లేదమ్మా?" అన్నది వంటమనిషి బుచ్చమ్మ.
    "నీ తెలివి తెల్లారినట్టే వుంది. వాన్నెత్తుకొని నేనెక్కడ తిరిగేదే హైదరాబాదులో? వారం పదిరోజులు పట్టొచ్చు. ఈలోపల వాడి చదువు ఆగమైపోదూ? కమలా! వాడు రోజూ స్కూలుకెళ్ళేట్టు చూడు. వాళ్ళ నాన్నగారికి వదిలేశావంటే భుజాన వేసుకొని హాలుచుట్టూ తిప్పుతారు. తెలిసిందా?"
    "అట్లాగేనమ్మా!"
    "బాబుకు  చెప్పు - హైదరాబాదు నుంచి విమానం, రైలూ, మంచి బట్టలూ తెస్తానని. పొద్దున నేను వెళ్తానంటే వస్తానని వాడు చాలా మారాం చేశాడు" అన్నది వరూధిని.
    గేటు ముందు కారాగటం చూసి "కమలా, ఆ సూట్ కేసు పట్టుకురా!" అని చెప్పి బయలుదేరింది.
    కార్లోనుంచి వెంకటపతీ, డ్రైవరూ దిగారు. డ్రైవర్ కమల చేతిలోనుంచి సూట్ కేసు తీసుకొని డిక్కీలో పెట్టాడు.
    "అయ్యాగారేరీ?" అడిగింది వరూధిని డ్రైవర్నిచూసి.
    "ముందు మిమ్మల్ని ఎక్కించుకు రమ్మన్నారు" అని చెప్పి రసూల్ కారు స్టార్టు చేశాడు.
    మళ్ళీ కారులో ఎక్కబోతున్న భర్తను చూసి "మళ్ళీ మీరుందుకండీ?" అన్నది.
    "హాలు దగ్గర దిగుతా!" డోరు తెరచిపట్టుకొని లోపలపెట్టిన కాలు అలాగే ఉంచి అన్నాడు భర్త.
    "ఎందుకూ ఇప్పుడు హాలు దగ్గరకు? బాబు స్కూలునుంచి వచ్చేవేళకూడా అయితేను? వాడొచ్చేసరికి ఇద్దరం లేకపోతే మారాం చేస్తాడు. ఉండండి" అన్నది భార్య.
    వెంకటపతి కారు తలుపు మూసి వెనక్కొచ్చాడు.
    కారు సాగిపోతుండగా భర్తను చూసి చెప్పింది వరూధిని:
    "బాబును జాగ్రత్తగా చూసుకోండి! ఇల్లు జాగ్రత్తగా చూసుకోండి. అది.....కొంచెం తగ్గించుకోండి. తర్వాత..."
    కారు సాగి వెళ్ళిపోయింది. దుమ్ము లేపుకుంటూ వెళ్ళిపోయిన కారును చూపు కందినంత వరకూ చూస్తూ నిలబడ్డాడు వెంకటపతి.
    
                         26
    
    వారంరోజుల్లో వస్తానన్న వరూధిని పది రోజులకైనా రాలేదు. వరూధిని వెళ్ళేప్పుడు ఏమీ చెయ్యలేకపోయిన వెంకటపతి తీరా భార్య వెళ్ళాక, ఆమెను వెళ్ళకుండా ఆపితే బాగుండేదేమో ననిపించింది. అది తను ఆపితే ఆగుతుందా? అనే అనుమానం వచ్చి, ఆ ప్రశ్నకు సమాధానం తెలియక అంతటితో ఆ ప్రశ్నే వదిలేసుకున్నాడు.
    ఒకప్పుడు తనను చూస్తేనే హడలిపోయే వరూధినికి ఇప్పుడు తనన్నా, తన మాటన్నా బొత్తిగా ఖాతరులేదు. దానికి పెత్తనం ఇచ్చి, అది చెప్పినట్టు ఆడటంవల్లనే అది ఇంత నెత్తికెక్కి కూర్చుందేమో? ఆ రామనాథబాబుగాడ్ని వేసుకొని అది హైదరాబాదు వెళ్ళటం ఏమిటి? రానియ్! ఈసారి దానంతేదో తేల్చుకుంటాను ..
    అనుకొన్నాడు వెంకటపతి. ఖాళీ అయిన సీసా అవతలకు విసిరేసి పెళ్ళాం మీదొచ్చిన కోపంతో, పనిపిల్లనూ, వంటమనిషినీ కసిరి హాలు దగ్గిర కెళ్ళాడు. బుకింగ్ క్లర్కులూ, గేటు కీపర్లూ వెంకటపతికి రామనాథబాబు వెళ్ళిన దగ్గర్నుంచీ చాలా మర్యాద ఇచ్చి అణకువ చూపసాగారు.
    ఆ రోజు మొదటాట బుకింగ్ జరుగుతుంటే, వెంకటపతి రామనాథబాబు నిలబడే చోట నిలబడి, వచ్చే పోయే జనాన్నీ హాల్లో పనిచేసేవాళ్ళనూ చూడసాగాడు. హాలు ప్రొప్రయిటరు హోదాలో తిరుగుతూ వుంటే వెంకటపతి మనసు ఏదో లోకాల్లోకి విసిరేసినట్టయింది. మొదటి ఆట మొదలు పెట్టగానే వెంకటపతి హాల్లో ప్రవేశించి రిజర్వుడు సీట్లోకెళ్ళి కూర్చున్నాడు. ఆ క్లాసులో ఐదారుగురు కంటే ఎక్కువలేరు. న్యూస్ రీల్ అయిపోయి సినిమా మొదలైంది.
    రాజ్యం పిక్చర్స్ "హరిశ్చంద్ర" టైటిల్స్ తెరమీద కన్పించాయి. సీట్లో వెనక్కు జారగిలబడి కూర్చున్న వెంకటపతికి తను చిన్నప్పుడు చూసిన సినిమా గుర్తుకొచ్చింది. తను మొదటిసారిగా చూసిన సినిమా ఏమిటి? అవును, అదీ "హరిశ్చంద్రే!"
    ఆ రోజు తను స్కూలునుంచి నేరుగా భద్రయ్యగారింటికెళ్ళాడు. బలరామయ్యగారి పిల్లలు సినిమాకని బస్తీకి బయలుదేరారు. వాళ్ళు కొత్త బట్టలు వేసుకొని సవారి బండి ఎక్కుతుంటే తను ఎంతో ఆశగా బండి చుట్టూ తిరిగాడు. తను సినిమా చూడాలన్న కోరిక అణచుకోలేక జీతగాడితో చెప్పాడు. జీతగాడు తన్ను కసురుతుంటే బలరామయ్య విని, పోనీలేదా, పిల్లల్తో వుంటాడు. పాపం, తీసుకెళ్ళు అన్నాడు.
    అప్పుడు బలరామయ్యను తను ఎంత మెచ్చుకున్నాడు మనసులో? తను గుళ్ళో చూసిన దేవుడికంటే బలరామయ్యే మంచివాడుగా కన్పించాడు. జీతగాడు డబ్బులు సంగతి తెచ్చేంతవరకూ  సినిమా చూడాలంటే డబ్బులు కావాలన్న ఆలోచన తనకు తట్టలేదు.
    తను బిక్కముఖంవేసి నిలబడితే మళ్ళీ బలరామయ్యగారే "వాళ్ళ బాబు ఆ సాంబయ్య ఒక్క కానీ ఇవ్వడు. ఒరే పెద్దోడా! జీతగాడితోపాటు వీడిక్కూడా ఓ టికెట్ కొని ఇయ్యరా!" అన్నాడు.
    అప్పుడు బలరామయ్యకు తన మనసులో వెయ్యి దణ్ణాలు పెట్టుకొన్నాడు. జీతగాడు సుబ్బడు తన సొమ్మేదో పోయినట్టు ముఖం పెట్టాడు. వాడి ముఖం ఇప్పటికే తనకు గుర్తే!
    "ఒరేయ్ సుబ్బడూ! మీ అయ్య మాకు పాలేరుగా రాకముందు, వాళ్ళతాత వెంకయ్యేరా మా పెద్ద పాలేరు. ఆ వెంకయ్య నన్ను ఎత్తుకొని మోశాడ్రా! ఆ వెంకయ్య మనవడే వీడు. ఎవరనుకున్నావ్?" అలా చెప్తున్నప్పుడు తనకు బలరామయ్య అంత మంచివాడుగా అనిపించలేదు. ఎందుకు అట్లా అనిపించిందో అప్పుడు తనకు అర్ధం కాలేదు.
    బండి ఊరి బయటకొచ్చేదాకా సుబ్బడు ముందుపగ్గాలు పట్టుకొని నడిచాడు. ఊరు దాటిందాకా తనను బండెక్క నియ్యలేదు వాడు. బండి వెనకే తను పరుగులు తీశాడు. తనను ఎక్కించకుండానే బండి తోల్తాడేమోనని తనకు భయం వేసి ఏడుపొచ్చేసింది.
    "ఓయ్! వెంకటపతీ! ఎక్కెక్కు తొందరగా, గిత్తలాగేట్టులేవ్!" అని తొట్లోనుంచి అరిచాడు సుబ్బడు.
    తను వెనక పరంపట్టే పట్టుకొని బండి ఎక్కుతుండగా బండి కదిలింది. ఓ చేత్తో పరంపట్టీ, మరో చేత్తో జల్లా పట్టుకొని వేలాడాడు. అలా ఎంతసేపు వేలాడాడో సరిగా గుర్తు రావడం లేదు. కాని బలరామయ్యగారి పిల్లలు అదో తమాషాగా అనిపించి గగ్గోలుగా నవ్వడం మాత్రం గుర్తుంది. తను చచ్చీ చెడీ ఎట్లాగో బండిమీదకు పాకాడు. గొంతెండిపోయింది. వళ్ళంతా చెమటలు పట్టింది. జల్ల చివర ముడుచుకొని బిక్కుబిక్కుమంటూ, బస్తీకి చేరేదాకా అలాగే కూర్చున్నాడు. బలరామయ్యగారి పిల్లలు వాళ్ళచివరకు చూసిన సినిమాల గురించి చెప్పుకొంటుంటే తను శ్రద్దగా ఆశగా విన్నాడు. బండి బస్తీ చేరుకొంది. అప్పుడు ఇన్ని ఇళ్ళూ, దుకాణాలూ, రోడ్లూ, సినిమా హాళ్ళూ, హోటళ్ళూ లేవు. బండి సరాసరి సినిమా హాలు గోడ పక్కకువచ్చి ఆగింది. సుబ్బడు బండిదించి ఎద్దుల్ని బండికి కట్టేశాడు. జల్లలో వున్న ఎండుగడ్డి తీసి, ఎద్దులకేసి, మళ్ళీ చాప జల్లలో పరిచి బండి పక్కన హాలు ముందు నిలబడ్డ బలరామయ్యగారి పిల్లల దగ్గర కొచ్చాడు.
    అప్పటికే బలరామయ్యగారి పెద్దకొడుకు ఐదు కుర్చీ టిక్కెట్లు కొన్నాడు. వాళ్ళంతా హాల్లోకి వెళ్ళటానికి సిద్దంగా వున్నారు. పెద్దమ్మాయి తన భుజాన నిద్రపోతున్న పిల్లను సుబ్బడికిచ్చి "ఇదప్పుడే నిద్రకుపడింది. నువ్వెత్తుకోరా! దీన్ని నేను మోయలేను" అన్నది. పెద్దబ్బాయి జీతగాడి చేతిలో అర్ధరూపాయి పెట్టి, తమ్ముళ్ళనూ, చెల్లినీ వెంటబెట్టుకొని హాల్లోకి వెళ్ళాడు.
    నేలటిక్కెట్టు కంతదగ్గర ఇంకా జనం తోసుకుంటూనే వున్నారు. జీతగాడు భుజాన వున్న పిల్లను తనకిస్తూ "అమ్మాయిగారి నెత్తుకో నే వెళ్ళి టికెట్టు తెస్తా. జాగ్రత్త, పడేసేవ్!" అన్నాడు.
    ఆ పిల్ల తన భుజం మీద అటూ ఇటూ కదలడం మొదలుపెట్టింది.ముందు చాలా తేలిగ్గా వుంది. తను మోయగలిగాడు. కాని, వున్నకొద్దీ బరువుగా అయింది. పైగా ఇటూ అటూ కదులుతూంది. జీతగాడు ఎంతసేపటికీ రాలేదు. ఆ పిల్ల తన చేతుల్లోంచి కిందకు జారేట్టుంది. ఓసారి పైకి గుంజుకున్నాడు. మళ్ళీ పట్టు జారిపోయింది. ఆ పిల్లను మోయలేక అవస్థపడుతూంటే తన చొక్కా లాగూమీద ఎవరో నీళ్ళు పోసినట్టయింది. అటూ ఇటూ చూశాడు. పక్కన ఎవరూ లేరు. ఆ పిల్ల గౌను కూడా తడిసింది. అప్పటికి అర్ధమైంది - ఆ పిల్ల తన చొక్కా లాగూ మీద ఒకటికి పోసిండని! దాన్ని రోడ్డుమీద విసిరి పారేయాలన్నంత కోపం వచ్చింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS