"నిజ్జంగానా సమ్మీ...."
"నిజం, మన సత్తిపండు మీదొట్టు" అంది సత్తిపండు తలమీద చేయెసి.
"హు! పొతే నేనే కదా పోయేది" మనసులో అనుకున్నాడు సత్తిపండు.
"పండూ! నీ గాళ్ ఫ్రెండ్ రామేశ్వరిని కూడా తీసుకురా" అంది నవ్వుతూ సమీర.
"అలాగే వదినా! రేపే తీసుకొస్తా"
"చందూ....నేనిక్కడే పైనల్ అట్రాక్షన్ గా నిలబడితే నీకు బిజినస్సే బిజనేస్సురా....లాభం.....ఫిప్టి.....ఫిప్టి...." అంది సమీర.
ఓసారి ఎగాదిగా సమీర వైపు చూసి.....
"అక్కర్లేదు. నేనే నా గ్లామర్ చూపించి అమ్ముకోగల్ను.....' అన్నాడు శ్రీచంద్ర ఉక్రోషంగా.
"హబ్బ! బుంగముత్తో ఎంత ముద్దోస్తున్నావు" అంది శ్రీచంద్ర బుగ్గలమీద చేత్తో చిటికేస్తూ.
అక్కడ వాతావరణం నవ్వులతో, నూతనోత్సాహంతో నిండిపోయింది.
ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి.
* * *
అటువంటి సమయంలో......
ఓ రోజు శ్రీచంద్ర ఇంటికి వెళ్ళేసరికి యమధర్మరాజు ఇంటి అరుగుమీద కూచున్నారు.
"అయ్యో! అదేంటి యమధర్మరాజా! ఇంటి ముందు కూచున్నారు అసహ్యంగా" అడిగాడు శ్రీచంద్ర.
"ఏం చెయ్యను శ్రిచంద్రా, నువ్వా హొటల్ లో దిగబెట్టి వెళ్లావు. నేను నిన్న ఉదయం నా రూమ్ కిటికీలో నుండి ఉదయాన్నే చుద్దానుకదా! అందమైన సుందరాంగులు నీటి కొలనులో జలకాలడుతున్నారు. నేనునూ పోయి వారితో కలిసి జలకములు ఆడవలెనని కోరిక కలిగి అందులోకి దిగితిని."
"అది స్వేమ్మింగ్ పూల్ అందురు. కొలను కాదు గానీ ఇంతకీ ఏమి జరిగినది?"
"నేను వారితో జలకాలాడరాదుట. అది కేవలం ఆడవారు జలకాలాడు సమయమట. నాకేమి తెలియును. అయినా, నేను వారిని "మా లోకమునకు వత్తురా" అని అడిగాను. అంతే! హొటల్ వాళ్ళతో నాతో గొడవ పెట్టుకున్న ఆ తెల్ల అమ్మాయిలు నన్ను హొటల్ రూమ్ ఖాళి చేయించారు. తీరా ఇక్కడికివస్తే మీ బామ్మ గురించి ఏం చెప్పమంటావు మానవా! నేను నీ మనవడి స్నేహితుడ్ని అని ఎన్ని చెప్పినను......'నీ పేరేమి? నీ కులమేమి? ఎక్కడ చదివావు? ఏయే సినిమాలు చూశావు? సెక్స్ సినిమాల పట్ల ఒపినియన్ ఏమి? ఇంగ్లీషు నవలలు చదువుతావా?" అంటూ యక్ష ప్రశ్నలు వేసి చివరాఖరిగా 'ఇదిగో అబ్బాయీ! నువ్వెవరివైతే నాకెందుగ్గాని మా మానవుడు వచ్చేవరకు అరుగుమీద వెయిట్ చేయమని చెప్పింది. నాకు ఒళ్ళు మండింది గానీ నీ మాటకు కట్టుబడి ఆ మండిన వొళ్లు మీద నీళ్ళు చిలకరించుకుంటిని. అయిననూ మీ బామ్మను ఎక్కడో చూసిన జ్ఞాపకం....." అన్నాడు యముడు.
"ఆవిడ ఇంటర్నేషనల్ లెవల్లో పాపులర్ ఫిగర్ లే. అవును గానీ ముందు లోపలికి రండి" అని యమధర్మరాజును లోపలికి తెసుకేళ్ళాడు శ్రీచంద్ర.
"ఏరా మనవడా! నీకోసం ఎవడో గన్నాయ్ గాడోచ్చాడు బలసిన దుక్కలా వున్నాడు.....నీ ఫ్రెండట" అంది బామ్మ.
శ్రీచంద్ర వెనగ్గా వున్న యముడు గుర్రుగా చూసి 'ముసలిదానా! నువ్వు నరకానికిరా, అప్పుడు చెబుతా నీ సంగతి"అనుకున్నాడు.
* * *
యమధర్మరాజు ముసుగుతన్ని పడుకున్నాడు.
బామ్మ ఆ దుప్పటి లాగి "ఇదిగో దుక్కబ్బాయి" అని కేకేసింది.
యముడికి వళ్లు మండింది.
"యముండ" అన్నాడు కోపంగా.
"ఏంటి...ఏదో నీల్గుతున్నావు మిక్సి పాడయింది. కాస్త ఆ వడ పింది రుబ్బుదూ" అంది.
"నేనా? రుబ్బటమా?" కోపంగా అన్నాడు.
"చూస్తే దిట్టంగా వున్నావు. రుబ్బడానికి ఏం మాయ రోగమొచ్చింది. నా మొగుడూ ఇంతే! ఒక్క పని సరిగ్గా చేసి చచ్చేవాడు కాదు. చచ్చి ఏ లోకాన వున్నాడో గానీ, " అంది కోపంగా బామ్మ.
అప్పుడు వెలిగింది యమధర్మరాజు మెదడులో బల్బు.
"అవును. స్వర్గంలో వున్న ముసలివాడి భార్య. పేరు భ్రమర" యమధర్మరాజు వళ్లు వణికింది.
"రుబ్బుతావా లేదా? లేకుంటే మీ ఇంటికి నువ్వెళ్ళు. ఎందుకు ముప్పూటలా తిండి దండగా" అంది.
యమధర్మరాజు కామ్ గా ఉండిపోయాడు. తను ఇక్కడ ఉంది శ్రీచంద్రను కనిపెట్టాలంటే బామ్మ చెప్పినట్టు చేయక తప్పదు అనుకున్నాడు.
పొత్రం దగ్గరికి వెళ్ళాడు. రుబ్బురోలు కర్ర విరిగింది.
వెంటనే గదను తిరగేసి గుబ్బురోలులా చేసి పప్పు రుబ్బుతున్నాడు.
"ఆహా....ఎంత చక్కటి నేర్పరితనం. పప్పు రుబ్బవలెనన్న మీరే రుబ్బవలయును" అంటూ యముడి పక్కనే ప్రత్యక్షమయ్యాడు నారదుడు.
సిగ్గుతో మొహం దించుకుని "నారదా.....చూసితివా.ఈ విషయమును గోరంతలు కొండంతలు చేసి చెప్పవద్దు. సాటి దేవతల ముందు అవమానం భరించలేను" అన్నాడు.
"నేను అలాంటివాడిని కాదు. సమవర్తి! ఏదో మీ పాట్లు మీవి" అన్నాడు.
గదతో పప్పు రుబ్బుతున్న యముడ్ని విచిత్రంగా చూసి "హర్ సిక్రెట్ నైట్స్ అనే ఇంగ్లీషు నవలొకటి చదువుకుంటూ కూచుంది బామ్మ.
తన గదతో ముసలి బామ్మ తలమీద ఒక్కటివ్వాలన్నంత కోరిక కలిగింది యముడికి.
* * *
శ్రీచంద్ర చిన్నగా ప్రారంభించిన ఫాస్ట్ పుడ్ సెంటర్ పికప్ అవ్వసాగింది. సమీర యాంకరింగ్ మానేసి బుద్దిగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో శ్రీచంద్రకు సాయంగా ఉండసాగింది.
సత్తిపండు, సమీర కిచెన్ పనులు చూసుకుంటుంటే శ్రీచంద్ర సర్వ్ చేయడం కౌంటర్ దగ్గర కూచోవడం చేస్తున్నాడు. సమీర కస్టమర్లను ఆకట్టుకోవడానికి రంగంలోకి దిగింది.
జీన్స్ మీద టీ షర్ట్ టక్ చేసి వెంట్రుకలు ఆలా గాలిలోకి వదిలి సాయంత్రం వేళ చికెన్ సిక్స్ టీఫైవ్, నూడిల్స్, మంచురియా సప్లయ్ చేస్తుంటే కుర్రకారు మాత్రమే కాదు, ముసలాళ్ళు సైతం ఎగబడసాగారు.
కాలేజి అమ్మాయిలు కూడా రావడం ప్రారంభించారు. దానికి తోడు ఐటమ్స్ అన్నీ రుచిగా ఉండడం ప్లస్సయింది. ఓ రోజు శ్రీచంద్ర తల్లి అక్కడికి వచ్చింది.
కొడుకు ప్రయోజకత్వాన్ని కళ్ళారా చూసింది. ఆమెలో ఏదో కదలిక. శ్రీచంద్ర ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టిన నాలుగో రోజు తల్లికి పట్టుచీర, తండ్రికి లాల్చి, బామ్మకు కళ్ళజోడు పట్టుకెళ్ళాడు.
అది శ్రీచంద్ర తల్లికి ఆనందాన్ని కలిగించింది. ఇలాంటి సంఘటన తొలిసారిగా చూసింది. అదే విషయం శ్రీచంద్రతో అంది చమర్చే కళ్ళతో.
