Previous Page Next Page 
శ్రీ శ్రీ కథలు పేజి 59


                          ప్రేమ మరణం త్యాగం వగైరా

    టామ్ గార్నర్ , ఫిలింలో , తేరా మీద గొప్ప నిండైన
    విగ్రహం, రైలు దార్ల నిర్మాత, షికాగో అండ్ సౌత్ వెస్ట్రర్న్
    కంపెనీ ప్రెసిడెంటు , కుప్పగా కూలిపోతూ - నడుస్తూ
    రాజగదిలోకి తూలి పడతాడు, తలుపు వేసుకుంటాడు.
    ఆత్మహత్య చేసుకోబోతున్నాడని నాకు తెలుసు. కుప్పగా కూలబడ్డాడు కాబట్టి, ఇది సినిమా కాబట్టి, ప్రారంభమై అప్పుడే చాలాసేపు అయిపొయింది కాబట్టి ఏదో ప్రళయం ముంచుకు రావాలి. ఏదో బ్రహ్మాండమైన సంఘటన, హాలీవుడ్ చిత్రాల ప్రత్యేకార్షణ , ఏదో ఘనకార్యం, ఆత్మహత్య ! లేదా ముద్దు.
    ఏది జరిగితీరుతుందని నిశ్చయంగా ఎరుగుదువో దానికోసమని నిరీక్షిస్తూ సినిమా హాలులో కూర్చుంటావు.
    పాపం టైం కి ఇప్పుడే తెలిసింది. తన రెండవ భార్య మగ సంతానం మొదటి భార్య ఎదిగిన కొడుక్కి పుట్టినట్టు. టామ్ మొదటిభార్య ఆత్మహత్య చేసుకుంది - దరిమిలాను టామ్ ద్వితీయ కళత్రమైన ఈ అమ్మాయిని టామ్ ప్రేమిస్తున్నాడన్న సంగతి తెలుసుకొని ఈ అమ్మాయి శాంటాక్లారా రెయిల్ రోడ్డు ప్రెసిడెంటు కూతురు . తన తండ్రి ప్రెసిడెంటుగిరి నిలవడానికి గాను టామ్ తన్ను ప్రేమించేటట్టు ఈ అమ్మాయే జాగ్రత్త పడింది. తొమ్మిది మిలియన్ డాలర్లు పెట్టి టామ్ శాంటాక్లారా కంపెనీని కొన్నాడు. టామ్ ప్రేమ కధని టామ్ మొదటి భార్య ట్రంకారు కిందపడి చచ్చిపోయింది. ఈ చావడం హావభావాలతో నటించింది. మొగంలోను, కళ్ళలోనూ , పెదవులలోను నడిచిన తీరులోనూ నటించి చూపించింది. ఫిలిం నిర్మాతలు మీకు ఇబ్బంది కలిగించే ఘోరదృశ్యాలేవీ కనబరచలేదు. కారును హటాత్తుగా అపబోయినప్పుడు డ్రైవరు మొగంలో గందరగోళం, ఆమె మీద నుంచి వెళ్ళిపోయిన ఇనప చక్రాల రణగొణధ్వని,  ఇలాంటి భీషణ దృశ్యాలని చూసేటప్పుడు జనం అరిచే అరుపులు ఇవన్నీ చూపించారు. మీకు విషయం అర్ధమయింది. కావలసినంతా అయింది. టామ్ భార్య శాలీ దేవుడిలో కలిసిపోయింది.
    టామ్ పేదవాడుగా ఉన్నప్పుడు , శాలీ చిన్న స్కూలు మాస్టారుగా వున్నప్పుడు టామ్ ని శాలీ చూసింది. తనకి చదవడం, రాయడం, లెక్కలు చెయ్యడం రాదని టామ్ ఒకరోజు ఒప్పుకున్నాడు. శాలీ టామ్ కి చదవడం, రాయడం , కలపడం, కొట్టెయ్యడం ,భాగించడం , గుణించడం నేర్పింది. వాళ్ళ పెళ్ళి చేసుకున్న తర్వాత ఒక సాయంత్రం , టామ్ ! ఎప్పుడూ నీకిలాగ పేదగా వుండి పోవాలనే వుందా అని అడిగింది శాలీ. ఔనన్నాడు టామ్ - గొప్పవాణ్ణి కావాలని పిసరైనా కోరిక లేదా అని అడిగింది . లేదు. మనం, మన జిల్లా ఈ జీవితం అంతా తృప్తిగా జరిగిపోతోందన్నాడు. అందుకు శాలీ నొచ్చుకుంది. అప్పటి నుంచీ అద్బుతంగా  నటించడం మొదలుపెట్టింది. తాను గొప్పవాడినైతే శాలీ చాలా సంతోషిస్తుందని టామ్ కి బోదపడింది. రాత్రి భోజనం చేస్తూ , నీ కోరిక సఫలం చేస్తానన్నాడు టామ్. అతని కళ్ళలోకి ఒక వింత చూపు వొచ్చింది. అతని మొగంలోనికి గొప్పతనం వొచ్చింది. జీవిత సముద్రంలో అతడు పెద్ద పెద్ద బారలు వేస్తూ ఈదుకుపోతున్నట్టు మీకు కనబడి వున్నా వుండవచ్చు.
    టామ్ ని శాలీ షికాగో లో పాఠశాలకి పంపించి , ఇంట్లో తాను అన్ని పనులు చేసుకునేది. టామ్ వర్తకాన్ని తాను చూసుకుంటూ ఆ వచ్చిన డబ్బుతో టామ్ కి స్కూలు జీతం కట్టేది. గొప్ప స్త్రీ ! ఆదర్శప్రాయమైన భార్య! ఇంటింటికి సరుకులు తీసుకుపోయి అమ్మేది. ఒక చలికాలపు రాత్రి రైలు పట్టాల మీదుగా ఆమె ఇనప సామాన్లు మోసుకుని వెళ్లుతుండడం మ చుట్టు మిహికాచ్చాదనం , విషాదమయమైన నిర్జనప్రదేశం ఇదంతా చూపించారు. ఎంత జాలిగా ఉంది ఆ దృశ్యం. అంత జాలిగా వుండాలనే ప్రొడ్యూసర్ల ఉద్దేశ్యం. ఆ బాధంతా ఆమె టామ్ కోసమని పడుతోంది. టామ్ గొప్పవాడు కావడం కోసం . ఆ రోజయితే టామ్ తనకి మిస్సురీ బ్రిడ్జి నిర్మాణంలో ఫోర్మన్ పని లభించినట్టు ప్రకటించాడో ఆరోజే తాను గర్భంతో వున్నానని శాలీ వెల్లడించింది. అప్పుడు టామ్ అన్నాడు నన్నెవరూ ఇక ఆపలేరని శాలీ కోసం , బేబీ కోసం తాను ఎట్టి శిఖరాలైనా అందుకోగలనని.
    శాలీ కొడుకుని ప్రసవించింది. టామ్ ఆమె మంచాన్ని సమీపిస్తున్నప్పుడు మీకు శ్రావ్యమైన నేపధ్యగానం వినబడింది. టామ్ జీవితంలో ఇది అమోఘమైన ఘట్టమని మీకు వెంటనే బోధపడింది. తగ్గుస్థాయిలో వెలుతురు ఫోకస్ చేసిన గదిలోకి టామ్ ప్రవేశించడం చూశారు. దేవుణ్ణి ప్రార్ధించడం విన్నారు. శాలీ ప్రక్కని అప్పుడే పుట్టిన కొడుకు ప్రక్కని మోకరిల్లడం చూశారు. స్వర్గంలో వున్న మా తండ్రీ నీదే కీర్తి నీదే శక్తి ఎల్లప్పుడూ , ఎల్లప్పుడూ అనడం విన్నారు. సినిమాహాల్లో ఒకరిద్దరూ ఏడుపు దిగమింగకుండం కూడా విన్నారు.
    టామ్ ని గొప్పవాణ్ణి చేసింది శాలీ . రైలు పట్టాల నించి ఎత్తి ప్రెసిడెంటు కుర్చీ మీద కూర్చోబెట్టిందామే. తర్వాత టామ్ వయస్సులో చిన్నదీ, అందంలో పెద్దదీ అయిన ఈ రెండో అమ్మాయి వలలో పడిపోయాడు. శాలీ ట్రంకారు కింద పడి ప్రాణం తీసుకుంది. టామ్ ని ఇంతవాణ్ణి చేశాక చచ్చిపోయింది. కాబట్టే ఆమె మరణం అంత కరుణం. అందుకనే ఆమె ప్రాణత్యాగం చేసినప్పుడు అంతమందికి సినిమా హాలులలో కళ్ళంట నీళ్ళోచ్చాయి.
    కానీ శాలీ ఆత్మహత్య వల్ల టామ్ కి ఈ కన్నె పిల్ల మీద మోహం తగ్గిపోలేదు. కొన్నాళ్ళు పోనిచ్చి ఈమెను వివాహం చేసుకున్నాడు. ఎందువల్ల నంటే అతడు కార్య శూరుడు అనగా అప్పుడప్పుడు మాత్రం, అనగా ఎప్పుడేప్పుడతడు కార్యశూరుడుగా కనబడాలని హాలీవుడ్ పెద్దలు నిర్ణయిస్తే అప్పుడప్పుడు మాత్రం. టామ్ కొడుకు ఈడు వచ్చిన వాడు. మితిమీరిన తాగుడు కారణంగా కాలేజీ నించి తరిమివేస్తే మరలి వచ్చి టామ్ ఇంట్లో మకాం వేశాడు . టామ్ రెండవభార్య తో ప్రణయ వ్యాపారం పెట్టుకున్నాడు.
    ఫలితం ఒక శిశివు , అందమైన , ఆరోగ్యకరమైన బిడ్డ, తండ్రికి బదులు కొడుక్కి పుట్టింది. అంతే బేధం. టామ్ కొడుకు టామీ బాధ్యత ఎరగని కుర్రాడు. అయితే మంచి దుస్తులు వేస్తాడు. గొప్ప జీవితాశయాలున్నట్లు కనబడతాడు. పాపం అతనికీ ఈ పని చేయాలని లేదు ప్రకృతి చేసిందీ పని . ప్రకృతి చేసే పనులు మీకు తెలుసుగా . ఫిలింలో అయితే మాత్రం? టామ్ తన వ్యాపారం తొందరలో ఎప్పుడూ ఇంటి పట్టున ఉండేవాడు కాడు. అతని రెండవభార్య ఒంటరిగా ఉండేది. ఏమీ తోచేది కాదు. మొగుడి కొడుకుని చూసింది . డ్యాన్సులకి తీసుకెళ్ళింది.
    ఏ మంచి చెడ్డా ఎరగని ఆ కుర్రాడి వైపు సాభిప్రాయంగా ఆమె చెయ్యి చాపడం చూశారు. మీరు డాన్సు చేద్దామా అని అడిగిన మాట విన్నారు. ఆ చెయ్యి అందుకోవడానికి కెంత ఆలస్యం చేశాడు! తక్షణం తెలిసిపోయింది  మీరు దానిలోని, భయంకరమైన అర్ధం మరి. ఆమె సౌందర్యం అంత పిచ్చెత్తిస్తుందే. మీ మట్టుకు మీరైనా, అటువంటి పరిస్థితిలోనైనా ఆమెను ప్రతిఘటించగలుగుతారనుకోరు. అదేదో అనిర్వచనీయమైన శక్తి వుంది. ఆ నటీమణి ముఖంలో , ఆకృతిలో చుంభన యోగ్యమైన పెదవులు, లాలిత్యం ఉట్టిపడే భంగిమ. లోపల చూపించడానికి వీలులేని అంగసౌష్టవం , ఆరురావురుమనే ఆత్మ, ఎవరు మాత్రం అగగలరు వీటి ధాటికి.
    అంతే అలా జరగలవలసి వుంది జరిగింది. మానవుడు దుర్భలుడు ఇంద్రియాలు చెడ్డవి వగైరా.
    ఆఖరికి ఆ ఘనత వహించిన టామ్ గార్నర్. లక్షాధికారి, రైల్వే కంపనీ ప్రెసిడెంటు తాను పట్టినపట్టు ఎప్పుడూ నెగ్గించుకున్న వాడు . ఎదురు తిరిగిన కార్మికుల సమ్మెను ఇట్టే భగ్నం చేసినవాడు , దొమ్మిలో , కాల్పులలో తన పని వారు నలబైమంది దాకా చచ్చిపోయినా లక్ష్య పెట్టనివాడు. తన గదిలో కుప్పగా కూలబడి తలుపు వేశాడు.   
    ఇక చిత్రం ముగిసిపోతుందని మీకు తెలుసు.
    సినిమాహాలు వాతావరణం విద్యుదుద్వేగంతో దుర్భరమై పోతోంది. తమ తమ జీవితాల్లోచాలా భాగాలు చలనచిత్రాలని చూడడంలో ఖర్చు పెట్టి నాయికా నాయకులతో బాటు ప్రేమిస్తూ మరణిస్తూ ఉన్నతాశయాల కోసం ఆహుతి అయిపోతూ వెండి తెరని తదేకధ్యానంతో ఆరాధించే నడిమివయస్సు స్త్రీలుపురుషులూ తరువాయి కొరకై భయంతో నిరీక్షిస్తున్నారు. నిన్నటి లాగా ఇవాళ కూడా వచ్చారు. ఈ సినిమా చీకటిలోకి. ఇంకోమారు వీళ్ళని ఉన్నత జీవితాశయాలు ఆవహించబోతున్నాయి.
    ఈ ఆడా మగా జనంలోని అధ్యాత్మికోద్వేగం పసిపట్టలేరూ? జాగ్రత్తగా వింటే ఉన్నతంగా సంపూర్ణంగా జీవించడం కూడా మీకు వినబడదూ?    
    పాపం టామ్ ని ప్రచండమైన సమస్య పట్టుకుంది. భయంకరమైన బాధ్యత పీడిస్తుందతన్ని.
    అతని మర్యాద కోసం, హాలీవుడ్ నీతి చట్టాల కోసం, సినిమా పరిశ్రమ కోసం (అమెరికన్ పరిశ్రమలలో మూడవదని విన్నట్టు జ్ఞాపకం) దేవుడి కోసం నీ కోసం నాకోసం టామ్ గార్నర్ ప్రాణత్యాగం చేసి తీరాలి. చెయ్యకపోయినా ఇన్నాళ్ళూ మనం ఆత్మవంచనతో జీవిస్తున్నా మన్నమాట. షేక్ స్పియర్ నాటకాలు వృధా అన్నమాట. టామ్ లో ఏమాత్రం పౌరుషం వున్నా ఈపాటి పని చేస్తాడని మనం అనుకుంటాము. అయితే మాట వరసకి, చెయ్యకపోతే ఏమవుతుందో అని ఒక్క క్షణ కాలం అనుకుంటాము ఏమవుతుందో తమాషా చూడడానికి. మన చుట్టూ కట్టుకున్న ప్రపంచం ఒక్కసారిగా కూలి పోతుందేమో చూడడానికి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS