Previous Page Next Page 
మట్టి మనిషి పేజి 59


    కాఫీ సిప్ చేస్తూ ఇల్లంతా కలియజూస్తూ "బ్రహ్మాండంగా వుంది" అన్నాడు.
    "నా గొప్పేంకాదు. నెస్ కేఫ్ కలిపా?" అన్నది వరూధిని.
    "కాదు - డెకరేషన్."
    వరూధిని కింద పెదవి నొక్కింది, పవిట సర్దుకుంటూ.
    "కొత్త ఇంట్లోకి వచ్చాక పార్టీ అన్నా ఇవ్వలేదేం?"
    తనను గురించి కాదు. ఇంటి సంగతా ఈయన మాట్లాడుతుంది?
    "ఆ సంగతి మాట్లాడాలనే రెండు రోజులనుంచీ మీకోసం చూస్తున్నా!"
    "ఓహో! పార్టీ ఇచ్చే ప్రయత్నంలోనే వున్నావన్నమాట!"
    వరూధిని లేచి టేబుల్ మీద నుంచి కాగితం తెచ్చి మడత విప్పి రామనాథబాబుకిస్తూ "ఇదీ లిస్టు! ఇంకా ఎవరెవర్ని పిలవాలో మరి, చూడండి!" అన్నది.
    రామనాథబాబు లిస్టు పక్కనపెట్టి "అదంతా చూసే ఓపిక నాకు లేదుగాని చెప్పు, ఎవరెవర్ని పిలుస్తున్నారో?" అన్నాడు.
    "చదవటానికి ఓపిక లేనివాళ్ళకు వినే ఓపిక మాత్రం ఉంటుందేమిటి?" పెదవి విరుస్తూ అన్నది వరూధిని.
    "నువ్వు మాట్లాడుతుంటే వినాలనే ఉంటుంది మరి!"
    "చాల్లెండి!" అంటూ వరూధిని భర్త రావడం చూసి ఆగిపోయింది.
    వెంకటపతి రామనాథబాబుకు ఎదురుగా కూర్చుంటూ "ఎంత సేపయింది వచ్చి?" అన్నాడు.
    "ఏమిటి, ఒంట్లో బాగాలేదా?" పరామర్శించాడు రామనాథబాబు.
    "బాగాలేకపోవడం ఏం లేదు. కాని నరాలు గుంజుతున్నట్టుగా వుంది." అదోలా నవ్వుతూ అన్నాడు వెంకటపతి.
    "రసూల్ కు మూడు రోజుల క్రితం చెప్పా. వాడికీ ఎక్కడా దొరికినట్టు లేదు మరి!"
    "ఇంకెవర్నన్నా అడిగితేనో?" ఆశగా అన్నాడు వెంకటపతి.
    "అదే ఆలోచిస్తున్నా! ప్రొహిబిషన్ యస్సైకు చెప్తే అతనే తంటాలు పడ్తాడు." సాలోచనగా అన్నాడు రామనాథబాబు.
    వెంకటపతి తికమకపడ్డాడు. రామనాథబాబు అసాధ్యుడు! ఏమైనా చెయ్యగలడు! అనుకున్న వెంకటపతికి, నరాల్లోకి బలం వచ్చినట్టయింది.
    "ఇంతకీ డిన్నర్ ఎప్పుడూ? నేను వెళ్ళేముందే ఇస్తారా? వెళ్ళాకా?"
    "ఎప్పుడిస్తే మీకేం లెండి. ఎవర్ని పిలుస్తున్నావో కూడా వినటానికి ఇష్టంలేని మీకు..." వరూధిని అలిగింది.
    "అదే! చెప్పందే ఎలా వింటాను?" అన్నాడు రామనాథబాబు సర్దుకు కూర్చుంటూ.
    "సబ్ కలెక్టరుగారూ, ఆయన ఫామిలీ, డియస్పీగారూ - ఆయన పెళ్ళాం రాదనుకుంటాను, సీతారామారావుగారూ, రామచంద్రయ్యగారూ, చంద్రమతీ ఆమె మొగుడూ, వేదవతి - ఆమె భర్తను తీసుకురాదుగా - మిసెస్ వైకుంఠం....ఇంకా..." వరూధిని ఆలోచించసాగింది.
    "మిస్టర్ వైకుంఠమో?" అన్నాడు రామనాథబాబు.
    "ఆయన కైలాసంలో వున్నాడేమో! మీరే పిలవండి." పకపకా నవ్వింది వరూధిని.
    "లిస్టు అయిందా? ఇంకా వున్నారా?" గుర్రుగా అడిగాడు రామనాథబాబు.
    "ఆ! - మర్చిపోయాను. టౌమహాల్ సెక్రెటరీ, ప్రెసిడెంటూ, మహిళా సంఘం ప్రెసిడెంటూ- ఇంకా....."
    "ఎందుకంటా వీళ్ళంతా?" రామనాథబాబు ముఖంలో అయిష్టత స్పష్టంగా గోచరించింది.
    "వాళ్ళంతా మీ మనుషులేగా? మీ ఫ్రెండ్సేగా! ఇందులో మా ఆయనగ్గానీ, నాక్కానీ కావాల్సిన వాళ్ళెవరూ లేరే?" పెళుసుగా అన్నది వరూధిని.
    రామనాథబాబు తగ్గిపోయి "ఆహా! నేనంది అదికాదు. చాలా పెద్ద పెద్ద వాళ్ళను పిలుస్తున్నావ్! డిన్నర్ కు గొప్పగా ఏర్పాట్లు చెయ్యాల్సి వుంటుందని" అన్నాడు.
    "అందుకు మీ మందీ, మార్బలమూ వుందిగా?" అన్నది వరూధిని.
    "ఇంతకీ డిన్నర్ ఎప్పుడివ్వాలనుకొంటున్నావ్?"
    "నేనిచ్చేదేమిటి? అంతా మీదేగా? మీ వీలునుబట్టి చెప్పండి. ఎప్పుడూ అందరి ఇళ్ళల్లో తినేసిరావటంతప్ప తెలియందానికి, పార్టీలిచ్చే సంగతి నాకేం తెలుస్తుంది?"
    "నిన్ను ఒద్దని ఆయన అన్నాడా ఏంటి? ఎందుకట్లా మాట్లాడతావ్?" అన్నాడు వెంకటపతి.
    "మన ఇంట్లో ఒక్కరోజు కూడా విస్తరేయకుండా పిలచీ పిలవడంతోనే తిని రావడానికి సిగ్గేసి చస్తున్నాను." వరూధిని పెదవులు బిగించి నేల చూపులు చూసింది.
    "ఇది ఇంకా బాగుంది? నిన్ను పార్టీ ఇవ్వొద్దని నేనన్నట్టు మాట్లాడతావేం! ఎల్లుండే ఏర్పాటు చేయిస్తా సరా? వెట్టా? డ్రైయ్యా?" అడిగాడు రామనాథబాబు.
    "అది మళ్ళీ నన్నడగాలేమిటి?" దీర్ఘం తీస్తూ అన్నది వరూధిని.
    ఆమె కళ్ళల్లోని వెలుగు రామనాథబాబు గుండెల్లో గిలిగింతలు పెట్టింది.
    "మరి నే వస్తా!" అంటూ రామనాథబాబు లేచి నిలబడ్డాడు.
    "నా సంగతి మర్చిపోయేరు? రాత్రికి ఎట్టా అయినా ఒక అరసీసా అయినా పంపించాలి" అన్నాడు వెంకటపతి.
    
                           25
    
    "నువ్వెందుకంటా? ఆయన వెళ్తే సరిపోదూ?" అన్నాడు వెంకటపతి, పూర్తిగా ముస్తాబయి నైలాన్ చీరలో మెరిసిపోతున్న వరూధిని చూసి.
    "బాగానే వుంది. మన బిజినెస్ మనం చూసుకోకపోతే ఎంతకాలం పై వాళ్ళమీద ఆధారపడ్తామూ?" ప్రమాదాన్ని పసికట్టి అప్పుడే పాడగా విప్పబోతూన్న తాచుపాములా లేచింది మొగుడిమీదకు వరూధిని.
    "ఆహా - అదికాదు. హైదరాబాదులో సినిమా హాలెందుకు మనకీ అని! ఇక్కడుంది చూసుకొంటే చాల్దా?" వెంకటపతి మెత్తబడిపోతూ అన్నాడు.
    "మీకేం తెలియదు. అంతా అడివిగోడు! పది లక్షలు పెట్టి హాలుకడ్తే, అందులో ఫైనాన్సు కార్పొరేషన్ వాళ్ళు ఎనిమిది లక్షలదాకా ఇస్తారు. ఇహ మనం పెట్టేది ముష్టి రెండు లక్షలు. అందులో మన వాటా లక్షే కదా?"
    "ఉన్నదంతా అమ్మించి ఈ హాలుకింద పెట్టించావ్. ఇంకా లక్ష ఎక్కడ తెస్తావ్?"
    "ఆ లక్ష రూపాయలు మనం తేనవసరం లేదని చెప్పటం లేదూ? మన థియేటర్ ఐదేళ్ళకు  లీజ్ కిస్తే లక్షన్నర అడ్వాన్సు ఇస్తామంటున్నారు. ఇహపోతే ఏభై వేలు. అందులో నా వాటా పాతిక వేలు. అది రామనాథబాబే హుండీలో ఇప్పిస్తానన్నారు."
    "ఏంటీ? ఉండీలా, గుండీలా! నీ గొడవేంటో నాకర్ధం కావడంలేదు."
    "అందుక్కాదూ నిన్ను నోరుమూసుకు కూర్చోమంటుంది?"
    పెళ్ళాం అన్నమాటకు వెంకటపతి తలెత్తి చూశాడు.
    "అన్నిటికీ అపశకునాలు. అనుమానాలూ? పాతికవేలు పెడ్తే ఐదులక్షల ఆస్తి మనకవుతుంటే మధ్యలో నీ నసుగుడేమిటి?"
    "ఆఁ! అవుద్ది పాతికేలు ఐదు లక్షలు!"
    "హైదరాబాద్ లో థియేటర్ల కలెక్షన్లు ఎలా వుంటాయో మీకేం తెలుసు? గోపాలరావు నాలుగేళ్ళల్లో హాలుమీద పెట్టిన పెట్టుబడి సంపాదించాడు. లీజు కిచ్చినా వారానికి ఐదు వేలకు తక్కువ కాకుండా ఇస్తారు."
    "ఇస్తారిస్తారు!" బొటనవేలు నోట్లోనుంచి తీసి అన్నాడు వెంకటపతి.
    "నిన్ను చూస్తే నాకు వళ్ళు మండుతుంది! వారానికి ఐదువేలు కాదు, ఏడువేలదాకా ఇస్తారు. ఆ మాటకొస్తే ఖర్చులూ వడ్డీ పోనూ నెలకు పదివేలు మిగుల్తాయి. సంవత్సరానికి లక్షా ఇరవై వేలు. అంటే చూడు...."
    "ఏంది చూసేది? చూడాల్సిందే!" అంటూ వెంకటపతి పెళ్ళాంకేసి చూశాడు.
    "నా కెదురుగా నిల్చుని అట్లా గుడ్లు మిటకరించుకొని చూడకపోతే, అట్లా వీధిలోకి వెళ్ళి రామనాథబాబు కారొస్తుందేమో చూడరాదూ? ట్రైన్ టైం అవుతోంది!" చేతివాచి చూసుకుంటూ చిరాగ్గా అంది వరూధిని.
    వెంకటపతి టవల్ దులుపుకొని భుజాన వేసుకొని వీధిలో కెళ్ళాడు.
    వరూధిని పనిపిల్లనూ, వంటమనిషినీ పిలిచి, తను ఊరునుంచి తిరిగి వచ్చేంత వరకూ చెయ్యాల్సిన పనులన్నీ ఏకరువు పెట్టింది.
    "బాబు ఇంకా స్కూలునుంచి రాలేదుకదమ్మా?" అన్నది పనిపిల్ల.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS