Previous Page Next Page 
మెయిడ్ ఇన్ ఇండియా పేజి 60

 

    "నాలుగు గంటలు దాటి పావుగంట ఎక్కువ సమయం గడిచింది. అంటే అతను పెట్టిన షరతు ఎప్పుడో దాటింది. ఇక విష్ణు ప్రాణాలతో వుండడం అసంభవం కాబట్టి అతను ఎప్పుడో కన్నుమూసి వుంటాడు. కనీసం అతని చివరికోరికనయినా తీరుద్దాం" ధీరజ మాటలు ఇంకా పూర్తీ కానే కాలేదు.....
    అప్పటికే ఆ షాకింగ్ న్యూస్ డైనమైట్ లా పేలింది.
    ప్రజలలో కలవరం......
    "విష్ణుని బయటకు తీయాలి."
    "వెంటనే విష్ణు సమాధి తవ్వండి"
    నినాదాలు మిన్నుముట్టాయి.....
    కలెక్టర్ ధీరజ ఆ భక్త జనాన్ని వారించలేకపోయింది.
    ఆమెకూ తన ప్రియతముడ్ని ప్రాణాలతో చూడాలనే వున్నది. కాని తనకు రాసిన ఆఖరి ఉత్తరంలో అతను వెలిబుచ్చిన చివరి కోరిక అది.
    అందుకే అలా అన్నది తప్ప ఆమెకూ మనస్పూర్తిగా యిష్టం లేదు.....
    ప్రజల నాడి కూడా అందుకు వ్యతిరేకంగా వుండడంతో ధీరజ మౌనం వహించింది. కిరణ్మయి భారతిలకు విష్ణు రాసిన లెటర్స్ ఇచ్చి తనకు రాసిన దానిలో ఏముందోనని తెరిచి చూసింది రీటా.
    "రీటా నువ్వు ఎవరివో ఏం చేస్తుంటావో అసలు ఆశ్రమానికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు. నువ్వు ఎందుకోసం వచ్చినా పని మరచిపోయి సర్వసంగ పరిత్యగిని అయిన నా మీద లేనిపోని ఆశలు పెంచుకోడాన్ని ఎవ్వరూ హర్షించరు గాక హర్షించరు. అయినా నీ ఆశ ఈ జన్మలో తీరేది కాదు. నేను సన్యాసిని అన్నమాట మర్చిపోవద్దు.'
    రీటా మనసు బాధతో మూలిగింది.
    "నిజమే .........తను రాంగ్ ట్రాక్ లో పడిపోయిన మాట నిజమే. తను తన కర్తవ్యం మరచిపోయి విష్ణుపై ప్రేమను పెంచుకోవడం తను చేసిన పెద్ద తప్పు. కానీ ఈ క్షణంలో కూడా తను ప్రేమించకుండా వుండలేకపోతున్నది ఏం చేయాలో తన బేల హృదయాన్ని ఎలా సమాధానపరచుకోవాలో అర్ధం గాక తనలో తను మూగగా రోదిస్తున్నది రీటా!
    కిరణ్మయి విస్మయంతో లెటర్ చదివింది.
    "నువ్వు నన్ను కోరుకున్నావే తప్ప అప్పటి నా పరిస్థితిని అర్ధం చేసుకోలేకపోయావు. నేనెంత చెప్పాలని ప్రయత్నించినా నా మాటలు వినే దానివే కాదు. ఎలాగయినా నన్ను దక్కించుకోవాలనే అరాటంతో పిచ్చి రాతలు రాసి నా నుదుటి రాతనే మర్చివేశావు. అప్పటికే మరొకరికి భర్తనయిన నేను నీ మెడలో ఎలా తాళి కట్టగలననుకున్నావు? అందుకే నీకు కనిపించనంత దూరం వెళ్ళిపోయాను....."
    "అవును విష్ణూ.......! అప్పుడు మానసికంగా నిన్నెంత బాధించానో అందుకు రెట్టింపుగా ఇప్పుడు మానసిక వ్యధను అనుభవిస్తున్నాను. ఇన్నాళ్ళు కనీసం కంటి ఎదురుగా వున్న మిమ్మల్ని చూసయినా ఆ బాధను మరచిపోగలుగుతున్నాను. ఇప్పుడు ఆ అదృష్టానికి కూడా నోచుకోని దురదృష్టవంతురాలిగా మిగిలిపోయాను.......అని తనలో తనే కుమిలిపోతున్నది కిరణ్మయి.
    భారతి పరిస్థితి వెళ్ళిద్దరికి భిన్నంగా వుంది.
    ఎప్పుడయితే విష్ణు సమాధిలో నుంచి బయటకు రాడని తెలిసిందో  ఆ క్షణంలోనే ఆమె కుప్పకూలి పోయింది. ఆశ్రమ వాసులు ఆమె ముఖం మీద నీళ్ళు జల్లారు. తిరిగి భారతి స్పృహలోకి వచ్చింది.
    ఆమె కళ్ళు విష్ణు రాసిన ఉత్తరంలోని అక్షరాల వెంటే పరుగులు తీశాయి.
    "మిస్ భారతి........హిందూ సంప్రదాయం ఎంతో ఉన్నతమయినది. పాశ్చాత్య నాగరికతతో పెరిగిన నీకు ఇక్కడి అచారాలు, వ్యవహారాలూ విచిత్రంగా వుండి వుండవచ్చు. నీ తండ్రితో నువ్వు ఛాలెంజ్ చేసి లండన్ నుంచి వచ్చావని నాకు తెలుసు. ఒక స్త్రీకి ఒకే భర్త వుండాలనేది ఆర్ష సంప్రదాయం. దానిని ఎవరూ అతిక్రమించకపోవడమే మా వివాహ బంధంలోని కట్టుబాటు.....
    "అగ్నిసాక్షిగా తాళికట్టి ఏడడుగులు నడిచినందుకే మానసికంగా భార్య భర్తల బంధం ఏర్పడుతుమ్డనే నమ్మకం నరనరాన జీర్ణించుకున్న మా హైందవ సంస్కృతీ నీకు ఏవగింపుగా ఉండవచ్చు. కానీ ఆచంద్రతారార్కం భారతీయ చిహ్నాలు అజరామరంగా నిలిచి వుంటాయని నువ్వు ఇప్పటికైనా తెలుసుకో.....
    "శిష్యురాలిగా నా ఆశ్రమంలో చేరానే తప్ప నీకు ఆధ్యాత్మిక చింతన లేదని నాకు ఎప్పుడో తెలుసు. పాతివత్యం, పసుపు కుంకుమలు ధరించడం, బొట్టు కాటుక లాంటి అలంకరణలు ఒట్టి ట్రాష్ అని.....మమతాను బందాలనేవి ఒట్టి నీటి మూత అని నీ తండ్రితో వాదించి మరీ వచ్చావు.......భార్య భర్తల బంధమనేది మనసా వాచా త్రికరణ శుద్దిగా పవిత్రంగా వుండడమనేది అవసరం కోసం నటించడమే తప్ప మనుషులు దూరమైపోతే మనస్సులో ఎలాంటి అనురాగమూ వాళ్ళపై నిలిచి వుండదని నీ అభిప్రాయం.
    నీ మనస్సులో భారతీయుల పట్ల పేరుకుపోయివున్న అపోహలన్నీ తొలగించడానికి నీ తండ్రి నిన్ను నా దగ్గరకి పంపాడని నాకు తెలుసు....పాశ్చాత్య వ్యామోహంలో ముద్దు పెట్టినా, ఆలింగనం చేసుకున్నా దానికి కొలబద్దలు లేకపోగా ఆ క్షణమే వాటిని మరచిపోయే మనుష్యుల మధ్య పెరిగిన దానివి నీకు ముద్దు విలువ ఏం తెలుస్తుంది?
    "అందుకే ఇకనైనా హైదవజాతి తీరుతెన్నులు ఎలాంటివో తెలుసుకుని పవిత్రంగా వుండడం నేర్చుకో........"ప్చ్....." భారతి దీర్ఘంగా నిట్టూర్చింది.
    "అవును విష్ణూ..........నాకు ఇప్పటికి కనువిప్పు కలిగింది. కానీ నా కళ్ళు తెరచుకునేసరికి మీరు కనిపించకుండానే పోయారే.......ఆ కసాయి తనంతో మీ వెంట పడినా , చివరకు నేను మిమ్మల్ని పెట్టుకున్న ఒకే ఒక ముద్దు నా జీవన గతినే మర్సివేసిందని మీకెలా చెప్పేది విష్ణు.......


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS