"ఆడోళ్ళయితే నాకేం? మొగోళ్ళయితే నాకేం? సాయంత్రం లోపల మీరిక్కడనుంచి...." 'వెళ్ళిపోవాలి' అనే మాటకి బదులు ఓ బూతు మాట పలికాడు ఓనరు. "అర్ధమయిందా?"
అమ్మని, నాన్నని అంత సులువుగా వరించిన చావు తనకెందుకు వచ్చి చావదో అర్ధం కాలేదు సౌమ్యకి.
తను చిన్నప్పటి నుంచి కష్టాలు పడింది. చచ్చేదాకా కష్టాలు అనుభవించడానికి కూడా మానసికంగా సిద్దంగానే ఉంది కానీ - తన బతుకు ఇంతటి హీనమైన స్థితికి దిగజారిపోతుందని మాత్రం తా నెన్నడు ఉహించలేకపోయింది.
ఓనరు అన్నమాట వినగానే ఆవేశంతో ఉగిపోయాడు తేజస్వి.
"చూడు నువ్వు హద్దు మీరుతున్నావ్! అది చాలా దూరం పోతోంది" అన్నాడు తర్జనితో బెదిరిస్తూ.
ఒకసారి తేజస్వివైపు చూసి, ఇంకేం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఓనరు. పది నిమిషాలు తిరగకుండానే మళ్ళీ వచ్చాడు అతను. ఈసారి అతని వెంట పదిమంది మనుషులున్నారు. వాళ్ళ చేతుల్లో గునపాలు ఉన్నాయి.
"ఎయ్యండ్రా!" అన్నాడు ఓనరు.
వెంటనే వాళ్ళలోని ఒక బలిష్టుడు గునపం ఎత్తి తేజస్వి నిలుచున్న చోటికి దగ్గరగా, గోడమీద పొడిచాడు.
పరిస్థితి విషమిస్తోందని గ్రహించిన సౌమ్య అందుకుని క్షణం ఇంటి ఓనరు వైపు తిరిగి, చేతులు జోడించి ప్రార్ధనాపూర్వకంగా అంది.
"ప్లీజ్! సాయంత్రందాకా టైం ఇవ్వండి! సామాను సర్దేసుకుని వెళ్ళిపోతాను. దయచేసి మీరు ఇప్పుడెం గొడవ చెయ్యొద్దు . ప్లీజ్!"
తేజస్వి కోపంగా ఏదో అనబోయాడు.
అతన్ని వారించి మళ్ళీ అంది సౌమ్య "ప్లీజ్! కొద్ది గంటల వ్యవధి చాలు. నిజంగానే వెళ్ళిపోతాను నేను."
"వెళ్ళకపోతే వెళ్ళగోడతా! ఖబడ్దార్" అని గొణుక్కుంటు, ఒకసారి తేజస్వి వైపు గుర్రుగా చూసి వెళ్ళిపోయాడు ఓనరు.
అతనితో బాటే అతని వెంట వచ్చిన మనుషులందరూ కూడా వెళ్ళిపోయారు.
అప్పుడు నెమ్మదిగా అన్నాడు తేజస్వి. "ఎందుకలా చెప్పారు సౌమ్యా! వేరే ఇల్లు దొరక్కుండా ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళతారు మీరు?"
"ఏమో! తెలియదు" అంది సౌమ్య నిర్లిప్తంగా.
"మరి సామానేందుకు?"
"ఏమో తెలియదు. తెలియదు. నాకేం తెలియదు! నాకేం తెలియటం లేదు" అని నిస్సహాయంగా ఏడవడం మొదలెట్టింది సౌమ్య.
జాలిగా చూశాడు తేజస్వి. "ఎక్కడికి వెళ్ళాలో తెలియని స్థితిలో ఎలా వెళ్ళిపోతారు సౌమ్యా? పోనీ ఒకపని చెయ్యండి"
కన్నీళ్ళతోనే ఏమిటన్నట్లు చూసింది సౌమ్య.
"పరిస్థితులు చక్కబడేదాకా మా ఇంట్లో ఉంచండి - మీకు అభ్యంతరం లేకపోతే"
సంభ్రమంగా చూసింది సౌమ్య.
"ఏమిటి? మీ ఇంట్లోనా?"
"నడిరోడ్డుమీద నిలబడి రావలసి రావడం కంటే ఇది మంచిది కాదా సౌమ్యా?" అని అమెని ఇంకేం మాట్లాడనివ్వకుండా తనే సామానులు సర్దటం మొదలెట్టాడు తేజస్వి. ఆ సామాను కూడా ఎలాంటివి? వాటిలో ఎక్కువ భాగం ప్రస్తుతం ఎందుకు పనికిరానివే. విరిగిపోయిన పందిరి మంచం కోళ్ళు, పాతకాలపు అద్దం తాలూకు గిల్టు ఫ్రేము, బాగా తుప్పు పట్టిపోయిన చాలా పెద్ద నీళ్ళకాగు, నగిషి చెక్కిన పెద్ద ఇత్తడి దీపపు సేమ్మే ఒకటి - రెండు తరాల క్రితం బాగా బ్రతికి , ఇప్పుడు చెడిపోయిన కుటుంబం తాలూకు గత వైభవ చిహ్నాలు అవి. వాటినన్నింటిని పాక్ చేయించి ట్రక్కుల్లో సర్ధించాడు తేజస్వి.
ఆ చిన్న ట్రక్కు రెండు ట్రిప్పులు తిరిగి సామాన్లన్నీ తేజస్వి ఇంటికి చేరవేసేసరికి రాత్రయింది.
తేజస్వి ఇంటికి చేరగానే , రేకు పెట్టె మీద తల ఆనించి , వివశురాలయి, ఏడవడం మొదలెట్టింది సౌమ్య. ఏడుపు తప్ప జీవితంలో ఇంకేమి మిగిలినట్లు అనిపించడం లేదు ఆమెకి.
ఏడుపు మనసులోని బాధ మొద్దుబారిపోయేలా చేసే అనేస్తిషియా లాంటిది. అందుకని ఆమెని పలకరిచలేదు తేజస్వి.
ఆమె అలా ఏడుస్తూనే ఉంటె, తను పక్కగదిలో పడుకుని, చిన్నిని తనదగ్గర పడుకోబెట్టుకున్నాడు.
ఇదంతా చూస్తుంటే భయంభయంగా ఉంది చిన్నికి. చెప్పలేనంత దిగులేస్తోంది కూడా!
ఇక్కడికంటే అనాధశరణాలయం లోనే బాగుందేమో అని కూడా అనిపిస్తోంది.
అనాధ శరణలయంలో అయితే పిల్లలు మాత్రమే ఏడుస్తుంటారు. ఇక్కడ అలా కాదు. ఇక్కడయితే పెద్దవాళ్ళే ఏడుస్తున్నారు. పెద్దవాళ్ళు ఏడుస్తుంటే వినడం ఎంత భయంగా ఉంటుందో! అందులోను, ఆ ఏడుస్తోంది తన అమ్మ! అమ్మ ఏడుస్తుంటే తనకి ఎడుపోచ్చేస్తోంది.
అసలు తను ఇక్కడికి రావడం వల్లనే అమ్మకి ఇన్ని కష్టాలు వచ్చాయా? తను రావడం వల్లే అమ్మమ్మ చచ్చిపోయిందా? తను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే అమ్మ ఇదివరకటిలా మాములుగా ఉంటుందా?
ఇక్కడ వుండి అమ్మను ఇంతగా ఏడిపించడం కన్నా - తను అనాధ శరణాలయంలోనే ఉండిపోయి, అమ్మ పంపే బొమ్మలతో ఆడుకోవడమే బాగుంటుంది.
కానీ- వెనక్కి వెళ్తే అక్కడ వరదరాజులుంటాడు. తనని చూడగానే తోలు వలిచేస్తాడు వరదరాజులు - ఇన్ని రోజులపాటు కనబడకుండా పోయినందుకు, అది తలుచుకోగానే భయంతో వళ్ళు జలదరించింది చిన్నికి.
