Previous Page Next Page 
అగ్నిసాక్షి పేజి 61

 

    అసలు తను అనాధశరణాలయానికే ఎందుకు వెళ్ళాలి? మరి? అప్రయత్నంగా అతని చూపులు మూలగా పెట్టి ఉన్న తేజస్వి బూట్ల మీద పడ్డాయి. వెంటనే అతనికో విషయం గుర్తొచ్చింది. ఇదివరకు ఓసారి అనాధశరణాలయం నుంచి పారిపోయిన కుంటిగాడు బూట్ల పాలిష్ చేసుకుని రాజులా బతుకుతున్నాడు. ఇప్పుడు ఓసారి అనాధశరణాలయానికి వచ్చి తనకి ఇరవై పైసలిచ్చాడు కూడా. వాడి లాగు జేబునిండా బోలెడన్ని చిల్లర అపైసలు ఉన్నాయి.

 

    ఇప్పుడు తను కూడా అలాగే చేస్తాడు. ఎక్కడికన్నా వెళ్ళిపోయి బూట్ల పాలిష్ చెయ్యడం మొదలెడతాడు. బాగా డబ్బు జమ అయ్యాక - అమ్మకి మంచి చీరా- బాబాయికి మంచి టై గానీ మరోటి గానీ తెచ్చి పెడతాడు.

 

    "నువ్వేడవకమ్మా! నా దగ్గర చాలా డబ్బుందిగా! మనమింకా హాయిగా వుండొచ్చు" అని ఆమెకి ధైర్యం చెబుతాడు.

 

    అమ్మ ఎంతో సంతోషిస్తుంది. ఆ ఆలోచన రాగానే , లేచి నిలబడి అటూ ఇటూ చూశాడు చిన్నీ.

 

    తేజస్వి బాబాయ్ జోగుతున్నాడు. ఒక మూలగా బూట్లు ఉన్నాయి. అక్కడే బ్రష్షు ఉంది. బూటు పాలిష్ డబ్బా కూడా ఉంది.

 

    చప్పుడు చెయ్యకుండా బ్రష్షు, పాలిష్ డబ్బా తీసుకున్నాడు చిన్నీ. పక్కగదిలోకి వెళ్ళాడు. అక్కడ అమ్మ పడుకుని ఉంది. ఏడుస్తూనే నిద్రపోయింది అమ్మ.

 

     అమ్మ చెంపల మీద కన్నీళ్ళు చారికలు కట్టి ఉన్నాయి.

 

    దిగులుగా అమ్మ చెంపలమీద ముద్దు పెట్టాడు చిన్నీ. తరువాత తేజస్వి బాబాయ్ కాళ్ళకు దణ్ణం పెట్టాడు.

 

    ఆ తరువాత చిన్న చిన్న అడుగులు వేస్తూ బయటకి నడిచి చీకట్లో కలిసిపోయాడు చిన్నీ.

    

                                                                         21

 

    సౌమ్యని ఇంట్లోంచి వెళ్ళగొట్టేసిన రోజునుంచి మూడిగానే ఉంటున్నాడు శశికాంత్ స్తబ్దంగా అయిపొయింది అతని మనసు.

 

    ఇదిగో, సౌమ్య ఈ క్షణంలో వచ్చేస్తుంది, ఈ నిముషంలో వచ్చేస్తుంది , ఈ గంటలో వచ్చేస్తుంది, ఈ పూట ఎలాగైనా వచ్చేస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటే రోజులు గడిచిపోయాయి. గానీ సౌమ్య తిరిగి రానేలేదు.

 

    వాళ్ళ అమ్మ అంత్యక్రియలు పూర్తయిపోయి ఉంటాయా?

 

    ఎవరు జరిపించి ఉంటారు? ఆ తేజస్వినా?

 

    అలా అనిపించగానే. మెదడులోని నరాలు చిట్లిపోయినంత బాధ కలిగింది శశికాంత్ కి.

 

     కాలింగ్ బెల్ వినబడింది.

 

    ఎవరు? సౌమ్యేనా? వచ్చేసిందా?

 

    ఒక్క ఉదుటున లేచి, పనిమనిషి చంద్రిక కంటే తనే ముందు వెళ్ళిపోయి తలుపు తెరిచాడు శశికాంత్.

 

    సౌమ్య కాదు ఉజ్వల నిలబడి ఉంది అక్కడ!

 

    "నువ్వా! రా!" అన్నాడు శశికాంత్. వద్దనుకున్నా నిరాశ ధ్వనిస్తునే ఉంది అతని గొంతులో.

 

    అది అర్ధమైపోయింది ఉజ్వలకి.

 

    "ఏమిటి మొహం అలా పెట్టేశావ్? సౌమ్య వచ్చిందనుకుని ఆశ పడ్డావా?" అంది కాస్త ఎత్తిపొడుపుగా.

 

    కాసేపు ఏమి మాట్లాడలేదు , శశికాంత్ తరువాత నిదానంగా అన్నాడు.

 

    "ఇంట్లోంచి తనని తగిలేస్తే సౌమ్య కాళ్ళ బేరానికి వచ్చేస్తుందని ఉహించాను నేను. కానీ అలా జరగలేదు."

 

    "ఒక్కోసారి అంచనాలు తారుమారయిపోతాయి శశీ! అంతమాత్రాన మనం తలక్రిందులయిపోవలసిన అవసరం లేదు. సౌమ్య కాళ్ళ బేరానికి ఎందుకు వస్తుంది? బరితెగించి బజారున పడింది తను."

 

    "అంటే?"

 

    "తను ఉంటున్న ఇల్లు ఖాళీ చేసి తేజస్వితో బాటు వెళ్ళిపోయి అతని ఇంట్లోనే కాపురం పెట్టేసింది."

 

    శశికాంత్ పిడికిళ్ళు బిగుసుకుపోయాయి.

 

    "నువ్వంటున్నది నిజమేనా?"

 

    "నిజం! నువ్వు శశికాంత్ వీ, నేను ఉజ్వలని అయినంత నిజం!"

 

    ఆవేశాన్ని ఆపుకోలేకపోయాడు శశికాంత్. తన అగ్రహాన్నంతా అప్పటికప్పుడే ఎవరిమీదనన్నా లేదా దేనిమీదనన్నా చూపించేయ్యాలి.

 

    లేకపోతే ఈ అవమానాగ్నికి తన మెదడు మాడిపోతుంది.

 

    అతనికి తెలియకుండానే అతని చేతులు టేబుల్ మీద ఉన్న గ్లాసు బౌల్ ని పట్టుకుని గాల్లోకి ఎత్తాయి. ఆ గ్లాసు బౌల్ నిండా నీళ్ళున్నాయి. ఆ నీళ్ళలో నిశ్చింతగా ఈదుతోంది ఒక గోల్డు ఫిష్!

 

    బౌల్ ని విసురుగా నేలకేసి కొట్టాడు శశికాంత్. భళ్ళున పగిలింది బౌల్. నీళ్ళు పల్చటి మడుగులా వ్యాపించాయి. నేలమీద పడ్డ గోల్డ్ ఫిష్ విలవిల కొట్టుకోవడం మొదలెట్టింది.

 

    "శశీ!" అంది ఉజ్వల ఆదుర్దాగా.

 

    అతికష్టం మీద కోపాన్ని అణుచుకున్నాడు శశికాంత్. అయినా అతని ఉచ్చ్వాస నిశ్వాసాలు ఇంకా తీవ్రంగానే వస్తున్నాయి. పెద్ద పెద్ద అంగలు వేస్తూ బార్ దగ్గరికి నడిచి, గ్లాసులోకి ఘాటైన రమ్ముని వంపుకున్నాడు . గటగట దాన్ని ఖాళి చేసేసి సిగరెట్ అంటించాడు.

 

    "శశీ!" అంది ఉజ్వల ఈసారి అనునయంగా "నీతి నిజాయితీ లేని ఆ ఆడదాని కోసం ఎందుకు అంగలారుస్తావు? పొతే పోయింది. పీడ వదిలింది గుడ్ రిడ్దేన్స్ అనుకుంటే మనసు తేలిగ్గా ఉంటుంది."

 

    పౌరుషంగా అన్నాడు శశికాంత్.

 

     "ఇప్పుడు దానికోసం ఎవడేడుస్తున్నాడు? అది ఎవడితో ఎక్కడికి పొతే ఎవడికేం పట్టింది? నా క్కావలసినదల్లా కాగితాల మీద దాని సంతకాలు. నా ఖర్మకాలి కంపెని దాని పేరుమీద పెట్టేశాను.

 

    "అరె! ఇప్పుడెం మునిగిపోయిందని! ఎందుకంత వర్రీ అయిపోతావ్! సౌమ్య సంతకాలే కదా నీకు కావలసింది! అవి సౌమ్యే పెట్టాలని ఎక్కడుంది?"

 

    "వాట్ డూ యూ మీన్?" సౌమ్య సంతకాలు సౌమ్య పెట్టకపోతే మరెవరు పెడతారు?"

 

    భావగర్భితంగా అతనివైపు చూస్తూ అంది ఉజ్వల.

 

    "శశీ! కార్తిక్ లో ఒక గొప్ప టాలెంట్ ఉంది. అది నువ్వు కని పెట్టావా?"

 

    "ఏ కార్తిక్? మన కార్తికా? వాడు గుడ్ ఫర్ నధింగ్ బాస్టర్డ్. వాడిలో టాలెంటు ఏం ఉంటుంది?"

 

    "యూ ఆర్ గ్రేవ్ లీ మిస్టేకన్! సంతకాలు ఫోర్జరీ చెయ్యడంలో ఎక్స్ పర్టు కార్తిక్!"

 

    "వాట్?" అన్నాడు శశికాంత్ ఆశ్చర్యంగా.

 

    ఇటీజ్ ట్రూ శశీ?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS