లోపల బజర్ నిర్విరామంగా మోగడం వినబడుతోంది.
చాలాసేపటి తరువాత తెరుచుకుంది తలుపు - కాస్త ఓరగా.
ఆ ఎడంలో నుంచి పనిమనిషి, చంద్రిక మొహం కనబడింది. జర్దాపాన్ తో ఎర్రబడిన పెదిమలు, రేగిపోయిన జుట్టు, కళ్ళలో కైపు, మొహంలో అలసట. ఆమె శ్వాసలో మధ్యపు వాసన!
అప్రయత్నంగానే ఒక్కడుగు వెనక్కి వేసింది సౌమ్య.
"ఏమిటి?" అన్నట్లు నిర్లక్ష్యంగా చూసింది పనిమనిషి.
అప్పుడు మరో విషయం గమనించింది సౌమ్య.
పనిమనిషి చంద్రిక కట్టుకుని ఉన్న అమెరికన్ జార్జేట్ చీర తనదే!
వణుకుతున్న పెదిమలను అదుపులోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ అంది సౌమ్య.
"అయన ఉన్నారా?"
"ఆయనా? లేరు. బయటికి వెళ్ళారు."
"ఎక్కడికెళ్ళారు."
"ఏమో! తెలియదు" అని, "ఇంకేమిటి?" అన్నట్లు చూసింది చంద్రిక.
తల కొట్టేసినట్లయింది సౌమ్యకి. గిరిక్కున వెనుదిరిగి వచ్చేస్తూ , గేటు దగ్గర ఆగి, మనసు ఉండబట్టలేక మళ్ళీ ఒకసారి తిరిగి చూసింది.
తన ఇంటి వైపు - చివరిసారిగా , చూసి చూడగానే ఆమె దృష్టిని ఆకర్షించాయి అందమైన ఫ్రెంచ్ విండోస్.
వాటిలో ఒక కిటికీ దగ్గర నిలబడి ఉంది చంద్రిక. ఆ వెనకగా - ఆమె భుజం మీద చెయ్యివేసి, ఎకసెక్కంగా నవ్వుతూ చూస్తున్న శశికాంత్ !
జుగుప్సతో ఒళ్లు జలదరించింది సౌమ్యకి.
ఎంత చీప్ గా ప్రవర్తించగలడు ఇతను! ఎంత నీచమైన లేవెలుకి దిగజారిపోగలడు! నిజంగా - తలచుకుంటే-
కడుపులో తిప్పినట్లయింది సౌమ్యకి.
చివాలున వచ్చి, తనకోసం ఇంకా అక్కడే ఆగి ఉన్న రిక్షాలో కూలబడింది.
గుండెలోని అవమానాగ్నికి కళ్ళలో నీళ్ళు ఇంకిపోయాయి సౌమ్యకి. ఆమె పెదిమలు ఇప్పుడు దుఃఖంతో కిందికి వంపు తిరిగిలేవు పట్టుదలతో బిగుసుకుపోయి ఉన్నాయి.
రిక్షా రెండు సందులు దాటాక, ఉన్నట్లుండి గట్టిగా అంది సౌమ్య.
"ఒక్కసారి ఆపుతావా ఇక్కడ? ఇప్పుడే ఒక్క నిముషములో వచ్చేస్తాను."
రిక్షా ఆగింది. దిగి నడిచింది సౌమ్య.
"టు లేట్" అని బోర్డు తగిలించి ఉన్న ఇంటిముందు ఆగి బోర్డుని మరోసారి చదివి, ఇంట్లోకి నడిచింది.
ఆ ఇంటివాళ్ళు కొద్దిగా పరిచయమే సౌమ్యకి. ఇంటి వారి కోడలు సౌమ్యని చిత్రంగా చూసి , "రండి!" అంది.
"బయట బోర్డు చూసి వచ్చాను" అంది సౌమ్య.
"ఓ అదా! ఇవాళ పొద్దున్నే ఎవరికో ఇచ్చేశారు. మా మామగారు అడ్వాన్సు కూడా తీసేసుకున్నారు. సారీ!"
"అలాగా? ఫర్వాలేదులెండి. వెళ్తూ వెళ్తూ బోర్డు కనబడితే రిక్షా దిగి వచ్చాను. వెళ్ళొస్తానండి."
"కంసాలి దగ్గరికి వెళుతున్నారు కాబోలు" అంది కోడలు.
అర్ధం కానట్లు చూసింది సౌమ్య.
"మీ మంగళసూత్రం పెరిగిపోయింది గదా! బాగుచేయించడానికి కంసాలి దగ్గరికి వెళుతున్నారేమో అనుకున్నాను. అప్పటిదాకా మెడలో కనీసం పసుపు తాడేనా వేసుకోవలసింది" అంది కోడలు.
అప్రయత్నంగా మెడని తడుముకుంది సౌమ్య. నిజంగానే మెడలో మంగళసూత్రం లేదు. "ఏమయింది?
శశికాంత్ తనని మెడ బట్టుకు గెంటేస్తున్నప్పుడు తెగిపోయిందా? అయి వుండవచ్చు.
అయితే - అక్కడ జరిగిన దేమిటో వీళ్ళందరికి కూడా తెలిసి పోయిందా? అందుకే, భర్త వదిలేసిన తనకి ఇల్లు అద్దెకి ఇవ్వడానికి ఇష్టపడటం లేదా వీళ్ళు?
ఇంటివారి కోడలు ఎర్రతేలు కుడుతున్నట్లు మళ్ళీ అంది.
"ఇల్లు ఎవరికోసమేమిటి? మీకు తెలిసిన వాళ్ళకా? అలా అయితే మీ ఇంట్లోనే రెండు గదుల పోర్షన్ అద్దె కివ్వకపోయారా? పెద్ద బంగళా కదా మీది?"
అయితే వీళ్ళకు తెలుసన్నమాట! ఇక సమాధానం కూడా చెప్పకుండా వచ్చి రిక్షా ఎక్కింది సౌమ్య. ఇల్లు చేరుకునేసరికి తేజస్వి ఉన్నాడు అక్కడ.
అప్పుడు మొదటిసారిగా మరో విషయం గమనించింది సౌమ్య.
చిన్నీ ఎక్కడా కనబడడెం? ఎక్కడున్నాడు? ఈ వారం రోజుల నుంచి అసలు చిన్నినే గుర్తు రాలేదు తనకి.
"చిన్నీ కోసమేనా చూస్తున్నారు?" అన్నాడు తేజస్వి. ఆమె చూపులు గమనించి
"అవును! ఏడీ చిన్నీ? ఎక్కడున్నాడు?"
"మా ఇంట్లో ఉంటున్నాడు"
అది విని, రిలీఫ్ గా చూసింది సౌమ్య.
కొద్ది క్షణాలు ఆగి అన్నాడు తేజస్వి.
"సౌమ్యా! ఎక్కడి కెళ్ళారు?"
"ఆద్దె ఇంటికోసం వెతుకుతూ వెళ్ళాను" అంది సౌమ్య. అంతేగాని శశికాంత్ ఇంటికి వెళ్ళిన విషయం , అక్కడ చంద్రికా, శశికాంత్ ల సరాగం - ఇదంతా చెప్పలేదు. అవన్నీ ఎంత త్వరగా మరిచిపోతే అంత బాగుంటుందనిపిస్తోంది తనకి.
"నేను కూడా ఇవాళ చాలా తిరిగాను - ఇళ్ళకోసం!" అన్నాడు తేజస్వి. నిజంగానే చాలా తిరిగాడు తను. కానీ సౌమ్య కోసం అని చెబితే ఎవరూ ఇల్లు ఇవ్వలేదు.
ఆ సంగతి ఆమెకి చెప్పలేకపోయాడు తేజస్వి. 'ఎంత వెదికినా ఇల్లు మాత్రం దొరకలేదు" అని తేల్చేశాడు.
ఆ తరువాత ఇంకో నాలుగు రోజులు గడిచిపోయాయి.
ఈలోగా మళ్ళీ వచ్చాడు ఇంటి ఓనరు. ఈసారి కూడా తేజస్వి లేని సమయంలోనే.
వస్తూనే వినరాని బూతులు లంకించుకున్నాను ఇంటి ఓనరు. కానీ అవి ఎవరిని డైరెక్ట్ గా తిడుతున్న తిట్లు కావు. చాలామంది మనుషులు తమ సంభాషణలో ఉతపదాల్లా ఉపయోగించే బూతులు. అలాంటి భాషలోనే చెప్పాడతను - ఇల్లు ఖాళి చెయ్యక తప్పదని -
అతను అలాంటి పదాలు తన సమక్షంలో అంత నిస్సంకోచంగా ఉచ్చరిస్తాడని ఉహించలేని సౌమ్య నివ్వెరపోయింది. అంతకు ముందు ఎప్పుడూ తనతో అలా మాట్లాడలేదు అతను. చూపవలసిన కనీస మర్యాద చూపించేవాడు.
వికలమైపోయిన మనసుతో ఆమె అలా నిలబడి ఉండగానే వచ్చాడు తేజస్వి. వస్తూనే ఓనరు మాటలు అతని చెవిన బడ్డాయి. వెంటనే జేవురించింది అతని మొహం.
"ఇదిగో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారని తెలిదా?" అన్నాడు తీవ్రంగా.
