33
రామశేషు హాఠస్మరణం ఆ కుటుంబాన్ని మరోసారి కలిచివేసింది.
ఇంటిల్లిపాది కన్నీరుమున్నిరుగా ఏడుస్తున్నారు.
అప్పుడే ఆ వార్త చుట్టు పక్కలకు, అక్కడి నుంచి ఊరికి పాకిపోయింది. జనం ఒక్కక్కోరే వస్తున్నారు.
మాధవరావు, సుందరంలకు కర్తవ్యం గుర్తొచ్చి, చేయవలసిన పనులు చకచక ప్రారంభించారు. దుఃఖాన్ని దిగమింగుకుని క్షణాల్లో ఇంటిముందు పందిరి వేసి, అయన బౌతికకాయాన్ని కింద చాప మీద పడుకోపెట్టి బంధు మిత్రులకు కబుర్లు పంపారు.
ఇల్లంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇప్పుడిప్పుడే సుందరం షాక్ నుంచి కోలుకుంటున్న ఆ కుటుంబ సభ్యులకు ఇప్పుడు రామశేషు మరణం ఆశనిపాతంలా తాకింది.
ఆడవాళ్ళ ఏడుపులు ---శోకాలు హృదయవిచారకరంగా వినిపిస్తున్నాయి.
సర్వోత్తమరావు అన్నగారి శవం పక్కనే గొడ్ల చావిడిలో వాలు కుర్చీలో పడుకుని దీర్ఘంగా ఆలోచిస్తూ చుట్ట కాలుస్తున్నాడు.
"ఏంటి బావా! నువ్వు మరీ అంతగా దిగులుపడితే ఎలా చెప్పు? ఏదో ఒకనాడు అందరం పోవాల్సిన వాళ్ళమే------"అంటూ బసవయ్య అయన పక్కనే కింద ఆ చావిడి వాసానికి అనుకుని కూర్చుని ఓదార్పు తున్నాడు.
సర్వోత్తమరావు అతని మాటల్ని మౌనంగా వింటున్నాడు.
మాధవరావు, సుందరంలు పనుల హడావుడిలో దుఃఖాన్ని దిగమింగుకుని తిరుగుతున్నారు.
సుందరం పరిస్థితి మరీ అద్వానంగా వుంది.
తన వల్లనే అన్నయ్య చనిపోయాడనే దిగులు అతన్ని క్షణక్షణానికి కృంగ దిస్తుంది.
సురేంద్ర ఎడ్లబండిని తోలుకుంటూ ఇంటికి వచ్చాడు. అతనికి పొలం దగ్గరే ఈ వార్త చెప్పారు. పుట్టెడు దుఃఖాన్ని మోసుకుంటూ ఇంటికి చేరాడు. సురేంద్రకి రామశేషుకు ఎక్కువ అనుబంధం ఇద్దరూ పొలం పనులు చూసుకుంటూ, వేరే ప్రపంచం పట్టేదేకాదు.
సురేంద్ర పెద్ద మావయ్యా అంటూ అయన మీద పడి భోరున ఏడ్చాడు.
బసవయ్య సురేంద్రను ఓడర్చుతున్నాడు.
గిరిజ లోపలనుంచి పరుగున వచ్చి.....
"బావా.....మా నాన్న అన్యాయం చేసి పోయాడు బావా.....అంటూ సురెంద్రని వాటేసుకుని ఏడుస్తుంది.
జయంతి వచ్చి గిరిజను పట్టుకుని "ఊరుకో అక్కా...." అని ఓదార్చింది.
పొరుగూరు నుంచి బంధువులు ఒక్కొక్కరే చేరుకుంటున్నారు. దాదాపు సగం వూరు అప్పటికే అక్కడికి చేరుకుంది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా అనుకుంటున్నారు.
ప్రెసిడెంటుగారి కుటుంబానికి ఏదో శని పట్టుకుంది. శాంతి చేయించాలి అంటున్నారు.
గిరిజ పెళ్ళి ఎంతో వైభవంగా జరిపించిన ఆ కుటుంబం తరువాత ఒకదాని వెంట ఒకటి కీడులు సంభవిస్తున్నాయి.
సుందరం విషయం పెద్దగా పట్టించుకోలేదు ఆ వూరి జనం, ఎందుకంటే కరణాన్ని పోలీసులు వచ్చి అరెస్టు చేసి తీసుకెళ్ళటంతో దోషం అతని మీద పడింది. పాపం చినబాబుని మోసంచేశావు గుంటనక్క అంటూ అతన్నే తిట్టారు. కానీ సుందరం మాత్రం ఆ ప్రభావం నుంచి ఇంకా కోలుకోక మునుపే , అన్నగారి మరణం అతన్ని మరింతగా కుంగదిసింది.
"బాబూ మాధవా! ఇంటిముందు కట్టెలతో మంట వేయి బాబూ...."అన్నాడు బసవయ్య.
"అలాగే" అంటూ తలూపి, ఆ పనిని వెంకటేశంకు చెప్పాడు.
వెంకటేశం దుఃఖాన్ని తట్టుకొవటానికి అప్పుడే ఒక సీసా సారా తాగి నిశ్శబ్దంగా రోదిస్తున్నాడు.
సురేంద్ర ఏడ్చి ఏడ్చి, గొడ్ల చావిడిలో కింద చతికిలపడి తల పట్టుకుని కూర్చుని మావయ్య శవాన్ని చూస్తున్నాడు.
