Previous Page Next Page 
వెన్నెల వాకిళ్ళు పేజి 59

 

    "అసలు కరణానికి మనం చేసిన ద్రోహం ఏంటి? ఎందుకు వాడిలా చేశాడు?" అన్నాడు సర్వోత్తమరావు.

    "డబ్బుకోసం అన్నయ్య ఆ గోపాలరావు మనల్ని దెబ్బతీయాలని కరణాన్ని కొనేసి ఈ నాటకం అంతా ఆడించాడు. ఇప్పుడేమయింది? మూడేళ్ళ జైలు శిక్ష పడుతుందని అంటున్నాడు లాయారు నాగేశ్వరరావు, ఆ భగవంతుడు ఉన్నాడన్నాయ్యా! ఆయన ఎప్పుడు ఎవరికి శిక్ష విధించాలో వారికీ విధించి తిరతాడు" అన్నాడు మాధవరావు.

    "అంతేలే! మనం ఏం చెయ్యకుండానే భగవంతుడు వాడికి శిక్ష వేస్తున్నాడు. పోలీసులు అరెస్టు చేశారా వాడ్ని?" అన్నాడు సర్వోత్తమరావు.

    "చేశారుగా. దగ్గిరుండి ఆ కార్యక్రమం జరిపించే వచ్చాము...." అన్నాడు మాధవరావు.

    "ఏమండి! రాత్రి మీరు సరిగా భోజనమే చేయలేదు. ఇంకా కాస్త పెట్టుకొండి" అంటూ అన్నం వడ్డించబోయింది కస్తూరి.

    "వద్దు వద్దు, బాగానే తిన్నాను...." అన్నాడు సర్వోత్తమరావు తృప్తిగా.

    "ఏంటి శ్రీవారు అంత పెద్ద కేసును ఒక్క పూటలో తేల్చి పారేశారే" అంది దాక్షాయణి ఆ రాత్రి భర్త పక్కనే కూర్చుని.

    మాధవరావు మనసు ఇప్పుడు ఆనందంగా వుంది. రాత్రి ఇదే సమయానికి నరకయాతన అనుభవించారు అందరూ. నిజంగా ఒక్కపూటలో యీ కేసు విడిపోతుందని తనూ ఉహించలేదు. మంచం పైన పడుకుని పై కప్పు కేసి చూస్తూ ఆలోచిస్తున్నాడు.

    "ఏంటి మీ ఆలోచనలు ఇంకా ఆగవా? ఎదురుగా నేనున్నా ఇంకా ఎటో చూసి అలోచిస్తారేంటి?" అంది దాక్షాయణి గోముగా.

    మాధవరావు నవ్వుతూ ఆమెను తనపైకి లాక్కున్నాడు. అతని చాతిపైనా పడుకుని కళ్ళు మూసుకుంది తృప్తిగా దాక్షాయణి. ఇద్దరూ అలా కొంచెం సేపు మౌనంగా సేదదీరారు.

    "ఏమండి!" అంది దాక్షాయణి.

    "ఏంటి?" అన్నాడు మాధవరావు.

    "మొన్నరాత్రి ఎందుకు మీరు అంతతీవ్రంగా ఆలోచించారు?" అంది అలానే కళ్ళుమూసుకుని.

    "ఇప్పుడు అవసరం అంటావా ఆ విషయం?" అన్నాడు నవ్వుతూ.

    "అవసరమే! మీరు నాకు చెప్పకుండా ఇంకెప్పుడు అలా ఒంటరిగా బాధపడకండి. నేను చూడలేను" అంది దాక్షాయణి కళ్ళు తెరిచి అతని కళ్ళలోకి చూస్తూ.

    ఆమె వీపు మెల్లగా నిమురుతూ అన్నాడు.

    "సుందరం విషయమే ఆలోచించాను. అంతక్రితం రోజే నాకు తెలిసింది. వాడే....ఇందాక చెప్పానే కోటేశ్వరరావు అని....వాడే నాకు షాపు దగ్గిరకు వచ్చి చెప్పాడు" అన్నాడు.

    "మరి ఆ విషయం నాతో ఎందుకు చెప్పలేదు?" అంది సీరియస్ గా.

    "చెప్పి నీ మనసు కూడా పాడుచేయటం ఎందుకని చెప్పలేదు....." అన్నాడు నవ్వుతూ.

    "ఇప్పుడేమయింది? అందరికి తెలిసిపోయిందిగా?" అంది తనూ నవ్వుతూ.

    "అంతేనే, ఇలాంటి అక్రమ సంబంధాలు ఎప్పుడో ఒకప్పుడు తప్పక బయటపడతాయి" అన్నాడు.

    "తమరివి ఎప్పుడు బయటపడతాయోమరి?" అంది సీరియస్ గా.

    "నేనెంత పిచ్చోడ్ని కాదులే సుందరంలాగా" అన్నాడు నవ్వుతూ.

    దాక్షాయణి ఆ మాటలకు అతని తోడపైన గట్టిగా గిచ్చింది.

    "అబ్బా....." అన్నాడు పెద్దగా. ఠక్కున అతని నోరు మూసేసింది దాక్షాయణి.

    "ఏంటి అంత పెద్దగా అరిచారు?" అంది కంగారుగా.

    "అంత గట్టిగా గిచ్చితే అరవరామరి?!" అన్నాడు అమాయకంగా నటిస్తూ.

    "చంపేస్తాను గిచ్చటంకాదు....వెధవవేషాలు వేస్తే" అంది దాక్షాయణి.

    "నాకు అంత ఖర్మేం పట్టలేదోయ్. ఎదురుగా రంభ లాంటి పెళ్ళాం వుంటే పక్కదార్లుతొక్కే అవసరం నాకేంటి?" అన్నాడు ఆమెను మరింత దగ్గరకు తీసుకుంటూ.

    "అన్నీ కోతలే" అంది అతని ముక్కుపట్టి లాగుతూ.

    "అవునుమరి. నా పనే అదికదా?" అన్నాడు సీరియస్ గా.

    "ఏంటి కోతలు కోయటమా? అంటే ఇప్పుడు చెప్పినవన్నీ ఉత్తుత్తి మాటలేనా?" అంది సీరియస్ గా దాక్షాయణి.

    "అవికాదు, నా పనే కోతలు కోయటం అన్నాను" అన్నాడు మళ్ళీ గంభీరంగా.

    "మళ్ళీ అదేమాట అంటారే?" అంది మళ్ళా గిచ్చబోతూ.

    ఏయ్ గిచ్చబోకు పిచ్చిమొద్దు! మనదే దుకాణం!" అన్నాడు నవ్వుతూ.

    "బట్టల దుకాణం" అంది దాక్షాయణి సీరియస్ గా.

    "మరి ఏదైనా బేరం వస్తే కత్తెర తీసుకుని కోత కోయటమేకదా బట్టని" అన్నాడు సీరియస్ గా.

                                            32
    సుందరం సంఘటన జరిగి అప్పుడే నెలరోజులు అవుతోంది. అందరూ అతనితో బానే వుంటున్నారుగానీ, సుందరమే ఆ కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి వుండలేకపోతున్నాడు. ఇదివరకులా, అతని పరిస్థితి రోజురోజుకి క్లిష్టమయిపోతుంది. భార్య శివపార్వతి కూడా మొదటివారంరోజుల వరకు అతన్ని సూటిపోటి మాటలతో నిందించింది కానీ తరువాత మెల్లగా రాజీపడిపోయింది. భార్యాభర్తల బంధం అంటేనే రాజీ పడటం కాబోలు....ఏదో ఒక విషయంలో రాజీ పడలేకపోతే కాపురం నిలవదేమో? అని ఆలోచిస్తున్నాడు సుందరం.

    "ఏంటి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు? మళ్ళీ ఆ వరాలు గుర్తొచ్చిందా?" అంది సీరియస్ గా పార్వతి.

    "అబ్బ కాదే! దాన్నేప్పుడో మర్చిపోయాను. నేను ఈ ఇంట్లో వుండలేకపోతున్నాను. అన్నాడు సుందరం.

    
                                     *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS