సర్పనగర నిధి
అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో నాకు మెలకువ వచ్చింది.
మెలకువ రావడానికి అసలు నిద్రసరిగా పట్టి ఏడిస్తే కదా! మర్నాటి ప్రయాణం గురించి తల్చుకుంటూ ఏవో ఆలోచిస్తూ కలత నిద్రపోతున్నాను.
అయితే ఇప్పుడు మెలకువ రావడానికి కారణముంది. ఏదో చప్పుడయింది గదిలో!
మళ్ళీ ఏమీ చప్పుడు కాలేదు, అయితే గదంతా చీకటిగా వుంది. బెడ్ లైట్ యెవరు ఆర్పేశారో తెలియదు. నేను పడుకునేసరికి అది వెలుగుతూనే వుండేది. కరెంట్ లేదా అనుకుందామంటే గదిలో ఫాన్ తిరుగుతూనే వుంది.
ఎందుకైనా మంచిదని చేత్తో అటూ ఇటూ తడిమి మంచానికి దగ్గర్లోనే వున్న పుష్ బటన్ స్విచ్ నొక్కాను.
గది అంతా ప్రకాశవంతమైంది. ఒక్క నిముషం కళ్ళు జిగేల్ మన్నాయి. కళ్ళు గట్టిగా మూసుకుని తెరిచాను. ఏమీ కనబడలేదు. ఓసారి చేత్తో కళ్ళు నులుముకున్నాను. అప్పుడు కళ్ళు కాస్త కనబడుతున్నాయి. పక్కకు తిరిగాను. వులిక్కిపడ్డాను.
గదిలో ఓ మనిషి వున్నాడు. బలంగా, కండలు తిరిగి, వస్తాదులా వున్నాడు. ముఖం ప్రసన్నంగాలేదు. అతను నా వంకనే కోపంగా చూస్తున్నాడు. అతనిచేతిలో పిస్తోలు వుంది. అది నావైపే గురిపెట్టబడి వుంది.
"ఎవర్నువ్వు?" అన్నాను ధైర్యాన్ని నటిస్తూ, నేను లేవడానికి కూడా ప్రయత్నించలేదు కాబట్టి నాకు ధైర్యం లేదన్న విషయం అతనికి తెలిసే వుండాలి.
"నాపేరు చెప్పడంవల్ల నీకేం ప్రయోజనం. అందువల్ల నీకు తెలిసే దేముంటుంది? అయినా చెబుతానులే......నాపేరు పాండురంగడు...." అన్నాడతను.
"ఎందుకొచ్చావ్?" అన్నాను.
"నువ్వూహించగలవు?" అన్నాడు పాండురంగడు.
"డబ్బుకోస మయుంటుంది. అయితే నా ఇంట్లో నీ కెంతో డబ్బు దొరకదు...." అన్నాను.
"నేను డబ్బుకోసం రాలేదు...." అన్నాడు పాండురంగడు.
"అయితే నగలకోసం వచ్చివుంటావ్. నేను బ్రహ్మచారిని. ఇంట్లో ఆడాళ్ళు లేడు" అన్నాను. నాకు కాస్త ధైర్యంకూడా వచ్చింది. లేచి కూర్చున్నాను.
"నేను నగలకోసమూ రాలేదు...." అన్నాడు పాండురంగడు.
అతను చాలా ముక్తసరిగా మాట్లాడుతున్నాడు. మనిషి చాలా సీరియస్ గా వున్నాడు. ఎక్కడా నువ్వు లేదు.... "అయితే నాకోసం వచ్చావా?" అన్నాను.
"నీతో పనివుంది కానీ నీకోసం రాలేదు....." అన్నాడు పాండురంగడు.
మంచంమీద నుంచి దిగి నిలబడ్డాడు.... "అయితే ఆ పిస్తోలెందుకు?"
"అవసరమైతే నిన్ను చంపడానికి.... "అన్నాడు పాండురంగడు.
చటుక్కున మంచంమీద చతికిలబడి...... "నన్నా? చంపడమా, ఎందుకు?" అన్నాను గుటకలు మింగుతూ.
పాండురంగడు నన్ను సమీపించి ..... "వెనక్కు తిరుగు!" అన్నాడు. నేను వెనక్కు తిరగ్గానే అతను నా చేతులూ, కాళ్ళూ కట్టేశాడు. తాడు బహుశా అతని జేబులోనే వుండి వుంటుంది. అతను నన్ను బంధించగానే నాకు ధైర్యం పెరిగింది. నన్ను చంపే ఉద్దేశ్య మున్నట్లయితే యిలా బంధించి వుండేవాడు కాదుగదా!
పాండురంగడు నన్ను వదిలి.....ఇల్లంతా వెదకడం మొదలు పెట్టాడు. ఇంట్లో చాలా చోట్ల వెతికినట్లున్నాడు. చప్పుళ్ళు బాగానే అవుతున్నాయి. టైముకూడా చాలాసేపు పట్టింది. ఆఖరికి మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు.
"నువ్వు నే ననుకున్నకంటే ఘటికుడివి....." అన్నాడు పాండురంగడు.
అతను నన్ను ఘటికుడని ఎందుకనుకున్నాడో, ఎంత ఘటికుడని అనుకున్నాడో నాకుతెలియదు. అందుకని నవ్వి ఊరుకున్నాను.
"నవ్వితే సరిపోదు. ఆ కాగితం ఎక్కడుందో చెప్పాలి!"
"ఏ కాగితం?" అన్నాను ఆశ్చర్యంగా.
"నటించకు. ఈ పాటికి నీకు తెలిసే వుంటుంది నేనే కాగితం కోసం వచ్చానో."
అయోమయంగా వుంది నాకు. అతనే కాగితంగురించి అంటున్నాడో నాకు తెలియలేదు. ఆ సంగతే చెప్పాను.
పాండురంగడు చిరాగ్గా....."మరీ ఇంత కౌక్యం పనికి రాదు...." అని "సర్పనగర నిధి ప్లాన్ వున్నకాగితం....." అన్నాడు.
సర్పనగర నిధి ఏమిటో నాకు అర్ధంకాలేదు. అ పేరు విన్న గుర్తుకూడా నాకు లేదు....."నువ్వంటున్న మాటలు నాకు అర్ధంకావడం లేదు....." అన్నాను!
" నా చేతిలో ఒక పిస్తోలువున్నదనీ అది నేను ఉపయోగించవలసిన అవసరం రాకుండా చేయగలగడం నీ వల్లనే అవుతుందనీ గుర్తుచేసుకో. నా మాటలు వెంటనే అర్ధమవుతాయి....."
"గుర్తు చేసుకున్నాను. అయినా నీ మాటలు అర్ధం కావడం లేదు....."
"అయితే దేవుణ్ణి స్మరించుకో...." అన్నాడు పాండురంగడు.
"పాండురంగా-రక్షించు...." అన్నాడు పాండురంగడు.
"పాండురంగా-రక్షించు...." అన్నాను వెంటనే.
"నన్ను అడిగితే లాభంలేదు. ఆ దేవున్నే స్మరించుకో...."
"బాగుంది నాధైవం పాండురంగడు. ఆయన నాకు ప్రత్యక్ష దైవం....."
పాండురంగడు నవ్వాడు. నవ్వితే అతని ముఖంలోకి కళవచ్చింది....." నువ్వు చాలా ఘటికుడివి. నన్ను నవ్వించిన వాళ్ళు అరుదు...." అన్నాడు.
నాలో నేనే నవ్వుకున్నాను. ఎదుటి వాళ్ళను నవ్వించడం ఉగ్గుపాలతో నేర్చుకున్న విద్య నాకు. అది నా వృత్తి ధర్మంకూడా. నేను ప్రజానాయకుణ్ణి. వాళ్ళ నమ్మకానికి పాత్రుడినాయి ఎమ్మెల్యేనయ్యాను కూడా. అందరికీ యెన్నో ఉపకారాలు చేస్తానని వాగ్ధానం చేయగలను కానీ ఉపకారాలు చేయలేను. వాగ్ధానాలు నాకు పదవినిస్తాయి. ప్రతిఫలంగా ప్రజల్ని నేను నవ్విస్తాను-నా ఉపన్యాసాలతో! ఆ ఉపన్యాసాలే నన్ను నవ్వులపాలు కాకుండా కాపాడుతుంటాయి.
"నవ్వించినంత మాత్రాన వదలను. ఆ కాగితం గురించి చెప్పాల్సిందే......"
"ఆ కాగితం గురించి చెప్పలేదన్న కోపంతో నన్ను చంపేశావనుకో. అప్పుడు నీకు దానిగురించి ఏమైనా తెలిసే అవకాశముందా?" అన్నాను.
