
వెంకట్రావు పోయిన కొత్తల్లో ప్రతి రోజు వేకువనే తెల్లబట్టల్లో అంతకంటే తెల్లనైన చిరునవ్వుతో వచ్చి పక్కలో పడుకొనేవాడు. గుండె ఝల్లు మనేది! భయపడుతున్న తనను పొదివి పట్టుకొనేవాడు.
రామ రామ భయం తీరింది. అలవాటుగా మారింది. నిద్ర మనస్సు వేకువ కొరకు ఎదురు చూసేది. అది కలా అనుకోవటానికి వీలులేదు. ఆ స్పర్శ నిజమే ననిపిస్తుంది.
వెంకట్రావు వచ్చే ముందు ఆ గది అంతా పన్నీరు చల్లినట్లు కమ్మని వాసనలు రావటం కద్దు! తెల్లవారాక ఏ కోరికలు లేనట్లు తేలికగా ఉండేది శరీరం!
ఈ రహస్యం తనలోనే దాచుకొంది. పోను పోను వేకువ రకాలు తగ్గిపోయాయి. తాను నిలదొక్కుకొనేదాకా అలా చేశాడు. ఇప్పుడు కలలోకూడా రావటం లేదు. ఆ ఆత్మ ఇప్పుడు మరల ఎక్కడ జన్మమెత్తిందో? రా ఆరాటంగా అటు, ఇటు కదలసాగింది నిద్రలో.
"అమ్మా! అమ్మా!" అన్న పిలుపు వినపడింది.
రాముడు వచ్చాడు. పిలుస్తున్నాడు. ఎప్పటిలా నాగలక్ష్మి వెళ్ళి తలుపు తీస్తుందని ఊరుకొంది.
ఏకపత్నీ వ్రతుడు, తండ్రి మాట నిలబెట్టిన వాడు, అందాల రామావతారుడు తన ఇష్టదైవం! ఆ పేరు కొడుక్కి పెట్టుకొంది. వీడు కృష్ణావతారం ఎత్తాడు. తల్లికి క్షోభ, కట్టుకొన్న దానికి క్షోభ కలిగిస్తున్నాడు.
"అమ్మా! అమ్మా!" మళ్ళీ పిలుపు.
ఏమిటి? నాగలక్ష్మి ఇంకా తలుపు తీయలేదు. వాడి స్వరం ఎందుకు ఎలా ఉంది? బాధగా పిలుస్తున్నాడు. గబగబ లేచి తలుపు తీసింది.
రామారావు కాస్త దూరంగా నిలుచుని ఉన్నాడు. గుడ్డి వెన్నెల్లో మసకగా కనిపించాడు.
"ఎంత పొద్దు అయిందో! మజ్జిగ తాగి పడుకో!" అంటూ వెళ్ళి పడుకొంది.
'వాడి కళ్ళు ఎందుకలా ఉన్నాయి! ఏదో బాధ!' తల్లి మనస్సు ఎలాగో అయింది. వెళ్ళి వాడిని దగ్గరకు తీసుకోవాలనిపించింది.
'ఈ రోజు నా మంచంలో పడుకోమని చెప్పితే?' పైకి లేచింది. తటపటాయించింది. నాగలక్ష్మి దగ్గర పడుకొని ఉంటాడు.
"పిచ్చిపిల్ల! సాయంత్రం అంతా ఎదురుచూస్తూనే ఉంది. దాని కడుపు పండితే కొత్త కీవితం మొదలవుతుంది, చిన్న చిన్న పిల్లల్ని తలుచుకొంటూ నిద్రలోకి జారింది.
సూర్యుడు పూర్తిగా పైకి వచ్చాడు.
నాగలక్ష్మి పాచిపనులు ముగించి, పాలు పొయ్యిమీద ఉంచింది. ఓంకారి గూట్లో వేపపుల్ల తీసుకుని వంట గదిలో పొంగుతున్న పాలవైపే చూస్తున్న నాగలక్ష్మిని చూసి పెరటిబావి దగ్గరకు వెళ్ళింది.
గ్రామమంతా నిశ్శబ్దంగా ఉంది. లోనికి వచ్చిన అత్తమ్మకి కాఫీ ఇచ్చింది.
"వాడు ఇంకా లేవలేదూ?" అంది ఓంకారి.
"ఆయన రాందే!?"
"వాడు రాలేదూ!? నేనే తలుపు తీశాను!!" అంటూ బయటికి వెళ్ళింది ఓంకారి.
ఇంటిముందు చాకలి వెంకాయి ఉంది. కళ్ళప్పగించి ఓంకారిని, ఆమె వెనక వచ్చిన నాగలక్ష్మిని చూస్తూ ఉంది.
"ఏమిటే దయ్యం పట్టినట్లు అలా చూస్తున్నావు?" అంది ఓంకారి.
అటు, ఇటు పోతున్న వారు నిలబడి వారి ఇంటివైపే చూస్తున్నారు.
మరికొంత దూరంలో ఆ ఊరి మునసబు, వెనక తెలారినాడు వస్తూ కనిపించారు.
తలుపు దగ్గర శాలువ కప్పుకొని ఉన్న ఓంకారిని, ఆ వెనక జూకాలు పెట్టుకొన్న నాగలక్ష్మిని చూసిన మగవాడు మునసబు గుండె దడదడలాడింది.
'రామారావుని ఎవ్వరో వెన్నులో రెండు కత్తి పోట్లతో పొడిచి చంపి రైలు పట్టాలమీద పడేశారని వారికి ఎలా చెప్పాలి!? తాను మూగవాడై ఎందుకు పుట్టలే'దని తలచాడు ఆ మునసబు.
గాంధారి నష్ట జాతకాన్ని సరిచేయాలని మళ్ళీ పెళ్ళి చేసిన సుబలుని, రక్త సంబంధమైన తాతగారినే క్షమించలేదు దుర్యోధనుడు. మరి రత్నావతి సోదరులు ఊరుకొంటారా? రత్నావతి మనస్సాక్షి మరీ గద్దించసాగింది. కొడుకుని ముద్దాడి భర్త పక్కలో ఉంచింది. తాను దేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా అగ్నితో తన శరీరాన్ని దహించి వేసుకొంది!
భూమి తనలో కుంభవృష్టినికూడా ఇంకింప చేసుకొంటుంది. పెనుతుఫాన్లు వచ్చినా, భూకంపనలు కలిగినా స్థానభ్రంశం కాదు!
జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తగిలినా, కష్టనష్టాలకు రక్తమే కన్నీరుకాగా, జీవచ్చంలా ఏకాకిగా మిగిలినా, గుండె ఆగిపోనందుకు ఆశ్చర్యమే కలిగింది ఓంకారికి.
పొద్దు పొడవగానే ఎవ్వరికోసం లేవాలి? ఎవ్వరి కోసం పనిచేయాలి? ఎవ్వరికొరకు బ్రతకాలి? బ్రతికి ఏమి సాధించాలి? తను భూదేవికి భారంగా లేదా? ఎండుటాకు భూమిని సారవంతం చేస్తుంది. అలా శూన్యం లోకి చూస్తూ కాలం గడుపుతున్నది ఓంకారి.
డాబామీద పడుకొన్న నాగలక్ష్మికికొబ్బరిచెట్ల గుండా కనిపించే చంద్రుడు అతి మనోహరంగా ఉంటాడు.
వేసవిలో వేకువన వీచే చల్లని గాలి హాయిని గొలుపు తుంది. కొండల్లోనుంచి వచ్చే సూర్యున్ని చూస్తూంటే లోకం ఇంత అందంగా ఉందేమిటి-అనుకొంటుంది. పందిరికి విరగబూసిన జాజులు మాలలు కట్టి దిండు కింద ఉంచుతుంది! కొత్త గేదెపాల జున్ను ఇష్టం! చక్కగా బ్రతకటం ఇష్టం! తనకు పెళ్ళయిందా- అనుకొంటుంది. మిగిలిన మధురస్మృతులంటూ ఏమీ లేవు!
తనకు రావలసిన దేదో తీసుకొని రమ్మని నాగలక్ష్మి తల్లిదండ్రులు ఒత్తిడి చేశారు. అమ్మకంటే మిన్నగా చూసుకొనే, అన్నీ పోగొట్టుకున్న అత్తమ్మను వదిలి వెళ్ళలేకపోయింది.
ఆమె భారం తీసుకొని జీవితానికి ఒక అర్ధం కల్పించుకొంది నాగలక్ష్మి!
గ్రామాభివృద్ధిలో స్కూలు, లైబ్రరీ, పోస్టాఫీసు వెలిశాయి. పెద్ద గదులు, చావడి, పైన డాబా ఉన్న ఇల్లు ఓంకారిది. వెనక గదుల్లో వారు ఉంటూ పోస్టాఫీసుకు ముందు ఇల్లు అద్దెకు ఇచ్చేటట్లు నిర్ణయించారు గ్రామపెద్దలు!
కొత్తగా వచ్చిన పోస్టుమాస్టరు కృష్ణారావు బ్రహ్మచారి కావటం వలన మిగిలిన ఒక్క గదిలో తన సామాను ఉంచుకొన్నాడు. గ్రామంలో మరో వ్యాపకం లేని కృష్ణారావుకు నాగలక్ష్మిని చూడటం ఒక వ్యసనం క్రింద మారింది! పాతిక సంవత్సరాలు నిండని యౌవనపతి నాగలక్ష్మి అందం ఇట్టే ఆకర్షించింది!
కొబ్బరిచెట్ల సందులో కనిపించే చంద్రుడు, కొండల చాటునుండి పైకి వచ్చే సూర్యుడు, కనుచూపు మేరా కనిపించె పచ్చని పైర్ల అందం కృష్ణారావులో చూడసాగింది నాగలక్ష్మి! బరువెక్కిన వక్షోజాలు. గుండెల్లో కొత్త గుబులు. ప్రశాంతమైన సెలయేటిలో రాయి పడ్డట్లు మనస్సు వికలమైంది.
కొద్దికాలంలోనే పోస్టుమాస్టరు కృష్ణారావు మంచి వాడనిపించుకొన్నాడు గ్రామంలో.
నవ్వుతూ సరళంగా మాట్లాడే తీరు చూసి ఓంకారి మనిషి నమ్మదగినవాడే ననుకొంది.
నిర్మలాకాశానికి చంద్రుడు, నక్షత్రాలు శోభను చేకూర్చుతాయి. స్త్రీ జీవితానికి భర్త, పిల్లలు నిండుదనాన్ని చేకూర్చుతారు!
వెల్లకిలా పడుకొని ఆలోచనలో ఉన్న నాగలక్ష్మి దగ్గరకు కృష్ణారావు ధైర్యం చేసి ఓ రాత్రిపూట వచ్చాడు! తెల్లని వెన్నెల్లో నాగలక్ష్మి ముక్కుబేసరి తళుక్ మంటున్నది.
అంత దగ్గరలో కృష్ణారావుని చూసి అచ్చెరువు పొందినా బిడియపడలేదు ఆమె మనస్సు.
ఓంకారి సాహచర్యంలో మెలిగిన నాగలక్ష్మి పరపురుషుని కౌగిలికి లొంగిపోలేదు!
నిరాదరించినా తనమీద అయిష్టత చూపలేదు నాగలక్ష్మి. చావని ఆశతో ఆ రోజు తిరిగి వచ్చాడు.
నాగలక్ష్మి మీద గౌరవం, ప్రేమ ఎక్కువవగా పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించి ఒంటరిగా గదిలో ఉన్న నాగలక్ష్మిని తనతో వచ్చేయమని, రిజిస్టరు పెళ్ళి చేసుకొంటానని అడిగాడు.
"మీ మాటమీద నమ్మకం ఉంది. కాని, నా బంధాన్ని తెంచుకొని నేను రాలేను! అత్తమ్మకి ఎవ్వరూ లేరు." చేతుల్లో ముఖం దాచుకొంది!
అకస్మాత్తుగా ఆ గదిలోకి వచ్చిన ఓంకారి ఏడుస్తున్న నాగలక్ష్మిని, బిత్తరపోయి చూస్తున్న కృష్ణారావుని చూసింది.
"కృష్ణా! ఏమిటి?" స్వరాన్ని అదుపులో ఉంచుకొని గద్దించి పలికింది.
"ఏమీ లేదమ్మా! ఇప్పుడే వస్తాను" అంటూ బయటికి వెళ్ళి గ్రామపెద్దల్లో ఒకరిని వెంట పెట్టుకొని వచ్చాడు.
అతడు ఓంకారితో మాట్లాడాడు. అన్నీ ఆలోచించి, నాగలక్ష్మికి పెళ్ళి చేయటమే మంచిదని నిశ్చయించారు. ఓంకారి హృదయపూర్వకంగా, ఇష్టంగా వారిని ఆశీర్వదించింది.
బ్రాహ్మణుడైన కృష్ణారావు నాగలక్ష్మిని మళ్ళీ పెళ్ళి చేసుకొన్నందుకు విడ్డూరంగా చెప్పుకొని కొన్నాళ్ళకు మరిచిపోయారు గ్రామస్థులు!
నాగలక్ష్మి ఆ ఇంటిని, అత్తమ్మని విడిచి పోలేదు. కృష్ణారావే వాళ్ళ దగ్గర ఉండటానికి ఇష్టపడ్డాడు.
నాగలక్ష్మిలో ఏ లోపం కనిపించలేదు. ఆమెతో సంసారం హాయిగానే ఉంది. రోజు రోజుకు మక్కువ కాసాగింది. దానితోపాటు ఈర్ష్య కలగసాగింది.
పడకలో తన ముందు బాడి ముడి విప్పే నాగలక్ష్మిని చూస్తూ ఉంటే ఏవో ఆలోచనలు మొదలయ్యాయి.
"అతని ముందు ఇలాగే సిగ్గుపడేదానివా?" అన్నాడు.
అర్ధంగాక కళ్ళు విప్పి చూసింది.
అలసటతో కళ్ళు మూసుకుపోతున్న నాగలక్ష్మిని, "నీకు ఎవరు ఎక్కువ సుఖాన్నిచ్చారు? నేనా! ? అతనా?" అని అడిగాడు.
ఊపిరి పీల్చుకోవటం మరిచిపోయింది నాగలక్ష్మి.
సిగ్గుతో తన ప్రాణం పోతుందనుకొంది.
సీతకు ఎంత సిగ్గేసి ఉంటే భూమిలోకి వెళ్ళిపోయింది? అలా ఏ శక్తీ తనను దాచలేదా?
'నిన్నేమని పిలిచేవాడు?"
"భగవంతుడా!" తన భర్తను కొన్నా అతని వైపు చూడటానికి భయం వేసింది!
"అతను బాగా సరసుడు. ఎలా ప్రవర్తించేవాడో!?"
పడకటింటి రహస్యాలు తెలుసుకోవాలనుకొనేవాడు. సిగ్గుపడుతూనే అడిగేవాడు.
మరింత సిగ్గుతో చచ్చిపోతూ, "అత్తమ్మా! అత్తమ్మా!" అని పిలిపించేది మనస్సు. పైకి మౌనంగా ఉండి, అతని చేతుల్లో కట్టెలా బిగుసుకుపోయేది.
'ఏ స్త్రీ ఇలాటి కోత భరించలేదు. భగవాన్! నేను చేసుకొన్న పాపం ఏమిటి? అత్తమ్మ కోసం అయినా సహించక తప్పదు!'
మరో సంవత్సరానికి 'పువ్వు' లాంటి కూతుర్ని తెచ్చి ఓంకారి ఒడిలో పెట్టి తృప్తిగా నవ్వింది. నాగలక్ష్మిని హృదయానికి హత్తుకొంది ఓంకారి.
'మాలాగ కాకుండా సరస్వతి, లక్ష్మి కలయికతో నూరేళ్ళ జీవితం ఈ బిడ్డకు ప్రసాదించమ'మని ఏక హృదయంతో వేడుకొని, 'వీణ' అని నామకరణం చేశారు.
* * *
