Previous Page Next Page 
మూడుముళ్ళూ పేజి 5

 

                                     3

    తాతయ్యగారికి, నరసయ్య వ్యవహారం ఏమీ నచ్చలేదు. ఆయన మధ్యవర్తి వ్రాసిన లేఖ చూసి ధాంధూం అంటూ చిరాకుపడ్తున్నాడు. రామనాధంకు చిన్నప్పుడే తల్లీతండ్రీ చనిపోయేరు. తాతయ్య, రామనాధం తండ్రి అన్నదమ్ముల పిల్లలు. రామనాధాన్ని, తల్లీ తండ్రీ పోగానే దయగా తనతో తీసుక వచ్చేడు. అప్పటికి రామనాధానికి ఆరేళ్ళుండేవి. వీధి బళ్ళో పుస్తకం పట్టి చదువుకునేవాడు. అప్పటికి తాతయ్య దేవమ్మల కింకా సంతు కలగ లేదు. అన్నగారు పోయేరని పరామర్శకి వెళ్ళిన తాతయ్య, ఆరేళ్ళ రామనాధాన్ని వెంట పెట్టుకుని వొచ్చాడు. దేవమ్మ ఆ అనాధ బాలుణ్ణి చూసి ముఖం చిట్లించింది.
    'ఇంటికి వెళ్తే నాకు పరామర్శించటానికి వీడు తప్ప ఇంకెవళ్ళూ కనపళ్ళేదు! అవునే! చీనయ్య భార్య పోయి సంవత్సరం అయిందిట! మాట కైనా మనకి వ్రాసేడు కాదు. పాపం! సంవత్సరంలోగానే తనూ భార్యని కలుసుకున్నాడు!' అన్నాడు సానుభూతిగా తాతయ్య.
    'ఏమిటో! ఎవళ్ళెలాపోతే మనకేం వచ్చింది? వానలేని వరదా, పిల్ల లేని పెంటా ఎవళ్ళు భరాయిస్తారు? హాయిగా పిల్లలు లేనందుకు కులాసాగా కాలం గడపక ఎందుకొచ్చిన రంధి ఇది! ఈ రోజుల్లో కడుపున పుట్టి పెరిగిన వాళ్ళే, పెరిగి పెద్దయినాక కన్న వాళ్ళని కాళ్ళ రాస్తున్నారు! అల్లాంటిది దత్తువాళ్ళు చూస్తారా, చేస్తారా! నేలన పోయేది నెత్తికి రాసుకోటం కానీ!' అని సాగతీసింది దేవమ్మ.
    దేవమ్మ దృష్టిలో తాతయ్యది అమాయికపు బంధుప్రీతి! నిజానికి తాతయ్య దేవమ్మ అనుకున్నంత అనాధ రక్షకుడు కాడు! తాతయ్యకి ఆ వూళ్ళో పదెకరాల వరకూ పొలం వుంది. రామనాధం తండ్రి చీనయ్యకు కూడా నాలుగెకరాల పొలం, తాతయ్య పొలం ప్రక్కనే వుంది. అన్నతమ్ముల పంపకాల్లో రాగా, రాగా, తాతయ్యకీ, చీనయ్యకీ ప్రక్కప్రక్క పొలాలు వొచ్చాయి. చీనయ్య పొలం బాగా పల్లంగా వుంటుంది. తాతయ్య పొలం మెరక! నీటి వంతులు కూడా ముందు చీనయ్యకి వచ్చాక, తర్వాత తాతయ్యకి వస్తాయి, మెరక అవటం నించి పొలానికి చప్పున నీరు ఎక్కదు. తాతయ్య పొలంలో మెరక తీయించి పల్లం చేయించాలంటే చాలా సొమ్ము ఖర్చు అవుతుంది. బోదె చీనయ్య పొలంలోంచి వున్నందున చీనయ్య పొలానికి ఏమీ బలం చేయక పోయినా, సాలు తిరిగేసరికి ఎల్లా లేదన్నా నాలుగెకరాలకీ, నలభయిబస్తాల గింజలూ రాలేని! తాతయ్య చేను పేరుకి పదెకరాల ఖండ్రిక కనీ, పంటకి పెద్దమ్మలనే వుండేది. ఎంత సత్తువచేసినా ఎకరాకి నాలుగయిదు బస్తాలకంటే ఎక్కువ ధాన్యం దిగుబడి అయ్యేదికాదు.
    తాతయ్య, ఆ వూరి ఎలిమెంటరీ స్కూలులో ప్రధానోపాధ్యాయ పదవి నిర్వహిస్తూ వుండేవాడు. అదీకాక, పోస్టాఫీస్ లో పోస్టు మాస్టరు పనికూడా చేసేవాడు. దానా దీనా ఏరుకున్న రూపాయలతో, తాతయ్య జీవితం తాపీగా గాలి వాలుగా వున్న పడవ ప్రయాణంలా జరిగిపోతూంది. దేవమ్మ అయినా స్వతహా పిసినారి కాదు. ఆ గ్రామం లో ఎవళ్ళు నీళ్ళాడినా, పాత బియ్యం, పాతబెల్లం, నువ్వుల నూనె, కాయపు సామానూ ఇవ్వకుండా వుండేది కాదు. రామనాధానికి తల్లి వెంపు ఇద్దరు మేనమామలున్నారు. కాని, చీనయ్య భార్య పోయినప్పుడు వచ్చికూడా, వాళ్ళు రామనాధం పెంపు విషయంలో ఏమీ శ్రద్ధ తీసుకోలేదు. అభిమానానికి చీనయ్య, 'నా బిడ్డ నాకు పెంచుకోవటానికి బరువు కాదు.' అనుకున్నాడు. కాని, పెంచి, రామ నాధంవల్ల తన అక్కర తీర్చుకోకుండానే చీనయ్యని మృత్యుదేవత ఆహ్వానించింది. రామనాధం మేనమామలు దూరంగా ఎక్కడ్నో ఉత్తరదేశాన్న ఉద్యోగాల్లో వున్నారు. అంచేత చీనయ్య చనిపోయిన వార్త అందినా, ఈ కనుగాయని ఏమని పరామర్శించుతాం? అన్నట్లుగా ఇంటి చాయలకైనా రాలేదు. ఇంక ఒక్క తాతయ్యకే అన్నివిధాలా రామనాధంని పెంచవలసిన బాధ్యత కన్పించింది. వూరి కరణం గారూ కొంతమంది పెద్ద మనుష్యులు కూడా ఆ సవరణనే ప్రతిపాదించారు.
    పయివాళ్ళు ఎవరన్నా రామనాధాన్ని పెంచితే తాతయ్య పొలం మరింత బీడు పడిపోతుంది. పయివాళ్ళు చీనయ్య అంత ఉదారంగా తాతయ్య పొలానికి నీటి సరఫరా చేస్తారా? తమకా నడివయసు దాటి పోతూంది. ఇంక జీవితంలో సంతు కలుగుతుందన్న ఆసక్తి మూడువంతులు నీళ్ళు వదులుకోవచ్చును! తమ వంశం లోనివాడు, తమ ఇంటి పేరిట వాడు! పెంచితే తప్పేముంది! వాడు పెద్ద వాడై వుద్యోగస్థుడై నదాకా నాలుగెకరాల పంటా తనదేకదా! ఆరేళ్ళ పసివాడు నలభయి బస్తాల ధాన్యాన్ని నెమరు వేయలేడు కదా! ఆ పంట డబ్బుతో ఈలోగా తమ పొలంలో మెరక తీయించి పల్లం భూమిగా చేసుకోవచ్చును! అనుకొని ఇవన్నీ క్రింద మీదా ఆలోచించి వూళ్ళో పెద్దవాళ్ళని సంప్రదించి రామనాధాన్ని స్వంతం చేసుకున్నాడు తాతయ్య.
    దేవమ్మ ముందురోజుల్లో, 'ఆఖర్లేని సంత వచ్చిపడింది' అని సణుగుకున్నా రానురానూ, రామనాధం బుద్దిమంత తనానికి కట్టుబడిపోయింది. రామనాధం చాలా నెమ్మదైనవాడు. చదువులో మంచి చురుకుగా వుండేవాడు. దేవమ్మ అంటే వినయ విధేయతలతో మసలు కునేవాడు. సహజంగా పిల్లల్లో వుండే నిర్లక్ష్యం, అల్లరితనం, రామనాధంలో మచ్చుకైనా కనపడేవికావు! ఒక్కొక్కప్పుడు దేవమ్మ అనుకునేది.
    'పిచ్చి వెధవ! వుట్టి మేధకుడు! స్వంత తల్లితండ్రులవద్ద ఎలావుండునో పాపం!' అని జాలిపడేది. రామనాధం వచ్చిన సంవత్సరానికి, ఎవరూ అనుకోకుండా దేవమ్మకి గర్భం వచ్చింది.
    'బిడ్డ వొచ్చిన వేళా, గొడ్డు వొచ్చిన వేళా! అంటారు దేవమ్మో! రామయ్య కాళ్ళు చల్లన!' అన్నారు గ్రామస్థులు.
    దేవమ్మకీ, రామనాధం, అనాధబాలుడులా కన్పించలేదు. నళప్రసాదిలా కన్పించాడు. ఇంక దేవమ్మకీ రామనాధం పంచప్రాణాలూ అయిపోయేడు.
    'ఈ వయసులో ఇంకా ఇంకా, కనగలమా, పెంచగలమా! కొడుకంటూ వున్నాడు కనుక, ఆడపిల్ల కలిగితే బాగుండును.' అనుకుంది. దేవమ్మ. కాని, దేవమ్మకి కొడుకే కలిగాడు.

                             
    'పోనీలే! ఇద్దరూ, నాకు రెండు కళ్ళులా వుంటారు.' అనుకోండి దేవమ్మ. 'మాధవ' కూడా రామనాధంలానే, అణుకువగా వుండేవాడు. తల్లితండ్రుల మాట లకీ ఎదురు చెప్పేవాడు కాదు. అన్నని చూసి తమ్ముడూ కూడా కుదురుగా వుంటాడు, అనుకునేవారు. తాతయ్యగా రిల్లు సిరి సంపదా కలలైంది. రామనాధం పొలంమీద వచ్చే డబ్బుపెట్టి తాతయ్య తను పొలంలోని మెరక అంతా తీయించాడు. చక్కని పాటిమట్టి దిబ్బల్ని కొని పొలం అంతా పాటిమట్టి వేయించారు. దేశంలో వున్న ఆహారలోపంవల్ల ప్రభుత్వం వ్యవసాయదారు లందరికీ, ఏటికి రెండుపంటలు పండించటానికి అనుమతి నిస్తూంది!
    లేదంటే సాలు గిర్రుమని తిరిగేసరికల్లా, రెండు పంటలవల్లా మూడు వందల బస్తాల గింజలు దాకా మట్లో కళ్ళకి కనపడుతోంది. తాతయ్యగారు, పెద్దరైతు అయిపోయాడు. రామనాధం పొలానికి పన్నులు కూడా తన పేరుతోనే కట్టేవాడు తాతయ్య! అంచేత రామ నాధానికి తనకి నాలుగెకరాల పొలం వున్నట్లు కూడా తెలియదు. రామనాధం, బి. ఎ. బి. ఇడి. ప్యాసయి, పట్నంలోవున్న ఒక హైస్కూల్లో లెక్కల టీచరుగా పనిచేస్తున్నాడు. మాధవ కూడా ఆ పట్నంలోనే ఒక కాలేజీలో, బి. యస్ సి. చదువుతున్నాడు. రామనాధం, తాతయ్య గారు దానధర్మ హృదయం వల్ల, తన్ని పెంచి పెద్దచేసి, చదువు చెప్పించి, తన్నొక వ్యక్తిగా సంఘంలో నిలబెట్టారని భావించేవాడు. ఆయన పట్ల ఒక కృతజ్ఞతా భావంతో రామనాధం మనస్సునిండి వుండేది తన మాటకు ఎన్నడూ ఏ విధంగానూ ఎదురు చెప్పని రామనాధం అంటే 'తాతయ్య' గారికీ సద్భావంగానే వుండేది. కాని, 'మాధవ'తో సమానంగా, చేసి చూడగల గటం అతనికి చేతనయ్యేది కాదు. దేవమ్మకి చుటుకు, 'పెద్దాడు' అంటే, 'మాధవ' కన్నా ఎక్కువ ప్రేమగా వుండేది. తమని రౌరవాది వనకాల నించి తప్పించిన దేవ దూతలా ఆమె కళ్ళకి రామనాధం మన్నించేవాడు. రామనాధానికి పిల్ల నిస్తా మంటూ, చాలామంది బంధువులు ముందుకు వచ్చేరు.
    'అబ్బాయి పెద్దవాడివయ్యావోయ్! నీ కోసం సంబంధాలు వస్తున్నాయి! ఏదో వకటి వచ్చిందనిపించు! మీ అమ్మకి కోడలితో దెబ్బలాడాలని వకటే ముచ్చటగా వుందిట! అన్నాడు తాతయ్య.
    'మీ ఇష్టం!' అన్నాడు రామనాధం. పిల్లనిస్తామంటూ వచ్చిన వాళ్ళ ఇళ్ళకు. పెళ్ళి చూపులకి వెళ్ళటం మొదలెట్టారు రామనాధం ఇంట్లో వాళ్ళు. రామనాధానికి, అట్టే ఫేషన్సు నచ్చవు! కాలేజీలో చదివే రోజుల్లో కూడా, అతను, ఆడపిల్లల జోలికి పోయేవాడు కాదు. కొంతమంది క్లాసు మేట్స్, అతనికి ఋష్యశృంగుడని పేరుపెట్టి ఏడిపించే వాళ్ళు కూడా! అతను ఏమీ అనకుండా నవ్వి వూరుకునే వాడు, రామనాధానికి ఈ పెళ్ళి చూపుల తతంగం కూడా వచ్చేది కాదు. కానీ, పిల్లని చూడకుండా, ఎల్లా నచ్చుకోవటం జరుగుతుంది? అందుకని తప్పనిసరిగా, ఈ పెళ్ళి చూపులకి వెళ్ళే వాళ్ళు.
    ఒకసారి, ఒక చిన్న వూరు పెళ్ళి చూపులకని వెళ్ళాడు. కూడా తల్లి దేవమ్మ, తమ్ముడు మాధవ కూడా వున్నారు.
    'మినప సున్నీ, జంతికలూ' ఫలహారంపెట్టేరు. కంచుగ్లాసుల నిండా చిక్కటి కాఫీలు ఇచ్చారు. కాఫీ ఫలహారములు సేవించటం అయినాక, పిల్లని తీసుకువచ్చి చాపమీద కూర్చోబెట్టారు. ఆ పిల్ల తలని భూమిలోకి పాతేసింది! ఎంతకీ తల ఎత్తదు! తల్లో ముద్ద బంతి పూల చెండుమీద అరచేయంత నాగరం, గట్టిగా బిగించి వేసిన జడక్రింద జడగంటలూ! మెళ్ళో ఇత్తడి వాటిల్లా పాతబడిన గొలుసులూ! పెద్ద పట్టు చీరలో పదిలంగా చుట్టబడిన ఆ పిల్ల పదిహేనేళ్ళ వయస్సూ, రామనాధానికి అపరసంజవేళ, సింహాచలం కొండమీద నించుని క్రింద లోయలోనికి చూస్తే కనబడే చిక్కని చీకటిలా కనపడింది. ఇంక చూడటం చాలించి, లేవబోతూండగా, అప్పుడు చటుక్కున జ్ఞాపకాని కొచ్చింది, తిను పిల్ల సంగీత జ్ఞానము ఆ పిల్ల అన్నయ్యకి!
    'ఉండండి! మా పిల్ల పెట్టె నేర్చు కుంటోంది! పాడుతుంది వినండి! అని బలవంత పెట్టాడు రామనాధం వాళ్ళని పెళ్ళికూతురు అన్నయ్య!    
    'అవశ్యం! శ్రవణీయం!' అనుకుంటూ కూర్చున్నారు మళ్ళీను.
    హార్మోనియం తెచ్చి ఆ పిల్లముందు పెట్టారు. ఆ పిల్ల కాసేపు గునిపించుకుని గునిపించుకుని హార్మోనియం వాయించటం మొదలెట్టింది.
    'గొంతులో పాడు!' అని ఆడపెళ్ళి వారి బంధువుల్లో ఒకరు హెచ్చరించారు.
    ఆ స్వరాలు ఒక స్థాయిలో వుంటే, ఈ పిల్ల ఇంకో స్థాయిలో అరుస్తూ స్వరాలు వాయించటం మొదలెట్టింది.
    'ఏదన్నా కీర్తన పాడు!' అన్నారు - ఆ పిల్ల తల్లితండ్రులు.
    'నీవు లేక వీణా పలకలే నన్నదీ!' అంటూ మొదలెట్టింది. వాళ్ళకి అదే కీర్తన! రామనాధంకు చెప్పలేనంత నవ్వు వొచ్చింది. పాడటం పూర్తి అయినాక మాధవ అడిగాడు.
    'బాగా పాడింది.ఎక్కడ నేర్పించారు?'
    'ప్రక్కవూరినుంచి వొస్తాడు పాట పంతులు. నెలకి ఇరవయి రూపాయిలిచ్చి చెప్పిస్తున్నాము. ఇరవయి కీర్తన లొచ్చాయి!' అన్నాడు పెళ్ళికూతురి అన్నయ్య.
    'బాగుంది! మంచి శ్రద్దగా నేర్పిస్తున్నారు!' అన్నాడు మాధవ,
    'నేర్పించకపోతే ఎల్లా! బస్తీల్లో వుద్యోగాలు చేసేవాళ్ళకే ఇచ్చిచేయాలని, మా నాయన మాచేత చేతిలో చేయి వేయించుకుని మరీ ప్రాణం వొదిలాడు. మరి మాలా, నేల దున్నుకుని బ్రతికే వాళ్ళకి ఎల్లావున్నా ఫరవాలేదు కాని, వుద్యోగస్థులకి చదువు సంగీతం రాక పోతే నచ్చుతుందా?' అన్నాడు పెళ్ళి కూతురు అన్నయ్య. 'ఇంకో కీర్తన పాడు' అని హెచ్చరించాడు చెల్లెల్ని. ఆ పిల్ల హెచ్చుస్థాయిలో హార్మోనియం వాయిస్తూ, 'పరపరా, కురుపరా!' అంటూ కీచుగొంతుతో పాడటం మొదలెట్టింది. ఆ సంగీతంతో రామనాధానికీ, మాధవకి కూడా చెవులు గింగుర్లెత్తిపోయాయి. వచ్చేస్తూ మాధవ అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS