Previous Page Next Page 
మల్లెలు ఎర్రగులాబీలు పేజి 5


    
    'నీవలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది శారూ....! అవకాశం లేనప్పుడు బాధలు పడ్డావు. నీకు తోడుగా నేనుండి నిన్ను నాతో సమంగా చూసుకుంటావని అంటున్నప్పుడు కూడా నీవలా నిరుత్సాహపడితే నా మనసుకు కష్టం కలుగుతుంది. నీవు అరచి గీపెట్టినా, నిన్నిక ఒంటరిగా ఒదలను. ప్రమాణం చేసి చెబుతున్నాను. నిన్నొక యింటిదాన్ని చేసిన తర్వాతే నా సుఖం నేను చూసుకుంటాను. ఎందుకో గాని నిన్ను చూసిన మరుక్షణంనుండి నాకు నీపై ఎనలేని ఆప్యాయత, అనురాగం ఏర్పడ్డాయి.'
    'శాంతా అంత త్యాగం నాకోసం చేయవద్దు. నే నొక యింటిదాన్ని కావడం నీ వనుకుంటున్నంత తేలికైన పనికాదు. నీ ఈ మాటలు చాలు. నా హృదయం సంతోషంతో పొంగిపోతూ ఉంది. నా గత చరిత్ర తెలిసినవారెవ్వరూ నన్ను చేపట్టరు. దాన్ని తెలియజేయకుండా ఎవరినీ వివాహమాడ తలచుకోలేదు నేను. ఈ జన్మకిక యింతే...!' నిరాశ, నిస్పృహ లతో నిండి ఉన్నాయి ఆమె మాటలు.
    'శారూ....! ఎన్నిసార్లు అడిగినా నీ పూర్తి వివరాలు చెప్పకుండా తప్పించుకుంటున్నావు. ఈ రోజు అది కుదరదు. ఎలాగూ నిద్ర చెడిపోయింది. తెల్లవార్లూ జాగరణైనా చేసి ఈ రోజు నీ కధ వింటాను.'    
    'వద్దు. నా పూర్వ చరిత్రంతా చాలా జుగుప్సా కరమైనది. నీకుచెప్పి నీమనసు కష్టపెట్ట తలచుకోలేదు.'
    'అలా అనకు. పద్మం పంకిలంలో జన్మించింది. దాని జన్మ గురించిగాని, దాని చుట్టూ ఆవరించి ఉండే పంకిలాన్ని గురించిగాని ఎవరైనా ఆలోచిస్తున్నారా...? నీవు చెప్పి తీరాల్సిందే ...!'
    'తప్పదంటావా...?'
    'తప్పదు. ఏమాత్రం తప్పదు ....!!' మొండిగా అంది శాంత.
    'శాంతా .... ! నా సంగతులన్నీ విని అసహ్యించుకోవు గదా....?'
    'శారూ ... ! ఇంతేనా నీవు నన్ను అర్ధం చేసుకున్నది....?' బాధపడుతూ అంది.
    'మన్నించు....!'
    'సరే...! త్వరగా చెప్పు-
    'మా అమ్మ మోసపోయింది. తత్ఫలితంగా నేను జన్మించాను. స్త్రీలకు సమాన హక్కులు, స్త్రీ జనాభ్యుదయం అనే నినాదాలు ఉపన్యాసాలలో, పుస్తకాలలో తప్ప ఆచరణలో ఉండవు. అమ్మను మోసగించిన యువకుడు విద్యావంతుడు, ధనికుడు. నాగరికత అనే ముసుగులో తలదాల్చుకున్న అనాగరికుడు. పయోముఖ విషకుంభం. ఆమె యౌవ్వనంలో తన దాహాన్ని తీర్చుకున్నాడు. తన ప్రతిబింబం అమ్మలో పెరుగుతూన్న సంగతిని తెలుసు కొని ముఖం చాటుచేసుకున్నాడు. ఈ విషయం నలుగురికి తెలియక ముందే అమ్మ యింటినుండి వెళ్ళిపోయింది. ఎన్నో కష్టాలు పడింది. లెక్కలేనన్ని అవమానాలకు గురైంది. నవమాసాలు మోసి చివరకు నన్ను కన్నది.
    'నేను పుట్టడంతో ఆమె కష్టాలు ద్విగుణీకృతమయ్యాయి. ఆమెకు నిలవడానికి ఎక్కడా నీడ దొరకలేదు. తనను మోసగించిన ఆ యువకుణ్ణి నలుగురిలో ఆమె బయటపెట్టలేదు. నిదర్శనాలు, రుజువులు ఉన్నప్పటికీ ఆమె అతనిని బాధించడానికీ ఏ ప్రయత్నమూ చేయలేదు. ఆమె చనిపోయిన తర్వాతగాని అవి ఉన్నట్లు నాకు తెలియలేదు. ఆమె అందమే ఆమెకు శత్రువైంది. ఎన్నో అవమానాలను హింస లను ఎంతో వోర్పుతో సహించింది. కాని మరొక స్తీని వివాహం చేసుకొని హోదా, పరువు ప్రతిష్టలతో సంఘంలో పెద్ద మనిషిగా చలామణి అవుతూన్న అతని పేరును మాత్రం బయటపెట్టలేదు. అనాది నుంచి భారత స్త్రీ యిటువంటి అన్యాయాలకు అక్రమాలకు గురి అవుతూనే వచ్చింది.
    'ఎంతో కష్టంమీద మా జీవితాలు గడవడం నాకు కొద్దిగా గుర్తుంది. ఎన్నో రాత్రులు ఉపవాసాలు చేస్తూ ఉండే వాళ్ళము. అమ్మ తనకు లేకపోయినా బాధపడేదికాదు. నేను ఒక్కపూట పస్తుంటే చాలు ఆమె కళ్ళు ధారలు కడుతూ ఉండేవి. ఎన్నో యిబ్బందులు ఎదుర్కొని నన్నుమాత్రం చదివించింది. ఎన్నో అవస్థలు పడుతూ, కలవారి యిండ్లలో చాకిరీ చేసుకుంటూ, తన శీలాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ నాకు పదమూడేళ్ళు వచ్చేవరకు సాకింది. నేను అప్పుడు ఆ ఊరి స్కూలులో ఎనిమిదవక్లాసు చదువుతున్నాను. అప్పుడే ప్రపంచమంటే ఏమిటో తెలుస్తూ ఉంది నాకు. రెండు మూడు నెలలుగా అమ్మ ఆరోగ్యం క్షీణించసాగింది.
    'నేను ఒకరోజు స్కూలునుండి యింటికి రావడం ఆలస్యమైంది. చీకటిపడింది. ఆలస్యమైనందుకు అమ్మ కోప్పడుతుందేమోనన్నభయంతో ఉరుకులు, పరుగులతో యింటికి రాసాగాను. ఇంటికి చేరిన నాకు లోపలనుండి కేకలు వినపడడంతో ఆశ్చర్యపోయాను. తలుపు వోరగావేసి ఉండడంవల్ల లోపల జరుగుతూవున్న దృశ్యం నాకంటపడింది. అమ్మ ఎవరినో తిడుతూ ఉంది. ఎవరో వ్యక్తి తడబడుతూన్న మాటలతో పడుతూ, లేస్తూ అమ్మ చేతిని పట్టుకొని లాగుతున్నాడు. నాకు భయంవేసింది. లోపలికి వెళ్ళడానికి ధైర్యం చిక్కలేదు. అలాగే నిర్జీవప్రతి మలా నిలుచుని లోపల జరుగుతూన్న దృశ్యాన్ని చూడసాగాను. అమ్మ ఏడుస్తూ ఉండడంవల్ల నాకు ఏడుపు వచ్చింది. పెద్దగా ఏడుస్తే అతడు నన్ను కూడా ఏమైనా చేస్తాడేమోనని భయంతో వణికి పోసాగాను. పెద్దగా కేకలువేసి అందరినీ పిలవాలన్న ఊహ గాభరాతో వణికి పోతూన్న నాకు తట్టనే లేదు. అంతకు ముందే మేఘావృతమై ఉన్న ఆకాశం నుండి క్రమంగా చినుకులు ప్రారంభమైనాయి.....ఉరుములు ....మెరుపులుకు తోడు గాలి విజ్రుంభించి వర్షం ఎక్కువైంది. తడిసి పోతూ యింటి ముందు నిలుచున్నానే కాని దైర్యంచేసి లోపలకు వెళ్ళలేక పోయాను. ఆ మసక వెలుతురులో లోపలి దృశ్యం కనుపిస్తూ ఉంది. అమ్మ తన శక్తినంతా కూడ తీసుకొని అతనితో పెనుగులాడుతూ ఉంది. ఆ నీచుడు అమ్మను లోబరుచుకోవాలని విశ్వప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాడు తనను పట్టుకుంటున్నప్పుడల్లా కొరుకుతూ ఉంది. కళ్ళెర్రజేసి అరుస్తూ ఉంది.....దున్నపోతుమీద పడిన వర్షంలా ఆ దుర్మార్గుడు ఏ మాత్రం చలించడం లేదు. అమ్మ చీరె చినిగి పీలికలై వ్రేల్లాడుతూ ఉంది. రవిక తన నిస్సహాయతను వ్యక్తం చేసి శరీరాన్ని కప్పి ఉంచలేకపోయింది. రాక్షస రూపం తాల్చాడా దుర్మార్గుడు. నాపై ప్రాణాలు పైనే పోవడ మారభించాయి. నాలుక పిడుచగట్టింది, మళ్ళీ పెద్దగా అరుద్దామనే ఊహ ఆ సమయంలో నాకు కలిగింది గాలిలోపలి నుండి మాట పెగిలి రాలేదు. వర్షపు నీరు నా ఒంటినిండా కారుతూ ఉండడంచేత చలికి వణికిపోసాగాను, అకస్మాత్తుగా ఒక పెద్ద మెరుపు మెరిసింది. అమ్మచేతిలో కత్తిపీట కనుపించింది. అర్ధనగ్నంగా అపరదుర్గయై విజ్రుంభించడం కనుపించింది.
    'వర్షం యింకా పెద్దధైంది...ఎక్కడో పిడుగుపడినట్లు చప్పుడైంది. భయంతో వణికిపోయాను. నాకేమీ తోచక అక్కడే కూలబడిపోయి ఏడువసాగాను. పెద్ద పొలికేకతో ఎవరో క్రిందపడిన చప్పుడు వినిపించింది. ఆ దుర్మార్గుడు తలుపు తెరుచుకొని ఆ వర్షంలో బయటికి పరుగెత్తాడు, నేను వాడికి కనుపించకుండా తలుపు చాటున నక్కి, వాడు కనుచూపు మేర దాటి పోగానే భయపడుతూ యింటి లోపలికి అడుగులు వేయడం ప్రారంభించాను లోపల కనుపించిన దృశ్యంతో నాకళ్ళు బైర్లు కమ్మాయి. కత్తిపీట అమ్మకడుపులో పూర్తిగా దిగబడి ఉంది. అమ్మ వెల్లకితలా పడి ఉంది. రక్తం మడుగుకట్టింది. ఇదంతా చూసిన నేను భయంతో వెంటనే తేరుకోలేక పోయాను తేరుకున్న తర్వాత ఏం చేయాలో తోచలేదు. బయటికి పరుగెత్తి ఎవరినైనా పిల్చుకువద్దామను కున్నాను. కాని బయట వర్షం యింకా అధికమైంది. బిగ్గరగా కేకలు వేయసాగాను అమ్మకు ఏమైందో తెలియలేదు. కదలడంలేదు. అమ్మవైపు చూడడానికే భయం కలగడంవల్ల రెండు కళ్ళనూ మూసుకున్నాను అప్పుడప్పుడు వ్రేళ, సందులనుండి అమ్మను చూస్తూ భోరున ఏడవసాగాను. ఎన్నిసార్లు చూసినా అమ్మలో చలనం కనుపించలేదు. చనిపోయిన వారు కదలరని ఎవరో చెప్పగా విన్నాను. అనుమానం కలిగింది బిగ్గరగా ఏడ్చాను. ఉరుములు.....మెరుపులు.....వర్షం.....ప్రకృతి విలయ తాండవం తగ్గలేదు. అలాగే శోష వచ్చి పడిపోయాను....అంతే! ఆ తర్వాత జరిగిన సంగతులు నాకేమీ తెలియలేదు'
    ఇంతవరకు కధచెప్పిన శారద కళ్ళవెంట కన్నీరు ధారలుకట్టి బుగ్గల క్రిందుగా ప్రవహించడం చూసిన శాంతకు కూడా దుఃఖం ఆగలేదు.
    'అందుకేనా  శారూ...! ఉరుములు మెరుపులతో వర్షం వచ్సినప్పుడల్లా ఉలికిపడి లేచి ఏడుస్తావు' శారద కన్నీటిని తుడుస్తూ ఓదార్పు మాటలంటూ తన కళ్ళను పమిట చెంగుతో తుడుచుకుంది శాంత కొన్ని క్షణాలు ఆ గదిలో నిశ్శబ్దం ఆవరించింది. ఇద్దరి ముఖాలు చిన్నబోయి కన్నీటి చారలతో ఎంతో విషాదాన్ని వ్యక్తం చేయసాగాయి.
    మెల్లిగా తేరుకున్న శాంత శారదవైపు చూస్తూ 'శారూ...! నా శారూ....! ఎంత ఘోరమైన దృశ్యాన్ని చూశావే...? చిన్నతనం ప్రపంచజ్ఞానం తెలియని రోజులు. ఆ రాక్షస కృత్యాన్ని కళ్ళతో సూడడం. ఎటువంటి గుండె నిబ్బరం కలవారికైనా భయం కలగడం సహజం....! అటువంటిది అమాయకురాలివి, చిన్నదానివి అంతటి కఠోరదృశ్యానికి తట్టుకోలేక పోవడంతో అసహజమేమీ లేదు. భగవంతుడు నీకు ఎంత అన్యాయం చేశాడే...?'
    'ఆ భగవంతుడు చేసిన దేముంది శాంతా....? కర్మ ఫలానుభవాన్ని ఎవరు తప్పించుకో గలగారు....? ఆనాటి సీత, ద్రౌపది; సతీ అనసూయల వంటి మహా పతివ్రతలకే తప్పలేదు. సాధారణ మానవులం. మన మెంతటివాళ్ళం ....?' అని ఒక్క క్షణం ఆగి మళ్ళీ 'నాకు తెలివి వచ్చే సరికి ఆ ఊరి ఆస్పత్రిలో ఉన్నాను. రెండురోజులకు ఆ షాక్ నుండి తేరుకో గలిగాను. ఆస్పత్రినుండి యింటికి వెళ్ళాను. ఇల్లంతా చిందర వందరగా ఉంది. అమ్మ శవాన్ని చుట్టుప్రక్కల యిండ్ల వాళ్ళు దహనం చేశారట..... కత్తిపీట అమ్మకడుపులో దిగబడి ఉండడంతో దానిని హత్యగా ఊహించిన పోలీసులు నేరస్తుడికోసం గాలిస్తున్నారని తెలిసింది. ఉన్న ఒక్కపెట్టె తెరిచాను.అందులో పాతగుడ్డలు తప్ప ఏమీలేదు. వాటిని కదిలించి చూస్తూ ఉండగా ఒక కవరు కనుపించింది. అందులో ఫోటో, రెండుమూడు ఉత్తరాలూ కనుపించాయి. ఆ కవరును జాగ్రత్తగా యిప్పటికీ ఉంచుకున్నాను. ఉపయోగిస్తాయనుకున్న ఒకటి రెండు జతల గుడ్డలను ఒక పాతసంచీలోకుక్కి ఆ కవరును కూడా అందులోనే దాచిపెట్టాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS