Previous Page Next Page 
లోకం పోకడ పేజి 5

           
                                     5

    ఆ ఊరి పేరు ప్రసాద పురం. ఆ ఊరు పోవాలంటే అన్ని కోరికలూ, అన్ని ప్రయాణ సౌకర్యాలూ అనుభవించ వచ్చు. ఒకానొక రైలు స్టేషను లో దిగి, పది మైళ్ళు బస్సులో వెళ్లి, రెండు మైళ్ళు పంట కాలువ గట్టున నడిచి వెళ్లి, చిన్న తెప్పల మీద ఏరు దాటితే, ఏటి ఒడ్డు నుంచీ అరమైలు మళ్ళీ నడిస్తే, ఆ వూరు చేరుకోవచ్చు. గట్టిగా , నిక్కచ్చిగా ఒక రోజు ప్రయాణం. ఊరు చాలా మంచిది. ఇసుక ఊరు. ఎంత వాన కురిసినా కాలికి మన్ను కాదు. ఊళ్ళో మొత్తం అన్ని కులాల వాళ్ళవీ రెండు వందల గడప ఉన్నది. ఊళ్ళో అంతా మంచివాళ్ళే. అంతా చెడ్డవాళ్ళే . ఏటి అవతల వారు తగాదాకు వస్తే రెండు వందల గడపా ఒక్కటి. ఒక కోట గోడలా నిలబడతారు. ఊళ్ళో వాళ్ళలో తగాదాలు వస్తే పది పార్టీలు. కనీసం వారానికి ఒక్కసారయినా సబ్ ఇన్ స్పెక్టర్ రావలసిందే. అదీ ఆ ఊరు పరిస్థితి.

                           
    ఆ ఊళ్ళో రెండు వందల ఎకరాల ఆసామి నుంచీ రెండెకరాల చిన్న రైతు వరకూ ఉన్నారు. పదిహేను మంది బి.ఏ. లు ఉన్నారు. పై చదువు లకు చదివేవారు అయిదారుగురు ఉన్నారు. ఊళ్ళోనే మిడిల్ స్కూలు ఉంది. ఊళ్ళో వాళ్ళంతా ఎవరికి వాళ్ళు పెద్ద మనుష్యులు. అందర్లో నూ పెద్ద మనిషి నాగభూషణం.
    నాగభూషణానికి ముగ్గురు కొడుకులు. పెద్ద వాళ్ళిద్దరూ తండ్రితో భాగం పంచుకుని వెళ్ళిపోయారు. విధవ కూతురు వండి పెడుతూ ఉంటె పొలం వ్యవహారాలూ చూసుకుంటూ ఉన్నాడు నాగభూషణం. రమేష్ మూడో కొడుకు.
    నాగభూషణం అంటే ఊళ్ళో అందరికీ ఆదరాభిమానాలు ఉన్నాయి. అతనికి ఎవరి జోలి అక్కర్లేదు. ఎవ్వరూ అతని జోలికి రారు. ఎవ్వరి ప్రస్తావనకూ అతను పోడు. అందుకనే నాగభూషణ మంటే అందరికీ గౌరవం. పైగా అరవై ఏళ్ళు దాటినవాడు.
    తండ్రికి అందరి కొడుకులూ ప్రయోజకులై వృద్ది లోకి రావాలనే ఉంటుంది. అంతా తనను వృద్దాప్యంలో ఆదరించి ఆదుకోవాలనే ఉంటుంది. పెద్ద తనంలో ఏ దిగులూ లేకుండా, అంతా తన కళ్ళ ముందు ఉంటె యింక ఆ తండ్రికి కావలసిన దేముంది?
    కొడుకులు అప్రయిజకులై తండ్రి మాట కాదని దుర్వ్యసనాలకు లోనైతే అలాంటి కొడుకు లను చూసుకుని మనస్సు లో పడే బాధ వేరు. అలాంటి మానసిక వేదన నలుగురితో చెప్పుకుని కొంత మనశ్శాంతి చేకూర్చు కోవచ్చు. నలుగురి చేతా చెప్పించి నయానో, భయానో మంచి మార్గంలోకి తీసుకు రావటానికి ప్రయత్నం చెయ్యవచ్చు. ఇలాంటి విషయాలో నా కొడుకులు అప్రయోజకులని ఆ తండ్రి ఎవరితో నయినా చెప్పుకున్నా వినేవారు సానుభూతి కనబరచవచ్చు.
    కొడుకులు ప్రయోజకులై రెండు చేతులా సంపాదించుకుంటూ నలుగురిలోనూ పలుకుబడి కలిగినవారై ఉండి , చక్కగా వాళ్ళ సంసారాలను దిద్దుకుంటూ ఉండి కూడా తండ్రి మాట కాదని, ఆయనతో భాగం పంచుకుని యింక ఆ తండ్రి వైపు చూడకుండా వెళ్ళిపోతే ఆ తండ్రి పడే ఆవేదన భరింప రానిది. సానుభూతి వాక్యాలతో అలాంటి ఆవేదనను ఎవ్వరూ తీర్చలేరు. ఆ తండ్రి ఎవ్వరితోనూ చెప్పుకోనూ లేడు. ఆ మానసిక ఆవేదన మనస్సులో , హృదయం లో హరించి పోయి, గుండె బండబారి పోవలసిందే.
    ప్రయోజకులైన నాగభూషణం కొడుకు లిద్దరూ ఆ తీరుగా వెళ్ళిపోయారు. ఇప్పుడు రమేష్ ఒక్కడే అయన కొడుకు.
    నెల రోజులుగా ఎదురుచూస్తున్న రమేష్ వద్ద నుంచి ఉత్తరం రావటం లేదు. ఇదివరకు వారానికో ఉత్తరం వచ్చేది. ఇప్పుడు నెలదాటినా ఉత్తరం లేదు. నాగభూషణం మనస్సు పరిపరి విధాల పోయింది. కూతురు కామాక్షి కూడా తమ్ముడి సంగతి తెలియకపోయేసరికి కొంచెం మనస్సులో బెంగ పెట్టుకుంది.
    టాపా వచ్చే గడువూ అయిపొయింది.
    "ఇవ్వాళ కూడా ఉత్తరం రాలేదుగా, నాన్నా, రమేష్ దగ్గర్నుంచి?' అన్నది కామాక్షి తండ్రి కి పొగాకు కాడ అందిస్తూ.
    "రాలేదమ్మా. వాడేట్లా ఉన్నాడో! జ్వరం లో ఉన్నాడో, ఏదయినా సుస్తీగా ఉన్నదో తెలియదు. వాడికి ఈడుకు మించిన వ్యాపకాలూ, ఆలోచనలూ రాతలూ. ఏం అఘోరిస్తున్నాడో " అన్నాడు నాగభూషణం.
    "పోనీ, ఒక్కసారి వెళ్లి రారాదూ నాన్నా? సంగతులు తెలుసుకుని వెంటనే వచ్చేద్దువు గాని. రెండు మూడు రోజుల్లో రాలేవూ?"
    "రాలేకేం? వెళ్లి రావచ్చు. మరి నే వేల్లోస్తే ఒక్కదానివీ ఉండగలవా?" అన్నాడు నాగభూషణం, చుట్ట వెలిగిస్తూ. అగ్గిపుల్ల ఆరిపోయింది. చుట్ట అంటుకోలేదు. అగ్గిపెట్టె లో పుల్లలు లేవు. కామాక్షి యింకో కొత్త అగ్గిపెట్టె తెచ్చి యిచ్చింది.
    "నాకేం భయం నాన్నా? వెన్నెల రోజులేగా. అయినా మన గొడ్ల కాటి కుర్రాడు ఈ అరుగు మీద పడుకుంటాడు. నాకేం భయం లేదు  వెళ్లిరా" అన్నది కామాక్షి.
    కూతురు ఇంతగా చెపుతుంటే సరే నన్నాడు నాగభూషణం . నెల రోజుల నుంచీ ఉత్తరం రాకపోయేసరికి ఆయనకూ కొడుకును చూడాలనిపించింది. మర్నాడే వెళతా నన్నాడు.
    అనుకున్నట్లు గానే మర్నాడు ఉదయమే బయల్దేరి సాయంత్రానికి గుంటూరు చేరాడు నాగభూషణం. గొడ్ల కాటి కుర్రాడిని కామాక్షి కి తోడుగా అరుగు మీద పడుకోమన్నాడు. వాడు పదిహేనేళ్ళవాడు.
    అరుగు మీద గొడ్ల కాటి కుర్రాడు పడుకుంటే అన్ని తలుపులూ లోపల గడియ పెట్టి తన గదిలో పడుకుంది కామాక్షి. అంతా గాడ నిద్రలో ఉన్నారు. అర్ధరాత్రయింది. పెరటి తలుపు చప్పుడయింది. ఏ పంది కొక్కో , పిల్లో అనుకుంది కామాక్షి. "ఇస్సో" అన్నా పోలేదు. మళ్ళీ మెల్లిగా తలుపు తట్టిన చప్పుడయింది. ఈసారి "కామాక్షీ" అన్న మాట కూడా వినబడింది. కామాక్షి గుండెల్లో రైళ్ళు పరిగెత్తినాయి. ఏ దొంగయినా తండ్రి లేని సమయం చూసి వచ్చాడేమో ననుకుంది. కన్నార్పకుండా మెదలకుండా చూస్తూ పడుకుంది. దొంగ కన్నం వేస్తున్నాడేమో ననుకుంది. కాని చప్పుడు లేదు. మళ్ళీ తలుపు చప్పుడు "కామాక్షీ" నేను రాఘవరావు ను. తలుపు తియ్యవూ?" అన్న మాటలు వినిపించాయి. అప్పటికి కామాక్షి అంతా అర్ధం చేసుకుంది. తండ్రి లేని అదను చూసుకుని మునసబు గారి కొడుకు రాఘవరావు వచ్చాడన్నమాట. మెల్లిగా పక్క మీద నుంచీ లేచింది. తలుపు తీస్తే అతను లోపలికి వచ్చేస్తాడు. తరవాత విషయం అతి నీచమయింది. తలుపు తీయకుండా ఉంటె అట్లాగే అతను తలుపు తట్టుతాడు. ఎవరయినా వినవచ్చు. రఘావరావు పెరటి దోవన వచ్చి వెళుతుంటే అపవాదులు వెయ్యటానికి ఎంతయినా అవకాశం ఉంది. ఎట్లాగయినా చిక్కే. తలుపు తియ్యకుండానే అతనికి సమాధానం చెప్పి పంపించాలను కుని మెల్లిగా లేచి కిటికీ తలుపు తెరిచింది. రాఘవరావు కిటికీ దగ్గరికి వచ్చాడు.
    "తలుపు తియ్యి, కామాక్షి " అన్నాడు నవ్వి.
    "రాఘవరావు గారూ, ఇన్నేళ్ళ నుంచీ మీరు నన్ను చూస్తున్నారు. నా మంచి చెడ్డలూ , నే నేటు వంటి దాన్నయిందీ మీకు తెలుసు. ఈ రోజున ఈ దుర్భుర్ది మీకు ఎందుకు కలిగిందో నాకు అర్ధం కావటం లేదు. మీ చెల్లెలు విమల లాంటి డాన్ని. మీకు భావ్యం కాదు. వెళ్ళిపొండి" అన్నది ఎంతో ప్రాధేయ పూర్వకంగా.
    "కామాక్షీ , ఏనాటి నుంచో కలలు కంటున్న నేను ఈనాటికి అవకాశం దిరికినందుకు ధైర్యం చేసి వచ్చాను. పట్టుమని పాతికేళ్ళయినా నిండలేదు నీకు. నీ యౌవనం అడవి కాచిన వెన్నెల చేసుకోకు." అన్నాడు రాఘవరావు.
    "ఇవన్నీ నాకేం చెప్పనక్కర్లేదండీ. నా మనస్సులో వెన్నెలా లేదు పన్నీరు లేదు. ఏ కోరికా లేదు. నా జీవితం యిట్లాగే వెళ్ళిపోతుంది. నీచపు కోరికలతో, క్షణిక సుఖాలకు ఆశించట మనేది నాచేత కాని పని. మీరు దయచేసి వెళ్ళిపొండి" అని కిటికీ తలుపులు మూసేసి గడియ పెట్టి వెళ్లి పక్క మీద పడుకుని ఏడవ సాగింది కామాక్షి. రాఘవరావు ఏదో ఒక నిశ్చయానికి వచ్చిన వాడిలా తల ఊపి వెళ్ళిపోయాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS