"మీకు సంగీతం నచ్చుంతుందో లేదో? నాన్నగారు సినిమా పాటలు పాడుకొనియ్యరు. అందుకని నేర్చుకోలేదు." అంది గీత.
"సంగీతానికి వంక లేన్నగలవాడిని కానులెండి!" అని అభయమిచ్చాడు సుధాకర్.
గీత బేగడ కృతి "అనుదినమును' పాడింది. పాట పూర్తయ్యాక "బాగుంది!" అని మెచ్చుకోకపోతే గీత నొచ్చుకుంటుందేమో అనుకున్నాడు సుధాకర్. తీరా "బాగున్నది" అని మెచ్చుకుంటే మరో పాట వినాల్సి వస్తుందేమోనని భయం వేసింది. ఏమనాలో తోచక సతమత మవుతుండగా ఆకస్మికంగా ఒక ఉపాయం తట్టింది.
"త్యాగరాజు తెలుగువాడు కావటం మన అదృష్టం లెండి!... ఎంత చక్కని కృతి!" అన్నాడు.
గీత నవ్వింది.
"ఇది త్యాగరాజు కృతి కాదులెండి."
సుధాకర్ నాలుక కరుచుకున్నాడు.
"లేనిపోని బడాయి ఎందుకు లెండి. కాని సంగీతం గురించి నాకు తెలిసిందల్ల త్యాగరాజు పేరే!' అని దాపరికం లేకుండా తన సంగీత జ్ఞానం గురించి గీతకు పరిచయం చేశాడు.
గీత నవ్వింది.
"బేగడ మీగడ లాంటి రాగం.... నాకు చాలా యిష్టం.... మొన్న సంగీతం పోటీలో నేను ఈ కృతే పాడాను. జడ్జీలు అన్యాయం చేయబట్టి కాని లేకపోతె నాకు మొదటి బహుమతే వచ్చేది అంటూ గీత గాడ్రెజ్ బీరువా లో నుంచి చిన్న వెండి కప్పు ఇవతలకు తీసి చూపించింది.
"న్యాయమూర్తు లెప్పుడూ అంతేలెండి! న్యాయాన్ని ఖూనీ చేయకపోతే వాళ్ళు కానీకి పనికి రారు." అని సానుభూతి ప్రదర్శించాడు సుధాకర్.
ఉన్నట్టుండి గీత "మీరు యింట్లో ఉన్నంత సేపు రేడియో పెట్టుకోరేం? మేం వినిపోతామనా?' అని అడిగింది.
'అబ్బే! అదేం లేదు! మీ అందరికీ ఇబ్బందిగా ఉంటుందేమోనని...."
"నాకు రేడియో అంటే చాలా యిష్టం! నాన్నగారు మా చదువులు పాడవుతాయని రేడియో కొనలేదు."
"మైగాడ్! రేడియో కు కరెంటు కు సంబంధం ఉన్నదని తెలుసును కాని రేడియో కు, చదువుకు ముడి ఉన్నదని నాకు యిప్పటి వరకు తెలియదు లెండి ....! ఇప్పుడు చదువులు పూర్తయ్యాయి గా నిక్షేపంగా కొనుక్కోవచ్చు!"
"ఏం కొంటారో? ఒకవేళ కొన్నా సినిమా పాటలు పెట్టుకోనియ్యరు!"
అయన బైటి కెళ్ళినప్పుడు సినిమా పాటలు, అయన ఇంట్లో ఉన్నంతసేపూ 'సరిగమ' లు శ్రద్దగా వినండి. అప్పుడు అయన మాట మన్నించి నట్టూ అవుతుంది. ఇటు మీరు సినిమా పాటలు వినటమూ అవుతుంది...."
గీత బుగ్గలు లోత్త పడెట్టు నవ్వింది.
"మంచి సలహా ఇచ్చారు లెండి! అది యిప్పుడే ఎందుకు అమలు చేయకూడదు. నాన్నగారు ఇంట్లో లేరుగా, మీరు ట్యూన్ చేయకూడదూ?"
సుధాకర్ హడావుడిగా ట్రాన్సి స్టర్ తీసుకొచ్చి సిలోన్ ట్యూను చేశాడు. లత తీయని కంఠం హాయిగా వినిపించింది. గీత మహదానందం పొందింది. సుధాకర్ కు గీత మీద జాలేసింది.
"నేను ఊరి కెళ్ళే అంతవరకూ ఇది మీదగ్గరే ఉంచుకోండి. నా దగ్గర ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే! మీరైతే సరదాగా పెట్టుకునైనా వింటారు." అని ట్రాన్సి స్టర్ గీత చేతిలో పెట్టాడు.
"నిజంగా?" థాంక్స్! మీరెంత మంచివారండి!" అంటూ గీత కృతజ్ఞతా సూచకంగా చూసింది సుధాకర్ వైపు.
3
జానకమ్మ బీరువా లో నుండి బట్టలు లాగి చూస్తూ "ఉషా! ఆకుపచ్చ జాకెట్టు గుడ్డ ఉండాలి ఏదే?" అనడిగింది.
'అదింకా బీరువా లో ఎక్కడున్నదే అమ్మా? కత్తిరించి పోగులు పెట్టిందిగా?" అంది చిత్ర ఎక్కడినుంచో గదిలోకి వస్తూ.
"నేనేం పాడు చెయ్యలేదు లే జాకెట్టు ఎంచక్కా కుదిరింది! సాయంత్రం వేసుకుంటాను -- నువ్వే చూద్దువు గాని....!" అని జవాబు చెప్పింది ఉష.
"టైలరు కుట్టి తెస్తే ఎన్ని వంకలైనా పెడుతుంది కాని ఇది కుట్టుకుంటే జాకెట్టు పట్టినా, పట్టక పోయినా దీనికి చక్కగా కుదిరినట్టుగానే కనబడుతుంది!" అని నవ్వింది గీత గుమ్మం ముందు నిలబడి.
"వద్దని చెప్పినా వినదమ్మా! ఇంట్లో జాకెట్టు గుడ్డ తెచ్చి పెడితే దాన్ని కత్తిరించి పాడు చేసేదాకా వూరుకోదు!" అని కళ ఫిర్యాదు చేసింది గీత వెనకాలే వస్తూ.
"ఆకుపచ్చ గుడ్డ అమ్మ కోసం తెస్తే నువ్వు కుట్టేసుకున్నవే ఉషా?" అని అడిగింది ఆశ్చర్య పోతూ, శారద వంటింట్లో చేసుకుంటున్న పని మధ్యలో ఆపి.
"ఏం కుట్టుకుంటే తప్పా? అమ్మకు కావాలంటే ఇంకోటి కొంటె సరిపోతుంది! దాని కేమిటో రాద్దాంతం!" అంటూ తల విసురుగా తిప్పింది ఉష.
"పోనీ కాని తల్లీ! సాయంత్రం పేరంటానికి వెళ్ళాలి కదే! వాళ్ళకి జాకెట్టు గుడ్డ పెట్టకపోతే ఎలా? నాన్నగారు బజారు కెళ్తున్నట్టున్నారు.... నువ్వు కూడా ఆయనతో కలిసి వెళ్ళి అట్టే ఖరీదు లేని గుడ్డేదైనా తీసుకురా!" అని జానకమ్మ చెప్పింది.
రామయ్యగారి ని కాస్సేపు ఉండమని ఉష ముస్తాబు చేసుకుని వచ్చింది.
ఉదయం పది గంటల వేళ. ఆదివారం . ఏవో అక్కడక్కడా కొద్ది కోట్లు తెరిచి ఉన్నాయి. ఉష రామయ్య గారితో సహా ఓ కొట్లో చొరబడి గుడ్డలు సెలెక్టు చేస్తున్నది.
పొట్టీ పొడుగు కాని ఎత్తు చామన చాయ, సన్నని నాజూకైన విగ్రహం , చంద్ర బింబం లాంటి చక్కని ముఖం, చెవులకు బెంగాలీ రింగులు.....
ఉషా? నిషా?
"హల్లో ఉషారాణి"
ఉష ఇటు తిరిగింది. రామయ్యగారు కొరకొర చూస్తూ "ఎవడే వాడు?" అని ప్రశ్నించటం ఇంతట్లో ఆ అబ్బాయి దగ్గరకు రావటం జరిగింది.
ఉష మాటలకు తడుము కోలేదు.
"ఈయన సాముద్రికం భలే చెప్తారు. నాన్నా మా క్లాసు మేటు శకుంతల లేదూ? వాళ్ళ అన్నయ్య ప్రభాకర్."
రామయ్య గారి కోపం చరచరా క్రిందికి దిగి పోయింది.
"అలాగా, అదృష్టవశాత్తు ఈరోజు మిమ్మల్ని కలిసాను. చాలా సంతోషం! మీరు శ్రమ అనుకోక మాయింటకో మాటొచ్చి మా అందరి చేతులు చూడాలి...."
ప్రభాకర్ సిగ్గుపడుతూ "అబ్బే! నాకేం చేత కాదండీ!' అన్నాడు.
'అయన అలాగే అంటారు నాన్నా! అయన మాటలెం నమ్మకండి! అయన ఫస్టు గా చూస్తారు.....అయన చెప్పేదేదీ పొల్లు పోదు....!"
"మీరు నామాట కాదనకూడదు! ఈ ఆదివారం తప్పక మా యింటికి రావాలి."
"......."
"నాన్నగారు ప్రాధేయపడుతుంటే మీరు కిమ్మనకుండా వూరుకుంటారేం? అవుననండి!" అంది ఉష మండలిస్తున్నట్టు.
'అలాగే! వస్తానండి!"
ప్రభాకర్ చేతులు జోడించి సెలవు తీసుకున్నాడు.
రామయ్యగారు ప్రభాకర్ ను కొట్టు ఇవతల వరకూ వచ్చి ఆప్యాయంగా దిగబెట్టారు. ఉష నచ్చిన జాకెట్టు గుడ్డ ఒకటి తీసుకున్నది. బిల్లు చెల్లించి రామయ్యగారు , ఉష ఇవతల కొచ్చారు.
సాయంత్రం ఉష ఆకుపచ్చ నైలాన్ చీర కట్టుకుని, దాని మీద తాను కుట్టిన ఆకుపచ్చ జాకెట్టు వేసుకున్నది. ఆ ఆకుపచ్చ గుడ్డ కోసం అక్కయ్యలు, చెల్లెళ్ళు ఎంత గొడవ చేశారు? ఇంట్లో ఉత్తి గుడ్డ ఉంటె తనకు తోచదు. తీరా కత్తిరించాక టైలరు కిస్తే బాగుండేదని ఎంతో అనుకున్నది. ఏదోలా జాకెట్టు ఆకారం తేవటానికి నానా తంటాలు పడింది. జాకెట్టు మెడదగ్గర ఎర్ర గుడ్డ అతికేసి మిస్సమ్మ మెడ తయారుచేసింది.
ఆ జాకెట్టు కేసి కన్నార్పకుండా చూసింది కళ.
"ఎంత షేషనుగా ఉందొ! మాకైతే ఒకటి కుట్టి పెట్టవు కాని నువ్వయితే అన్నీ భేషుగ్గా కుట్టుకుంటావ్!'అని మూతి ముడుచుకుంది.
"ఇందాకేగా మీరంతా కలిసి చింపి పోగులు పెడతానన్నారు?"
"అవును మరి! నాకోసమని కుట్టిన జాకెట్టు నాకూ నీకూ కూడా పట్టకుండా పెట్టెలో మూల్గుతున్నదిగా?" అని అక్కసు తీర్చుకున్నది చిత్ర.
"అదుగో, తగువు వాడుకుంటూన్నారూ? ఉషా! జాకెట్టు గుడ్డ తెస్తున్నావా? మర్చిపోయావా?" అంటూ జానకమ్మ ముస్తాబై వీధి వరండాలోకి వచ్చింది.
ఉష తల్లని తీసుకుని టీ నగర్ లోని శకుంతల ఇంటి కెళ్ళింది. శకుంతల చిట్టి చెల్లెలు వసంత కు పుట్టిన రోజు. ప్రభాకర్ కు ఇద్దరు చెల్లెళ్ళు-- శకుంతల, వసంత. శంకుంతల పుట్టిన పదిహేనేళ్ళ కు మళ్ళా వసంత పుట్టింది. జానకమ్మకు,శకుంతల తల్లికి అంతకు మునుపే పరిచయముంది. ప్రభాకర్ నాన్నగారు పలుకుబడిలేని ఓ ప్లీడర్ . బి.ఎల్.పాసైననాడే అయన అందంగా ఒక బోర్డు వ్రాయించుకుని దాన్ని ఇంటి ముందు తగిలించాడు. ఇన్నాళ్ళ ప్రాక్టీసు లో ఆ బోర్డు కోసం ఖర్చు పెట్టిన మొత్తమైనా రాబట్టు కో గల్గారో, లేదో అనుమానమే. ప్లీడరీ వృత్తి లాభసాటిది కాదని అయన గ్రహించుకున్నారు. అందుకే అబ్బాయి డాక్టరు కావాలని పట్టుదల గా చదివిస్తున్నారు. నయాపైసా సాధించలేకపోయినా ఆయనకు డబ్బుకేం కొదవ లేదు. పెద్దలు బుద్ది మంతులు కాబట్టి అయన తెలివి తేటల్ని అట్టే నమ్ముకోక కావల్సినంత ఆస్తి వదిలి పెట్టి వెళ్ళారు.
శకుంతల తల్లి పెరంటాళ్ళకు పసుపు, కుంకుమ తాంబూలాలు అందిస్తూ హడావుడి గా తిరుగుతున్నది. జానికమ్మ, ఉషారాగానే ఆప్యాయంగా ఆహ్వానించి కూర్చోబెట్టింది. శకుంతల వూళ్ళో లేదు. ప్రభాకర్ ఇంట్లో లేడు జానకమ్మ , శకుంతల తల్లి మాటల సందడి లో మునిగి పోయారు. ఉష మెల్లిగా లేచి పానగల్ పార్కు కు దారి తీసింది. ప్రభాకర్ సిమెంటు బెంచీ మీద కాళ్ళు పైకెత్తి కూర్చుని రేడియో వింటున్నాడు. ఉషను చూడగానే ప్రభాకర్ కాళ్ళు క్రిందకు దించి సరిగా కూర్చున్నాడు.
