Previous Page Next Page 
పధ విహీన పేజి 5


    జగన్నాధం విస్తుపోయి చూడటం సాగించాడు. ఈమె కింత సాంఘిక పరిజ్ఞానం ఎలా వచ్చిందో అతనికి అర్ధం కాలేదు  కాకపొతే చాలా ఎక్కువగా చదువుతుంది.
    "బావగారు వచ్చే వేళయింది. ఇక వెడతాను. ఇంతకూ ఎందుకు ఎడుస్తున్నవో చెప్పావు కాదు" అని వెళ్ళిపోయింది విజయ. జగననాధం చాలాసేపటి వరకూ ఆమె మాటలను గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. అతని కేదో భరించరాని దిగులని పించింది. వాతావరణం ఉక్కగా ఉంది. చిక్కపడుతున్న సంజ వెలుగు తాలుకూ ఉజ్జ్వల రక్తిమలో, జీవితం మీద అంతు తెలియని విశ్వాసం, అర్ధరహితమైన తృష్ణ ప్రారంభమాయినాయ్. మనసుకు శాంతి దొరికి పునర్జన్మ ఏదైనా లభిస్తే బాగుండు ననిపించింది. ఈ ఆలోచనల మధ్య నుంచి బలవంతంగా బయట పడి తలెత్తాడు జగన్నాధం.
    విజయ బిందే తీసుకుని చెరువుకు వెడుతున్నది.
    ఆ అసుర సంధ్య లో ఆభరణ విహీనమైన ఆకాశం తన సౌందర్యాన్ని వెలిగ్రక్కినట్లే విజయ కూడా తన సౌందర్యాన్ని నాలుగు వైపులకూ చిమ్ముకుంటూ నడుస్తున్నది. పవిత్రత తోడైన ఒకానొక స్వచ్చత ఆమెను మరింత రమణి ని చేసింది. రమణీ రమణీయకత లాటి మహత్తర వస్తువు సృష్టి లో మరేదీ లేదు. అమోదకత లోంచి మానవ మాత్రు డేవడూ తప్పుకు పోలేడు. అనాదిగా వస్తున్న ఈ స్త్రీ సౌందర్యం సృష్టి కే ఒక పెద్ద సమస్యగా పరిణమించి సర్వ మానవత్వాన్ని సవాల్ చేస్తున్నది.
    చెరువులో బిందె ముంచుతున్న విజయ కు ఒక్కసారి ఆపాద మస్తకం జలదరించింది. ఉలిక్కిపడి తిరిగి చూసింది ఆమె. ఆమె నలా జలదరింప చేసిన పదార్ధం ఒడ్డునే నిలబడి విజయ వంక నిష్మిత దృష్టి తో చూస్తున్నది.
    ఆ పదార్ధం ముప్పై ఏళ్ళ యువకుడు.
    విజయ గబగబా నడిచి ఇల్లు చేరుకొని బిందె దించి చాలాసేపు గుంజ నానుకుని అలాగే నిలబడి పోయింది. జయప్రద రావు ఇంటి కొచ్చి ఇంకా దీపం వెలిగించ నందుకు విసుక్కుని నులక మంచం వాల్చి, దాని మీద వెల్లకిలా పడుకొని, చుక్కల్ని లెక్కపెట్టడం ప్రారంభించే దాకా విజయ అలాగే నిలబడి ఉన్నది.
    గబగబా భర్త దగ్గరికి వచ్చి "పిలవకూడదు కాబోలు" అని మెల్లిగా అన్నది ఆమె.
    "దొరసాని గారేదో దీర్ఘాలోచనలో ఉంటేను" పరిహాసంగా సమాధానం ఇచ్చాడు జయప్రదరావు.
    విజయ ముఖం నల్ల బడిపోయింది. తనలో ఏదో కల్మషం ప్రవేశించింది. లేకపోతె ఇన్నేళ్ళ జీవితంలోనూ తను ఏ మగవాడి వలనా అలా చూడబడలేదు. విజయ గబగబా వెళ్లి స్నానం చేసి వచ్చింది.
    "అదేమిటి? అర్ధరాత్రి వేళ మద్దెల దరువని ఇప్పుడు తలారా స్నానం చేశావు? " అని ఆశ్చర్యంగా అడిగాడు జయప్రదరావు.
    "ఇందాకా చెరువు దగ్గర మైల సోకింది లెండి. ఇక భోజనానికి లేవరాదూ?" అన్నది విజయ పమిట కొంగుతో తల తుడుచుకుంటూ.
    "ఇంకా ఈ కాలంలో కూడా పిచ్చి నమ్మకాలు నిన్ను వదలలేదు విజయా."
    "ఎవరి నమ్మకాలు వారికి ఉంటేనే ఎవరి వ్యక్తిత్వం వారికీ ఉంటుంది . ఇహ లేవండి."
    జయప్రదరావు మాట్లాడకుండా లేచి భార్యను అనుసరించాడు.
    భర్తకు తను పెట్టబోతున్న భోజనం సంగతి తలుచుకుంటేనే ఏడుపు వస్తున్నది విజయ కు. ఆవకాయ తప్ప మరేమీ లేదు. నెయ్యి నిండుకుని రెండు రోజులయింది. మజ్జిగ అసలే లేదు. అక్కడికీ గిన్నె పుచ్చుకుని ఒకటి రెండిళ్ళ కు వెళ్ళింది విజయ. అయినా దొరకలేదు.
    వడ్డన అయిన తరవాత తలుపు చాటుకు పోయి మనసారా దుఃఖించింది ఆమె. ఇతన్ని తనెంత గానో ప్రేమించి ఆరాధిస్తున్నది. తన అహంకారం ఇంతా అంతా కాదు. కాని దీనికి భగవంతుడు ఇచ్చే ప్రతిఫలం ఇంత చేదుగా ఉందేమిటి? నిప్పు అనగానే కాలటం దాని స్వభావం అయినట్లు స్త్రీ అనగానే కష్టపడటం స్వభావ సిద్దమైన శాపం కాదు గదా అనుకుంది విజయ.
    తొలిగా తను కాపురానికి వచ్చిన రోజులు జ్ఞాపకం వచ్చాయి విజయ కు. ఆ రోజుల్లో ఎంత ఆనందం -- ఎంత ఉల్లాసం? దొడ్డి నిండా చంద్ర కాంతలు విరగ బూసేవి.  వాటి తేలిక సువాసన అంటే తన కెంతో ఇష్టం. రంగు రంగుల ఆ పూలు జడ అల్లి తలలో పెట్టుకోగానే వాడి పోయేవి. అంత సుకుమారం వాటికి. ఆడదాని బ్రతుకు కన్నా సుకుమారం.
    "విజయా...."
    గబగబా కళ్ళు తుడుచుకుని భర్త ఎదటికి వెళ్ళింది విజయ. అంతవరకూ ఆమె పడుతున్న బాధను అర్ధం చేసుకోలేనంత అర్బకుడు కాడు జయప్రదరావు. ప్రతి రోజూ విజయ తింటున్న తిండి చూస్తూనే ఉన్నాడు కాని తను చేసేదేమీ లేదు. తను తినగా మిగిలిన అన్నాన్ని నీళ్ళల్లో వేసి ఉట్టి మీద పెట్టి, చలవ చేస్తుందని చెపుతూ, ప్రొద్దున్న పూట తిరిగి తనకే పెడుతుంది. ఆ చలవకు అర్ధం కాఫీ పోడూం, పాలూ పంచదారా కొనలేని స్థితి. కానీ ఆ మాట పైకి అనదు విజయ.
    పదిహేను రోజులుగా తను ఏమీ తేలేదు ఇంటికి. ఇల్లు ఎలా గడుస్తున్నదో తనకు తెలియదు. మొన్న ఇంటాయన అద్దె అడిగితె విజయే ఏదో సమాధానం చెప్పి పంపించింది.
    "నీకు ఈ పూట కూడా అన్నం లేనట్లుంది." అన్నాడు జయప్రదరావు.
    "నాకు లేకుండా మీకేం పెట్టలేదు లెండి. ఇహ లేవండి" పెదవుల మీదకు చిరునవ్వు తెచ్చుకోవాలని వ్యర్ధ ప్రయత్నం చేస్తూ అన్నది విజయ.
    జయప్రదరావు ఇక తర్కించదలచు కోలేదు. తర్కించి ప్రయోజనమూ లేదు. ఇంట్లో ఏమీ లేదని అతనికి తెలుసు. సౌందర్యవతి అయిన విజయ రోజు రోజుకూ నల్లబడి చిక్కిపోవటం అతను చూస్తూనే ఉన్నాడు.
    మెదలకుండా వచ్చి భర్తపక్కనే కూర్చుంది విజయ. ఇదివరకు తమల పాకుల పళ్ళెం తో వచ్చేది. ఇప్పుడు కూడా ఊరికే రాలేదు. కొంగున కట్టి ఉన్న లవంగం మొగ్గ భర్తకు ఇచ్చింది.
    "విజయా, ఇన్ని కష్టాలు ఎలా భరిస్తున్నాం మనం?"
    "మనుషులం కనుక." చిరునవ్వు నవ్వింది విజయ.
    "ఇవ్వాళ ఊరంతా తిరిగాను. అందరూ జాలి పడేవారే గానీ ఆధారం చూపించిన వారు లేరు."
    "దాన్ని గురించి బెంగ పడకండి. భగవంతుడే ఉన్నాడు."
    "నీ గాజులేవీ?"
    విజయ సమాధానం చెప్పలేదు.
    "నా దౌర్భాగ్యానికి అంతం లేదు, నా పాపానికి నిష్కృతి లేదు" నుదుటి మీద కొట్టుకున్నాడు జయప్రదరావు.
    "పధా, ఇటు చూడు."
    దారిద్ర్య భారంతో ఎండిపోయిన అతని అంతర్యాన్ని చిగురింప చెయ్యాలని ప్రయత్నించింది విజయ. వ్యధతో వెలిసి పోతున్న అతని యవ్వనాన్ని రాగరంజితం చెయ్యాలని ఆమె ఆశ. అతను ఆమె కలల్లో రాజకుమారుడు.
    కాని ఆమె ఊహ ఫలించలేదు . నవ్వి --
    "ఇంకా నాలో జీవం మిగిలి ఉందంటావా విజ్జీ" అన్నాడు జయప్రదరావు.
    విజయ సమాధానం చెప్పలేదు. రెండు కళ్ళూ గట్టిగా మూసుకుంది. మూసిన రెప్పల సందు నుంచి అగ్ని బిందువులలా కన్నీరు జారింది.
    ఆమెను దగ్గరకు తీసుకున్నాడు జయప్రదరావు. ఆ దంపతులు అలా ఎంతసేపు ఉన్నారో, ఎంతసేపు తను కన్నీటిని జీవితం లాగే కలిసి ప్రవహింప చేశారో చూసిన వారెవరూ లేరు.
    యుగయుగాల భారతీయ సంస్కృతి , తరతరాల రక్త పరిశుభ్రము విజయ లో నిండి ఉన్నాయి. ఆమె ఈ దేశపు స్త్రీ. గంగానది ప్రవహిస్తున్న భారతదేశంలోనే ఆమె జన్మించింది. ఆమె నమ్మకాలు, ఆచారాలు, జీవన విధానం అన్నీ కూడా ఈ గడ్డ మీద మొలకెత్తి ఫలిస్తున్న పవిత్ర బీజాలలోనివి.
    కాని, ఈనాడు జరిగిందేమిటి? వీటికి విలువ అంటూ లేదా?
    అర్ధరాత్రి వేళ కాళ్ళీడ్చుకుంటూ ఇల్లు చేరిన జగన్నాధానికి ఈ ప్రశ్న ఎదురయింది. ఏడ్చి ఏడ్చి భర్త గుండెల మీద నిద్రపోతున్న విజయకు మనసులోనే నమస్కరించి తన భాగం లోనికి వెళ్ళిపొయినాడు అతను.
    తెల్లవారింది.
    "తమ్ముడూ...."
    విజయ పిలుపుతో నిద్ర మెలకువ వచ్చింది జగన్నాధానికి . లేచి కూర్చుని--
    "ఏమిటి అక్కగారూ?' అని ప్రశ్నించాడు.
    "వారికి జ్వరం వచ్చింది తమ్ముడూ. ఎంత చెప్పినా వినకుండా బయటికి వెళ్ళారు. "దుఃఖాన్ని అపుకోవాలని వ్యర్ధ ప్రయత్నం చేస్తూ సమాధానం ఇచ్చింది విజయ.
    జగన్నాధం గాబరా పడి చొక్కా తొడుక్కుని బయలుదేరాడు.
    "ఎక్కడికి?"
    "బావగార్ని వెతుక్కోస్తాను."
    "ఎక్కడని వెతుకుతావు ..ఒక పని చేసి పెట్టు తమ్ముడూ. నీకు తెలిసిన వాళ్ళెవరయినా ఉంటె ఆవకాయ కొంటారేమో అడుగు."
    "లోలోపల నిట్టూర్చి "అలాగే లెండి" అని సమాధానం ఇచ్చాడు జగన్నాధం. అతను ఆ సాయంత్రం వరకూ ఆవకాయ ఎవరైనా కొంటారేమోనని ప్రయత్నంలో ఉండి చివరికి ఉట్టి చేతులతో ఇంటికి వచ్చాడు.
    రచన మాని ఆవకాయ వ్యాపారం పెట్టారా ఏమిటని ఒకళ్ళిద్దరు ప్రశ్నించారు కూడా. అతను సిగ్గుపడుతూ తన భాగంలో దూరేసరికి విజయ అక్కడే ఉంది. ఆత్రుతగా అతని వేపు చూస్తూ -- "కోతల జనానికి అమ్మి నేనే రెండు రూపాయలు సంపాదించానులే తమ్ముడూ. వారింకా రాలేదు. ఒకసారి చూసి వస్తావేమిటి?" అన్నది.
    అలాగే తిరిగి బయటికు వచ్చాడు జగన్నాధం.
    గంటసేపు తిరిగినా జయప్రదరావు జాడ తెలియలేదు. చివరికి జంక్షన్ లో కూర్చుని బీడీ కాలుస్తున్న జయప్రదరావు ను చూసి నిర్ఘాంత పోయినాడు అతను. ఇదివరకెప్పుడూ అయన బీడీ కాల్చటం తను చూడలేదు.
    "బావగారూ?' అయన భుజం మీద చెయ్యి వేసి మెల్లిగా పిలిచాడు జగన్నాధం.
    "ఎవరు?'
    "నేను బావగారూ , జగన్నాధాన్ని."
    "విజయ పంపిందా? పోదాం పద" అని లేచి నిలబడి తూలిపోయాడు జయప్రదరావు.
    దూరం నుంచే భర్తను, జగన్నాధాన్ని చూసిన విజయ ఎదురొచ్చి బావురుమంది.
    "ఛా...ఛా...పిచ్చి పిల్లలా ఏడుపెందుకు?"
    "ఇంత జ్వరంలో ప్రొద్దుటి నుంచీ ఎక్కడ తిరుగుతున్నారు చెప్పండి?' అని కళ్ళు తుడుచుకుని భర్తను మంచం మీద పడుకో బెట్టి , ఆవకాయ అమ్మి సంపాదించిన డబ్బులతో కాచిన కాఫీ తేవటానికి లోపలికి వెళ్ళింది విజయ.
    జగన్నాధం అప్రతుభుడై నిలబడిపోయాడు. అతని అంతర్యం ఆ స్త్రీ మూర్తి ముందు అవగతమై పోతున్నది. ఈ ప్రేమకూ, భక్తీకీ ప్రతిఫలం దుఃఖమె అయితే భక్తీ ప్రేమలకు భగవంతుడి సమక్షంలో కూడా విలువ అంటూ ఉండదు.
    "తమ్ముడూ, ఎక్కడున్నారు వీరు?' అన్నది విజయ అగన్నాధాన్ని ఉద్దేశించి.
    "ఎక్కడో దొరికితే పట్టుకొచ్చా ను లెండి. చలిగాలి కొడుతున్నది. లోపలికి తీసు కేళ్ళండి" అని తన ఇంట్లోకి నడిచాడు జగన్నాధం.
    ఆ రాత్రి భర్త మంచానికి అనుకుని అలాగే నిద్రపోయిన విజయకు ఒక కల వచ్చింది. ఆ కలలో జయప్రదరావు రాజకుమారుడు. తను రాజకుమారి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS