Previous Page Next Page 
మనిషి - మిథ్య పేజి 5

 

                                        3

    రంగారావ్ కేంప్ కెళ్ళేడు.
    శంకరం ఇరుకున పడ్డాడు. సుజాతతో మనసు విప్పుకు మాటాడటానికి భయపడుతున్నాడు. ఆమె ఒక పట్టాన అతనికి అర్ధం కావడంలేదు. ఆమె చనువు అతని కిబ్బందిగా తయారయ్యింది. దానికి తగ్గట్టు ఆమెలో ఏదో మార్పు వచ్చినట్టు గమనించాడు. మళ్ళా అంతలోకి అపార్ధం చేసుకుంటున్నానేమోనని విచారించేవాడు. అంతా ఆవ్యక్తంగా ఉంది. సమయానికి రంగారావ్ ఊళ్ళో లేకపోవడ మయ్యింది. మరీ మూడు రోజులు ఎలా నడిపేది?
    ఉద్యోగం కోసం వచ్చినవారు ఉద్యోగం వేయించే వాడి ఇష్టానుసారంగా పడి ఉండటం పద్ధతి వాడు రావాలి, ఆఫీసరుకి నచ్చజెప్పాలి, తనకి ఉద్యోగం వేయించాలి.
    అన్నయ్య హోదాలో ఉన్నమాట నిజమే. తనతో పుట్టినవాడు ఉద్యోగం లేకుండా తిరుగుతున్నాడే,  వాడికో దారంటూ చూపించే పూచీ నాది గదా అనే ఇంగితం వాడికుండాలి గాని మరి. 'నాకుద్యోగం కావాలి' అని నోరు తెరిచి అడిగిన తర్వాత 'నా వల్ల కాదురా తమ్ముడూ' అని జాలి చూపిస్తే ఎంత అవమానం.
    తనకున్న హోదాతో ఒకడికి భుక్తి జరిగేందుకు అవసరమైన ఉద్యోగం వేయించడం బ్రహ్మ విద్యేమీ కాదు.
    తన పట్ల నాన్న గూడా ముభావంగా ఉంటున్నారు. ఆయనకి చీమ కుట్టినంత బాధైనా అనిపించడం లేదు కాబోలు!
    అయినా ఆయనేం చెయ్యగలరు? రిటైరైన బడిపంతులు, తను సంపాయించుకున్న పరపతి నుపయోగించి ఉద్యోగం వేయించడం అనుకున్నంత తేలిక పనికాదు.
    శంకరం సిగరెట్టు ముట్టించాడు.
    గది దగ్గర శబ్ధమైతే, తొంగి చూసేడు. సుజాత మరో ఇద్దరు ఆడ పిల్లల్ని వెంట బెట్టుకు వచ్చింది. వచ్చీ రావడంతోనే-
    "వీళ్ళిద్దరూ నా స్నేహితురాళ్ళు. ఈవిడ సుభద్ర, ఈవిడ సత్యవతి. బి.ఏ. వరకూ చదువు కున్నారు. కథలు రాయాలనే కోరిక చాలా ఉంది. ప్రస్తుతం వ్యాసాలూ వగైరా వ్రాస్తున్నారు. ఈయనే శంకరం గారు" ఒకర్నొకరికి పరిచయం చేసింది.
    పరిచయమైన ఆ ఇద్దరూ సుజాతతోపాటూ చాలా ప్రశ్నలు వేశారు. కథల గురించీ, వివధ కథకుల గురించీ అతని అభిప్రాయాలు అడిగారు.
    సిగ్గు పడుతూనే తెలిసినంతవరకూ చెప్పాడు. ఆ తఃర్వాత కేవలం అతని కథల గురించి అతని అభిప్రాయాలు అడిగి వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. ఇక్కడ మాత్రం శంకరం చాలా ఇబ్బంది పడిపోయాడు. అవునూ కాదని ఏది చెప్పినా తంటాగా కనిపించవచ్చు.
    సత్యవతి అడిగింది-    
    "అవుతే మీరు ఇక్కడే ఉంటారన్నమాట"
    "అని వేరే చెప్పాలా అంతా విన్నావుగా" అన్నది సుజాత.
    "నా దగ్గర రెండు కథలున్నాయి. రేపు పట్టుకొస్తాను. వీలుంటే చదివి మీ అభిప్రాయం చెప్తారు గదూ?"
    "తీసుకు రారాదూ" సుజాతే సమాధానం చెప్పింది.
    మరికొంతసేపు తన ప్రసక్తి లేకుండానే నేటి సాహిత్యమూ ముఖ్యంగా కథలూ వాటి కమామీషు గురించి ముగ్గురు వనితలూ చర్చించి, ముగించి-వెళ్ళేముందు రేపు తీసుకురాబోయే కథను గురించి మరొక్కమాటు జ్ఞాపకం చేసి మరీ వెళ్లారు.
    సుజాత వాళ్ళని సాగనంపటానికి వీధిగుమ్మం వరకూ వెళ్ళింది. గుమ్మం వరకూ వెళ్ళారన్న మాటేగాని, అక్కడే ఆగిపోయి ఇంకా ఏవో విషయాలు మాటాడుతూనే ఉన్నారు.
    శంకరానికి నవ్వు వచ్చింది.
    వచ్చిన వాళ్ళు పరిచయమైన మరుక్షణమే కథల గురించి లొడ లొడా మాటాడేశారు. రంగా రావ్ అన్నట్టు ఈ రోజుల్లో ఆడవాళ్ళే కథలంటే ప్రాణం పెడుతున్నట్టు కనిపిస్తుంది. రేపు తన అభిప్రాయం కొరకు కథలు  గూడా పట్టుకొస్తారుట.
    ఇది తలచుకుంటూంటే ఒక చిన్న సంఘటన గుర్తుకు వచ్చింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒకానొక ప్రముఖ రచయిత (పేరూ, దేశం గుర్తు లేవు. చెప్పిన మనిషీ జ్ఞాపకానికి రావడం లదు) మరో దేశస్థులు ఆహ్వానం పంపుతే వెళ్ళాడు. ఘనమైన స్వాగతాలూ, శుభాకాంక్షలూ వగైరాలూ స్వీకరించేడు. తన పట్ల ఇంతమందికి గల గౌరవ భవాన్ని గమనించి మురిసిపోయేడు. అప్పట్లో తన దేశం యుద్ధ భీతిలో చిక్కుకుని ఉంది. అక్కడ ఆ వాతావరణాన్ని వదిలి దూరంగా ఇక్కడ ఈ గౌరవ మర్యాదలూ పొందుతూ తనని తనే పూర్తిగా మరిచిపోయేట్టు ఆ మహా రచయిత, ఒకనాడు-ఒకానొక రచయితల మహా సంఘం ఆహ్వానం మీద అక్కడ సభలకి వెళ్ళేడు. గంటా గంటన్నరపాటు ఏవో ఉపన్యాసాలు జరిగాయట. అవి ముగిసిన తర్వాత- ప్రారంభమైందిట చిన్న సైజు యుద్ధం! ఒక్కొక్కరు రావడం, తను రాసిన మహా గ్రంథాన్ని ఆ మహా రచయితముందు పెట్టడం, ఈ దేశం ఒదిలి వెళ్ళేలోగా చదివి తమ అమూల్యాభిప్రాయం ఇచ్చి వెళ్ళవలసిందిగా కోరడం-ఇలా వందమందికి పైగా తమ గ్రంథాన్ని ఆయన ముందుంచారు. ఇదంతా చూచిన ఆ మహా రచయితకి పిచ్చెత్తినట్టయింది. ఏమని చెప్పాలో తెలీక బిక్కమొహం పెట్టి అనుకున్నాట్ట "నా దేశంలో, నా గదిలో కూర్చునుంటే ఏదో బాంబులాంటి ఆయుధం నా ప్రాణాన్ని తీసి ఉండేది. నిశ్చింతగా కన్నుమూసి ఉండేవాడిని. ఎరక్కపోయి ఈ దేశం వచ్చి ఈ బోన్లో చిక్కుకున్నాను. చిత్ర హింస ప్రారంభమయ్యింది. ఆ యుద్దం కంటే ఈ యుద్ధమే మహా భీభత్సంగా ఉన్నది సుమా!" అని.
    ఇది తలుచుకుని మళ్ళా ఓ మాటు నవ్వుకున్నాడు శంకరం.
    పోలికచేసి చెప్పడం కాదుగాని, తరచూ కథలు రాసే వాళ్ళతో, కథలు రాయబోయే, కాబోయే కథకులు పరిచయమైతే-అవతలి కథకుడి పాట్లు చెప్ప నలవికాదు. ఏది చెప్పినా చిక్కేను. పెడార్ధాలు తీసి 'గర్వబోతూ', 'అబ్బో అతనా', 'ఆయన గారిపలుకే బంగారం కాదుటండీ', 'నలుగు కథలు రాస్తే, ఇహ పెద్దాడై పోయినట్టేనా', "ఏం చూచుకునో ఈ మిడిసిపాటు' ఇలా ప్రచారం మొదలవుతుంది.
    తను రాసిన కథ పట్టుకొచ్చి మొహాన్న కొట్టి చదవమని ప్రాణం తీసేంతవరకే అవతలివాడి వంతు కథ ఓపిగ్గా చదివి ఎలాటి అభిప్రాయం ఇస్తే ఎలాటి చిక్కు లొస్తాయిరా భగవంతుడా అని దిగులు పడటం కథకుడి వంతు.
    ఎవరో కొందరదృష్టవంతుల మినహా, చాలా మంది ఈ 'హింస'లో ఇరుక్కున్న వాళ్ళేమరి.
    "ఏమిటో దీక్షగా ఆలోచిస్తున్నారూ" అన్నది సుజాత తన ముందున్న కుర్చీలో కూర్చుంటూ.
    "ఏమీలేదు"
    "మా వాళ్ళు మీకు విసుగు ఇస్తున్నారు కాబోలు"
    "లేదండీ"
    "మీ కంత మోడస్టీ పనికిరాదు. విసుగు పుట్టి నప్పుడు చెప్పేయడం మంచిది"

 

                            
    "..................."
    "సరే.........ఇక నేను విసిగించడం మొదలు పెడుతున్నాను కాబోలు"
    "ఎందు కలా అనుకుంటారూ?"
    "అన్నట్టు- ఇవ్వాలిటి ప్రోగ్రాం ఏమైనా ఆలోచించారా?"
    "ప్రోగ్రామా?"
    "అవును. మిమ్మల్ని ఇంట్లో కట్టేసి ఉంచుతే రేపొద్దున ఆయనొచ్చి ఎంత మండిపడి పోతారో తెలుసా? అదీగాక, ఆయన లేరనే వెలితి కనిపించనే కూడదు."
    శంకరం నవ్వి ఊరుకున్నాడు.
    "ఇవ్వాళ మా మహిళా సమాజంవాళ్ళు ఏదో మీటింగొకటి పెట్టారు. ఈ విషయం చెప్పటానికే వీళ్ళు వచ్చింది. కానీ- 'అమ్మాయిలూ ఈవేళ నే రాదలుచుకోలేదూ' అని చెప్పేశాను."
    "అరె.........."
    "అవునండీ. మిమ్మ ల్నొకర్నీ ఇంట్లో పెట్టి సమాజాలూ, మీటింగులూ అని ఊరేగితే, ఇంక అతిథి మర్యాదకి అర్ధం ఏముంటుంది చెప్పండి?"
    "అనవసరంగా మీకు శ్రమ నిస్తున్నాను"
    "బాబోయ్ ఆపండి. మీవల్ల మేముగాని, మా వల్ల మీరు గాని శ్రమ పడటాలూ, తీసుకోడాల్లాటి మాటకి స్థానం లే దసలు. సరే.........నేను కాఫీ పట్టుకొస్తాను. ఈ లోగా మీరు ఒక బ్రహ్మాండ మైన ప్రోగ్రాం ఆలోచించి పెట్టండి" అని ఆవిడ వెళ్ళిపోయింది.
    శంకరాని కేమి చేయాలో తోచడంలేదు. ఇప్పుడీవిడ బ్రహ్మాండమైన ప్రోగ్రామంటూ ప్రాణం తీయడమ ఏమీ బాగోలేదు. బాగుండదు కూడా.
    పోనీ, ఆవిడకి నచ్చజెప్పి ఏ మూడ్రోజుల పాటూ ఏదైనా హోటల్లో గడుపుదామనే మాట ఉత్తదీ, కుదరనిదీను.
    వెడుతూ వెడుతూ రంగారావ్ నా ఇంట్లో చచ్చినట్టు పడుండమన్నాడు' పడుండక తప్పదు మరి.
    ఎవరైనా ఏమైనా అనుకుంటా రన్న దిగులు కంటే ముందు తన మనస్సుకే నచ్చడంలేదు ఈ పద్ధతి.
    సుజాత కాఫీ తీసుకొచ్చింది. తెచ్చిన కాఫీని గడగడా తాగేసి గోళ్ళు గిల్లుకోవడం ప్రారంభించాడు శంకరం.
    "మరి మన ప్రోగ్రాం మాటేం చేశాడు?" రెట్టించి అడిగింది సుజాత.
    "ఏం ప్రోగ్రాముల్లెండి" అనేశాడు.
    "అదేమిటి?"
    "అవునండీ నా వంట్లో బాగో లేదు. విపరీతమైన తల నొప్పీ-వళ్ళు నొప్పులూను."
    "అరె.......చెప్పారుకాదె. ఉండండి. ఒక్క నిమిషం ఇంట్లో అమృతాంజనం ఉంది. పట్టుకొస్తాను" ఆమె గబ గబా తన గదిలోకి వెళ్ళింది.
    ఈవిడతో ఏ మాట అన్నా తంటాగానే ఉంది. ఇప్పుడు అమృతాంజనం పట్టుకొస్తుంది కాబోలు ఖర్మం. లేని నొప్పులకీ అదేం పని చేస్తుంది! ఏమైనా సరే-ఇవ్వాళ ప్రోగ్రాం మాట రానేకూడదు-అని నిశ్చయం చేసుకున్నాడు.
    సుజాత అమృతాంజనం తేవడం, ఆ ఇంటి ముందు ఒక చక్కటి కారు ఆగడం రెండూ ఒక్క సారే జరిగాయి. కారులోంచి దిగి ఇంట్లోకి రాబోతూన్న వ్యక్తిని చూచి ఆనందంగా అంది సుజాత.
    "భలే........సమయానికి రాంబాబూ వచ్చాడు" వచ్చి నతను హుందాగా ఉన్నాడు. గాబర్డీన్ పాంటూ, టెరిలిన్ స్లాక్ లో అతని హుందాతనం మరింత విజ్రుంభించింది. అతను రాగానే ఖరీదైన సెంటు వాసన గుప్పున గుమాళించింది. టీపాయ్ మీద ఉన్న ఆష్ ట్రేలో సగం వరకూ కాలిన సిగరెట్టు పడేసి మరో కుర్చీలో కూర్చున్నాడు.
    "రంగారావ్ ఇంకా గూటికి చేరుకున్నట్టు లేదే?"
    "ఆయన కేంప్ కెళ్ళారుగానీ, తమరెప్పుడు వేంచేశారు ఈ ఊరు" అని అడిగింది సుజాత.
    "ఉదయం."
     "అవుతే మేమిప్పటికిగ్గాని కనిపించ లేదన్న మాట"
    "ఏమిటా నిష్ఠూరం? రాత్రంతా ట్రావెల్లోనే గడిచిందేమో-ఇంటి కొచ్చి ఇప్పటి వరకూ వళ్ళు మరిచి నిద్ర పోయాను"
    "సమర్ధించి చెప్పుకోడంలో నిన్ను మించిన వాడు మరొకడు లేడు.........వీరు మావారికి మిత్రులూ, ప్రఖ్యాత కథకులూ అయిన శంకరం గారు.......వీరు......."
    "రాంబాబుగారు. పేరు మీరంటూండగా తెలిసింది" అన్నాడు శంకరం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS