Previous Page Next Page 
అసుర సంధ్య పేజి 5


    "మునసబు గారి గురించి నాకు చాలా వివరాలు కావాలి."
    "ఏమిటో ."
    "మావయ్య కీ, ఆయనకీ కొన్నాళ్ళ క్రితం మాట ల్లెవని చెప్పేరు."
    "అవును, చెప్పాను."
    "ఆ మనస్పర్ధలు దేని మూలకంగా వొచ్చాయో చెబుతే సంతోషిస్తాను."
    "దేనికైనా ప్రయోజన ముండాలి కదా నాయనా?"
    రాజారావు తాత దగ్గరిగా జరిగేడు.
    "ఈ వూళ్ళో అడుగుపెట్టిన మరుక్షణం ఇదే ఆలయంలో దేవుడులా మీరు కలిశారు. నేను వయసులో చిన్నవాడినే కావచ్చు. నా ఆలోచనలు మీకు నవ్వు కలిగించనూ వొచ్చు. వొప్పుకుంటాను. మునసబు గారికీ, మావయ్య కీ మధ్య ఎలాంటి సంబంధ మున్నదో తెలుసుకోడం మరోకప్పుడైతే నాలాటి వాడికి నిష్పప్రయోజనమూ, అనవసరమే కావచ్చు. కానీ, ఇక్కడ పరిస్థితి వేరు . మావయ్య హత్య చేయబడ్డారు."
    తాత ముసిముసిగా నవ్వడం ప్రారంభించేడు.
    "అంత వూహించలేని చవటను కాదు నాయనా? నువ్వన్నట్టు నీ ఆలోచన నీ పసితనాన్నే ఎత్తి చూపిస్తోంది. అంత చిన్న కారణాన్ని ఆధారంగా తీసుకుని మునసబు అనుమానితులంటే నేనొప్పుకోను."
    "అసలు విషయం చెప్పడానికి మీ కభ్యంతరం లేదుగా."
    లేదన్నట్టు తలూపాడు తాత.
    "అయితే చెప్పండి."
    "కన్న కొడుకు తండ్రి కెప్పుడూ ప్రయోజకుడి లానే కనిపిస్తాడు. కాదని ఎదుటివాడు చెబుతే అతని అభిమానం దెబ్బతింటుంది. సరిగ్గా ఇక్కడ అదే జరిగింది. మీ మావయ్య కూతుర్ని తన కోడలిగా చేసుకుంటా నన్నాడు మునసబు. కానీ-- పిల్ల నివ్వక పోగా అయన మొహం ముందే మీ మావయ్య వరుడ్ని అవహేళన చేశాడు. స్పర్ధ రావడాని కిది చాలదూ. అవుతే అంత మాత్రం చేతనే నువ్వూహిస్తున్నది నిజమే నని వొప్పుకోగలవా నువ్వు. నీకు వాళ్ళ స్పర్ధ ఒక్కటే తెలుసు. కానీ, వాళ్ళ స్నేహం గురించి ఇప్పుడు నేనెంత చెప్పినా అర్ధం చేసుకోలేవు."    
    రాజారావు మరేమీ మాటాడలేదు. వాదించినా ప్రయోజనం లేదని మవునం వహించాడు.
    "ఆవిధంగా నీ వూహగానం ప్రారంభమైతే చాలామందిని నువ్వు అనుమానించవలసి వొస్తుంది." మళ్లా తాతే అన్నాడు.
    "అవుతే మీరు మరికొంత మంది గురించి చెప్పాల్సి ఉంటుంది."
    తాత నవ్వేడు.
    "భలేవాడివి. భయంకరమైన వర్షపు రాత్రి అందరికీ ఆశ్రయమిచ్చే పవిత్రమైన దేవాలయంలో పరిచయమై నానెత్తి మీద ఇంత బాధ్యత పెట్టడం తగునా నీకు?"
    "నిజం తాతా. ఈ వూళ్ళో మీరే మంచి స్నేహితులు నాకు. మనిద్దర్నీ ఈ దేవుడే స్నేహితుల్ని చేశాడు."
    "ఆ మాత్రం అభిమానం చాలు."
    "అయితే చెయ్యి కలపండి. నాతో సహకరించండి " అని తాత చేతిని తన చేతిలోకి తీసుకొన్నాడు. తాత ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. రాజారావు లేచి నిలబడ్డాడు.
    "వూరంతా ఒకమాటు చూడాలని ఉంది. మరోమాటు మిమ్మల్ని తప్పకుండా కలుసు కుంటాను. "తాత దగ్గర సెలవు తీసుకుని, చెప్పులు తొడుక్కుని మంటపం దిగేడు. తాత వెనక నుంచి నవ్వుతూనే అడిగేడు.
    "స్నేహితులమన్నావ్ బాగానే ఉంది. నీ పేరు నాకింత వరకూ తెలీదు. నా పేరు రామదాసు."
    రాజారావు సిగ్గుపడ్డాడు. తర్వాత చెప్పేడు.
    "అమ్మ పెట్టిన పేరు రాజారావు. వాడుకలో రాజు. మీరెలా పిల్చినా అభ్యంతర ముండదు."
    "ముఖస్తుతి కాదు గానీ, నువ్వు మాటకారివి రాజూ! వెళ్లిరా!" అన్నాడు తాత.

                           *    *    *    *
    ఆ రాత్రి భోజనాలైన తర్వాత అత్తయ్య దగ్గర కొచ్చి కూర్చున్నాడు రాజారావు. ఆవిడను మునసబు గురించి అడిగాడు. ఆవిడ అతని వైపు చిత్రంగా చూసింది.
    "ఎంత స్నేహితులైనా ఉద్రేకంలో తమని తామే మరిచిపోవడం సహజం. ప్రస్తుతానికి పిరికి మనిషైనా ఆ క్షణం లో అతి సాహసవంతమౌతాడు. పరిసరాలు గుర్తుండవు. తను చేస్తున్నది 'మహా దారుణమైన కార్య' మనీ అనిపించదు."
    "మునసబు గారు నాకు బాగా తెలుసు నాయనా!"
    "ఉష్ గట్టిగా అనకు అత్తయ్యా! నా అనుమాన మేదో చెప్పానే గాని యిదే వాస్తావని వాదించడం లేదు. అయినా ఇలాంటి వూళ్ళో ఇంకా ఉండటానికి భయంగా ఉంది నాకు. నేనేటూ వెళ్లి పోవలసిన వాడినే. నా భయం మీ గురించే. కేవలం మీ గురించే నత్తయ్యా."
    సుభద్రమ్మ లో కొంచెం తొట్రు పాటు కనుపించింది.
    "మునసబే కాదు. వాళ్ళబ్బాయి గురించి కొదొఆ తెలుసుకోవాలి."
    'అతను పట్నం లో చదువు కుంటున్నాడు." అన్నది తలుపు దగ్గర నిలబడి అత్తా, అల్లుళ్ళ మాటలన్నీ ఆలకించిన వరలక్ష్మీ . రాజారావు ఆమెను చూసేడు.
    'అవుతే , ఇప్పటివరకూ నువ్వూ యిక్కడే ఉన్నావన్న మాట" అన్నాడు రాజారావు.
    కాసేపటి వరకూ ఎవరూ మాటాడలేదు. రాజారావు తన గదిలోకి వెళ్ళిపోతూ అన్నాడు.
    "మన జాగ్రత్తల్లో మనం ఉండటం ఎంతైనా మంచిది."
    -- అతను మంచం మీద నడుం వాల్చాడే గానీ నిద్ర పట్టడం లేదు. పక్క మీద దొర్లుతూ ఉదయం తను కలుసుకున్న వ్యక్తుల గురించీ, ఆ వూరి వాతావరణం గురించీ ఆలోచించడం మొదలెట్టాడు. అతని బుర్ర వేడెక్కింది. పక్క మీద నుంచి లేచి తలుపుకి గడియ వేసి సిగరెట్టు ముట్టించెడు. తాత సిగరెట్టు మీద చేసిన వ్యాఖ్యానం హటాత్తుగా గుర్తు కొచ్చింది. నవ్వుకున్నాడు. నిజమే. అతిగా సిగరెట్లు కాల్చమనేది జాడ్యమే. మానడం మాత్రం తన చాత నయ్యేది కాదు. తనేదురుగా ఉన్న పాతకాలపు ఫోటో కనిపించడంతో, గట్టిగా కళ్ళు మూసుకున్నాడు.
    కొంతసేపటికి అతనికి తెలీకుండానే నిద్ర పట్టేసింది.
    జానికమ్మ తలొంచుకుని నిలబడ్డది. రాఘవయ్య రౌద్ర రూపం దాల్చేరు. అయన కళ్ళు ఎర్రబారినై.
    "నువ్వు ముండ మోసిన దానివని మరిచి పోయావు."
    జానకమ్మ ధైర్యంగా తలెత్తి చెప్పింది.
    "నా చిన్నతనం లోనే పెళ్లి చేయడం నీ తప్పు."
    ఆ భ్రష్టుడు నిన్నుద్దరిస్తా డనుకుంటున్నావేమిటి. ఒకనాడు నిన్ను నడి గంగలో ముంచేయగలడు. వాడి ఆదర్శాలు నమ్మి వంశ గౌరవాన్ని మంట గలపకు. వాడు సంఘ సేవకుడు కాదు. మాయల మారి. నీ పాలిటా, నా పాలిటా యముదడు చిట్టీ! యముడు."
    ఆ మాటతో జానికమ్మ కి రోషం పెల్లుబికి వొచ్చింది.
    "అయన దేవుడు. నాకు మరో లోకాన్ని ప్రసాదించిన మహానుభావుడు."
    "అవుతే వెళ్లు. మళ్లా నా గుమ్మం తోక్కకు. ఆ మహానుభావుడు , నీ దేవుదతో వూరేగు. ఫో....వెళ్ళవెం . వెళ్లు" రాఘవయ్య హుంకరించి జానికమ్మ మెడ పట్టి గెంటేడు. అవేనుక తలుపూ మూసేడు.
    "అమ్మా" ఏడుపొచ్చింది రాజుకి.
    --తలుపు దబదబా శబ్దమయ్యింది. అతను నిద్ర లేచాడు. కళ్ళు విప్పాడు. ఇది కలా? పాపిష్టి కల! కల్లోనైనా తండ్రిని చూడ నోచుకోని దరిద్రుడు తను.
    మళ్లా తలుపు శబ్దమైంది.
    లేచి తలుపు తీశాడు. గుమ్మం లో సుభద్రమ్మ, వరలక్ష్మీ నుంచున్నారు.
    "ఏం బాబూ! పలవరించేవా?' అడిగింది సుభద్రమ్మ.
    "అమ్మ కలలోకి వచ్చింది. " అన్నాడు రాజారావు.
    సుభద్రమ్మ కి అతని పైన జాలి కలిగింది. ఇంత అర్బకుడెం?
    "నీది పిరికి గుండె నాయనా! తలుపెసుకో!"
    తల్లీ కూతుళ్ళు ఇద్దరూ వెళ్ళిపోయారు. అతను దిగాలుగా వొచ్చి మంచం మీద కూర్చున్నాడు. వాచీ చూసుకున్నాడు.
    మిగతా కాలమంతా నిద్ర లేకుండానే గడిపేడు.
    -- ఆ సాయంత్రం మాటల సందర్భంలో రాజారావు తో అన్నది వరలక్ష్మీ.
    "ఎందుకనో బావా? నిన్ను చూస్తుంటే ఏడుపొస్తుంది నాకు."
    "అనామకులూ, చాతకాని వాళ్ళూ ఎదటి వాళ్ల దగ్గర సానుభూతి సంపాయించు కోడమే వొక గొప్ప అదృష్ట మైతే, గర్వించాలి నేను, కానీ! వరం- నాక్కావలసింది వొక్క సానుభూతే కాదు. మనశ్శాంతి! అమ్మ లేదు. నాన్న లేరు. మొన్నటి వరకూ నామమాత్రమైన ఉన్నడను కున్న మావయ్యా లేరు. ఎవరూ లేరు... నాకెవరూ లేరు." అన్నాడు మొహాన్ని చేతుల్లో దాచుకుంటో .
    "అమ్మ ఉంది. నేనున్నాను." అన్నది వరలక్ష్మీ.
    అతను ఆ పిల్ల వైపు నిశితంగా చూసేడు. పెదాల మీదుగా నవ్వేస్తూ --
    "తలుచుకుంటుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది వరం! క్షమాభిక్ష ఆశించినట్టు మావయ్య ద్వారా నాకు లభించక పోయినా , ఆ తండ్రి కూతురి వైన నువ్వు -- " చివర్ని ఆపేశాడు.
    "చెప్పు బావ! నేను....నేనేమిటి?"
    "నువ్వు నా పాలిట వరానివి."
    "ఆ పిల్ల కళ్ళల్లో ఆనందమూ, సిగ్గు తొణికిస లాడేయి.
    సుభద్రమ్మ పిలవడంతో తేరుకుని వంట గది లోకి వెళ్ళింది.
    రాజారావు వంటరిగా కూర్చుని సిగరెట్టు ముట్టించెడు. అంతలో అతనితో విషయం గుర్తు కొచ్చింది. గబగబా తన గదిలోకి వెళ్లి టార్చి లైటు తీసుకున్నాడు. మఫ్లర్ మెళ్ళో వేసుకున్నాడు. పెద్ద పెద్ద అంగ లేసుకుంటూ ఆలయం వైపు నడిచేడు.
    అంత దూరాన్నుంచే రాజారావు ని పోల్చగలిగాడు రామదాసు తాత. అతను తాత దగ్గరి కొచ్చి ఏదో చెప్పబోయాడు గాని, మధ్యలోనే తాత కలుగ జేసుకున్నాడు.
    "మొత్తానికి కుర్రాడి వనిపించావ్! నీ పట్టుదలకి మెచ్చు కుంటున్నాను. పద ఆ స్థలం చూపిస్తాను."
    రాజారావు  ఆశ్చర్యపోతూ అడిగేడు.
    "ఏ స్థలం?"
    "నువ్వెంత దాచినా నీ మెళ్ళో మఫ్లర్ నీ చేతిలో టార్చి లైటు నీ ఉద్దేశ్యాన్ని బైట పెడుతూనే ఉన్నాయి. మీ మావయ్య ని హత్య చేసిన చోటుకే కదూ నీ ప్రయాణం.
    "భలే.....కనిపెట్టేశారే."
    "నీ నేస్తాన్ని. పైగా కొద్దో గొప్పో వయసున్న వాణ్ణి. నాకది కష్టం కాదను కుంటాను. వొప్పుకుంటావా?"
    ఇద్దరూ నవ్వుకున్నారు.
    కనుచీకటి పడుతుండగా వూరు నుంచి బయట పడ్డారు. శ్రమ తెలీకుండా ఉండేందుకు దార్లో తాత కధలు చెప్పడం ప్రారంభించేడు. రెండు మైళ్ళు పైగా నడిచిన తర్వాత తాత ఒక చోట ఆగి --
    "ఆ స్థలం ఇక్కడికి ఆరు ఫర్లాంగు లుంటుంది " అన్నాడు.
    "పదండి త్వరగా ."
    "కొంచెం అగు . కుర్రాడివి. ఎకబిగిని ఎంత దూరమైనా నడువగలవ్. నా విషయం ఆలోచించు మరి" అన్నాడు తాత.
    రాజారావు సిగరెట్టు ముట్టించెడు.
    "నిన్న నీకో మాటిచ్చాను-- అనుమానించే ఒంతు నీదైతే, దానిక్కావలసిన కొందరి మనుషుల జాబితా యిస్తానని. అంచేత మరో మనిషిని నీకు పరిచయం చేయాల్సి ఉంటుందిప్పుడు."
    "థాంక్స్ , చెప్పండి" అన్నాడు రాజారావు.
    ఇద్దరూ మళ్లా నడక ప్రారంభించేరు. దార్లో తాత చెప్పుకు పోతున్నాడు.
    "ఈ పక్క వూళ్ళో ఆచారి గారని మీ మావయ్య లాంటి వైద్యుడోకాయన ఉన్నారు. రాబడి విషయం లో గానీ, పరపతి విషయంలో గానీ మీ మావయ్య ముందు అయన నిలబడ లేకపోవడమనేది నిజం. ఆచారి గారు సేకరించలేని మూలికలు ఈయన సేకరించే వారు. ఆచారి గారి వూర్లో కొంతమంది మావయ్య గారి దగ్గరే వైద్యాని కొచ్చేవారు. ఈ విధంగా ఆచారి గారికి మావయ్య గారి మీద ఈసు కలగడం లో ఆశ్చర్యం లేదు. మునసబు గార్ని చిన్న కారణం తీసుకుని ఎలా అనుమానించావో, అదే విధంగా ఆచారి గార్ని కూడా నువ్వు అనుమానించవలసిందేను." అన్నాడు తాత.
    "వైనాట్? తప్పకుండాను. అనుమానించడమనేది నేరం కాదు తాతా."
    "ఏమో అదృష్టవ శాత్తు మన అనుమానమే 'నిజం' కావచ్చు. చెప్పలేం కదా" అన్నాడు రాజారావు.
    ఆ మాట అనేసి తన ఆలోచనలను ఆచారి గారి వైద్యమూ, వగైరాలపై సాగించాడు రాజారావు. తాత మాత్రం మవునంగా నడుస్తున్నాడు. కొంత చూసేడు రాజారావు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS