Previous Page Next Page 
మనం మిగిలేం పేజి 5


    "నీపెళ్ళి మాట ఎంతవరకూ వచ్చింది?"
    "నాన్నా, నువ్వూ మావయ్యని అడగండి."
    "అదికాదే వెర్రి మొద్దూ! రాజు ఏవన్నాడు?"
    ఇరుకున పడింది.
    "మాట్లాడవేం? తరిపి గేద్దూడలా ఎదిగేవు. ఎందుకు నిన్ను ఇక్కడకు పంపించేను? ఆమాత్రం ముందుచూపు అక్కర్లేదూ? దొడ్లో వేపచెట్టు పెరిగింది. నువ్వూ పెరిగేవు."
    కోపం రవులుకుంది. "అత్తయ్యకు, మావయ్యకు ఇష్టమే."
    "చచ్చిన అత్తయ్యా, పండిన మావయ్యా కాదు నిన్ను పెండ్లి చేసుకునేది."
    "బావ ఏం మాట్లాడడు."
    "ఏండ్లు వచ్చేయి కాని, బుద్ధీ జ్ఞానంరాలేదే. ఎంతైనా బావకదా? నువ్వు మరదలివి. ఆ మాత్రం ఆలోచనపోలేదూ? ఎందుకు పంపేననుకున్నావు నిన్ను? అక్కడ అర్ధాకలితో మాడుతున్నా, పట్టెడు తింటావని, ఈ ఆస్తికి వారసురాలవుతావన్న ఆశతోనే పంపేను. పెద్దమనిషివయ్యే వన్నా లెక్కచెయ్యలేదు. గుండెల్లో బాకు పుచ్చుకు పొడిచేసేవే? మీనాన్న నసుగుడితత్వం నీలో వుంది. ఏం చేస్తాను? నాఖర్మ." బుర్ర బాదుకుంది.
    తన అమ్మ దృష్టిలో తన విలువ ఎంత ఉందో ఆక్షణికంలో అది దహించేసింది. ఆఖరుకు శరీరం, అందులో వంపులు బలిపెట్టయినా, బావను లోబరుచుకుని మూడుముళ్ళూ వేయించుకునేందుకే తన్ను పంపింది.
    తనకు బావమీద ఇష్టంలేకకాదు. ఉన్నా అది ఫణంపెట్టి, జూదంలో గెలుచుకున్న పడుపు కూడు కాదు తను ఆశించినది. ఆదర్శమైన వలపు. సంసారంలో, ఎడతెగని అనురాగం. తన సహధర్మచారిణి అన్నమాటలో ధర్మపదమైన అర్ధం. అత్తయ్య. మామయ్య మాటల్లో అది చిగురించి వసంతమే అయ్యింది. ఈనాడు, ఈ క్షణంలో అమ్మ అర్ధాలు, ఆశయాలు చూస్తే, తను ఎందుకు పుట్టిందన్న ఏహ్యతే కలిగింది. గత నాలుగైదు వత్సరాలనుండి ఈ ఇంట్లో ఉన్నా, ఎప్పుడూ ఆ లక్ష్మీ హస్తగతం కోసం తను ప్రయత్నించలేదు. ఆ ఊహ అన్నదే క్రొత్త. బావను వశపరుచుకోవాలి అన్న భావన చూచాయల్లో కైనా రాలేదు, ఇన్నాళ్ళూ. ఆ వేళాకోళాలూ, పరిహాసాలూ, క్రమఫలితం తనలో 'బావకు ప్రేమ లేకపోలేదు' అన్నదే చిగురించింది. దానికి విభిన్నత లేదు. అది చలించదు.
    "పోనీ మావయ్య...." ఉరిమినట్లే అంది అమ్మ.
    "అమ్మా!" అరిచేబయటికి వచ్చింది. దుఃఖం. ఎగత్రోసిన నెగడు. అమ్మలో ఎంత స్వార్ధం? ఎంత నీచాతినీచానికి ఒడిగట్టింది! సావిట్లోకి వచ్చేసరికి నాన్న కనపడితే, గొల్లుమంటూనే కాళ్ళదగ్గర కుప్పకూలిపోయింది.
    అర్ధంకాలేకబిత్తరపోయేడు. "ఏమిటమ్మా?"
    "ఎందుకు కన్నావ్, నాన్నా, నన్ను?" ఎక్కిళ్ళమధ్య.
    నలువైపులా ఉబ్బెత్తుగా గాలివీచినట్లు అయ్యింది సీతారామయ్యకు. తన కన్నకూతురే తన్ను ఏడుస్తూ, గుండెలు పగిలేటట్లుగానే అడిగింది. ఏ ప్రశ్న అయితే ఎవరూ, ఎక్కడా అడగనిది ఆలోపల ఏదో జరిగిఉంటుంది. దానికి ఈ రాక్షసి ముండ కారణం అయి ఉంటుందన్న నిరుకులోనే విసురుగా వంటింట్లోకి వచ్చేడు.
    అలమారుల్లో డబ్బాలు తడుముతూంది. క్రిందపెట్టిన పళ్ళెంలో తిను బండారాలు నిండుతున్నాయి. పళ్ళెంవద్ద కూర్చున్న ఆరేళ్ళ వాడు, పంట్లాం జేబులు, చొక్కాజేబులు నింపుకుంటున్నాడు. తన్ను చూడగానే-
    "నాన్నా! నాన్నా! అప్పచ్చి" అన్నాడు నవ్వుతూ.
    చూడనేలేదు. "ఏమన్నావే దాన్ని" అన్నాడు. కోపం మ్రింగుకున్న దాస్యం చిలికింది.
    "ఉరేసుకోమన్నా."
    "దానితోపాటు నేనూనా?"
    తగ్గిపోయింది లక్ష్మి. తెలుసు ఎప్పుడు తను కాస్త చెయ్యి దించాలనో. పీట సారిస్తూనే "కూర్చోండి" అంది. పళ్ళెం ముందరికి నెట్టింది.
    నెమ్మదిగానే తను గ్రహించినవన్నీ కూడా చెప్పింది. "ఇప్పుడేం చేస్తాం" అనే కళ్ళల్లో కళ్ళుపెట్టి అడిగింది.
    ఏమీ సమాధానం చెప్పలేకపోయేడు. చేతులారా తను దానికోసం ఊహించిన ఉన్నతి జారిపోయేస్థితికి వచ్చింది. ఈ పరిస్థితుల్లో లక్ష్మి సూచించిన విధానం తప్పుగా కన్పడలేదు. ఒక్క ఆశయసిద్ధికి, రుక్మిణిని బలిపెట్టినా సంఘం తన్ను దుమ్మెత్తదు.
    అయినా, రాజు విషయం ముఖాముఖీగా అడిగేవరకూ తనుగాని, లక్ష్మిగాని తొందర పడకూడదు. ముందు ఎత్తు సూచించ కూడదు.
    "వచ్చిన అర్ధఘంటలోనే ఇంత తొందర పడితే ప్రయోజనం ఏముందే? వాడు రావాలి కదా? ఈ ఇదమిత్థంలేని విషయానికి అమీ, తుమీ తేల్చుకునే మనం బావకు కాళ్ళబంధం వెయ్యాలి. ఇది ఎందుకు ఆలోచించవే? దాన్ని దుయ్యపడితే కార్యం సఫలమవుతుందా?"
    తల దిమ్ము తగ్గినట్లు, తేరుకున్నట్లు అయితే, సావిట్లోకి వెళ్ళి రుక్మిణిని అక్కున చేర్చుకునే, "కన్నందుకు, తల్లి హృదయం, ఓ అయ్య చేతుల్లో పెట్టేవరకూ ఎంత అటమటిస్తుందో నీకు తెలియదు.నీకు ద్రోహం చెయ్యాలని కాదమ్మా" అని ఊర డించింది. సీతారామయ్య నిట్టూర్పు నిగిడ్చేడు.
    వీధిలోంచే "రుక్మిణీ, సుభద్రమ్మ అత్తయ్య వచ్చిందే" అన్న మావయ్య కేకతో తెప్పరిల్లి రుక్మిణి ఒక్కటే అంగ వేసేసింది. సీతారామయ్య, లక్ష్మి కూడా గ్లాసుడు మంచి నీళ్ళు త్రాగేరు-
    'ఈ మహమ్మారి ఇప్పుడెందుకు వచ్చిందే' అన్న భయం శరీరాన్ని వణికిస్తుంటే.
    "మీరెప్పుడు వచ్చేరు? ఇన్నాళ్ళకా రావడం?" ఆవిడ అడిగేసింది.
    "ఉత్తరం నిన్న అందింది."
    ఇక మాట్లాడలేదు. "ఏరా! రాజు రాలేదూ?"
    "రాలేదు, అక్కయ్యా!"
    "పోనీ, కాలేజీకి వ్రాయకపోయినావా?"
    "మనిషినే పంపించేను."
    "మనస్సు చెడగొట్టుకుని వాడు దేశాలు పాలై పోలేదుకదా అన్న బెంగరా."
    "అంత వ్యక్తిత్వం తెలియనివాడు కాదుకా?'
    "అల్లుడు సిసింద్రీ లాంటివాడు. నలుగురిని జయించుకువస్తాడు బయటకు వెళ్ళితే." లక్ష్మి అంది.
    "అల్లాగేం?" అని చీదరించింది సుభద్రమ్మ. సమాధానం చెప్పాలనుకున్నా, బాగుండదు ఇప్పుడు అనుకుంటూనే నవ్వేసింది పేలవంగా.
    "ఒరే! ఎందుకైనా మంచిది. పేపర్లో కూడా వేయించరా."    
    గుభిల్లుమంది హృదయం అందరికి.
    "అల్లాగే, అక్కయ్యా" అన్నాడేకాని నూతులోంచి వచ్చినట్లున్నాయి మాటలు. శబ్దం.
    తన కొడుకు అంత దూరం రానివ్వదు అనుకున్నాడు.
    "అల్లా నుంచునిపోయేవు. అత్తయ్యకు కాస్త కాఫీ పట్టుకురా" అన్న ఆదేశింపు, వెనకాలే తను కొంగు పట్టుకున్నట్లు సీతారామయ్య లోపలికి వెళ్ళేరు.
    "ఏమిటి ప్రస్తుతపు ఎత్తులు?" ముక్కుకు సూటిగానే ప్రశ్నించింది తమ్ముణ్ణి.
    "ఇందాకనే వచ్చేరు."
    "కాస్త జాగ్రత్తగా ఉండు. మొన్న డ్రయివరు వీరయ్య కన్పడి, అబ్బాయిగారు బస్సులో వచ్చేరండి అన్నాడు."
    "నిజంగా?"
    "బెజవాడలోనే దిగేడుట. ఇంతకీ రుక్మిణి విషయం ఏంతేల్చేవు?"
    "వాడి విషయం అర్ధం కావటంలేదు."
    "అయితే నీ ముఖానికి ఈ వ్రాత కూడా వ్రాసిపెట్టి ఉందన్నమాట!"
    వీపుమీద తట్టినట్లయ్యింది. "ఏమిటే, అది?"
    "ఇంత వెర్రివాడవు, డబ్బు ఎల్లా సంపాదించగల్గేవురా? ఆ జంబూక దంపతులు, నీకే రుక్మిణిని ఎరబెట్టవచ్చు. రాజు విషయం నాకూ సందిగ్ధమే."
    "ఆ! ఏమిటంటున్నావు, నువ్వు?"
    "ఉన్నది మాట్లాడుతున్నా. కనుక కాస్త ఒళ్ళు, వయస్సు దగ్గర పెట్టుకుని సంచరించు. రేపు మీ బావగారు బెజవాడ వెళ్ళుతారు. కాస్త పదిమంది చెవుల్లోనూ పడేసిరమ్మని చెపుతా. మరి వెళ్ళివస్తా."
    "కాఫీ త్రాగకుండానే" అన్నా, తను మ్రింగుకోలేని సత్యం విన్నాడు. అది గజిబిజి చేసింది.
    ఫక్కున నవ్వుతూనే, "ఇదెన్నాళ్ళనుండిరా! రాజు రాడేమో ఇప్పట్లో అన్న బెరుకు గల్గుతోందిరా" అంటూ గుమ్మం దాటింది.
    సోల గ్లాసుతో నురగలు కక్కుతున్న కాఫీ పట్టుకొచ్చేసరికి, కుర్చీ ఖాళీగా ఉండడం, మావయ్య పరధ్యాన్నంలో ఉండడం చూచి తెల్లబోయింది రుక్మిణి.
    "మావయ్యా!" పిలిచింది.
    "నువ్వా!" అంటూనే సర్దుకున్నాడు. ఒక్కసారిగా ఇన్నేళ్ళూ రుక్మిణిని చూడలేదన్నట్లే ఆపాదమస్తకం కూలంకష వీక్షణం పారేసేడు.
    డిల్లపోయింది రుక్మిణి. 'ఏమిటది?' ఆ చూపుల్లో తను, తను పశువు క్రిందైనట్లే నివురుకున్నాయి. గ్లాసు అక్కడపెట్టి, ఇంట్లోకి ఒక్కటే పరుగు, కుమిలింపుపల్లెతో, బావురుమంది మంచంమీద.

    
                                      5

              

    "యచ్చిత్తస్తే నైష ప్రాణ మాయాతి పాణస్తే జపాయుక్తం! స హత్మానా యథా సంకల్పితం లోకం నయతి.' ఈ శ్లోకం జ్ఞాపకం వచ్చింది అవధానికి- ఎదురుగా కట్టలులాగ ఉన్న తన లెక్కలు కాగితాలు నిండి ఉంటే. తను వ్యాఖ్యానం చెయ్యడం ప్రారంభిస్తే తుడా మొదలూ తేలదు.
    అవ్యక్తంగా ఇదే ఎందుకు తనకు జ్ఞాపకం వచ్చింది? అంటే, ఒక్క 'అమ్మ ఆజ్ఞ' అనుకో వలసిన నమ్మకం. విశ్వాసం. అన్యధా శరణం నాస్తి అన్న తన అర్పణ. వంశానుగతంగా అమ్మ పీఠం తనకు తన తండ్రి సంక్రమణచేసి మంత్రోపదేశం చేశాడు. గురుపీఠంలో బలం, ఆ ఆశీర్వచనమే తన్ను నడిపించింది. నడిపిస్తూంది. అది చలించలేదు.
    ఈ అర్పణ అన్నది పరచింతనం కావడంవల్ల నేమో జీవితంలో ఏవిషయాన్నీ తను మనస్సుకు పట్టించుకోలేదు. ఎన్నో సమస్యలు వచ్చేయి. అవన్నీ తను కాదు తీర్పు ఇచ్చే వన్నట్లే విడిపోయినాయి. తనుమాత్రం ఓ తామరాకుమీద నీటి వతు.
    ఇదే ఈనాడు కలిగింది. శాంతి. గతం, ప్రస్తుతానికి తను కర్తకాడు. ఒక్క కట్టు బాటుకు తలవంచి, పోషణ చెయ్యడం విధి. అది తను తప్పకూడదు. చూచాయగా కుండలిలో తను ఊహించినవి సత్యదూరాల్లా కనుపించినా, శాస్త్రసమ్మతం. తను నమ్ముతాడు. కాని ఒక్కటే ఈనాడు తను సత్యాలను వ్యక్తీకరించలేడు. చెప్పలేడు.
    ఇదే నిజమైతే, తను నమ్మలేని నిగూఢ సత్యంగా, మరో విషయాన్ని కూడా గుర్తుకు ఉంచుకోవలసి వస్తూంది. సంభవాసంభవాల మధ్య ఇమిడి ఉన్న తన నమ్మకంకూడా సడలే టట్లు ఉన్నా 'ఏమో!' అనుకున్నాడు.
    "వీధిలోకిబండి వచ్చింది. రైలువేళ అవవచ్చింది. ఇంకా మీరు పత్రాలు ముందు వేసుకు కూర్చుంటే ఎల్లా?" మరచెంబు బయటపెడుతూనే అంది పార్వతమ్మ.
    "నా ఆలస్యం ఏముంది?" కట్టలు కట్టినవిసందుగా పెట్టెలో పెడుతూనే "నా అంగ వస్త్రం...." అన్నాడు.
    "ఆఁ అన్నీ సద్దేను."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS