భోజనాలైనై. అందరూ వారి వారి ఇండ్లకు బయలుదేరారు.
"పెద్దదాన్ని ఎక్కడికే రాలేను. అప్పుడప్పుడు వస్తూ పోతూ వుండమ్మా." అంటూ సాగనంపింది.
ఆ రాత్రంగా కుమార్. మంజుల ఆమె మంచితనాన్ని విశాలహృదయాన్ని గూర్చి చెప్పుకుంటూండగానే తెల్లవారింది.
* * *
డాక్టర్ అన్నపూర్ణకు సుస్తిచేసింది. మంజుకు చేతినిండా పని తగిలింది. రెండు రోజులు గడిచిపోయాయి.
సాయంత్రం అలసి ఇంటి కొచ్చింది. భర్త రాలేదు. కాఫీ త్రాగి ఈజీచైర్ లో పడుకుని కళ్ళు మూసుకుంది.
ఎంత సేపైందో - కుమార్ వచ్చి "మంజూ ఎవరో ఆడాళ్ళొచ్చారు. వెళ్తూ" అంటుంటే మగతగా కళ్ళు తెరచింది. భర్త కళ్ళల్లోకి అలా చూస్తూనే వుంది. కుమార్ నెమ్మదిగా వంగి ఆమె ముంగురులను సవరించి మృదువుగా పెదాలు స్ప్రుశించాడు. మంజు మంజులంగా నవ్వి లేచి కూచుని "కాఫీ త్రాగారా!" అంది.
"ఓ....కాఫీ అయింది.....అమృతపాన కూడా" మంజూ బుంగమూతి పెట్టి భర్తవైపు చిరుకోపంతో చూచి వెళ్ళిపోయింది.
ఆమె చీరమార్చుకుని తల దువ్వుకొని ముందుగదిలో కెళ్ళింది. ఒక నలభై సంవత్సరాల స్త్రీ ఒక పదహారు సంవత్సరాల పిల్ల కూచుని ఉన్నారు. మంజుల వెళ్ళగానే లేచి నుంచున్నారు.
"ఎవరమ్మా మీరు....ఏం కావాలి" అంటూ కూచుంది.
వారిద్దరూ కూచున్నాక పెద్దావిడ రహస్యంగా ఏదో చెప్పింది. మంజుల ఆ పిల్లకేసి పరీక్షగా చూచి లోపలికి తీసుకొని వెళ్ళింది, పది నిమిషాలకు చేతులు తుడుచుకుంటూ వచ్చి ఆమెకు సమీపంలో కూచుని అంది. "ఏ అనుమానం లేదు. నాలుగవ నెల..." ఆమె ముఖం మసి పులుముకొన్నది.
ఏ ఏదో అనుకున్నాం గాని ఇంతవరకొచ్చిందని మాకు తెలియదమ్మా" అంది, మంజులకు జాలివేసింది.
"పోనీ త్వరగా పెళ్ళి చేయకూడదూ!"
"అయ్యో - తల్లీ - వాడు పెళ్ళిజేసుకొని నాల్గు నెలలయిందమ్మా. స్వంత బావ కాబోయే మొగుడు - పెళ్ళాం గదా అని ఊరుకున్నాం. ఇంకొక కత్తి వేలు పోసేసరికి దీన్ని చిత్రవధజేసి మోసంజేసి వెళ్ళిపోయి దాన్ని చేసుకున్నాడు. ఏం చెయ్యను తల్లీ ఒక్కతే పిల్ల ఎన్నో ఆశలు పెంచుకున్నాం. మమ్మల్ని గట్టెక్కించే భారం మీది మంజులకు వెంటనే తట్టలేదు.
"మీ మేలు మరచిపోము ఈ అవమానం లోంచి పైకి లాగే భారం మీది మీ రేమడిగినా యిస్తాము."
మంజు నీరస పడింది. ఆ పిల్లవైపు చూచింది. ఎంతో అమాయకంగా దీనంగా జూస్తోంది. ఇలాంటి వారిని తను చాలా మందిని జూచింది. ఏమీ తెలియని పిల్లల్ని ఇలా అన్యాయంజేసి పారిపోయే పశువులను పట్టి శిక్షించేవారెవరూ లేరా? సంఘం స్త్రీని వేలెత్తి చూపుతుంది. ఎందుకు? ఆ పాపపు చిహ్నాలు ఆమె లోనే కనపడతాయి, చీ....ఏం మనుష్యులు....
ఆమె ఆలోచనల కంతరాయం కల్గిస్తూ ఆమె ఏదో మంజు చేతిలో పెడ్తోంది మంజు చటుక్కున చేయి తెరచి చూచింది. వెయ్యి రూపాయల నోట్ల కట్ట. మంజు కడుపులో చేయిపెట్టి కెలికినట్లయింది.
అతి ప్రయత్నంతో అంది.
"మీ బాధనంతా అర్ధం చేసికొన్నాను....కానీ ఆ పని చేయలేను. ఆమె కడుపులో ఉన్నది ప్రాణంలేని వస్తువైతే నాకే అభ్యంతరం లేదు. కాని దానికి రక్తమాంసాలున్నాయి. ప్రాణం ఉంది. నాలుగు నెలల పాప - భగవంతుని సృష్టిలో అతి అద్భుతమైనది....నేను చేయలేను..." మంజు ఆ నోట్లు ఆమె కివ్వబోతోంది. కానీ ఆమె బొడ్లోంచి మరొక నోట్లకట్ట తీసి ఇస్తోంది.
ఈసారి మంజు వారించలేదు. రెండునోట్ల కట్టలు టీపాయ్ మీద ఉంచి లేచి నుంచుంది "ఇది మావృత్తిధర్మం కాదమ్మా. ప్రాణిని రక్షించమని ఆదేశించారు. ప్రమాణం చేశాము.....కానీ ఒక ప్రాణిని చంపమని లేక నాశనం చెయ్యమని మాకు నేర్పరు. ఉన్నతాశయాలను కల్గి వాటి కనుగుణంగా మా వృత్తిని మానవ సేవకు వినియోగించాలి. మీరు దయతో వెళ్ళండి....కానీ ఒక్క మనవి నాటు మందులు-నాటు వైద్యులచేత ఈ పని చేయించకండి. సరిగా చేయకపోతే ప్రాణహాని కలుగుతుంది. కానీ ఆమె విడువలేదు. అనేక విధాలుగా బ్రతిమాలుతోంది.
మంజులకు జాలి వేస్తోంది. విసుగు కూడా వేస్తోంది. తను నిస్సహాయ ఈ పని, తను ముమ్మాటికి చేయలేదు లక్ష చేతిలో పెట్టినా చేయలేదు. తనకంతటి మనస్థైర్యం లేదు తన అంతరాత్మ ఒప్పుకోదు.
ఆమె మనోభావాలను గ్రహించినట్లు కుమార్ మంజును పిలిచాడు "బ్రతుకు జీవుడా" అని భర్త దగ్గర కెళ్ళి అంతా నివేదించింది.
"ప్చ్ అని తల పంకించాడు కుమార్.
ఈసారి ఇద్దరు ఆ గదిలోకి వెళ్ళారు ఆ పిల్ల బెదురుతూ కూచుంది. ఆమె ఆశగా దోసెలొగ్గి లేచి నుంచుంది.
"చూడండమ్మా. మీరు చాల పొరపాటు జేశారు మా దగ్గరకు రావటమే ఆ పొరపాటు. మనః సాక్షిగల వారెవ్వరు ఈ పని చేయరు చేసినా అది తప్పు అని నేననను. వారి వారి వ్యక్తిగత విషయాలని మిమ్మల్ని ఈ అవమానం నించి కాపాడటానికి కొందరు జాలిపడి చేస్తారు. లేదా కొందరి ఆ పిండం కేవలం ప్రాణం లేని మాంసపు ముద్ద. ఎవరి భావాలు ఆశయాలు వారివే. మీరన్యధా భావించక మరొక మంచి డాక్టరును కలుసుకుంటే....
డాక్టర్ బాబూ అన్నపూర్ణమ్మగారు చేయనని మిమ్మల్ని కలుసుకోమన్నారు మీరు తప్పక గట్టెక్కిస్తారనుకొని గంపెడాశతో వచ్చాము...మీరు ఇలా అంటే.... ఆమె నిస్సహాయంతో చేతులు నలుముకుంది.
కుమారి క్షణం మౌనం దాల్చాడు. నోట్లు పిల్లలికి అల్లలాడుతున్నాయి. వాటి వైపు తదేకంగా చూచాడు అంతే గబుక్కున ఆమె వైపు తిరిగి స్పష్టంగా అన్నాడు.
"మీకు అర్ధం కాదు....కానీ ఇలా చెబితే అర్ధం కాగలదు. డాక్టరమ్మగార్కి మూడవ నెల. ఈ పని ఎలా చేయగలదు.....అహ....మీరింకెవరి దగ్గిరకైనా తీసికొని వెళ్ళండి."
ఆమె చాలసేపు మౌనంగా నేలకేసిచూస్తూ కూచుంది. తరువాత నెమ్మదిగా లేచి నోట్లు తీసికొని బొడ్లో దోపుకుంది.
మౌనంగా ఇద్దరికీ నమస్కరించి బైటకి నడిచింది. ఆ పిల్లవైపు చూడనైనా చూడలేదు ఆ పిల్ల యాంత్రికంగా ఆమె ననుసరించింది. పాపం- అని మాత్రం అన్నాడు కుమార్.
ఎంతో సేపటికిగాని వారిద్దరు తేరుకోలేక పోయారు.
శుభవార్తను తెలుపుతూ అనుంగు స్నేహితురాలు ప్రమీలకు రాసింది మంజు. ఈ విషయం జరిగిన రెండు రోజులకు ప్రమీల నించి ఉత్తరం వచ్చింది.
మంజుకు తన ఆప్తుల దగ్గరనించి లేఖలు రావు. వ్రాస్త స్నేహితులే రాస్తారు. ప్రమీలనించి ఉత్తరం వస్తే ఆమె కేనలేని సంతోషం- స్వంతవాళ్ళతో తెగతెంపులు చేసికొని వచ్చినప్పుడు ప్రమీలే ఆదరించి ధైర్యం చెప్పింది. ఒకసారి కాదు- మూడుసార్లు వేసవి సెలవలు కేరళలో ప్రమీల వాళ్ళింట్లో గడిపింది. ప్రమీలకు ఒకచెల్లిమాత్రం ఉంది. చాల ధనవంతులు, రబ్బరు తోటలు వ్రాలు. మంజును కన్నబిడ్డలా చూచుకున్నరామె తల్లిదండ్రులు ఎన్నో సార్లు మంజుకు అండగా నిల్చింది.
కవరు విప్పింది. చాల చిన్నలేఖ. ఎంతో నిరాశ చెందింది. సోఫాలో చేరబడి చదివింది. అందులోని విషయం ఏమిటో గాని - మంజు గుండెల మీద చేతులువేసి. కుడిచేతి పిడికిలిపై ఎడమచెయ్యి వుంచి భరింపరాని ఆవేదనకు గురైంది గుండె దడదడ కొట్టుకుంటోంది. ఆ శబ్దం ఆమె కర్ణాల కతిభయంకరంగా వినవస్తోంది ఆ గదిలో చలనంలేదు. ఎక్కడి కక్కడ అన్నీ బిగించుకుపోయి తటస్తంగా వున్నట్లుందామెకు ఎవరో బిగ్గరగా నవ్వుతున్నారు. ఎవరది? ఎవరు...? ఆ... ఆమె.. మొన్నవచ్చిన స్త్రీ-ఎందుకా నవ్వు? మంజు చెవులు మూసుకుంది. కొంతసేపటికి తెప్పరిల్లి లేఖను చదివింది. తన కర్తవ్యం ఏమిటి! తనేం చెయ్యాలి?
కుమార్ స్నానం చేసి వచ్చాడు.
మంజును చూచి చకితుడయ్యాడు.
"మంజూ-అలావున్నావేం.... ఒంట్లో బాగులేదా?
ఆమె పేలవంగా నవ్వి ఆ లేఖ అందించింది.
"....ఏ లేఖ నాకెంతో ఆనందాన్ని కలుగ జేసింది. పురిటికి నువ్వు తప్పక ఇక్కడికి రావాలి - అని ఆమె ఆదేశం. మంజూ ఈ లేఖ నీ కెంతో దుఃఖాన్ని కలుగ జేస్తుంది....ఎంత వ్యధకు లోనౌతావో తలంచుకుంటే గుండె నీరు కారి పోతుంది....కానీ తప్పదు. నీపై ఇంతటి భారం మోపటం నాదేతప్పు.....కానీ తప్పదు. వారం రోజులుగా నాలోనేను కుమిలిపోయి చివరికి ఈ నిర్ణయానికి వచ్చాను....నన్ను క్షమించు మంజూ.
చెల్లి- పుష్ప కాలు జారింది.....నాకు రాసింది. నువ్వు దాన్ని పిలిపించుకుని అంతా చేసి పంపవలసినది. ఇది అత్యంత రహస్యంగా జరగాలి.
నువ్వు తప్ప నాకెవరు కనబడలేదు. దాని భవిష్యత్తు సలక్షణంగా వుండాలంటే మనపై ఆధారపడి వుంది.
మీ ఇద్దర్నీ నమ్ముకున్నాను....నన్ను క్షమించండి....కోరరాని కోరిక కోరుకుంటున్నాను...ఈలేఖ డాక్టర్ కుమారిగార్కి చూపవలసినది...
విధి వైపరీత్యం కాకపోతే మరేమిటి, మొన్న- సరిగ్గా ఒకటిన్నర రోజు- ఏ కార్యం తప్పు క్రింద జమ చేసి విముఖత చూపారో, అదే కార్యం ఈనాడు ఈ లేఖ చదువుతుంటే ఒప్పు క్రిందికి వస్తోంది. తప్పదు.... పుష్ప ఎవరోకాదు... మంజు ప్రాణ స్నేహితురాలి చెల్లి. అవసరమున్నప్పుడు పనికిరాని స్నేహం స్నేహమేకాదు. ఎవరో- ఎక్కడో కారు క్రిందపడి గాయపడి మనకు చింతలేదు. అదే మన వాళ్ళయితే ఎంతో ఆందోళన చెందుతాము.

మంజు వాలకం చూస్తుంటే కుమార్ కు తెలిసిపోయింది. ఆమె విముఖత చూపుతోందని. ఎంతైనా బోధపర్చి - తమ కప్పగించిన బాధ్యతను నెరవేర్చేలా చేసే బాధ్యత తనపై ఉంది.
ఉత్తరాన్ని మడిచి అందిస్తూ అన్నాడు.
"పాపం ప్రమీలకు మనసై ఎంత గురి, తనకు మాత్రం ఇలాంటి సహాయం చేయగల వారెవరున్నారు. ఇది మాన మర్యాదలతో కూడిన సమస్య మంజూ....నిన్ను తోబుట్టువుగా భావించి రాసింది అదే మన సన్నిహితుల్లో జైర్గితే ఆ మాత్రం చేయలేమా!...."
"ఏమో! అప్పటిమాట వేరు. ఈ పరిస్థితుల్లో నాకు ధైర్యంగా లేదు. నాకు చేతకాదు."
మంజు ముంజేతితో కళ్ళు కప్పుకుని వెనక్కి చేరబడింది సోఫాలో.
"మరి అలా అని రాసెయ్యి.....రేపేరాసెయ్యి. వేరే ఏర్పాట్లు చేసికొంటారు" కుమార్ తను సంధించి వదలిన బాణాలు సూటిగా హృదయంలో గుచ్చుకున్నాయో లేదో అన్నట్లు ఆమెవైపు పరిశీలనగా చూచాడు.
కొన్ని నిశ్శబ్ద క్షణాలు గడిచినై. మంజు ఆలోచనలు అంతులేకుండా సముద్ర తరంగాల్లా తరుము కొస్తున్నాయి. పుష్పను గురించి ఆలోచన. మహావుంటే పదహారు సంవత్సరాలుండవచ్చు, ఇంటరు చదువుతుంది....ఇంత పని జరిగిపోయింది. వాడినెవడినో లాక్కొచ్చి ముడి వేయిస్తే - ఆ మాట బిగ్గరగానే అనేసింది.
కుమార్ ఆమెలోని మార్పును గమనిస్తూ ఈ మాటలు విన్నాడు.
"అయ్యో-పెళ్ళి చేసుకోవాలనుకునేవాడు ఇలా దొంగ పని చేయడు. వాడెవడో తల్లిచాటు కుర్రవాడై ఉండాలి....మనకు తెలియదు. ఈ ఉత్తర ప్రత్యుత్తరాలికే నెలరోజులు గడిచిపోతాయి. నీకెందుకు నువ్వు ఊ-అను అంతా గుట్టుగా నేను ఏర్పాటు చేస్తాను" మంజు "ఊ" అన్నది అతి బాధతో.
