
ఆరోజు ఆదివారం స్నేహితులు ముగ్గురు వరండాలో కూచుని కబ్లు చెప్పుకుంటున్నారు.
మంజుల కాఫీతెచ్చిపెట్టి కూచుంది.
"ఎల్లుండి సాయంత్రం మా పెద్దన్నయ్యగారి అబ్బాయి పుట్టిన దినం- పార్టీ - విందు మీరంతా తప్పక రావాలి. నువ్వు తప్పక రావాలి. నువ్వు తప్పక రావాలమ్మా" అంటూ మూర్తి ఆహ్వానించాడు. మంజు భర్తవైపు చూచింది. ఆమెవచ్చి ఏడాది దాటినా యింతవరకు స్నేహితుల యిళ్ళకు వెళ్ళలేదు, నజీర్ ఖాన్ అవివాహితుడు. మూర్తి మామగారు ఏదో పేచీపెట్టి కూతుర్ని పంపలేదు. ఇక ఆ ఊళ్ళో వాళ్ళకు కావలసిన వారెవ్వరు లేరు.
ఆడవాళ్ళవైపు పెద్ద డాక్టరమ్మ అన్నపూర్ణ మాత్రం మంజుపై ప్రేమాభిమానాలు కల్గి వుంటుంది. ఆమె ఇంటికి ఒక్కసారి మాత్రం వెళ్ళారు. మంజుకు ఎక్కడికైనా వెళ్ళాలంటే కాస్త భయంగా వుండేది. వెళ్ళటానికి ఆమెకు సుతరాముయిష్టంలేదు. కాని....రామమ్మూర్తి తన భర్త ప్రియస్నేహితులు, కలిసి చదువుకున్నారు. ఎంతో సన్నిహితంగా వుంటారు. కాదనలేక పోయారు.
ఆ రోజు రానే వచ్చింది, పార్టీ ప్రారంభమైంది భారీ ఎత్తున పండుగ జేస్తున్నారు. మంజు బహుమతితో గదిలో అడుగుపెట్టగానే అన్ని కళ్ళు ఆమెవైపు కేంద్రీకరింపబడినై. మూర్తి వదిన మంజును చాలాసార్లు చూచింది. తరచు మంజు వాళ్ళింటికెళ్ళేది. గబగబా ముందుకు వచ్చి ఎంతో ఆప్యాయంగా లోపలికి తీసికొని వెళ్ళింది.
మంజుకున్న జంకుకాస్తా వదలిపోయింది.
లోపల తివాచీమీదా ఓ ప్రక్కగా కూచుంది.
వయసు చెల్లిన వృద్ధ ముత్తయిదువ ఆమె ప్రక్కలో కూచుంటూ "నెహ్రూ హాస్పిటల్ లో డాక్టరమ్మవా అమ్మాయ్" అంది.
మంజు "ఔను" అంది ముక్తసరిగా.
"మీది కాకినాడటగా?"
మళ్ళీ ఔనంది మంజు.
ఇంటి పేరేమిటమ్మా,
"కస్తూరి"
"ఆహా-మీ అత్తవారిది?"
"అత్తవారిదే-కస్తూరి..."
"పుట్టింటి వారిది?"
అప్పుడే అటొచ్చిన మూర్తి వదిన, మంజు ముఖ కవళికనుగ్రహించి వెంటనే అంది "మంజు వదినా? కాస్త ఇటు రావమ్మా."
మంజు క్షణం నివ్వెరబడిన మాట వాస్తవం,
అంతే చాలన్నట్లు చటుక్కునలేచి ఆమె ననుసరించింది.
"మీకు కృతజ్ఞురాలను-ఇంకా ఏం ప్రశ్నలు వేసేదో..."
"మమ్మల్నే బ్రతక నివ్వదు, ఏదో మాట్లాడుతూ చివరికి చుట్టరికం కలుపుకుంటుంది, మీ ప్రక్కలో కూచోగానే అనుకున్నా, వెంటనే పిలిచి నట్లయితే బావుండేది.
"అందుకే-ఎక్కడికీ వెళ్ళటానికి ఇష్ట ముండదు. మా విషయం అందరికీ తెలిశాక మళ్ళీ అడగటం దేనికి చెప్పండి?"
"అదొక తృప్తి అంతే"
బిడ్డకు హారతి ఇవ్వటం అయిపోయింది. అల్పాహార విందు అయిపోయింది.
"మీరు భోంచేసి వెళ్ళాలి" అని రామ్మూర్తి ముగ్గుర్నీ నిలేశాడు.
సందడి తగ్గింది. అందరూ హాల్లో కూచున్నారు.
మూర్తి వదిన ఒక కవరు తెచ్చి మంజుకిస్తూ అంది ఈ ఉత్తరం చదవండి..."
మంజు లేఖ అందుకుని చదువుతోంది. ఆమె ముఖంలో స్పష్టమైన కాంతిని చూచి మిగతావారు ఆశగా చూస్తున్నారు.
అక్కడ రామ్మూర్తి, వాళ్ళన్నగారు, వదిన నజీర్, కుమార్, మంజులా తప్ప పెద్దవాళ్ళెవరు లేరు.
మంజు మౌనంగా భర్త కందించింది.
అది మంజు తండ్రిగారిచే రాయబడిన లేఖ, కుమార్ చదివి కొన్ని క్షణాలు ఆలోచించి అన్నాడు. ఈ లేఖను బట్టి మంజు వారికి బ్రతికి వున్న కూతురుతో సమానం కాదు. ఆమె చనిపోయింది. ఆమె చెల్లి కళ్యాణిని ఈ ఇంటి కోడలిగా చేసుకోవాలని మీ అభిలాష. మంజు కళ్యాణి అక్కగారన్న విషయం మొదట్లోనే పెద్దలకు చెప్పండి. ఇది చాల ముఖ్యం. నిగూఢంగా వుంచేస్తే - ఎప్పటికైనా బహిర్గత మైతే మమ్మల్ని చులకన చేస్తారు-మా సంగతి వేరు-కల్యాణి అవమానాలకు లోనౌతుంది. పెద్దవాళ్ళు ఇతర్ల విషయాలల్లో పట్టించుకోక పోయినా తమ దాకా వస్తే అన్నీ చూస్తారు, ఏమంటావ్ మూర్తీ" మూర్తి నేల కేసి చూస్తూ కూచున్నాడు.
మంజు భర్త మాటల్లోని సత్యాన్ని గ్రహించి మూర్తి జవాబు కోసం ఎదురు చూస్తోంది.
మంజు చెల్లి నా మరదలు కాబోతోందంటే నాకు చాల సంతోషంగా వుంది. కాబట్టి, నా ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేదు, అన్నయ్యా నువ్వు చెప్పు,"
"కుమార్ చెప్పినట్లు చేస్తే మంచిది, తర్వాత మోసం చేశారంటారు. అమ్మావాళ్ళు నిజంగానే మంజులగారు లేరనే వారి భావం. అంటే పేరు తెలియదనుకోండి. ఇలాంటివి అట్టే కాలం దాగవు. మూర్తి స్నేహితుడుగా కుమార్ ను - కుమార్ భార్యగా డాక్టర్ మంజులను మనం-ముఖ్యంగా మన పెద్దలు గౌరవించి అభిమానం చూపుతున్నారు. అదే స్వంత కోడలి అక్కగారు. డాక్టర్ మంజుల అని తెలిస్తే వారి భావా లేవిధంగా వుంటాయో ఊహించుకోగలను.
...ఏమిటో-వ్యక్తిని వ్యక్తిగా గౌరవించే కాలం ఎప్పుడొస్తుందో- మూర్తి తండ్రిగారు అప్పుడే ఆ వేపుగా వచ్చారు.
"ఏమిటి మంతనాలాడుతున్నారు" సోఫాలో కూచుంటూ ముక్కుపొడుం ఒక్కసారి పీల్చారు.
ఎవ్వరు మాట్లాడలేదు.
"ఏమ్మా-మా వూరెలా వుంది? మంజు నుద్దేశించి అడిగారు.
'దీనికేమండీ-భాగ్యనగరం" అంది.

మిమ్మల్ని గూర్చి మావాడు చెబుతుంటే చూడాలనిపించేది. ఈ నాటికి చూడగల్గాను....ఏమోయ్ ఒంటరిగానే వస్తావు-ఇకపై ఎప్పుడొచ్చినా-అమ్మాయితో సహా రావాలి...
మూర్తి ఎవ్వరూ చూడకుండా పెదాలు విరిచాడు. అసలు సంగతి చెబితే యింత ప్రేమ చూపిస్తాడా తండ్రి!
మూర్తి అన్న భార్యవైపు చూసి సైగ జేశాడు. ఆమె "అమ్మబాబోయ్" అన్నట్లు భర్తవైపు చూసింది.
ఇక లాభం లేదనుకుని మూర్తి ప్రారంభించాడు. "నిన్న రాశారే సత్యనారాయణ మూర్తి గారు? వారి అమ్మాయి విషయం అడుగుతున్నాం. మంజులని......ఇంతా జేస్తే వారు ఎవరో కాదు స్వయాన మంజుల కన్న తండ్రి"
ఆయన ముక్కు తుడుచుకుంటూ కొడుకువైపు వింతగా చూచాడు. తర్వాత కుమార్ వైపు దృష్టి మరల్చాడు. కుమార్ వెంటనే అన్నాడు వాళ్ళ పెద్ద అమ్మాయి చనిపోలేదు మంజుల వారి పెద్ద అమ్మాయి కళ్యాణిని చేసుకోక ముందు ఈ బంధుత్వాన్ని మీరు గ్రహించాలని చెబుతున్నాను.
ఆయన మౌనం దాల్చాడు.
పది సంవత్సరాల క్రితం ఎంప్లాయ్ మెంట్ ఎక్స్ చేంజి ఆఫీసరుగా రిటైర్ అయ్యారు. ప్రథమంలో వకీలుగా ప్రాక్టీసు చేసేవారు.
ఒకనాడు విజయవాడలో గాంధీ మహాత్ముని చూచి వారిపై గురి నిలిపారు. శ్రీమతికి కూడా పూజ్యబాపూజీ అన్న భక్తి భావం అప్పటికే వుండేది. ఖద్దరు ధరించటం తను మానినా ఆమె మానలేదు. సరికదా. తీరిక సమయాల్లో రాట్నం ముందు ఇప్పటికి కూచుంటుంది. ఆ మహాత్ముని అడుగుజాడలో దేశభక్తితో జీవనం గడుపుతూ వచ్చారు. వారికిది పెద్ద పరీక్ష కాదా? ఎన్నో విషయాల్లో వారు ముందంజవేశారు. కానీ ఇలాంటి సమస్య లెప్పుడూ వారికి రాలేదు. ఆయనకు మాత్రం ఇదేమంత తప్పుగా తోచటంలేదు. ఎన్నో విషయాలను ఆకళింపుజేసికొని మనో వికాసంపొందిన వారికి ఇదొక సమస్యగా తోచలేదు అప్రయత్నంగా మంజుకేసి చూచాడు ఆమె అన్నింటికీ అతీతురాలైనట్లు ఎటో చూస్తోంది.
"మీ అత్తయ్యను పిలువమ్మా" కోడలి నాదేశించాడు.
ఆమె వెళ్ళిన దిక్కుకేసి చూస్తోంది మంజు ఇక తేలిపోతుంది. కళ్యాణి బి. ఎ. పాసయ్యి నాలుగు సంవత్సరాలైంది. ఇంతవరకు పెళ్ళీ కాలేదు. అందుకు తనే కారణం, ఎంతగా పయత్నాలు చేస్తున్నారో వాళ్ళకు డబ్బుకు కొదువలేదు-కాని..."
ఆమె వచ్చింది. నజీర్ ఖాన్, కుమారులు ఆమెకు చిర పరిచితులు ఆరు ఏడు సంవత్సరాలనించి వారు తనకు తెలుసు. కుమార్ కు తల్లిదండ్రులు లేరని ఆమెకు అతనిపై ప్రత్యేకాభిమానం వుండేది. ఆమె హృదయం లో కుమార్ కు పుత్రుడుగా చోటు దొరికింది. మాతృప్రేమ గుర్తులేని అతడికి ఆమెలో మాత కనిపించేది. కుమార్ పై అంత మమత ఆమె కుండటానికి మరో కారణం ఉంది.
మూర్తి పెళ్ళికని అందరు బయలుదేరుతున్నారు యం. బి. బి. యస్ పరీక్షలై పోయాక అవేనని సెలవులో పెళ్ళి, అందరు చుట్టాలు స్టేషన్ కు వెళ్తున్నారు. ఆఖరి టాంగాలో ఆమె-కోడలు-మూర్తి కుమార్ ఎక్కడానికి ఏర్పాటైంది కాని ఆఖరి గడియలో మూర్తి తండ్రితో కలిసి వేరే టాంగాలో ఎక్కేసి వెళ్ళి పోయాడు.
నీ టాంగా బయలుదేరింది. ఇంకా బాగా తెల్లవారలేదు జనసంచారమే లేదు. ఉన్నట్లుండి గుర్రం భయంకరంగా సకిలించి ఒక్క దౌడు తీసింది. బండివాడు అదుపులో పెట్టలేక పోయాడు. అప్పుడే ఇరుసు చక్రం విడిపోయాయి సామానుతో సహా నలుగురు దొర్లి క్రిందపడ్డారు. గుర్రం విడిపించుకుని దూరంగా పరుగుతీసింది- మదించింది-కుమార్ గ్రహించి "అక్కయ్యా-నువ్వు బండికిందదూరు అని అరుస్తూ భయంతో అచేతనంగా పడి ఉన్న తల్లిని చేతుల్లోకి తీసికొని భుజంమీద వేసికొని కొద్దిదూరంలో వున్న చెత్త కుండి చాటుకు పరుగెత్తాడు గుర్రం త్రొక్కు కుంటూ రెండుకాళ్లును పైకెత్తి బలంగా నేలకేసి కొడుతూ వచ్చింది. ఇంతలో నలుగురైదుగురు ప్రోగై దాన్ని కట్టివేశారు.
కుమార్ ఆమెను మూర్తి వదినను తిరిగి ఇంటికి తీసికొని వెళ్ళడం, కడకు ఆమె పెళ్ళికి వెళ్ళకుండానే మూర్తి వివాహం అయిపోయింది.
విషయం తెలిసి కొన్న బంధుజనులు కుమార్ పై కృతజ్ఞత చూపకుండా ఎలా వుండగలరు?
పుట్టిన దినం- మనవడిని చూస్తూ - వంట చేయిస్తున్న ఆమెకు కుమార్ ను మంజులను చూచి సావకాశంగా పలుకరించాలని ఉన్నా ఇవతలికి రాలేకపోయింది.
ఇప్పుడు కుమార్ ను చూచి ఎంతో సంతోషంతో పలుకరించింది.
"ఎన్నాళ్ళకు తెచ్చావునాయనా అమ్మాయివి....చాలా సంతోషం.....భోజనాలు అయ్యాక తీరికగా కూచుంటాను.....పిలిచారుట....వంట అయింది....వడ్డించమంటారా!"
"అమ్మా, ఇప్పుడే ఏదో తిన్నాం. కాసేపుంటేనే కడుపులో ఖాళీ ఏర్పడగలదు" కుమార్ సోఫాతో ప్రక్కకు జరిగాడు.
మంజు జరిగింది. ఆమెకు కూర్చోటం తప్ప లేదు.
"బోజనాల సంగతి కాదే. ఒక విషయం మాట్లాడటానికి రమ్మన్నాను."
"ఏమిటది" - అన్నట్లు భర్త ముఖంలోకి నిరీక్షణగా జూచింది.
"మొన్న ఉత్తరం రాశారే ఆయన మన మంజుల తండ్రిగారట. భాస్కర్ కు చేసికోవాలనుకునే అమ్మాయి స్వయాన చెల్లెలు....మరి మూర్తి అంటాడూ ఈ విషయం మన కందరికీ ముందే తెలియాలని. ఇప్పుడు తెలిసింది కదా-ఏమంటావ్ నీ ఇష్టం" ఆమె విస్తుపోయి చూస్తోంది. భర్తవైపు తర్వాత మెల్లగా మంజు వైపు చూచింది. మంజు చెంపకు చేయి ఆన్చి నేల కేసి చూస్తోంది. ఆమెకు తెలుసా మంజులోని బడబాగ్ని.
ఉన్నట్లుండి ఆమె ముఖంలో వేయి విద్యుద్దీపాల కాంతి మెరిసింది. కుమార్ వైపు చూచి నెమ్మదిగా ఉద్రేకంతో స్పష్టంగా అంది.
"ఈ పెళ్ళి అయితే నువ్వు నాకు స్వంత కొడుకు వరస అవుతావు బాబూ- ఆ పిల్లకూడా నీ పెళ్ళామంతటి అందగత్తె బుద్ధిమంతురాలైతె మాకే చింతా లేదు... నాకు యిష్టమే.......మాట్లాడుకుంటూ వుండండి..... వడ్డనకు ఏర్పాట్లు చేస్తాను."
ఆమెతోపాటు కోడలుకూడ వెళ్ళిపోయింది.
ప్రతివారి హృదయాలు తేలికపడినై. మంజుల హృదయంలోనే మనఃపూర్వకంగా నమస్కరించిందామెకు!
"ఈమెలో యింక సంస్కారం- సౌకుమార్యం- దయా - ప్రేమ- మానవత్వం ఉన్నయ్యా అని అందరూ విస్తుపోయినవారే.
"మా చెల్లి ఎంత పుణ్యం చేసుకుందో - వీరికి కోడలు కాబోతుంది" అని మంజు బిగ్గరగానే అనేసింది.
"ఏవేవో సంశయాలతో బుర్రలు పాడు చేసుకున్నాం. చూశారా క్షణంలో తేల్చి పారేసింది" భార్య నుద్దేశించి అన్నారాయన.
మూర్తి ఎటో చూస్తూ కూచున్నాడు.
"అమ్మ అంటే అందరికి భక్తి శ్రద్ధలున్నాయి. సుగుణాల పుట్టినిల్లు, నాకు జ్ఞాపక మున్నంత వరకు ఆమె కోపగించుకోవటం ఇంతవరకు చూడలేదు. ఆమెను సేవిస్తే పుణ్యం లభిస్తుందని మీ కోడలి భావం. మరి రెండో కోడలి కా భాగ్యం లేదు. దేనికైనా పరమేశ్వరుని దయ ఉండాలి. అన్నగారు "ప్" అంటూ తేల్చి చెప్పారు. ఖాసి వింటూ తల పంకించి మూర్తి దెస చూచాడు.
