'ఏం చెప్పమంటారన్నట్లు హరికృష్ణ వంక చూసింది.
'ఇక్కడే! మద్రాసు లోనే కొన్నాను శారదా! నువ్వూ వున్నావుగా ఆరోజున!'
'ఆహా? అదా! అత్తయ్య చీరా! గుర్తుకు వచ్చిందిలే!'
అనూరాధకా చీరనా క్షణం లో విప్పి వేయాలన్నంత అభిమానం ఆవహించింది. కానీ నిగ్రహించుకుందెంతో ప్రయత్నం మీద.
'క్షమించండి! అపార్ధం జేసికోవద్దు! బావ ఎవరికీ ఏనాడూ స్వయంగా కానుకగా ఏ వస్తువునీ యివ్వలేదు. మీకు తానెంతో అపురూపంగా భావించే అత్తయ్య చీరనే యిచ్చినందుకు ఆశ్చర్యం వేసింది. మీరందుకు అర్హులనే అనిపించుతోంది నాక్కూడా. బావ జీవితం యిక నైనా వో దారిన పడుతుందన్న ఆశ కలిగింది మిమ్మల్ని చూడగానే!' అన్నదామె హరికృష్ణ బయటికి వెళ్ళిన తరువాత.
ఆశ్చర్యం పరువు లేత్తిందామె కనుల నిండుగా ఆ మాటలు వినగానే.
'మీరే భావంతో అంటున్నారో నా కర్ధం గావడం లేదు. కానీ ఒకటి మాత్రం నిజం శారద గారూ! హరికృష్ణ గారిలోని కళా హృదయం అందించిన కాన్క అనే స్వీకరించాను నేను. మరో వూహ నాలో లేదు.' అన్నదామె మృదు స్వరంతో.
క్షణ మాత్రం మౌనం వహించింది శారద.
'మంచిది! మీ డాన్సు చూడాలి! రేపు తప్పక వస్తాం!' అన్నది మాట మార్చి. కానీ ఆ గొంతున యిదివరకటి మాధుర్యం వర్తించ లేదు.
అనూరాధ కారులో కూర్చుంటుండగా అన్నదామె తిరిగి --
'నీ మనస్సు నోచ్చుకుందేమో చెల్లాయ్! ఈ అక్కయ్య ని కొంచెం తొందర స్వభావం. మరేమీ అనుకోకు. రేపోసారి వస్తాను కొంచెం కోపగించు కోక మనస్సు విప్పి మాట్లాడు!' ఎంతో ఆత్మీయత దోర్లిందా స్వరం నిండుగా. ఏదో చెబుదామనుకుంటుండగా కారు కదిలి పోయింది. ఆ హోరులో అనూరాధ పెదవుల పై నున్న అక్షరాలూ విన్పించనే లేదేవరికి.
మంజుల గారి యిల్లు యిదేనని కారు ఆపించాడు హరికృష్ణ వో మేడ ముందు.
'మళ్లీ వస్తాను రేపు సాయంత్రం!' అంటూ సెలవు దీసి కొన్నాడతడు. అంతలో మంజుల వచ్చింది బయటికి. ఇంటరు లో మంజులా, అనూరాధ లిద్దరూ ఎంతో స్నేహంగా వుండేవారు. మంజుల తండ్రి జడ్జీ కావడంతో మద్రాసు వచ్చేశారు.
'రా! అనూరాధా! మద్రాసు వచ్చి కూడా దాక్కున్నావన్న మాట! ఎవరింటి దగ్గరున్నావు తల్లీ! ఆయనెవరో ఫోను చేశారిందాక. మీ బంధువులే ననుకుంటానే!' అంటూ ఆప్యాయంగా లోనికి తీసికొని వెళ్ళిందామెను.
మంజుల తల్లి మనస్సున మృదుత్వం అన్నది మచ్చుకైనా కన్పించదు. తామే మహారాజుల వంశం లో పుట్టినట్లు, యితరులంతా బానిస వంశం వారన్నట్లు ఎదుటి వారిని హీనంగా చూస్తుంది.
'ఏమ్మా! అనూరాధా! నాన్నగారు పోయారటగా! ఎలా జరుగుతోంది?! అందుకేనా తల్లీ! డాన్సులు చేస్తున్నావ్? ఏం చేస్తావులే మరి! తిండి తినాలి గదా'
! ఇంకా నయం ఆ డాన్సు అన్నా వుంది...' దండకం ఆరంభ మైంది.
'అమ్మా! నాన్నగారు పిలుస్తున్నారెందుకో చూడు! అనూకి నిద్ర వస్తోందనుకుంటాను పక్కలవీ వేయించు తాను ' అంటూ మంజుల తల్లి దండకాన్ని ఆపి వేసింది. అనూరాధ వూపిరి పీల్చు కుంద ప్పటికి.
'నువ్వేమీ బాధపడకు అనూ!అమ్మ ధోరణే అంత!' స్నేహితురాలికి నచ్చ జెప్పింది.
కానీ ఆ యింటి లో క్షణం కూడా వుండలేనేమో నన్పించుతోందామెకు. స్నేహితురాలి మనస్సు బాధ పడుతుందని పైకి మాట్లాడకుండా వుండి పోయింది. మంజుల చెల్లెళ్ళు ద్దరు తమ్ముడోకడు. వాళ్ల అమ్మ దగ్గర జేరి అనూరాధను గురించి వో హరికధ జెప్పించుకుంటున్నారు.
'వాళ్ళకేమీ లేదురా! ఈ అమ్మాయి సంపాదనే తిండికీ, బట్టకీ సరిపెట్టు కుంటున్నారట. పాపం! ఎక్కడైనా హోటల్లో దిగితే ఖర్చ వుతుందని మన యింటికి వచ్చింది.' ఆయాసమన్నదే లేకుండా శ్రోతలకి విందు చేస్తోందా మహాతల్లి.
అనురాధలోని అభిమానం తారాజువ్వలా లేచింది. కానీ లాభం లేదని దిగమ్రింగింది బాధను. ఆ పిల్లలు మాటిమాటికి గది తలుపుల సందుల్లో నుంచి చూస్తూ చిన్నగా నవ్వుతున్నారు.
'పాపం! నిద్రబోతోంది పాప! అమ్మ చెప్పిందిగా! వాళ్లకు పడుకోడానికి మంచాలు కూడా లేవనీ.'
'దుప్పటి కూడా లేదటరా!' అంటోందో పిల్ల.
'అన్నమే లేదని అందిగా అమ్మ!' మరో అమ్మాయి సన్నాయిలా పాడుతోంది.
'భగవాన్! ఎలా పుట్టించావు తండ్రీ! ఈ ,మనిషిని? ఎదుటి వాళ్ళ నింతగా చిత్రవధ చేసే వాళ్ళ మీద నీకెందుకు ఆగ్రహం రాదు?' ఆక్రోశించింది అనూరాధ మృదు హృదయం. ఎంత ప్రయత్నించినా నిదురే రాలేదామేకు. మంజుల హాయిగా నిద్ర పోతోంది. ఆలోచనలు తెరల్లా కమ్ముతూనే వున్నాయి. ఎప్పటికో నిదురలో కి జారిపోయిందామె.
* * * *
రాత్రి నిద్ర సరిగా లేకపోవడం మూలాన ఉదయాన ప్రొద్దెక్కి లేచింది అనూరాధ. లేవగానే ఆ యింటి వాతావరణం గుర్తుకు వచ్చి పారిపోదామన్పించింది. అంతలో మంజుల 'కాఫీ రెడీగా వుంది అనూ! ముందు ముఖం కడిగి స్నానం చేసిరా!' అంటూ వచ్చింది.
ఎలాగో స్నానపాదులు ముగించింది. పది గంటలు కాగానే శారద కు ఫోను చేసింది, మంజుల వంట యింట్లో కి వెళ్లినప్పుడు.
'అక్కయ్యా! వో చిన్న కోరిక. నేను ఏలూరు వెళ్లే వరకూ మీ యింట్లో వుందాలను కుంటున్నాను. కాదనరని తెలుసు. కానీ మీరు వో గంటలో వచ్చి నన్ను వెంట బెట్టుకుని వెళ్ళమని అడుగుతున్నాను. వివరాలు తర్వాత చెబుతాను. ' అన్నది ఫోనులో.
'అలాగే నమ్మా! ఇదో ఇప్పుడే బయలు దేరుతున్నాను! నిన్ననే వుండి పొమ్మని అందామనుకున్నాను. కానీ మీ స్నేహితురాలు ఎమనుకుంటుందోనని ఆగిపోయాను.' అంటూ ఫోను పెట్టేసింది శారద.
'అమ్మయ్యా!' తృప్తిగా విశ్వసించింది అనూరాధ. ఆ యింట్లో నుంచి ఎంత త్వరగా బయట పడితే అంత మేలు అన్నట్లుందామెకు. ఆ వాతావరణం లో వుంటే మరునాడు 'నృత్యం ' లో ఒక్క అడుగు కూడా అందంగా కాదు కదా! భావయుక్తంగా కూడా పడదన్న భయం వూపివేస్తోందామెను.
అందుకే శారదకు ఫోను చేసింది చేసేదేమీ లేక.
శారద వో అరగంట లో వచ్చి మంజులకు నచ్చ జెప్పి అనూరాధ ను వెంట దీసుకొని వెళ్ళింది. వాళ్ళ యింటికి రాగానే వో గ్లాసుడు మంచినీళ్ళు త్రాగి అన్నది.
'అబ్బ! ఇప్పటికి ప్రాణం కుదుట పడిందక్కా! మీ చేతి మంచినీళ్ళు త్రాగగానే!'
'అక్కా, చెల్లెళ్ళ మధ్య 'మీ' అన్న పరాయి పదం వద్దు అనూరాధా! అక్కా! అని పిలువు చాలు!' అన్నది శారద.
మంజుల తల్లి స్వభావం చెప్పగానే నవ్వింది శారద.
'ఉంటారు అనూ! అలాంటి వాళ్లీరోజుల్లో చాలామంది వున్నారు. వాళ్ళను గురించి పట్టించు కోగూడదు. సరే! ఇంతకూ బావ నీకెలా తెలుసు?' అన్నది.
జరిగిన సంగతంతా చెప్పింది అనూరాధ. చెప్పినదంతా జాగ్రత్తగా విన్నదామే.
'అనూ! నేనో మాట చెప్పనా! బావ మనస్సున నువున్నావు. సందేహం లేదు. ఆ! అగు! నన్ను చెప్పనివ్వు! నీకా వూహ లేదు. నాకు తెలుసు. మల్లె కన్నా తెల్లనైన నీ మనస్సు బావ నెంత గానో ఆకర్షించింది. నా గురించి నీకేం తెలుసునని ప్రశ్నించకు. ఏదో మంత్రం వేసి మాయ చేస్తున్నానని అపోహ పడకు. కానీ ఈ అక్కయ్య కు మాత్రం వో మాట యివ్వాలి!' వో క్షణం ఆగిపోయిందామె అనూరాధ కనులలోకి చూస్తూ.
'బావ మనస్సు ఎంతో సున్నితం! ఇప్పటికే ఎంతో బాధ రగులుతోందా గుండెల్లో. ఆ బాధని నీ మనస్సులో పరువులేత్తుతూన్న అమృతంతో మాయం జేయగలవని నమ్ముతున్నాను.'
'ఉండక్కా! అంత వున్నతంగా వూహించకు. మాట యివ్వలేను. క్షమించు? ఇలా అంటున్నందుకు. ఏ శిక్ష విధించినా భరించు తాను. ఈ నీ చెల్లాయి చుట్టూరా వున్న పరిస్థితులు ఏమీ ఆశాజనకంగా లేవు. ఒకరికి మాట యిచ్చెంత వోపిక లేదిపుడు నాలో" అన్నది అనూరాధ.
'శిక్షించకుండా వదలదీ అక్కయ్య! కానీ ఆ శిక్ష లో ఆనందమే గానీ, బాధ వుండదని మాత్రం గుర్తుంచుకో!' అన్నది శారద మందహాసం చేస్తూ.
అనూరాధ తర్వాత మౌనంగా వుండి పోయింది. మరునాడే 'ప్రోగ్రాం' కావడం మూలాన అభినయం లో వున్న మెలకువలను మరోసారి సరిజూచుకుందా రాత్రి.
తొమ్మిది గంటలు కొట్టింది గడియారం. వెన్నెల వెలుగులో ప్రకృతిఅందాల నవ వధువులా మెరిసి పోతోంది. చల్లని గాలులు వచ్చి పలుకరించి పోతున్నాయి. మల్లెలు తెల్లగా నవ్వుతున్నాయి. మాలతీ లత ఒయ్యారా లొలుకబోస్తోంది.
విరిసిన మల్లెలు పరిమళాల్ని వెదజల్లు తున్నాయి. తోటలో పూవుల దర్బారు లో ఆ సుమ బాలం ముచ్చట్లు వింటూ అందాల్ని కంటూ కూర్చున్నారు శారదా, అనూరాధలు.
హరికృష్ణ పది నిమిషాల్లో వస్తానని ఫోను చేశాడు. అందుకే నిదుర తూలీ పోతున్నా అనూరాధ మేల్కొనే వుంది. శారద కిలా మెలకువ గా వుండడం అలవాటే. రాత్రి పదిన్నరా , పదకొండు గంటలయ్యే వరకూ భర్తతో యేవో సంగతులు ముచ్చటించుతూనే వుంటుందామె.
శరత్ బాబు 'నవల' శ్రీకాంత్ ని గురించి మాట్లాడు కుంటుండగా వచ్చాడు హరికృష్ణ.
'ఎన్నాళ్ళ కో అన్నమాట నిలబెట్టుకొన్నావు బావా! నువ్వు నిజంగా వస్తావని అనుకోలేదు. మా చెల్లాయి 'అనూరాధ' ముందు మంచి వాడిలా మారిపోదామని అనుకుంటున్నావేమిటి?' పరిహాసం లో యదార్ధం తళుక్కున మెరిసింది.
'నటించడం నాకు రాదు శారదా!' కించిత్ కోపం ధ్వనించిందని గొంతులో.
'కాని కోపం మాత్రం పిలిస్తే పలుకుతుంది ' నవ్వుతూనే అన్నదామె.
'అని అనూరాధ గారికి చెప్పానులే!' అన్నాడతను. తర్వాత అతడు 'డాన్సు ప్రోగ్రాం గురించి మాట్లాడి వెళ్ళిపోయాడు.
శారద కూడా తోడుగా వెళ్ళిందా రోజున. సమాజం మేనేజరు అడ్వాన్సు గా అయిదు వందల రూపాయలు లిచ్చాడు. అనూరాధ మనస్సున ఎంతో సంతోషం నిండి సందడి చేసింది.
కృష్ణు ని కోసం వేచి వున్న గోపికగా అభినయించింది ముందుగా. ఆ కంఠనా అమృతం నిండి వున్నట్లు, మధురాతి మధురంగా శ్రోతలను రసమయి జగత్తులో వూయల లోపీ వేసింది.
మయూరి కన్నా వయ్యారంగా వంపులు దిరిగి పోతోందా సన్నని నడుము. ఆ విశాల నయనాలలో అనురాగం మెరుపులా మెరిసి పోతోందోసారి. విరిసిన మల్లియలా స్వచ్చంగా నవ్వులు చిందించుతోంది మరో మారు.
వెన్నెల రేఖలా తళుక్కు మంటున్నదా అందాల మయూరి. విరిసిన మందారం లా ఎర్రదనంతో మెరిసి పోతున్నాయి చెక్కిళ్ళు.
అందెలు కదలుతున్నాయి. భావాలు పులకించి పరవశంతో తూలీ పోతున్నాయి. అడుగు అడుగునా అందమైన భావం పురి విప్పిన మయూరం లా ఆడుతోంది అభినయం అన్పించడం లేదేవరికి.
దివి నుంచి భువి కి దిగివచ్చిన దేవతా మూర్తి లా మనస్సులలో మందారాల్ని పూయించుతోందామె.
విమర్శ కూడా వినరానంతటి ఆనంద పారవశ్యాలతో ప్రేక్షకులు కనురెప్ప వేయకుండా చూస్తుండి పోయారా కమనీయ నృత్యాన్ని.
అ సన్నని నడుము ఎన్నో వంపులు తిరుగుతోంది.
ఆ కమ్మని కంఠం ఎంతో సొంపుగా వినదించుతోంది. శారద ఆశ్చర్యంతో పెదవి కడుపలేక పోయింది. ఆనందంతో నిండిన ఆమె హృదయం పరవశత తో కూలిపోయింది.
హరికృష్ణ కనులనిండుగా ఆనందం వెల్లి విరిసింది. అనూరాధ అతని హృదయాన దివ్య భామిని లా, అనురాగ వీణియలా మెరిసి పోతోంది.
