4

సారధి వస్తూనే లింగరాజు ను ముక్కు మీద రెండు గుద్దులు గుద్దాడు. రెండు పలుపులు తెచ్చి స్తంభానికి వేలాడ గట్టి "లింగరాజూ అవేమిట్రా ?" అన్నాడు.
"పలు--పు-లు " అన్నాడు నత్తిగా లింగరాజు.
"కాదు. ఉరి తాళ్ళు. నువ్వు చేసిన తప్పుకి నీకు ఉరిశిక్ష విధిస్తున్నాను. అది మెడకు తగిలించుకో" అన్నాడు.
లింగరాజు బావురుమంటూ సారధిని కౌగలించుకొని ఏడ్చాడు. సారధి నవ్వుతూ, "ఇంకెప్పుడూ నిప్పుతో చెలగాటం అదకు. ముక్కు తుడుచుకు పో!" అన్నాడు.
లింగరాజు చెర్లో నెత్తుటి మరకల్ని కడుక్కుని ఇంటికి చేరాడు. రామదాసు గారడిగితే , పడ్డానని చెప్పాడు గాని, జరిగిన సంగతి చెప్పలేకపోయాడు లింగరాజు.
* * * *
ఒకనాడు సీనియర్ ఇన్ స్పెక్టర్ గారు వచ్చారు స్కూలు తనిఖీ చేయటానికి.
హెడ్ మాస్టార్ మూడు నాలుగు పిండి వంటలు చేయించారు. రామదాసు గారింటికి, స్కూలు అరమైలు దూరం ఉంది. ఊరి బైట స్మశానాల్లో కట్టారు స్కూలు. సారధి, నేను హెడ్ మాస్టారింటి దగ్గిర నుంచి టిఫిన్ కారేజీ తీసుకొని వెళుతున్నాం స్కూలికి. దోవలో మర్రి చెట్టెక్కి , నన్నూ పైకి రమ్మన్నాడు సారధి.
ఆ మర్రి చెట్టు రెండు చెరువుల మధ్య ఉంది. దాని మీద ఒక తొర్ర ఉంది. అందులో కట్ల పురుగులు తిరుగుతుంటాయని అందరికీ తెలుసు. నేను తోర్రలోకి ఎక్కటానికి సందేహిస్తున్నాను.
"భయపడకురా, విఠల్. అయువుంటే మనం ఏం చేసినా చావం. ఆయువు తీరితే ఏం చేసినా చస్తాం. మన లింగరాజు నా ఉరిశిక్ష నుంచి ఎలా బయట పడ్డాడంటావ్ ? ఆయుర్దాయం ఉండబట్టే" అంటూ నన్ను చెయ్యి పుచ్చుకు పైకి లాగాడు.
టిఫిన్ కారేజీ తెరిచాడు. ఒక గిన్నెలో అరడజను లడ్లున్నాయి. తానొకటి తిని నా కొకటి ఇచ్చాడు. నాకు తినాలనిపించ లేదు. తప్పు చేస్తున్నామని కాదు. రామదాసు గారికి తెలిస్తే వీపు చిట్లు తుందేమోఅని భయం. బలవంతంగా నోట్లో లాడ్డుండ పెట్టాడు. రెండో గిన్నె లో ఆవడలున్నాయి. చేరోకటి తిన్నాం. మూడో దాన్లో పులిహోర ఉంది. సగం ఆరగించాం. మిగిలిందే ఇన్ స్పెక్టర్ గారికి దక్కింది.
మధ్యాహ్నం క్లాసులో బోర్డు మీద 'ఇన్ స్పెక్టరు గారు ఎంగిలి తిని మైల పడిపోయారు -- ఇట్లు లింగరాజు" అని వ్రాశాడు. ఇన్ స్పెక్టరు గారది చదివి మండిపడి, లింగరాజేవరు? నుంచోవాలి " అన్నాడు.
లింగరాజు వణుకుతూ నుంచున్నాడు.
రామదాసు గారు ఆగ్రహావేశాలతో ఊగిపోయి కొడుకుని విరగ బాదారు. చివరికి ఇన్ స్పెక్టరే అడ్డం వెళ్లి రామదాసు గారిని శాంతింప జేశాడు. ఆనాటి నుంచి సారధి ముఖ్య మిత్రుల్ల్లో లింగరాజు ఒకడయ్యాడు.
నాటి నుంచి లింగరాజూ, నేనూ, ఇద్దరమే ముఖ్యస్నేహితులమయ్యాం సారధికి.
* * * *
మేం స్కూలు ఫైనలు చదివే రోజుల్లో మనో మోహిని అనే పంతులమ్మ వచ్చింది మా ఊరు. ఎలిమెంటరీ స్కూల్లో ఆమె పని చేసేది . పేరులాగే మనిషి కూడా బాగుండేది. కొంచెం ఒత్తరిగా, పొడుగాటి జడతో , కొంచెం ఎడం కాలు ఎగరేసుకుంటూ నడిచేది. ఆమెను చూసి, పాలమ్మే గవళ్ళ యువకోకడు --
"పొడుగు జడల దానా,
పొంగే వయసు దానా
కైపూ కలిగించుదానా, నా
నైపూ చూడుము చెలియా!"
అని పాట వ్రాసి, బడి ఊడ్చే జాలమ్మ కిచ్చి, "ఫలానా పంతులమ్మ కు ఇయ్యి" అన్నాడు. ఆ జాలమ్మ ఆ నాటు రకం ప్రేమ గీతాన్ని, దాంతో ఉన్న లేఖనూ తెచ్చి సరాసరి (పొరపాటున) హెడ్మాస్టరు సవ్యసాచి గారి కిచ్చింది. ఆయనది చూసి గుడ్లు మిటకరించి . చిత్ర విచిత్రంగా నృత్యం చేసుకుంటూ మనోమోహిని క్లాసు లోకి వచ్చి "నీలాంటి అందమైనవాళ్ళుంటే ఇదే ప్రమాదం. నాకే మతి పోతుంటే " అంటూ అదే ధోరణి లో గంటన్నర మాట్టాడి, అలిసి లేచి పోయాట్ట!
ఆనాటి నుంచీ నిజంగానే సవ్యసాచి గారి మతి పోయింది. అయన యాభై ఏళ్ళ జీవితంలో ఆయన చేతి కింద ఆ మాత్రం అందగత్తె పనిచెయ లేదట. రోజూ మనో మోహినిని తన గదిలోకి పిలిపించి రభస చేయటం మొదలు పెట్టాడు.
"ఈ ముసలి పీనుగుతో చస్తున్నాను తమ్ముడూ!" అంది మనో మోహిని ఒకనాడు పార్ధ సారధి తో.
మనో మోహిని ఉంటున్న ఇల్లు పార్ధ సారధి వాళ్ళ ఇంటి పక్కనే ఉండేది. పార్ధ సారధి అంటే మనో మోహినికి చాలా ఆదరం కలిగింది. ఒక్కర్తే ఉండేది. పార్ధ సారధి ని స్వంత తమ్ముడు కంటే ఎక్కువగా చూసుకునేది. తల దువ్వేది. టిఫిన్ లు పెట్టేది. కధలు చెప్పేది. క్రమక్రమంగా వాళ్ళు ఎంతో అత్మీయిలై పోయారు.
పద్నాల్గేళ్ళ సారధికి పంతులమ్మ సమస్యలు పూర్తిగా అర్ధం కాకపోయినా ఏదో గొడవగా ఉందని తెలుసు. ఒకనాడు నా దగ్గిరికి వచ్చి, "ఆ ముసలిపంతులు పని పట్టాలిరా!" అన్నాడు.
అన్న మాట కాదంటే వాడు ప్రాణం తీస్తాడని నాకు తెలుసు.
"ఏం చేస్తావురా?' అన్నా.
"చూద్దుగానిగా" అంటూ పరుగుపరుగున వెళ్ళిపోయాడు సారధి.
స్కూలు అయిదు గంటలకు వదిలి పెట్టినా, సవ్యసాచి మాత్రం ఆరు గంటల దాకా బళ్ళో నే ఉండటం అలవాటు. డానికి కారణం ఆయనకు, వేరే ఇతర వ్యాపకం లేకపోవటం ఒకటి. గ్రామ పెద్దల దృష్టి లో ఉద్యోగ ధర్మం పట్ల తనకున్న శ్రద్దా సక్తుల్ని ప్రదర్శించాలనే తాపత్రయం రెండో కారణం. ఆనాడు సాయంత్రం స్కూలు నుంచి ఇంటికి బయలుదేరాడు సవ్యసాచి.
పొద్దు కుంకుతుంది. సవ్యసాచి గారికి మరో అలవాటుండేది. తనలో తాను మాట్లాడు కోవటం . ఒకోసారి తనలో తనే నవ్వుకుంటూ నడిచి వెళుతుండేవాడు. మరోసారి ఏవో లెక్కలు చేస్తున్నట్టు వెళ్లు లెక్క పెట్టుకుంటూ నడిచి వెళుతుండే వాడు. ఆనాడూ అలాగే తనలో తాను మాట్లాడుకుంటూ , వేళ్ళు లెక్క పెట్టుకుంటూ వెళుతున్న సవ్యసాచి గారి తలకు మర్రి చెట్టు తొర్ర లోంచి ఒక రాయి వచ్చి తగిలింది. గావుకేక పెట్టుకుంటూ కింద పడ్డాడు మాస్టారు. సారధికి ఉండేలు కొట్టటం లో అద్భుతమైన ప్రజ్ఞ ఉండేది. ఆకాశంలో ఎగురుతున్న పక్షిని కొడితే, అది గిలగిల తన్నుకుంటూ నేల రాలవలిసిందే. అలాటి సారధికి తాపీగా తల వంచుకు నడిచి పోతున్న సవ్యసాచి గారిని కొట్టటానికి కష్టమేముంది?
సారధి ఉండేలు దెబ్బకు మాస్టారి తల తిరిగి పోయింది. కళ్ళు బయర్లు కమ్మాయి. ఇద్దరు మనుషులు ఆయన్ని మోసుకొని ఇంటికి చేర్చారు. ఆ మరునాడు మాస్టారు గారికి ఒక ఉత్తరం అందింది.
"ముసలి నక్కా, నా దెబ్బ రుచి చూశావుగా. ఈసారి పంతులమ్మ జోలికి పోయావంటే ప్రాణాలు దక్కవు. జాగ్రత్త."
సారధి ఎత్తుగడ అమోఘంగా పనిచేసింది. మూడోనాడు పంతులమ్మ ను పిలిచి మాస్టారు పితృ వాత్సల్యం పొంగి, కళ్ళు చెమ్మ గిల్లగా గాద్గాదిక స్వరంతో ఇలా అన్నారు:
"మనో మోహినీ! నువ్వు నా బిద్దలాటి దానివి. నాకు పిల్లలు లేరు గానీ, ఉంటె నీ అంత కూతురుండవలసింది. నీ తండ్రినే అనుకో. నీ మేలు కోరిన సంరక్షకుడి ననుకోమ్మా. ఊరు మంచిది కాదు. వయసులో ఉన్నదానివి. ఒంటరిగా ఉంటున్న దానివి. చూడమ్మా! బ్రహ్మ కైనా పుట్టు రిమ్మ తెగులు లన్నట్టు పెద్ద లున్నారే ఈ ఊళ్ళో వాళ్ళు మరీ దొంగలు. కుర్రవాళ్ళే ఇంకా నమ్మదగిన మనుషులు. నీకేదో సహాయం చేస్తున్నట్టు నటిస్తూ దగ్గిరికి చేరి, ఉచ్చులో వేసుకుంటానికి ప్రయత్నిస్తారు. జాగ్రత్త , తల్లీ!" అంటూ సవ్యసాచి గారు ముగించారు హితోపదేశం.
* * * *
మా ఊళ్ళో కి ఒక యోగి వచ్చాడు. అతను అతి చిన్నతనం లోనే సమస్తం వర్ణించి, హిమాలయాలకు పోయి, సంవత్సరాల తరబడి తపస్సు చేసి, సిద్ది పొంది దివ్యశాక్టు ల్ని సాధించిన వాడట. అతన్ని బెల్లపు వీరయ్య నే ఆసామీ ఆహ్వానించి, సత్కరించి, తన ఇంట్లోనే ఒక నెల రోజులుంది అతిధ్యం స్వీకరించమని, ప్రార్ధించాడు. స్వామి వారందుకు అంగీకరించారు.
రోజూ ఏవో హోమాలు, పూజలు జరుగుతుండేవి. వీరయ్య గారింట్లో నుంచి పొగలు రేగుతుండేవి రాత్రింబవళ్ళు కాగడాలు వేలుగుతుండేవి . స్వామి వారు రోజూ సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా గంభీరోపన్యాసాలు చేస్తుండేవారు. క్రమక్రమంగా వందలాది జనం అక్కడ చేరటం మొదలు పెట్టారు.
అయిదారుగురు స్త్రీలు ఇతర వ్యాపకాలన్నీ వదిలి పెట్టి స్వామి వారి సేవకే జీవితాలను అంకితం చేసుకున్నారు. అందులో మనో మోహిని ఒక్కర్తే. బడి మానింది. ఇంటికి రావటం మానింది. నిరంతరం స్వామి సేవలోనే మునిగి తెలుతుండేది.
స్వామి అప్పటికి మా ఊరు వచ్చి రెండు నెలలయింది. రెండు నెలల్లో ఒక్కనాడు కూడా మనోమోహిని బడికి రాలేదు. సవ్యసాచి గారు పంపగా జాలమ్మ వచ్చి మనో మోహాని ని హెచ్చరించింది.
అలా స్కూలు మానితే ఉద్యోగం నిలవదని కబురు చేశారు హెడ్ మాస్టారు. డానికి సమాధానంగా రాజీనామా పత్రం వ్రాసి పంపింది.
ఉళ్ళో రకరకాలుగా చెప్పుకుంటున్నారు.
స్వామి మందు పెట్టాడని కొందరన్నారు.
ఆ మత్తు తల కేక్కిందని కొందరు వ్యాఖ్యానం చేశారు.
ఊళ్ళో చాలా మందికి స్వామి వారి మీద ఆగ్రహావేశాలు కలిగాయి. కాని అయన చాలా శక్తి కలవాడనీ చేతబడి చేసే సమర్ధుడనీ గ్రామంలో ఒక పుకారు బయలుదేరింది. స్వామి వారి దగ్గిరికి జనం వెళ్ళటం ఆకస్మికంగా ఆగిపోయింది.
మా వూరు స్వామి గారు వచ్చేముందు సారధి వాళ్ళ మేనమామ గారింటికి వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి ఊరంతా అట్టుడికి పోతుంది. మనోమోహిని గురించి కూడా ఉదృతంగా దుమారం వీస్తుంది. సారధి ఇంటికి వచ్చేసరికి ముకుందరావు గారు బెల్లపు వీరయ్య తో మాట్లాడుతున్నారు.
"ఆ తద్దినం ఎందుకు తెచ్చి పెట్టుకున్నావు, బావా! వదిలించు కోపోయావా నిమ్మదిగా?" అని అడుగుతున్నాడు ముకుందరావు.
"నే తెచ్చి పెట్టుకున్నప్పుడు ఇంత జరుగుతుందనుకోలేదు , బావా! ఇప్పుడాయాన్ని పొమ్మంటానికి భయం వేస్తుంది." అన్నాడు వీరయ్య.
వాళ్ళ సంభాషణ లో జరుగుతున్నా విషయమంతా గ్రహించాడు పార్ధసారధి. తాను విన్నదంతా చెప్పి, "అరేయ్! ఆ సన్యాసి అంతు తెలుస్తానురా" అన్నాడు.
నేను భయంతో కంపించాను. సన్యాసి కి నేనే కాదు, ఊరంతా భయపడుతున్నారు.
సారధి ముందు మోహినిని కలుసుకొని, "వీడు దొంగ . వీడు నీకు మందు పెట్టాడు. వీణ్ణి నువ్వు నమ్మబోకు. వీడి దగ్గిర నువ్వుండబోకు" అని చెప్పాడుట.
కాని మోహిని ఈతని మాటలు వినిపించు కోకుండా, "అయన దేవుడు అయన అవతార స్వరూపుడు, మహా పురుషుడు. ఆయనే నా పతి. అయన సేవ కంటే నాకీ జీవితంలో కావలసింది లేదు ఆయన్ని దూషించకు కళ్ళు పోతాయి . దేవుడు శిక్షిస్తాడు. నువ్వు కూడా అయన శిష్య కోటిలో చేరు" అని పిలిచిందిట.
స్వామి ఏదో మాయ చేసి, మందు పెట్టి, "మోహిని మతి పోగొట్టి స్వాధీనం చేసుకున్నాడని ఊరందరి తో పాటు గా నేనూ నమ్మాను. స్వామి అంతు తేల్చుకుంటానికి లక్ష మార్గాలు ఆలోచించేవాడు. సారధి. నాతొ చర్చించేవాడు. అవి చాలా దారుణమైన సంగతులు. ఆలోచించటానికే నాకు వణుకు పుట్టేది. మరునాడు "స్వామిని చూసి వద్దాం రారా ముందు. ఆ తరువాత చెబుతాను" అన్నాడు సారధి. నాకూ చూడాలనిపించింది. ఇద్దరం స్వామి దర్శనానికని బయలుదేరి వెళ్లాం.
