
7
నిజంగా శంకరనారాయణ గారికి అరుణ అంటే పంచ ప్రాణాలూను. ఆ అమ్మాయిని చూడనిదే , ఆ అమ్మాయి యోగ క్షేమాల్ని ఆ అమ్మాయి నోటంట విననిదే , ఆ అమ్మాయికి చదువు చెప్పనిదే , ఏనాటి కానాడు ఏ సుమతి శతకం లోనివో , వేమన శతకంలోనివో పద్యాలు అరుణ అప్ప జెప్పనిదే , తన చిన్నారి చేతులతో ఆ అమ్మాయి తనకు చెయ్యగల పరిచర్యలను చేయించు కొనిదె ఆయనకు తృప్తి ఉండేది కాదు. ఆనాడు కూడా తండ్రీ, బిడ్డా అలవాటు చొప్పున కాస్సేపు చదువుల తోనూ, కాస్సేపు కబుర్ల తోనూ కాలక్షేపం చేశారు.
"నాన్నగారండీ , మరి కధ చెప్పరూ?"
"అప్పుడే చడువాయి పోయిందా, తల్లీ?"
"ఓ!"
"అబద్దం! అబద్దం చెబితే చాలా పాపం!"
"నేనసలు అబద్దమాడి ఉంటేగా?"
"మరి , నీవు ఈ వేళ వేమన శతకం లోని పద్యం అప్పజెప్ప లేదుగా?"
అరుణ నాలిక కరుచుకుంది. "మరిచి పోయానండీ నాన్నగారూ!"
శంకర నారాయణ గారు ఆ అమ్మాయి పడిన తికమక చూచి, జాలిగొని నవ్వారు. "పోనీలే, ఆ పద్యాన్ని కూడా గడగడ అప్పజేప్పేసేయ్యి. ఆ తరవాత మంచి కధ చెబుతా. రెడీ ? వన్ ...టూ.......త్రీ!"
"అనువుగాని చోట నధికుల మనరాదు ;
కొంచెముండు టెల్ల కొదవ కాదు.
కొండ ఆద్దమందు కొంచెమై యుండదా?
విశ్వదాభి రామ వినుర వేమ."
"శభాష్! చాలా బాగా అప్పజెప్పావమ్మా! నీ చెల్లెళ్ళు చదవనీ, చదవక పోనీ..నీవు మాత్రం ఈ శతకాలన్నింటినీ కంఠతా నేర్చుకో అమ్మా. ఇంతకంటే మంచి చదువు పది పంచవర్ష ప్రణాళికలు గడిచినా, ఏ ప్రభుత్వమూ ప్రజల కందించ లేదు."
"మరి కదండీ, నాన్నగారూ!"
'అనగా అనగా ఒక అయ్య. అయన పేరేమో...."
"మీ పేరే!"
"సరి! ఆ శంకరనారాయణేమో చాలా పేదవాడు."
"ఊ........మీరేం పేదవారు కారు!"
"ఎవడు పేదవాడు, ఎవడు ధనవంతుడు -- అన్న విషయాన్ని , ఈరోజుల్లో మన దగ్గిర ఉన్న డబ్బుతోనే నమ్మా కొలిచేది! వాడెంత గుణ వంతుడయినా, కానీ, ఎంతటీ సహృదయుడైనా కానీ డబ్బు లేనిదే సమాజం లో వాడి కే స్థానమూ ఉండదు."
అరుణ ఒక్క క్షణం అలోచించి , "నాన్నగారూ ప్రపంచంలో డబ్బు అన్నది అసలు పుట్టలేదనుకోండి అప్పుడెలా ఉండేది మన ప్రపంచం?" అంది.
"అమ్మ తల్లో! నేనంత చదువు చదువుకోలేదు. కాబట్టి, ఆ విషయాన్ని అలా వదిలేసి, ఈ శంకరనారాయణ అన్న వ్యక్తీ కధకు వద్దాం. ఆయనకేమో ముగ్గురు కూతుళ్ళు...."
శంకరనారాయణ గారిని ఇక ముందుకు పోనివ్వలేదు అరుణ . "ఆ....నా కంతా తెలుసు! పెద్దమ్మాయి పేరు అరుణ అంటూ మొదలెట్టి, చిన్నమ్మాయి లిద్దరూ చదువుకోరు , దేనికీ పనికి రారు అంటారు! తప్పండీ నాన్నగారూ! పాపం, సీతామహాలక్ష్మీ , సరస్వతీ ఎంత మంచివారు! నాలా పెద్దయితే, వాళ్ళూ అన్నీ తెలుసుకుని, బాగా చదువు కుంటారు!"
"అబ్బో! అయితే నీ వంత పెద్దదాని వయ్యావన్న మాట?"
"కాలేదేం మరి?"
"అయితే నీ పెళ్లిని గురించి ఆలోచించ వలసిందేనమ్మా ఇంక."
"ఊ.......పొండి , నాన్నగారూ!" ఆ పిల్ల అపరిమితంగా సిగ్గు పడింది. అందుకనే కాబోలు, 'అష్ట వర్శాద్భనేత్కాన్యా" అన్నారు పెద్దలు!
'అరుణా!"
అరుణ ఇంకా ముచ్చటగా ముద్దుముద్దుగా సిగ్గు పడడం లోనే మునిగిపోయి ఉంది.
"బంగారమ్మా!"
"ఊ......పొండి , నాన్నగారూ! మరెప్పుడయినా నన్నిలా ఏడిపించారంటే అమ్మతో చెబుతా!"
శంకరనారాయణ గారు కేవలం నటన కోసం భయాన్ని తెచ్చి పెట్టుకుని, "అమ్మో! అంతపని చెయ్యకు, తల్లీ. అసలే మీ అమ్మ..." అంటుండగానే అరుణ, "నాన్నగారూ! అమ్మ" అంటూ హెచ్చరించింది.
నిజంగానే కనకదుర్గ విచ్చేసింది. తనను గురించి ఏదో చెడు చర్చ జరుగుతుందన్న సంశయం ఆమెలో నిలిచిపోయింది. 'ఆగిపోయారేం? అనండి. "అసలే మీ అమ్మ రాక్షసి! భూతం! దెయ్యం!" మొదలయినవన్నీ అనాలనేగా మీరు మొదలెట్టింది! అదికాదే, ఇక్కడికి వచ్చి, నామీద చాడీలూ చెప్పి చావకుంటే, ఆ అంట్లు తోమి చావరాదూ? బెత్తెడు లేవు, అప్పుడే నీకీ పాడు బుద్దులా? దిక్కు మొక్కూ లేని.........."
"దుర్గా!' గొంతు చించుకుని అరిచారు శంకర నారాయణ గారు. కనకదుర్గ నోరు మూసుకుని కళ్ళప్పగించి నిలుచుంది.
"అయినదానికీ, కాని దానికీ ఈ అమాయకురాలి మీద కారాలూ, మిరియాలూ నూరుతావెం? ఆ అంట్లు నీవు తోమరాదూ? ఆ ఇద్దరూ పిల్లల చేతా తోమించ రాదూ?"
"అయ్యో! ఎందుకు చేయించ రాదూ? మనం ఆ ఇద్దర్నీ కన్నదేందుకూ ? ఈ అరుణ దేవి గారికి ఊడిగం చేయించడానికేగా?' అంటూ రుసరుస లాడుతూ వెళ్ళిపోయింది ఆ ఇల్లాలు!
శంకరనారాయణ గారు మౌనంగా నే మిగిలిన తన కోపాన్ని తనలోనే అణిచి ఉంచుకోడానికి ప్రయత్నించారు.
"నేను వెళతాను, నాన్నా."
"అవసరం లేదమ్మా? నీవెంత? నీ వయసెంత? నీవా అంట్లు తోమడ మేమిటి? నానా చాకిరీ చెయడ మేమిటి? అసలు నీవు రేపటి నుంచీ నా గదిలోనే ఉండు; స్కూలుకు వెళ్ళు, రా ; నేను తిన్నప్పుడే తిను; ఇక్కడే చదువుకో, ఇక్కడే పడుకో , అంతే! ఆ తల్లీ.....ఆవిడ అనుంగు బిడ్డలూ అటు వైపు రాజ్యం ఏలుకోనీ .' ఊ నీ తెలుగు వాచకం తియ్యి!"
"అన్ని పాఠాలు చదివేశాను కదండీ , నాన్నగారూ? చెల్లాయిల్నీ పంపుతాను. వాళ్లకు చెప్పండి చదువు . నే వెళతా."
"వద్దన్నానా, అమ్మా?"
"తప్పండీ, నాన్నగారూ! ఆడపిల్లలు ఇంటి పనులు చెయ్యకపోతే చెడిపోతారు!"
"సరి! ఇవాళ ఇదొక కొత్త ఉపదేశమా? వెళ్ళమ్మా వెళ్ళు. నీకున్న జ్ఞానం నీకంటే ముప్పై ఆరేళ్ళు ఎక్కువ వయస్సున్న ముత్తైదువు కు ఉంటె బాగుండును మరి!"
":ఎందుకండీ , నాన్నగారూ, అన్నిటికీ అలా కస్సుబుస్సు మంటారు? అమ్మ మనస్సు నొచ్చు కోదూ? అసలు మీతో డాక్టరు గారేం చెప్పారు?"
"తల్లీ! నన్నిలా వదిలెయ్యి. వెళ్లి, నీ ఓపిక కొద్దీ కొంప లోని చాకిరీ అంతా దేకు. ఫో!"
"చెల్లాయిల్నీ ఇప్పుడే పంపిస్తాను" అంటూ అరుణ వెళ్ళిపోయింది.
అంత మంచిది ఆ అమ్మాయి. అంతటి సహృదయుడు ఆ దయామయుడు. కేవలం కనకదుర్గే చెడ్డ దంటారా? పాపం, ఆ ఇల్లాలి బాధలు ఆమెకు లేవూ?
సాధారణంగా ఇటువంటి పరిస్థితుల్లో కనకదుర్గ అలిగి, ఓ మూల కూర్చుని , ఇక ఆ పూట అన్నం మానేసేది. సీతామహాలక్ష్మీ, సరస్వతి అన్నాలు తిని, పడుకుని నిద్ర పోతున్నాసరే, ఎంత రాత్రయినా సరే, అరుణ మాత్రం ఆమె ఎదట అలానే కూర్చునేది . ఒకొకప్పుడు అదీ బాధాకరంగానే ఉండేది కనకదుర్గ కు.
"ఎందుకే అలా గుడ్పప్పగించి , ఉసూరుమంటూ నా ముందు నీవు కూర్చోడం?"
"అమ్మా, నీవు అన్నం తినకుంటే నేనూ తిననే! నీవు అలా బాధపడుతూ కూచుంటే, నేనూ అలాగే ఉండిపోతాను."
"అయితే అలానే తగలడు! చూచినా వారంతా 'ఆహా!ఓహో! వయసులో చిన్నదయినా, ఆ అరుణ ఎంత గొప్ప గుణమే! మా అమ్మ , మా తల్లీ , ఆ దుర్గ ఉందే?......దుర్గే!" అంటూ అందరూ నన్నాడి పోసుకుంటుంటే విని, ఆనందించుదువు గానీ! అదేగా నీకూ, ముఖ్యంగా అయన గారికీ కావలసింది? మా కర్మ! మా తలరాత!" అంటూ ఆపసోపాలు పడేది కనకదుర్గ.
అదేం భవంతా? ఎక్కడో కూచుని , ఏదో సణుక్కుంటే, ఎవ్వరికీ వినపడకుండా ఉండడానికి? శంకర నారాయణ అన్నీ వినేవారు.
"అరుణా, ఆ పడికాపులు కాయడానికి నీకేం ఖర్మ తల్లీ? వెళ్లి, బువ్వతిని , పడుకో . ఫో!" అనేవారాయన.
'ఉహు....పాపం అమ్మ అంతగా బాధపడి పోతుంటే ........."
"బాధపడ్డం మీ అమ్మకో సరదా, తల్లీ! నువ్వెళ్ళు!"
"ఉహూ."
"వస్తూన్న , ఉండండి!" అంటూ అలానే కష్టపడి, లేచి , కర్ర ఊతగా తీసుకుని , కుంటుకుంటూ వీరున్న చోటికి వచ్చేవాడాయన.
"ఏమిటే నీకిప్పుడు వచ్చిన బాధ? ఆ చిన్న పిల్లను సూటిపోటి మాటలని, సతాయించి, నమిలి మింగవద్దె అని నేననడం తప్పయిందా? నీవు తిండి మానితే మాకేవరికో ఆకలవుతుందను కొంటున్నావా? అరుణా, లే! నా మీద ఒట్టు! మనమంతా చూస్తుండగా అలకమాని అన్నం తింటే, అమ్మకు సిగ్గుగా ఉంటుంది. అందుకని, మనం ఎంత త్వరగా పక్కకు తప్పుకుంటే అంత మంచిది రా!" అంటూ బలవంతంగా చెయ్యి పుచ్చుకుని తీసుకు వెళ్లి, అరుణ అన్నం తినేలా చేసేవారు శంకర నారాయణ గారు.
