సావిత్రి నవ్వుతూ "నా సంగతి వేరయ్యా. నేను భార్యని. సర్వమూ సంతోషంగా స్వీకరించాలి."
"ఆ!...స్వీకరించాలి!....ఈ రోజుల్లో ఆడవాళ్ళు........"
"నువ్వు పట్నం వెళ్లి పట్టించుకొన్న సంగతులు ఇవా! నువ్వింకా ఏదో పెద్ద చదువులు చదివి కలెక్టరు అవుతావని మీ అన్నయ్య కలలు కంటుంటే--- చాల్లే-- లేచి మొహం కడుక్కో-- నీళ్ళు కాగిపోతున్నాయి. బట్టలు వేసుకుని హాస్పిటల్ కేసి రమ్మని చెప్పరు మీ అన్నయ్య-- నీతో ఏదో మాట్లాడవలసిన పని ఉందట!" అంది సావిత్రి గబగబా , తిరిగి గోపాలం సమాధానం చెప్పడానికి కేమీ అవకాశం ఇవ్వకుండా.
అంత అవసరంగా అన్నయ్య తనతో మాట్లాడవలసిన సంగతేమిటో చెప్మా అని ఆలోచిస్తూ, కాలక్షేపం కోసం తను రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్న వివేక వారధిని పత్రికలు ఒకటే రెండు పట్టుకుని గోపాలం హాస్పిటల్ కేసి వెళ్ళాడు.
రోగులతో అక్కడ మంచి రద్దీగా వుంది. బీదా బిక్కీ , ముసలీ ముతకా అంతా మందు సీసాలు పట్టుకుని గుంపులు గుంపులుగా ఉన్నారు. వచ్చిన రోగుల్ని పరీక్షిస్తూ , పరీక్షించిన వాళ్ళకి చీటీలు రాసిస్తూ, మధ్యమధ్య సలహాలిస్తూ అతిగా మాట్లాడుతున్న వాళ్ళనీ, ప్రశ్నలతో మరీ విసిగిస్తున్న వాళ్ళని, మందకొడి గా ఉండి అడిగిన డానికి కూడా సమాధానాలు చెప్పని వాళ్ళని , మందలిస్తూ , చివాట్లు పెడుతూ చీదరించు కుంటూ, ఉండుండి కాంపౌండరు కి ఏవో సలహాలిస్తూ , అన్నయ్య చాలా హడావిడి గా ఉన్నాడు.
అలాంటప్పుడు పలకరిస్తే వచ్చే ప్రమాదం ఏమిటో అనుభవం వల్ల తెలిసిన గోపాలం దగ్గర్లో ఉన్న ఓ బెంచీ మీద చతికిల బడ్డాడు. చేతిలో ఉన్న పత్రికల పుటల్ని తిరగేస్తున్నా అక్కడ జరుగుతున్నదల్లా వినిపిస్తూనే ఉంది.
"ఈ పూట పద్యం తినచ్చాండీ?" అంది ఎవరో ముసల్ది.
"తింటే చస్తావ్!....జ్వరం ఇంకా నూరుంది. ఇవాల్టీ కి కూడా లంకణం పడుకో , ఫో!' అన్నాడు అన్నయ్య.
గోపాలం మనస్సు చివుక్కుమంది.
ఎందుకంత పరుషంగా అనడం?
"కడుపు నొప్పి ఎందుకు వచ్చింది ?....ఒళ్ళు తెలియకుండా తిని ఉంటావు అడ్డమైన గడ్డి...ఊ....ఈ చీటీ పట్టికెళ్ళి కంపౌందరు గారి చేత మందు కలిపించుకొని తీసికెళ్ళు".....
"ఇంకా తగ్గలేదు?....తగ్గుతుంది లే....దెబ్బ తగిలించు కోవడం అంత సులభం కాదు తగ్గడం ".....
"సూది మందే ఇయ్యాలో పోట్లాలూ అరకే ఇయ్యాలో నువ్వేమిటి నిర్ణయించేది?....అట్టే అతి గడుసుదనం చూపించక నోరు మూసుకుని ఇచ్చిందేదో పట్టికేళ్ళు"..... ..... ......
ఇలా అన్నయ్య ఇష్టం వచ్చినట్లు విసుక్కుంటూ నోరు పారేసు కుంటా ఉంటె వాళ్ళంతా ఎలా ఊరు కుంటున్నారా అని ఆశ్చర్య పోసాగాడు గోపాలం.
క్రమంగా గంట గంటన్నర అయేసరికి , వచ్చిన జనంలో చాలా భాగం వెళ్ళిపోయి, రద్దీ చాలా మట్టుకి తగ్గింది. అప్పటికి కాని శంకరానికి తల ఎత్తి దూరంగా బెంచీ మీద కూచున్న గోపాలాన్ని చూడడానికి విశ్రాంతే చిక్కలేదు.
"ఎంత సేపయిందిరా వచ్చి?..... కూర్చో వస్తున్నా" అంటూ తిరిగి తన పనిలో నిమగ్నుడై పోయాడు శంకరం. ఇంకో అరగంట అయినా శంకరానికి కాళీ అవలేదు. ఎవళ్ళో ఒకళ్ళు వస్తూనే ఉన్నారు. జనం హడావిడి తగ్గి తాపీగా ఉండడం వల్ల కాబోలు వాళ్ళతో సావకాశంగా మాట్లాడుతున్నాడు శంకరం. కాళీగా మాట్లాడడమే కాదు ఓర్పుగా వాళ్ళు చెప్పే సంగతులన్నీ వినడం, వాళ్ళ స్వంత విషయాలూ, సంసారం సంగతులూ తెలుసుకుని సమస్యలకు తగిన పరిష్కారాలని కూడా చూచించడం , సలహాల నివ్వడం, ధైర్యం చెబుతూ సానుభూతి ప్రకటించడం , ఇవన్నీ చేస్తున్నాడు శంకరం. "చూస్తె ఇందాకటి అన్నయ్య కీ, ఇప్పటి అన్నయ్య కీ పోలిక ఏవైనా ఉందా?.... అంటూ ఆశ్చర్యపోసాగాడు గోపాలం.
ఎంత ఆదరణ తో వాళ్ళ కుటుంబ సభ్యుల నందరినీ పేరు పేరు వరసనా అడిగి వాళ్ళ యోగ క్షేమాలు తెలుసు కుంటున్నాడు! ఇప్పటి దాకా తను అన్నయ్య గురించి వేసిన అంచనా తప్పు అన్నమాట. ఒకమాటు ఆదరించినా ఇంకో మాటు అగ్రహించినా , అన్నయ్య వీళ్ళ నందరినీ కష్ట సుఖాలలో నూ ఆత్మీయుడి లా కలిసి పోయాడు. ఈ చుట్టూ ప్రక్కల పది పదిహేను గ్రామాల అశేష ప్రజానీకం జీవితాలలో అన్నయ్య నిత్యజీవితం . సదుగూ పేకలాగా అల్లుకు పోయింది!
ఇలా గోపాలం ఆలోచించుకుంటూ ఉంటె శేషయ్య హాస్పిటల్ కి వస్తూ "ఏం గోపాలం ! ఊళ్లోనే ఉన్నావా?....ఇంకా వెళ్లి పోయావేమో సెలవలు అయిపోయి అనుకున్నా ఈ మధ్య కనిపించక పొతే-" అని పలకరించాడు.
గోపాలం సమాధానం చెప్పే లోగానే శంకరం "రండి, రండి - ఏవిటీ మధ్య బొత్తిగా నల్లపూస అయిపోయారు ? అన్నాడు నవ్వుతూ.
"ఎదండీ- గట్టు లంకలు వేయించడం, మెరక పల్లాలు సర్ధించి చేలో మంద కట్టించడం , ఆకూ మడికి నీరు తోదించడం -- ఇలా పొలం పనుల్లో పడి కొట్టుకుంటున్నా -"
"ఆహా......."
"అవును గానీ, మా కోడలు పిల్ల అసలు మా యింటికి రావడమే మానుకుందెం నెల్లాళ్ళయి?"
"ఇదిగో -- వాళ్ళ బాబాయి వచ్చాడు. వాడు వస్తే ఇంక అది మాతో కూడా మట్లాడదు. కబుర్లు, భోజనం, పడకా అంతా వాడితోనే. గోపాలం కూడా అంతే. ఉన్న నాలుగు రోజులూ దానితోనే కాలక్షేపం వీడికి. కధలు చెబుతూనో, బొమ్మలు చూపిస్తూనో, తను పట్నం నుంచే తెచ్చిన బిస్కట్లు తినిపిస్తూనో...."
"ఆ-- బిస్కట్లు అంటే జ్ఞాపకం వచ్చింది. మా వాసుకి కూడా ఈ లంచం చూపించి నట్లున్నాడు గోపాలం. రాకమండ్రి మామయ్య గారు బిస్కట్లు పెడతారు అంటూ మీ ఇల్లు పట్టుకొని వదలడం లేదు వాడు."
గోపాలం నవ్వుకున్నాడు. తను రాజమండ్రి మావయ్య అయినందుకు. శంకరం మనస్సులో సంతోషించాడు తమ్ముడు కూడా తనలాగే శేషయ్య మీద గౌరవాన్నీ, వాసు మీద వాత్సల్యాన్ని చూపిస్తూ తమ ఉభయ కుటుంబాల మైత్రికీ దోహదం చేస్తున్నాడని.
"నాయనా. నీ పట్నావాసం బిస్కట్లు రావడంతో, మా పల్లెటూరి మిఠాయి కొమ్ములు చేదయ్యాయి. ఇంత క్రితం పిల్లలిద్దరూ మా అరుగుల మీద కాసు క్కూచునే వారు. నేను పొలం నుంచి ఎప్పుడొస్తానా , సెట్టి కొట్లోంచి మిఠాయి కొమ్ముల పొట్లాలు ఎప్పుడు తెస్తానా అని."
"పోనీ బావగారికి ఖర్చు తప్పింది" అన్నాడు శంకరం నవ్వుతూ.
"అవునవును , మిఠాయి పొట్లాలు కొనక పోవడం వల్ల మిగిలిన డబ్బులు పిడతలలో పోసి దాచి ఉంచాను, రేపొద్దున్న అబ్బాయి పెళ్ళికి అమ్మాయి కిచ్చే శుల్కం క్రింద ఉపయోగిస్తుందని."
"మీ వాడికి కన్యాశుల్కం ఇచ్చి కల్యాణం చెయ్య వలసిన కర్మేం వచ్చిందండీ!.....లక్ష రూపాయలు వర కట్నం ఇచ్చి మరీ ఇస్తారు పిల్లని " అన్నాడు శంకరం:
"లక్ష రూపాయలా? మాకు ఏం ఉందని?"
"అదేవి టండోయ్ !....పాతి కేకరాల సుక్షేత్రమైన మాగాణీ ఉంది. కుర్రాడా మెట్రిక్ చదువుతున్నాడు. నేదో రేపో పేస్ అవుతే, ఏ జడ్జియో చదివిస్తారు."
"మీ నోటి వాక్యాన మావాడు పరీక్షలన్నీ పేస్ అయి జడ్జీ అయి ఆ బెంచీ మీద కూర్చుండగా చూస్తె చాలు. నేను అంతకంటే కోరేది ఏం లేదు."
"నిక్షేపం లా అవుతాడు. బి.ఏ చెప్పించి, 'లా' చదివించండి అన్నాడు శంకరం.
"లా" అనే మాట వినేసరికి గోపాలానికి తను "లా" చదవడం సంగతి జ్ఞాపకం వచ్చింది. అన్నయ్య దగ్గర ఆ సంగతి ఎప్పుడో కదపాలి అనుకున్నాడు.
"వాసు చదువు సంగతి నీ మనస్సు లో ఎలా పట్టేసిందో, మా మణి పెళ్లి విషయం నాకంత పట్టేసిందండీ" అన్నాడు శంకరం.
అది విని గోపాలం ఉలిక్కిపడ్డాడు. ఆరేళ్ళు నిండాయే లేదో మణికి అప్పుడే పెళ్ళా?.....పద్దెనిమిదేళ్ళు వచ్చిన విజయ కి లేని మంగళ సూత్రా బంధం పసిపాప అయన మణికా? ...పన్నెండేళ్ళున్న వాసు ఎప్పుడో జడ్జి కావాలనే సంగతి వాళ్ళు ముచ్చటించు కుంటూ ఇప్పుడు మురిసి పోతుంటేనే తనకి అసందర్భంగా కనిపించిందే. అంతకంటే దారుణం కాదూ , ఆరేళ్ళ పిల్ల పెళ్లి ప్రస్తావన?....మనుష్యులెంత పెడ మార్గాల్లో ఉన్నారు? అందుకే వీరేశలింగం వంటి మహానుభావు లంతా "ఈ సంఘం పిచ్చి మర్గాన పడి తగలబడి పోతోంద ర్రోయ్ !....దీన్ని సత్వరం సంస్కరించాలిరోయ్!" అంటూ నెత్తీ నోరూ బాదుకొని చెప్తున్నారు.
ఇంతలో శేషయ్య అన్నాడు "మణి పెళ్ళికి ఇప్పుడు తొందరేం వచ్చిందండీ!" అని.
అన్నయ్య కంటే శేషయ్య గారికే కొద్దిగా అభ్యుదయ భావాలున్నాయన్న మాట!....
"అవును అన్నయ్యా. పసిగుడ్డు -- డానికి పెళ్ళేవిటి?' అన్నాడు గోపాలం.
"పసిగుడ్డు ఏవిట్రా?....మా పెళ్లి నాటికి మీవదిన ఇంతకంటే పెద్దదా ?.....ఇప్పుడు కాకపొతే వచ్చే ఏడయినా చెయ్యవలసిందే కదా -- అయినా అదీ నిజమేలే-- మీ వదిన చెప్పినట్లు ముందు నీ పెళ్లి కానిస్టే తర్వాత దాని సంగతి ఆలోచించవచ్చు. నీ పెళ్లి ఇప్పటికే ఆలస్యం అయి పోయింది. యుక్త వయస్సు రాని పిల్లని నీకు ఈడు జోడుగా ఉండేదాన్ని చూడాలి" అన్నాడు శంకరం.
గోపాలానికి గుండెల్లో రాయి పడింది.
"పెళ్లి సంగతి కేమోచ్చే గాని , నిన్ను రమ్మని చెప్పింది వేరే ఇంకో ముఖ్య మైన సంగతి మాట్లాడడం కోసం " అన్నాడు శంకరం- హమ్మయ్య-- గోపాలం హృదయం తేలిక పడింది ఈ మాటతో --
"ఆ సంగతెతో ఇక్కడ హాస్పిటల్లో ఎందుకు? ఇంటికి వెళ్ళాక మాట్లాడుకో కూడదూ?" అన్నాడు గోపాలం కొంచెం విసుగ్గా.
"హాస్పిటల్ అయితే మాత్రం ఏం?.... ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరున్నారు?....మన శేషయ్య గారూ, మన కాంపౌండరు గారు....అన్నాడు శంకరం.
"నేను వస్తానండి , పనుంది....అంటూ లేవబోయాడు శేషయ్య. "భలేవారే! అలా మొహమాట పడి పరాయి వాళ్ళలా వేల్లిపోతారేమిటి?.....పైగా మీ సలహా కూడా కావాలి ఉండండి" అని శంకరం బలవంతంగా శేషయ్య ని ఉంచేశాడు.
పేషెంట్స్ అందరూ వెళ్ళిపోవడం చూసి తను చెప్పదలుచుకున్నది ప్రారంభించబోయాడు శంకరం. ఇంతలో చేతికర్ర సాయంతో కుంటుకుంటూ వచ్చి పెద్ద కాపుకి , డాక్టరు కి నమస్కారం చేసి నిలబడ్డాడు , బలమైన నలభై ఏళ్ళ ఓ నల్లని వ్యక్తీ.
"ఏం సుబ్బడూ ఎలా ఉంది?' అని శంకరం అడిగాడు.
"బాబయ్యా ఇప్పుడు బాగా నయం అండి. నడుస్తున్నాను మీ దయ వల్ల" అన్నాడు సుబ్బడు.
"ఏవైంది వీడికి?" అన్నాడు శేషయ్య.
'మొన్న కుప్ప నూర్చు రోజుల్లో ధాన్యపు బస్తాలు బండి కేసుకొని మిల్లు కాడకి ఎల్తుంటే, కొరడా కర్ర కింద పడిపోయిందండీ , తీద్దాం అని దిగేతలికి, మా కర్రి మొహం పొట్ల గిత్త లేదండీ అది అంత బరువు బండినీ నాగేత్తే , చక్రం కిందడి తోడ నలిగి పోనాదండీ"
సుబ్బడు అలా చెబుతూంటే అదంతా అప్పటికప్పుడు జరుగుతున్నట్లూ ఊహించుకొని శేషయ్య గట్టిగా కళ్ళు మూసుకున్నాడు.
బాధతో గోపాలానికి ఒళ్ళు ఒక్కసారి జలదరించింది.
"నువ్వింకా వెధవ గిత్తని అమ్మేసి, ఆ బండి తోలడం మానెయ్యి" అన్నాడు శంకరం. సుబ్బడు ఆదరిపడి, వెంటనే బిక్క మొహం వేసుకుని "మరి నా బతుకో అండి!" అన్నాడు.
"నీ బతుక్కి వచ్చిన భయం ఏం లేదు. నా గురపు బండి తోలుడువు గాని" అన్నాడు శంకరం.
"గు...ర్ర...పు...బం....డి....!" అన్నాడు ఆశ్చర్యంగా శేషయ్య.
"అవునండి బావగారూ!....పోరుగూళ్ళ నించి ఇక్కడికి కదిలి రాలేని పేషెంట్స్ ని రోజూ చూసి రావడం కోసం ఓ గుర్రాన్ని బండినీ కొందాం అనుకుంటున్నా" అన్నాడు శంకరం.
"పొద్దస్తమానూ మీకిక్కడే సరిపోతుంటే ఇహ పోరుగూళ్ళు వెళ్లి రోగుల్ని ఎప్పుడు చూసి వస్తారు ?....తెల్లారింది మొదలు చీకటడే దాకా ఒక్క క్షణం తీరిక ఉంటోందా మీకు?' అన్నాడు శేషయ్య.
"పగలి కాళీ లేకపోతె రాత్రిళ్ళు వెళ్ళాలి. ఎలాగో అలాగా వెళ్ళక పొతే పాపం కదలలేని పేషెంట్స్ గతి ఏమవుతుంది?' అన్నాడు శంకరం.
