

రాత్రి చాలా పొద్దుపోయే దాకా తను చదవబోయే ప్లీడర్ నాలుగేళ్ల లోనూ విజయ తన జీవితం లో ఆక్రమించుకోవడం గురించి ఆలోచిస్తూ ఉండి పోయాడేమో తెల్లారి మెలకువ వచ్చిన కలలా ఉంది గోపాలానికి. అందుకే మంచం మీంచి లేవకుండా ఉన్నాడు. తను పడుకున్న గది పక్కని భోజనాల వసారాలోంచి వదిన కంఠం వినిపిస్తోంది.
"ఏం వాసూ! అప్పుడే తెల్లారిందా?' అంది సావిత్రి.
"ఓ!....మా నాన్న అప్పుడే పొలం నుంచి పాలు కూడా పితికించుకుని వచ్చేశాడు. ఎండ జామిచెట్టు పైకి వచ్చేస్తే ఇంకా తెల్లారిందా అంటావేమిటి అత్తయ్యా!" అన్నాడు వాసు.
"నీ దృష్టి ఎప్పుడూ జామి చెట్టు మీదే. తెల్లారిందా అంటే మణి తోటి ఆడుకోవడానికి అప్పుడే వచ్చేశావా అని అర్ధం.
"అదా? ...సరే! ...మణి ఏదీ?...ఇవాళ కొత్త అట ఆడుకుందాం అంది..."
"ఏం అట?"
"తనేమో స్కూల్లో టీచరుట....నేనేమో చదువు రాని మొద్దబ్బాయి నిట....రోజూ బడికి తేగలూ, గుమ్మడి గింజలూ తెచ్చుకుని తింటూ ఉండడమే కాని చదువు కోవడం లేదుట నాకు అందుకు టీచరు నన్ను బెత్తంతో కొడుతుందట.....ఇవిగో గుమ్మడి గింజలు కూడా తెచ్చాను."
సావిత్రి పకపకా నవ్వుతూ "అసిభాడవా! ఆరేళ్ళయినా లేని తను టీచరు, తనకంటే రెట్టింపు వయస్సున్న నువ్వు మొద్దబ్బాయి వీనా?....పైగా నిన్ను తను కొడుతుందా?..... నువ్వు ఎందుకు ఒప్పు కున్నావు ఈ ఆటకి?.... నిన్ను రోజూ సైకిలు మీద నగరం పంపించి మేటిక్యూలేషన్ కి ప్రైవేటు చెప్పి నిన్నేదో జడ్జిని చెయ్యాలని మీ నాన్న చూస్తుంటే నువ్వు చదువు రాని మొద్దబ్బాయి వి అయితే ఎలా?...." అంది.
"ఇది ఆటలే అత్తయ్యా ....గుమ్మడి గింజలు దోసిట్లోంచి జారిపోతున్నాయి. ఏటికి వేగిరం బూడిద రాయాలి చెప్పు అత్తయ్యా మణి ఎక్కుడుందో?" అన్నాడు వాసు.
శేషయ్య గారి లాగే వాళ్ళ వాసుకి కూడా పాపం మాయా మర్మం తెలియదు. ఉత్త మంచివాడు. అందుకే వాడితో చల్లగా కబుర్లు చెప్పి మణి గుమ్మడి గింజలు తెప్పించింది. చక్కగా అన్నీ తను ఆరగించటానికి. మణి ఎలాగైనా తెలివైనది. చదివిస్తే బాగా పైకి వస్తుంది . ఇలా అనుకుంటూన్నా గోపాలానికి మళ్ళీ వాసు కంఠం వసారా లోంచి వినిపించింది.
"చెప్పు అత్తయ్యా.....ఏం చేస్తోంది మణి?....ఎక్కడుంది?"
"చెప్తే నాకు ఏం ఇస్తావు ..... ఓ ముద్దిస్తావా?...."
'ముద్దా ....? ఊ....అలాగే."
"అయితే ఇయ్యి
"ముందు చెప్పు"-- అయితే అదుగో లోపల పెరట్లో మొద్దు అబ్బాయి కోసం కాబోలు. పాత తడికన ఉన్న వెదురు బడ్డ విరుస్తోంది -- మరి నాకు ముద్దు ఇయ్యి--"
సావిత్రి వాసుని ముద్దు పెట్టుకొన్న చప్పుడు వినిపించింది గోపాలానికి "వదినకి మగ పిల్లలంటే ప్రేమ. వదిన కాపురానికి వచ్చేటప్పటికి తనకి ఏడెనిమిదేళ్ళు. అప్పటి నుంచి తనకి పది పన్నెండేళ్ళు వచ్చే దాకా రోజూ తల దువ్వేక నుదిటి మీద ఇలాగే ముద్దు పెట్టుకొనేది తనని." అది తలుచుకుంటే గోపాలానికి వదిన మత్రుత్వప్రేమా అంతా గుర్తుకు వచ్చి ఒళ్ళు పులకరించి కళ్ళల్లో నీళ్ళు నిలిచాయి. ఎంత యిదిగా చూసేది తనని?....ఇప్పటికి?.... వదిన దగ్గరే కదా తనకి చనువు ! ఆ ఆదరణ, వాత్సల్యం, తను ఎప్పటికేనా మరిచి పోగలడా?....మధ్య పాపిడి , సిగ , నుదుట గుండ్రని కుంకుం బొట్టు కళ్ళల్లో వాత్సల్యం, ఒంటి నిండుగా . రెండు భుజాల మీంచి కప్పుకున్న చీరా , నిండైన ఆ పవిత్ర విగ్రహం వదినది. ఎంత జోతిర్మయమైన మూర్తి చూడగానే చేతులెత్తి మొక్కాలని పించే ఆ వ్యక్తిని, అన్నయ్య అంత నిరసనగా నిర్లక్ష్యంగా ఎలా చీదరించుకోగలుగు తున్నాదబ్బా-- ఆమె ఔన్నత్యం అతనికి అర్ధం అయి ఉండదు. ఒకవేళ అర్ధం అయినా ఆ అహంకారం లో ఇంకేం కనిపించదేమో -- ఏమో.....
ఇలా మంచం మీద పడుకుని తాపీగా ఆలోచిస్తున్న గోపాలానికి ఉరివురిమినట్లు అన్నయ్య కోపమూరితమైన కంఠం.
వేన్నీళ్ళు పెట్టమని అరగంట నుంచి అరుస్తుంటే చెవిటి మొద్దూ వినిపించడం లే?,...ఆ కుర్ర వెధవ తో ముచ్చట్లు కట్టి పెట్టి నీళ్ళు తోలుపు. చప్పున హాస్పిటల్ కి తగలడాలి. ఈపాటి కప్పుడే అక్కడ పేషెంట్స్ చస్తూ ఉంటారు."
ఒళ్ళు మరిచి అన్నయ్య కంఠంలోంచి నిప్పులు వర్షిస్తుంటే వినడం గోపాలానికి చాలా రోజుల నుంచి అలవాటే. కాని ఈ మధ్యనేవిటో విని సహించలేక పోతున్నాడు ముఖ్యంగా ఈ నాలుగేళ్ల నుంచీ పరమ సాత్వికుడైన రామనాధం గారి సహచర్యం ఎంతో సంయమనం తోనూ సంస్కారం తోనూ ప్రవర్తించే వ్యక్తులతో పరిచయం నాగరికమైన సమాజంలో తిరుగుతూ ఉండడం వల్ల తనలో వచ్చిన గణనీయమైన పరిణామం. ఇవి అన్నీ కారణంగా అన్నయ్య అలవాట్లూ, ఆదరనలూ ప్రతి చిన్న సందర్భంలో నూ సర్దుకోలేక ఇతరుల మీద చూపించే కోప తాపాలూ. ఎబ్బెట్టుగా నూ జుగుప్సా కరంగానూ కనిపించ సాగాయి గోపాలానికి.
ఇప్పటి కిప్పుడు వదిన మీద అంత విరుచుకు పడడం ఎందుకు?.... సౌమ్యంగా "నీళ్ళు పెట్టు సావిత్రీ " అనలేడూ? అలా అంటే తన కెంత హాయి, ఆవిడ కెంత ఆనందం వినేవాళ్ళ కెంత సంతోషం ?.....పాపం అన్నయ్య మొరటుగా అన్న ఆ మాటలకి వదిన ఎంత నొచ్చు కుందో ఏమో....అయినా చూస్తున్నాడు కదూ. వదిన కాపురానికి వచ్చిన ఈ పది పదిహేనేళ్ళ నుంచీ కరుకు మాటలూ, కస్సుమనే చీదరింపు లే తప్ప అనునయంగా ఒక్క మాట అన్నయ్య ఆమెతో అన్నట్లు లేదు పైగా అమ్మని, నాన్న. బామ్మ ని తాతయ్య శాసిస్తూ బానిసలులా చూసేవారు. నేనింకా సర్దుకుపోతూ ఓర్పు వహిస్తున్నాన"ని ప్రగల్భాలు నొకటి.
అన్నయ్య అన్న మాటలకి వదినేం సమాధానం చెప్పినట్లు లేదు అవును తల చిల్లులు పడేలాగా పెట్టె అ కారణమైన చివాట్ల కి ఆమె ఎప్పుడో అలవాటు పడిపోయింది.
గోపాలం దీర్ఘంగా శ్వాస వదిలాడు.
అన్నయ్య స్నానం వగైరాలు పూర్తీ చేసుకొని హాస్పిటల్ కి వెళ్ళిన అలికిడి విని నెమ్మదిగా మంచం మీంచి లేచి ఇవతలికి వచ్చాడు గోపాలం -- వస్తూనే "అన్నయ్యేవిటి కేకలేస్తున్నాడు వదినా" అన్నాడు.
సావిత్రి తల ఎత్తకుండా "ఏం లేదు" అంది.
"ఏం లేదంటా వేమిటి నేను వింటే!"
"వింటే ఇంకెందుకు చెప్పడం ?" అంది నవ్వుతూ.
ఆ నవ్వు వెనకాల ఎంత విషాదం గూడు కట్టుకొని ఉందొ గోపాలానికి తెలుసు. భారంగా నిట్ట్టుర్చి "నువ్వు ఇలా వుంటే లాభం లేదు వదినా?"
"మరెలా ఉండాలి?' అంది చిన్నగా నవ్వుతూ.
"అనవసరంగా అలా అనేస్తుంటే ఊరు కుంటావెం?"
"ఆయనకి అలా చర్రున కోపం వస్తూ ఉండడం కొత్త విషయం ఏమీ కాదు కదా?....కోపం వచ్చిన ఆ ఒక్క క్షణం సమాధానం చెప్పకుండా ఊరుకుంటే సరి-- కెరటం లా ఉవ్వెత్తుగా వచ్చే అయన కోపానికి ఎదురు నిలిచే కంటే తలవంచుకుని ఉంటేనే మంచిది. తర్వాత లేవోచ్చు అయినా అయన కోపం క్షణం కంటే ఉండదు. ఒట్టి తాటాకు మంటలా వెలిగి ఆరిపోతుంది. ఆ తర్వాత అయన చూపించే ఆదరణ నీకు తెలియంది ఏమీ ఉంది?" అంది సావిత్రి సౌమ్యంగా.
"అయితే మాత్రం?....నాకు హృదయం లో నీ మీద బోలెడు ప్రేమ ఉందని చెప్పి ఆకారణంగా చీటికీ మాటికీ తిడుతూ ఉంటె పడతామా?"
"అలా అనకు గోపాలం, అయన మనసు ఎంత వెన్న లాంటిదో నీకేం తెలుసు?"
"అయితే కావచ్చు ఆ వెన్న తన దగ్గరే ఉంచుకోమను. ఇతరుల మొహాల మీద నిప్పు లెందుకు చెరగడం?"
"నిజమే అనుకో. కావలసిన వాళ్ళం కనక మనం సర్దుకు పోతున్నాం! పైవాళ్ళు భరిస్తారా మరి! ఏమిటో చాదస్తం చెప్పడానికి లేదు"
"భరిస్తారా అంటా వేమిటి ఒకనాటికి భరించరు. నువ్వు కనుక .......
