Previous Page Next Page 
దీప శిఖ పేజి 7


    శంకరం మొహం లోకి ఆశ్చర్యంగా ఒక మాటు చూసి అతని మానవీతయతకి మనస్సులోనే నమస్కరించాడు శేషయ్య.
    ఇంకా అక్కడే నిలబడి వుండిపోయిన సుబ్బడి తో "డ్రెస్సింగ్ చేయోంచుకుని ఇంక వెళ్ళు అన్నాడు శంకరం.
    వాడు బెదురు బెదురుగా "కాలు బాగు చేసి నా బ్రతుకు నిలబెట్టారు.......తమకు ఎంత యిచ్చుకోమంటారో సెలవియ్యండి బాబయ్యా" అన్నాడు.
    శంకరం "ఏవిటీ?....నాకుడబ్బిస్తావా?....ఎంత యిస్తావు?....ఓ వెయ్యి ఇయ్యి పోనీ....పోరా ఫో ....తనకి రోజు గడవటం లేదు కాని నాకు ఫీజు ఇస్తాడుట " అన్నాడు గద్దిస్తూ.
    పెదవులు వణుకు తుంటే కళ్ళ నిండా నీళ్ళు నిండి, డాక్టరు గారి అవధులు లేని ప్రేమకి కృతజ్ఞలు ఎలా చెప్పుకోవాలో అర్ధం కాక "బాబయ్యా" అని మాత్రం ఆనందంతో ఒక్క మాటు అరిచి , పడిపడి దణ్ణాలు పెడుతూ వెళ్ళిపోయాడు సుబ్బడు.
    "ఈయన డాక్టరు కాదు - దేవుడు " అనుకున్నాడు శేషయ్య. తను పొలంలో వుండగా చేల గట్లమ్మట మందు సీసాలు పట్టుకొని పోతూ "దరమాత్ముడు రా-- దమ్మిడీ అడగడు. ఎంత యిస్తే అంతే లేక్కట్టు కోకుండా "సరే" ఎల్లిరమ్మంటాడు, ఇసుగు లో రెండు కేకలేస్తే మాత్రం ఏంటి, సెయ్యి మాత్రం మా చల్లని చెయ్యి. గుక్కెడు రంగు నీళ్ళతో ఇట్టే రోగం రంగు తెలుస్తాడు . అంటుండే పొరుగూరి జనం జ్ఞప్తికి వచ్చారు శేషయ్య కి.
    ఇంతలో ఆదరా బాదరాగా ఒ పాతికేళ్ళ యువకుడు వచ్చి, తనకేదో ప్రొద్దుటి నుంచీ కడుపులో గాభరాగా ఉందనీ, గుండెల్లో నెప్పి , తల దిమ్ముగా వుండి భయంగా వుందనీ అన్నాడు. శంకరం గబగబా లేచి అతని గుండెలు , కళ్ళు, నాడీ పరీక్షించి "నగరం నుంచి ఈ మందులు తెప్పించుకుని వాడు. అందాకా ఈ మిక్చర్ పట్టుకేళ్ళు. వారం పది రోజుల దాకా తిరక్కుండా రెస్టు తీసుకో" అన్నాడు.
    ఆ యువకుడు అంతటితో తృప్తి చెందకుండా ఇంతకూ నాకు వచ్చిన జబ్బేవిటండీ!" అన్నాడు.
    "జబ్బు పేరెందుకు? ఇచ్చిన మందు పట్టుకెళ్ళి చెప్పినట్లు వాడుకోక?.... ఏం?... జబ్బు పేరు చెప్తే జబ్బకు కట్టుకొని ఊరేగుతావా?...పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి నాకాట్టే కోపం తెప్పించక వెళ్ళు వెళ్ళు" అన్నాడు శంకరం గట్టిగా.
    ఆ కంఠం లోని తీవ్రత కి శేషయ్య అదిరి పడ్డాడు.
    అన్నయ్య మొహంలోని ఎర్రని కోపం చూసి మొదట భయపడి వెంటనే మొహం చిట్లించు కున్నాడు గోపాలం.
    బిక్క మొహం వేసుకుని ఆ యువకుడు నెమ్మదిగా అడుగు కదిపాడు. .... అలవాటు వల్ల గోపాలం ఆశ్చర్య పోవడం లేదు గాని శేషయ్య కి వింతగానే వుంది శంకరం ప్రవృత్తి. నాలుగేళ్ల నుంచి చూస్తున్నాడు. వాళ్ళూ వీళ్ళూ అంటుండగా వింటున్నాడు గాని. శంకరం లో ఇంత మరీ విపరీతంగా ఒక మాటు అదరమూ, మరో మాటు ఆగ్రహమూ , వెలుగు చీకట్లూ లా ప్రస్పుటంగా కొట్టవచ్చినట్లు చూడలేదు. ఒక్కోసారి అంత జాలిగా ఉండే మనిషికి అంత ఆగ్రహం ఏవిటి?"
    ఇంతలో శంకరం కంపౌందరు తో భోం చేసి ఊరు వెళ్ళాలి అన్నారు కదా. వెళ్ళండి -- ఆ! ...అన్నట్లు పది రూపాయలు కావాలని నిన్న అడిగారుగా?.....నోట్లో ముద్ద పెట్టుకుని అలా నిలబడతారేం?...ఇవిగో పట్టు కేళ్ళండి " అంటూ అతణ్ణి పంపించేశాడు.
    కొంచెం సేపు నిశ్శబ్దంగా ఊరుకుని, ఆ తర్వాత గోపాలం కేసి తిరిగి "ఆ....ఇంతకీ..నీతో మాట్లాడాలన్న ఆ ముఖ్యమైన సంగతి ఏవిటంటే -- "పరీక్షలు బాగానే వ్రాశావు. పేస్ అవుతావని ధైర్యంగా ఎలాగా నీకు ఉంది కనుక ఆ విషయం ఉదహరిస్తూ , ఏ తాహశీల్దారు ఉద్యోగానికో దరఖాస్తు ఒకటి రాసి జిల్లా కలెక్టరు కి పంపించు. ఫలితాలు వచ్చాక అందరూ పెట్టె దరఖాస్తుల కంటే ముందే నువ్వు పెడ్తావు కనక ముందు నీకే ఉద్యోగం ఇస్తుంది ప్రభుత్వం" అన్నాడు శంకరం.
    "తహశీల్దార్ ఉద్యోగానికా? ...ధరఖస్తా?....ఎందుకు?" అన్నాడు గోపాలం ఆశ్చర్యంగా.
    "అవును తహశీల్దారే....అలా ఆశ్చర్య పోతావేమిటి ! ....ఇవాల్టి కి తాహషేల్దారు జేరితే, అపక నెమ్మదిగా సబ్ కలెక్టరు, జిల్లా కలెక్టర్ గా ప్రమోట్ అవుతావు.........."
    "నేనా బానిస వృత్తి చెయ్యను"
    "ఏవిటి? ...దర్జాగా జిల్లా జిల్లా నంతనీ పాలించడం బానిస వృత్తా?.... అట్టే పిచ్చి పిచ్చి జవాబులు చెప్పక, వెళ్లి చెప్పినట్లు చెయ్యి."
    "నువ్వు ఎన్ని చెప్పు అన్నయ్యా.....నేను మాత్రం ఆ ఉద్యోగాలు ఏవీ చెయ్యను"
    "ఆ....ఏవిటా తల బిరుసు....ఎందుకు చెయ్యవ్?"
    "నా కిష్టం లేదు అంతే!...."
    "ఉద్యోగం ఏదీ చెయ్యక ఇంత చదువూ చదివి ఏం చేస్తావ్? గాడిదలు కాస్తావా..."
    ఆ మాటకి శంకరం మొహం లోకి సమాధానం ఏం చెప్పకుండా ఊరుకున్నాడు గోపాలం . గోపాలం మొండి ప్రవర్తనా పెంకి సమాధానాలు చూస్తుంటే , శంకరానికి ఒళ్ళు మండి పోసాగింది. పరిస్థితి ఎలా విశామిస్తుందో అని భయపదిపోతూ ముళ్ళ మీద ఉన్నట్లున్నాడు శేషయ్య.
    "నిన్నే" మాట్లాడవేం?....దరఖాస్తు పెట్టకుండా ఏం చేద్దామని...."
    "లా చదువుతా" నెమ్మదిగా నేలకేసి చూస్తూ అన్నాడు గోపాలం. అది విని అదిరిపడి "ఏవిటి.....లా చదువుతావా?....లా చదివి ఏం చేద్దామని . ఎవర్ని ఉద్దరిద్దామని ?" అన్నాడు శంకరం.
    "లా చదివితే ప్లీడరీ చెయ్యొచ్చు " అన్నాడు శేషయ్య నెమ్మదిగా.
    "అది తెలుసులెండి ...కాని అది ఎలాంటి వాళ్ళకి ? వెనకాల బాగా ఉండి ప్రాక్టీసు వచ్చినా రాకపోయినా దర్జాగా గడిచి పోయే వాళ్లకి?.... "లా" చడువి ప్లీడరు అవుదాం సరదాగా అనక ఆదాయం వస్తే వస్తుంది లేకపోతె లేదు అనుకోడానికి మనమేమయినా జమిందారులమా?..... మాట్లాడరేమండి శేషయ్య గారూ. అన్నాడు శంకరం నిశితంగా శేషయ్యకేసి చూస్తూ  తటపటాయించి --"నిజమే మరి! వెనకాల భూములూ పుట్రా ఏం లేకుండా కేవలం  రెక్కల కష్టం మీద తమ్ముణ్ణి బి.ఏ. దాకా చెప్పించడమే కష్టం. అది కాక ఇంకా రెండేళ్ళు మద్రాసు వెళ్లి "లా" చదువుతాను - అనక ప్రాక్టీసు అందుకొక పొతే అప్పుడు కూడా ఓ వంద పంపిస్తూ ఉండు అంటే కష్టం కాదూ? అన్నాడు శేషయ్య నసుగుతూ.
    శేషయ్య నంగి నంగి మాటలు చూస్తె గోపాలానికి అసహ్యం వేసింది. "ఇతనేమిటి మధ్య?....చెప్పించేదీ చెప్పించనిదీ తనూ అన్నయ్యా చూసుకోవాలి కాని?.... శేషయ్య గారూ మీరు నోరు మూసుకోండి" అందాం అనిపించింది గోపాలానికి అందుకే కోపంగా శేషయ్య కేసి చూశాడు.
    "రెండేళ్ళు కాదు, ఇరవై ఏళ్ళు చెప్పిస్తాను. వాడి చదువు కంటే ముఖ్యం ఏముంది నాకు ఆహా అది కాదు , నా కర్ధం కానిదే టంటే రాజాలాంటి గవర్నమెంటు నౌఖరీ చేయనని ఈ ముదనష్టపు వృత్తి లో దిగుతానంటాడేవిటి?" అన్నాడు శంకరం బాధగా గోపాలం కేసి చూస్తూ గోపాలం ఏం సమాధానం చెప్పలేదు.
    మధ్యలో శేషయ్య కల్పించుకుంటూ .. "అలా అంటారేవిటి?....చెప్పించడమూ కష్టమే!....అవతల ఆసుపత్రీ ఇల్లూ అందులోనే వచ్చేలాగా ఓ పెద్ద బిల్డింగు కట్టాలని ప్లాను వేసుకుని ఉన్నారా.....ఇప్పుడు కాకపోతే ఇంకో నాలుగేళ్లకయినా పిల్ల పెళ్ళోకటి చెయ్యాలా?....అటువంటప్పుడు ఇంకా రెండేళ్ళు గోపాలాన్ని చదివించాలంటే కష్టం కాదూ " అన్నాడు.
అనక అన్నయ్య తనని చదివించెను, మానెను. ముందీ శేషయ్య ని నిలువునాచీల్చేయాలని అనుకున్నాడు గోపాలం.
    "ఇల్లుకేం వచ్చిందండీ అవసరమయితే ఇంకో రెండేళ్ళు అపు చేస్తాను. అందాకా ఏమి పంచనో, మీ పంచనో కాలక్షేపం చేస్తాను. అది కాదు సమస్య వీడికి పిచ్చి పట్టిందేవిటి?....ప్లీడరీ అంటాడేవిటి హాయిగా గవర్నమెంటు నౌఖరీ చేసుకో మంటే?....అన్నాడు కోపంగా గోపాలం కేసి చూస్తూ శంకరం.
    "అవునయ్యా ...అన్నయ్య ఎందుకు చెబుతున్నాడో అర్ధం చేసుకుని "అలాగే' అను ప్లీడరీ ఆలోచన మానుకుని" అన్నాడు శేషయ్య.
    తను "లా చదిసి ప్లీడరీ చేసి ఎలాగో లాగో జీవించాలని అందంగా నిర్మించుకొన్న ఆశల హర్మ్యాన్ని వీళ్ళిద్దరూ కలసి ఇలా కూలదోస్తుంటే గోపాలానికి ఎంతో బాధగా అనిపించింది. తన నిస్సహాయత మీద తనకే అసహ్యం వేసింది. మనస్సంతా చికాకయి ఇంక అక్కడొక క్షణం నిలబడలేక దిగ్గున లేచి విసురుగా వెళ్ళబోయాడు.
    అది చూచి శంకరం కోపంగా "ఏవిటా విసురు? చెప్పింది అర్ధం చేసుకోకుండా అలా తల బిరుసుగా ప్రవర్తించావంటే తన్ని ఇంట్లో కూర్చో బెడతాను జాగ్రత్త. వెర్రి వెర్రి వేషాలేయ్యక రేపే బయలుదేరి వెళ్లి చెప్పిన ప్రకారం కలెక్టరు కి అప్లికేషన్ ఇచ్చిరా -- ఎప్పటికైనా నువ్వు కలెక్టర్ అయితే నువ్వూ సుఖపదతావు. నేనూ ఆనందిస్తాను. ఆ లోకంలో ఉన్న అమ్మ ఆత్మా సంతోషిస్తుంది " అన్నాడు.
    గోపాలం ఏం సమాధానం చెప్పకుండా కోప మూర్ణిత హృదయంతో బయల్దేరుతుంటే " ఏం మాట్లాడ వేం?....సమాధానం చెప్పి మరీ కదులు.....ఇంకా ప్లీడరీ మానేసినట్టే నా?....నిన్నే......" అన్నాడు శంకరం.
    మానేసినట్టే లెండి...మాట్లాడడం లేదంటే మీ మాటకి అంగీకరించి నట్లే. ఇంక మరీ అంత నిర్భందించకండి " అన్నాడు శేషయ్య.
    'అలాగే అన్నయ్యా ప్లీడరీ చదవనులే అని ఒక్క మాట అనకూడదు? ....పొగరు కాకపొతే !....అన్నాడు శంకరం.
    "చచ్చినా అనను...నేను -- "లా" యే చదువుతాను అంటూ విసురుగా వెళ్ళిపోయాడు గోపాలం. ఆ మాట విని శేషయ్య విస్తు పోయాడు. పట్టలేనంత కోపంతో పళ్ళు పటపటా కొరుకుతూ "ఆహా అంతవరకూ వచ్చిందెం?....ఎలా చాడువుతావో నేనూ చూస్తా" అంటూ తల పంకించాడు శంకరం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS