Previous Page Next Page 
బ్రతుకు బొంగరం పేజి 6


    "నేనేదన్నా తింటాను" అన్నాడు రవి.
    "నిక్షేపంగా! రెండు సమోసా, ఏదన్నా స్వీటు ఉంటె తీసుకునిరా" అని సురేంద్ర వెయిటర్ కు పురమాయించాడు.
    పెదిమల మీద చిరునవ్వు వేలుగుతుండగా , "ఊ! ఇక చెప్పు నీ సంగతి. నీవిక్కడికి ఎప్పుడు వచ్చావు? ఏమిటీ సంగతి?" సురేంద్ర అన్నాడు.
    ప్రశ్నిస్తున్న అతన్ని రవిచంద్ర పరీక్షగా చూశాడు.
    బాగా ఎత్తు ఎదిగాడు. కొంచెం ఎర్రబడ్డాడు కూడా ఇదివరకటి కంటే. శ్రద్దగా ఉంగరాలను తిప్పుకోన్నట్లు గా వెంట్రుకలు. చూపరులను ఆకర్షించాలనే ప్రయత్నం అతని ప్రతి కదలిక లోనూ కనిపోస్తున్నది. కాని కాసేపు అతనితో మాట్లాడితే మనిషి 'భోలా' అనే సంగతి అందరికీ ఇట్టే తెలుస్తుంది.
    "ఏమిటి అలా చూస్తున్నావు?"
    "నీవు చాలా మారిపోయావు." రవి మాటలకు సురేంద్ర హుషారుగా నవ్వాడు.
    "మార్పు తేవడం కాలానికి సహజం. ఆ సంగతులన్నీ తరవాత గాని, నీ సంగతి చెప్పవేం?' అన్నాడు.
    రవి ముఖం నల్లబడింది. అతనికి ఏం చెప్పాలో తోచలేదు. ఇంతలో వెయిటర్ ఆర్డరుచేసినవి తీసుకొచ్చి ముందుంచాడు.
    "చాలా రోజుల తరవాత కలిశాం కదూ! మేము అక్కడ నించి కొల్హాపూర్ వచ్చేశాం. అక్కడే మా నాన్న చచ్చిపోయాడు."
    రావుచంద్ర తల ఎత్తాడు, 'అరె! మామయ్య గారు పోయారా?' అని అప్రయత్నంగా అన్నాడు.
    "ఇప్పుడు అమ్మ కూడా లేదు. నీకు తెలుసుగా నాకో చెల్లి ఉన్న సంగతి. ఒక కర్కోటకుడికి ఇచ్చి పెళ్లి చేశాం, ఆ సంగతి తెలియక. వాడు పెట్టె బాధలకు వేగలేక అది కూడా ఆత్మహత్య చేసుకుంది. నౌ ఐ యామ్ ఎలోన్, ఎలోన్ ...అల్ ఎలోన్..ఇన్ దిస్ వైడ్ వైడ్ సీ."
    సురేంద్ర ముఖంలో ఎటువంటి మార్పులు లేకుండానే చాలా సహజంగా చెప్పాడు, లీలగా ఒంటరి తనాన్ని గురించి బాధపతున్నట్లు కొంచెం స్పురింప జేసినప్పటికి మాటల్లో.
    రవిచంద్ర విచారాన్ని వ్యక్తం చేసే వదనంతో సురేంద్రను చూశాడు.
    సురేంద్ర చెప్పసాగాడు.
    "కొల్హాపూర్ లో ఇంటర్మీడియట్ మూడు సార్లు తప్పాను. చదువు మనకు వంటబట్టదని ఎంత చెప్పినా నాన్న వింటేనా? అయన పోవడంతో నాకు చదువు విషయం లో స్వేచ్చ లభించింది. ఇంటరుతో చదువుకు తిలోదకాలిచ్చేశాను."
    అతన్ని చెప్పమని ప్రోత్సహిస్తున్నట్లు చూశాడు రవి.
    సురేంద్ర కాఫీలోని పంచదార చంచాతో కలుపుతూ మళ్ళీ చెప్పసాగాడు.
    "చిన్నప్పుడు మనం అంతా కలిసి వేసిన వీధి నాటకాల పిచ్చి మిమ్మల్ని వదిలి పెట్టిందేమో గాని నన్ను ససేమిరా వదలనంది. కొల్హాపూర్ లో ఉంటున్నప్పుడు అది మరింత విజ్రుంభించింది. హిందీ నాకు మాట్లాడడం అబ్బడం తో అక్కడ నాటకాల్లో నుంచి చాన్సులు వచ్చాయి. అక్కడ మొదట ఎమోచ్యూర్ డ్రమెటిక్ అసోసియేషన్ లో మెంబరు గా చేరాను. తరవాత అమ్మ చనిపోవడంతో కొల్హాపూర్ లో నాకు నాదిగా మిగిలింది ఏమీ లేదనిపించింది. అక్కడ నుంచి మా కంపెనీ తో బాటు ఇక్కడ ఏదో నాటకం కోసం వచ్చాం రెండేళ్ళ కిందట. అంతే ఇక్కడే సెటిల్ అయ్యాం!"
    గబగబా ఎడతెరిపి లేకుండా చెప్పేసి, కాఫీ సిప్ చేయటం మొదలెట్టాడు.
    రవిచంద్ర బిల్లు మీద చేయి వేశాడు.
    "కీపి ఇట్ దేర్. నీవు నా గెస్టువి" అన్నాడు సురేంద్ర. ఇద్దరు కాపీ తాగటం అయిన తరువాత బిల్లు చెప్పించేసి బయటకు వచ్చారు.
    ఎండ తీక్షణంగా ఉంది. అయినప్పటికీ బజార్లో రద్దీ తగ్గలేదు. బస్సులు, చిన్న కార్ల రొదతో చెవులు హోరెత్తి పోతున్నాయి.
    సురేంద్ర రవిచంద్ర భుజం మీద ఆప్యాయంగా చేయి వేస్తూ, "ఏమిట్రా మూగనోము పట్టావు? మనవాళ్ళ సంగతి తెలుసుకోవాలని ఎంత ఆత్రంగా ఉన్నానో తెలుసా! బెల్లం కొట్టిన రాయిలా ఏమిటి? అసలు నీవు నాగపూర్ ఎందుకు వచ్చావు? ఏమిటిది?" అతని మాట పూర్తీ కాకుండానే "నన్ను క్షమించు , సూరీ. నేనిప్పుడెమీ చెప్పలేను" అన్నాడు. బరువుగా ధ్వనించిన అతని కంఠము, విషాదానికి ప్రతి రూపంగా ఉన్న అతని వాలకము సురేంద్ర కు అప్రయత్నంగా గంబీర్యం తెప్పించాయి.
    "మంచిది. ఇప్పుడెక్కడికి వెళుతున్నావు? ఎక్కడ మకాం?"
    పేలవంగా నవ్వి రవిచంద్ర "ఇంతవరకు ఒక చోటని నిర్ణయించు కోలేదు" అన్నాడు.
    ఆశ్చర్యంగా సురేంద్ర అతన్ని చూశాడు.
    రవి తల వంచుకున్నాడు.
    "అరెరే! నేను నిజంగా ఫూల్ ని రా!ఇన్నాళ్ళ తరవాత కలిశావు. నిన్ను నేను ఆహ్వానించ వలిసింది పోయి నీ సంగతులు అరా తీయడం లోనే టైము వేస్టు చేస్తున్నాను. కమాన్, మా గదికి. ఒకసారి చూద్దువు గాని...ఊ!" అంటూ అతని చేతిని గట్టిగా పట్టుకున్నాడు. రవిచంద్ర దేన్నీ గురించో అమితంగా బాధపడుతున్నాడని ఇట్టే గ్రహించాడు సురేంద్ర. అదేమిటో ఇప్పుడు బలవంతం చేసి తెలుసుకోవాలనిపించ;లేదు. అందుకే మాట మార్చేసి గభాల్న ఒక టాక్సీ అపుజేసి అందులోకి రవి చంద్రను నెట్టేసి, "సదర్ పోనీయ్" అన్నాడు టాక్సీ డ్రైవరు తో మరాఠీ భాషలో.

                           *    *    *    *
    సదరు ప్రాంతంలో ఒక ఇరుకు గొందిలో ఉన్న ఆ చిన్న గదిలో సురేంద్ర బాధకు తట్టుకోలేక తన పెళ్లి అయిన దగ్గిరి నించీ జరిగిన సంగతులన్నీ రవిచంద్ర చెప్పాడు.
    "నేను కన్న కలలన్ని నాశనమయినాయి. ఆ షాక్ తట్టుకోలేక పోయాను."
    గంబీరంగా ధ్వనించిన రవిచంద్ర గొంతుక, అతను ఆ విషయం వల్ల ఎంతగా బాధ పడ్డాడో, ఏ విధంగా తట్టుకోలేక పోయాడో సురేంద్ర కు తెలియ పరిచింది.
    చివరి సారిగా సిగరెట్టు పొగ గుంజి, సిగరెట్టు ను ఒక మూలగా పారవేసి, ఆవలిస్తూ లైటు స్విచ్ వేశాడు.
    ఆ అసుర సంధ్య వేళ వెలుతురూ ను గుప్పించి కొట్టినట్లుగా ఆ చిన్నగది లోకి కాంతి దీదీప్య,మానంగా వచ్చింది.
    దూరంగా వెళుతున్న బస్సును కిటికీ లోంచి చూస్తూ అన్నాడు రవిచంద్ర , "నా జీవితంలో ఇక వెలుగు లేదు. చీకటే నాకు మిగిలింది" అని.
    సురేంద్ర తేలిగ్గా నవ్వటానికి ప్రయత్నిస్తూ , "ఛీ...ఛీ....ఏమిటా మాటలు? నీవు ఇంత పేసిమేస్ట్ గా మారిపోతే ఎలా?' అన్నాడు.
    గభాల్న విసుగ్గా వెనక్కి తిరిగి రవిచంద్ర , 'అయితే నన్ను ఆ మూగ దానితో కాపరం చేయమన్నావా? జరిగిన మోసాన్ని భరించమన్నావా?' అన్నాడు.
    రెండు క్షణాలు మాట్లాడలేదు సురేంద్ర.
    రవిచంద్ర తనను తానె నిగ్రహించుకొని, ఆ గదిలో మూలగా ఉంచిన తన బాగును తీసుకుని "క్షమించు సూరీ! నిన్ను నా స్వవిషయాలతో అనవసరంగా కష్ట పెట్టాను. చాలా రోజుల తరవాత అనుకోకుండా చాలా దారుణ మైన పరిస్థితుల్లో నిన్ను కలుసుకోవలసి వచ్చింది. నీవు ఈ రోజల్లా కులాసాగా ఆదరించి నప్పటికీ, దుర్బరమైన నా స్వవిషయాలతో నిన్ను విసిగించటం తప్ప కులాసాగా మాట్లాడలేక పోయాను. నీ ఆదరణకు కృతజ్ఞత. వస్తాను" అంటూ రెండు అడుగులు వేశాడు.
    "ఎక్కడికి?' అన్నాడు సురేంద్ర.
    "చెప్పలేను."
    "అలా వెళ్ళ నివ్వను."
    "నేను వెళ్ళ గలను." ఇంకో అడుగులో బయటకు వెళతాడనగా గభాల్న ఉరికిపోయి అతన్ని పట్టుకొని సురేంద్ర కళ్ళల్లో కళ్ళు ఉంచి, " రవీ, వెళ్లి పోతావా?' అన్నాడు.
    రవి తల వంచుకుంటూ "వెళతాను" అన్నాడు.
    "ఎక్కడికి?' తిరిగి అదే ప్రశ్న రెట్టించాడు.
    శారీరకంగా, మానసికంగా శుష్కించిపోయినట్లు గా అనిపించడం వల్ల రవికి కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి.
    "తెలియదు" అన్నాడు అతని సూటి చూపుల నించి తప్పించు కుంటూ.
    "తెలిసేంత వరకు ఇక్కడ ఉండగూడడూ?' నిష్కల్మషంగా సూటిగా అతని హృదయం లోంచి వచ్చిన ఆ ప్రేమ పూర్వకమైన ఆహ్వానానికి అంత విచారం లోను రవిచంద్ర కొంచెం చాలించాడు. అయినప్పటికి "సూరీ, నేను ఉండలేను. మీరందరూ , నాకు తెలిసిన వారందరూ కనిపించని చోటికి అందరికీ దూరంగా వెళ్ళిపోతాను. నేను వెళతాను" అన్నాడు.
    సురేంద్ర క్షణం లో ముఖం చిన్నబుచ్చుకుని, "సరే అయితే నన్ను అర్ధం చేసుకున్నావనుకున్నాను. ఈ పరిస్థితిలో నీకు హుషారుగా కబుర్లు చెప్పి, నీవు పడే ఆవేదనను తొలగించడానికి నాలాంటి స్నేహితుడుంటే బాగనుకున్నాను. కానీ నన్ను కూడా...." అన్నాడు.
    కొంచెం కరిగిపోయాడు రవిచంద్ర. అతని వైపు తిరుగుతూ "నన్ను ఎన్ని రోజులు ఉండమంటావు?' అన్నాడు.
    "నీ ఇష్టం వచ్చినంత కాలం!"
    చిరునవ్వు అతి బలవంతాన పెదిమల మీదికి గుంజు కుంటూ "నేను జీవితాంతం ఇక్కడే ఉంటె" అన్నాడు.
    "సంతోషంగా ఉంచు కుంటాను" అన్నాడు . సురేంద్ర కళ్ళలో మెరుపు చూడగలిగాడు రవి.
    "అయితే నీ ఖర్మ, అనుభవించు. నేను ఇక్కడే ఉంటాను. పోమ్మన్నావో, నిన్ను ఈ గది లోంచి గెంటేస్తాను. తెలిసిందా" అంటూ విచారాన్ని దూరంగా నెట్టి వేయడానికి, కొంచెం ఉత్సాహాన్ని పులుముకోటానికి విఫల ప్రయత్నం చేస్తూ అక్కడే ఉన్న ట్రంకు పెట్రె మీద కూల బడ్డాడు.
    సురేంద్ర ఎగిరి గంతు వేసినంత పని చేశాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS