Previous Page Next Page 
బ్రతుకు బొంగరం పేజి 5

                                    


    రవిచంద్ర అలాగే ఓ పావుగంట కూర్చున్నాడు. ఒంటరితనం భయపెట్టింది. గుండెల మీద మోయలేనట్లుగా బరువు, పేరుకుపోతున్న దిగులు. ఏకాంతం. కళ్ళలో అప్రయత్నంగా నీళ్ళు నిండుకున్నాయి. మసగ్గా స్టేషను లో మనుషులు కనిపించారు. స్టేషను మాయమయిపోయి క్లాసు రూము లో పాఠాలు చెబుతున్నట్లుగా ఉన్న తను, తోటి లెక్చరర్ల తో కులాసాగా కబుర్లు చెప్పే తను, పెళ్లి పీటల మీద తను, కార్యం గదిలో భయంకర సత్యాన్ని తెలుసుకొని వణికి పోయిన తను! జరిగిపోయిన దృశ్యాలు! రకరకాలుగా కనపడే తను! గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. అంధకారం భయపెట్టింది, హృదయంలో తీవ్ర సంచలనం. తుఫాను మాదిరి భావ సంఘర్షణ కు తట్టుకో లేక సతమత మయ్యాడు.
    "టికెట్ ప్లీజ్" అనే మాటతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. ఎదురుగా చెకింగ్ ఇన్ స్పెకరు.
    కొంచెంసేపటి దాకా మాట పెగలలేదు. తరవాత అతి కష్టం మీద ఇంగ్లీషు లో చెప్పాడు. "క్షమించండి నేను తీసుకోలేక పోయాను. ఇప్పుడు చేల్లిస్తాను" అని జేబులోంచి వంద రూపాయల నోటు తీసి ఇచ్చాడు.
    చెకింగ్ ఇన స్పెక్టర్ ఆశ్చర్యంగా చూస్తూ, "ఎక్కడి నించి వస్తున్నారు?' అన్నాడు . రవిచంద్ర చెప్పాడు.
    "ఎక్కడి దాకా?' ఇంగ్లీషులోనే అడిగాడు.
    రవిచంద్ర మాట్లాడలేదు. ఎందుకో పిరికితనం ఆవహించింది.
    "ఇక్కడ దిగుతారా?' అన్నాడు ఇన స్పెక్టరు.'
    ఆప్రయట్నంగా తల ఊపాడు రవిచంద్ర.    
    "సారీ, మీరు డబుల్ చార్జి ఇవ్వక తప్పదు" అంటూ మిగతా చిల్లర , రసీదు ఇచ్చాడు.
    రవిచంద్ర కు చిన్నతనం అనిపించింది. ఆ కంపార్టు మెంటు లో ఒక్క నిమిషం కూడా ఉండలేక పోయాడు.  గభాల్న బాకుతో దిగాడు. అతన్ని గురించి అతను ఆలోచించుకునే ఓపికలేదు. స్టేషను రద్దీని తప్పించుకుంటూ నెమ్మదిగా బయటకు నడిచాడు.
    రిక్షాల వాళ్ళు చుట్టూ ముట్టారు, అక్కడ ఉన్న మంచి లాడ్జీలు, హోటళ్ళు, వాటి సౌకర్యాలు అన్నీ ఏకరువు పెడుతూ . నిర్వికారంగా వాళ్ళ వైపు చూశాడు. ఒకణ్ణి మించి మరొకడు, మరోకడ్ని మించి ఇంకొకడు గడగడా పాఠం అప్పజేప్పినట్లు చెప్పసాగారు.
    ఎవడో రిక్షావాడు అతని చేతిలోని బాగు గుంజుకొని తన రిక్షాలో పెట్టుకుని "అయియే సాబ్" అన్నాడు.
    రవిచంద్ర ఎక్కి కూర్చున్నాడు. తతిమా వాళ్ళంతా ఆ రిక్షావాడ్ని పచ్చి బూతులు తిట్టసాగారు. సాబుకు ఇష్టం లేదు , దిగుతాడన్నారు. మరికొంతమంది అంతకు ముందు చెప్పిన కిరాయి లో దాదాపు సగానికి సగం తగ్గించి బేర మాడసాగారు.
    రవిచంద్ర ఏం మాట్లాడలేదు. అసలేమీ వినడం లేదు.
    అతి కష్టం మీద ఆ రిక్షా అక్కడి నించి కదిలింది. గప్పున ఒక్కసారి లైట్లు వెలిగాయి. వీలు కాదనుకొని చటుక్కున చీకటి పారిపోయింది. పౌడరు పూసుకుని సింగారించు కున్న వనితలా ఎలక్ ట్రిక్ లైట్లతో సింగారించుకున్న పట్టణం! రవిచంద్ర కు ఏమీ తెలియని, ఎన్నడూ చూడని పట్టణం! కొత్త ప్రదేశం కొత్త మనుష్యులు. కొత్త బాష. తనను అవరించుకున్న తనకే తెలియని ఏదో వింత దనం.
    రిక్షా ఏదో లాడ్జి ముందు ఆగింది.
    
                                  3
    గదిలో ఒక మంచం , ఒక కుర్చీ , డ్రస్సింగ్ టేబులు ఉన్నాయి. గది చాలా చిన్నది.
    బద్దకంగా కుర్చీలో కూలబడ్డాడు. ఉక్కపోయసాగింది. కిటికీ తలుపులు తెరిచాడు. ఎదురుగా తానేరగని పరిసరాలు, లైట్ల కాంతిలో కనపడే మేడలూ , వాడలూ!
    లాడ్జి బాయ్ వచ్చి, "కాఫీ తాగుతారా?" అని హిందీ లో అడిగాడు. రవిచంద్ర అడ్డంగా తల ఊపాడు. "స్నానానికి వేడినీళ్ళున్నాయి " అన్నాడు బాయ్.
    "ఇప్పుడక్కర్లేదు" అని సమాధానం చెప్పాడు.
    "మీకేది కావాలన్నా ఈ బటన్ నొక్కండి. నేను వస్తాను" అని గబగబా వెళ్ళిపోయాడు.
    శరీరం బరువుగా అనిపించింది. కనురెప్పలు కూరుకు పోసాగాయి. బద్దకంగా మంచం మీద వాలబోయాడు. పక్కలో వాడిపోయిన మల్లెపూలు కనిపించాయి. వాడిన మల్లెను చేతిలోకి తీసుకొని కాసేపు చూశాడు. ఏమీ అర్ధం కాలేదు. అర్ధం చేసుకోటానికి ప్రయత్నించే లోగానే నిద్ర ముంచుకు వచ్చింది.

                            *    *    *    *
    రవిచంద్ర ఉలిక్కిపడి లేచాడు. ఒక్కక్షణం తను కలగన్నాననుకున్నాడు. ఆ క్షణంలో అతనికి సంతోషం కట్టలు తెంచుకుని ప్రవహించింది. "కేవలం ఇదంతా కలే' ననుకొని కళ్ళు తెరిచాడు.
    ఎదురుగా డ్రస్సింగ్ టేబుల్. ప్తక్కనే కుర్చీ. జుగుప్స కలిగించే రంగు గోడలతో హోటలు గది. ఇదంతా కలకాదని నిజమని నగ్నంగా చెప్పే అపరిచిత పరిసరాలు.
    అతనికి నిద్ర మత్తు వదిలింది. నిరాశతో గదిలోంచి బయటకు చూశాడు. గది తలుపులు వేయకపోవటం వల్ల వరండాలో గుడ్డిగా వెలుగుతున్న దీపం కనపడింది.
    టైము చూసుకున్నాడు . అర్ధరాత్రి దాటింది. ఆప్రయత్నంగా జేబు తడుము కున్నాడు. నిండుగానే తగిలింది. నిద్ర పోదామని కాసేపు కళ్ళు మూసుకున్నాడు. నిద్రను దూరం చేస్తున్న ఆవేదన. ఆ ఆవేదనను అధికం చేస్తున్న ఆలోచన. ఆ ఆలోచనను పదేపదే జ్ఞప్తికి తెచ్చే పుండు లాంటి అనుభవం.
    కాసేపటికి ఏమీ తినకపోవడం వల్ల ఆకలి కాసాగింది. చీకట్లో నే మెల్లిగా లేచి టేబుల్ మీద కూజాను వెతుక్కుని గ్లాసులో మంచినీళ్ళు పోసుకొని తాగాడు. మంచినీళ్ళు కడుపులో ఏదో తెలియని మంటను అధికం చేశాయి. తల బద్దలు కొట్టే టట్టుగా తల నొప్పి పుట్టసాగింది. అశక్తుడుగా మంచం మీద కూర్చున్నాడు. వరండా లో గుడ్డి వెలుగు లో గాజుల చప్పుడు వినిపించింది.
    అటు వైపు చూశాడు. ఎవరూ కనపడలేదు.
    మళ్ళీ కాసేపటికి అదే చప్పుడు. ఏదో సైగను ధ్వనింప జేసే గాజుల సంగీతం!
    అతని గుండెల్లో వణుకు కమ్ముకొని వచ్చింది. చటుక్కున లైటు వేశాడు. ఎదురుగా తలుపులు తీసి ఉన్నగది. గదిలో లీలగా స్త్రీ ఆకారం.
    అతని కేమీ తోచలేదు. ఆ క్షణాలు మూగబోయాయి. నెమ్మదిగా ఆ గదిలోంచి కదులుతున్నట్లుగా ఏదో ఆకారం . నెమ్మదిగా.........అతి నెమ్మదిగా వెలుగులోకి వచ్చిన స్త్రీ! తనకు దగ్గిరయిన స్త్రీ!
    కృత్రిమాలంకరణ తో ఒయ్యారంగా నిల్చున్న ఆమె కాసేపటికి అతనికి దగ్గిరగా, మరింత దగ్గిరగా వచ్చింది.     బిత్తరపోయి చూశాడు రవిచంద్ర.
    దగ్గిరవుతున్న ఏదో చవక రకం సెంటు వాసన. గాలిలో కలిసిపోయిన పూల వాసన. వేడిగా తగులుతున్న విశ్వాసం. మెత్తగా తగిలిన ఎవరిదో ఒళ్ళు.
    గభాల్న లేచి దూరంగా నెట్టేశాడు.
    ఆమె ఆ తాకిడికి దూరంగా పడ్డది. లేవబోతూ ఆశ్చర్యంగా చూసింది అతన్ని.
    రవిచంద్ర భగ్గుమన్నాడు. "గెటౌట్ !" అని బిగ్గరగా అరిచాడు. ఆమె భయం భయంగా బయటకు వెళ్ళిపోయింది. అమాంతంగా తలుపులు పెట్టేసి గభాల్న పక్కలో పడ్డాడు.
    రవిచంద్ర ఇక నిగ్రహించు కోలేకపోయాడు. ఎందుకనో అతనికి బాధ అంతా బయటకు వెళ్ళగక్కుకోవాలనిపించింది. పేరుకుపోయిన విచారాన్నంతా హృదయం నించి నెట్టి వేయాలని పించింది. దిండు హృదయానికి హత్తుకొని గట్టిగా తనివి తీరా ఏడవాలని పించింది.
    పరుపులో తల దూర్చి , "అమ్మా" అంటూ ఒక్కసారిగా బావురుమన్నాడు.

                           *    *    *    *
    సూర్యకిరణాలు చుర్రున తాకాయి రవిచంద్ర కు. బద్దకంగా లేచి కూర్చుని టైము చూసుకున్నాడు. పది గంట లయింది. మెదడు దిమ్మెక్కి నట్లుగా అనిపించి గట్టిగా తల రెండు చేతులతో నూ అదుముకున్నాడు. ఆప్రయత్నంగా రాత్రి సంఘటన జ్ఞాపకం వచ్చింది. చికాకు, అసహ్యం అతన్ని పెనవేసుకున్నాయి.
    కాసేపటికి లాడ్జి బాయ్ వచ్చి, "కాఫీ తాగుతారా?' అని హిందీలో అడిగాడు.
    రవిచంద్ర కు అది నాసిరకం లాడ్జి అన్న భావన పెరిగిపోయింది. లాడ్జి మీద కోపం లాడ్జి బాయ్ మీదికి మళ్ళి "అక్కర్లేదు. ఈ గదీ, ఇక్కడి మనుషులూ, వాతావరణం -- అన్నీ అసహ్యంగా ఉన్నాయి. రాత్రి.....' అంటూ ఏదో చిరాగ్గా చెప్పబోయాడు.
    లాడ్జి బాయ్ విస్మయంతో , "మీరిక్కడి కెందుకు వచ్చారు? ఈ లాడ్జి కి వచ్చేవాళ్ళంతా ప్రత్యేకంగా......." అని ఇంకేదో అనబోయాడు.
    "నాన్సెన్స్, నాకేమీ తెలియదు. ఆ రిక్షా వాడు మోసం చేశాడు. ఛీ....ఛీ......" అన్నాడు. లాడ్జి కుర్రాడు కూజాలో నీళ్ళు పారబోసి, మంచి నీళ్ళతో నింపి అక్కడ తీసుకు వచ్చి పెట్టాడు. ఎవరో వచ్చి గది ఊడవ సాగారు. గబగబా లేచి రవిచంద్ర ముఖం కడుక్కున్నాడు. అక్కడ నిలవ బుద్ది కాలేదు. చేతి బాగుతో బయటకు వచ్చి లాడ్జి బాయ్ కి గది బాపతు బిల్లు ఇచ్చేసి బయట పడ్డాడు.
    రాత్రి సరిగ్గా చూడలేదు గాని, ఆ లాడ్జి ఇరుగ్గా ఉన్న ఒక గొంది లో ఉంది. ఆ బజారు లో చేపలు బుట్టల్లో పోసుకొని అమ్ముతున్నారు. బజారు అంతా గందరగోళంగా ఉంది. అలాగా జనం మరాఠీ లో పెద్దగా కేకలేసుకుంటూ వరసగా ఉన్న మాంసం దుకాణాల్లో బేరం చేస్తున్నారు.
    రవిచంద్ర ఆ ప్రాంతం నుండి బయటపడిన తరవాత ఊపిరి పీల్చుకున్నాడు. ఒక పెద్ద హోటలు కనపడింది. ఆకలి జ్ఞాపకం వచ్చింది.
    నెమ్మదిగా అందులోకి నడిచాడు. కౌంటరు దాటిన తరవాత ఒక టేబిల్ దగ్గిర కూర్చుని అక్కడే ఉన్న ఆ రోజు పేపరు అటూ ఇటూ తిరగేశాడు.
    ఇంతలో భుజం మీద ఎవరిదో చెయ్యి పడింది.
    ఆప్రయత్నంగా తిరిగి చూశాడు.
    తెల్లటి లాల్చీ, పైజామా లో అతను. నవ్వుతున్న అతని పెదిమలు...ఎక్కడో చూసినట్లుగా జ్ఞాపకం. కానీ, చటుక్కున గుర్తు పట్టలేక పోయాడు.
    "రవీ!" ఆ గొంతు వినగానే టక్కున రవిచంద్ర కు చిన్ననాటి ప్రాణ స్నేహితుడు సురేంద్ర జ్ఞాపకం వచ్చాడు.
    "సూరీ!" అంటూ అమాంతం కౌగలించు కున్నాడు. రవిచంద్ర కు ఎందుకనో తెలియకుండానే కంఠం జీర పోయింది. ఎడారిలో ఒయాసిస్సులా సురేంద్ర అతని కంటికి కనిపించాడు.
    సురేంద్ర క్షణ కాలం మిత్రుణ్ణి పరామర్శించాడు.
    "ఏమిటిది?" ఇక్కడి కేలా వచ్చావు? మామయ్య, అత్తయ్య కులాసా? ఏమిటి పని ఇక్కడ?"-- గబగబా ప్రశ్నలు రవిచంద్ర మీద షూట్ చేశాడు.
    పదిహేనేళ్ళ కిందట రవిచంద్ర ఇంటి పక్కనే సురేంద్ర వాళ్ళు ఉంటుండేవాళ్ళు. రవి తల్లిదండ్రులను అత్తయ్య, మామయ్య అని పిలవడం అలవాటు . కొన్నేళ్ళ తరవాత సురేంద్ర తండ్రికి బదిలీ కావడం తో దాదాపు రవిచంద్ర ఇంటి వాళ్ళు సురేంద్ర వాళ్ళ విషయం మరిచే పోయారు.
    ఇన్నాళ్ళ తరవాత ఈ పరిస్థితిలో మళ్ళీ సురేంద్ర ను చూడడం!
    రవిచంద్ర ఏమీ జవాబివ్వలేక పోయాడు.
    సురేంద్ర కాఫీ ఆర్డరు ఇచ్చినట్లుంది. వెయిటర్ తెచ్చి వాళ్ళ ముందు ఉంచాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS