3
'బామ్మా కేలా వుందిరా విస్సూ!' అన్నాడు రఘుపతి టాక్సీ లో నుంచి దిగి గేటులో అడుగు పెడుతూ , ఆందోళనగా!
'చాలా సీరియస్ గా వుంది బాబాయ్! మొన్నటి దాకా బాగానే వుంది. నిన్నటి నుంచీ అసలు స్పృహే లేదు. వుండీ వుండీ కళ్ళు తెరిచి ఇల్లంతా చూస్తుంది అంతే!' అన్నాడు విశ్వనాధం , అతని చేతిలో సూట్ కేసు అందుకుని.
బాగా తెల్లవారింది. వెచ్చగా ఇంట్లో పడుతోంది ఎండ. ఆత్మీయుల మధ్య ఎడబాటు తరువాత కలిగిన అనురాగం వలె.
'నిన్న వైర్ లో సీరియస్ గా వుందని వ్రాయలేదేం? నేను ఆఫీసు పని వుంటే చూసుకుని తాపీగా బయల్దేరాను-- లేకపోతె వెంటనే వచ్చెవాణ్ణి' అన్నాడు రఘుపతి నిష్టూరంగా.
"అదేమో నాకు తెలీదు బాబాయ్-- అన్నట్లు పిన్నేదీ?' అని కారు వైపు తిరిగాడు విశ్వనాధం.
"ఆవిడను స్నేహితురాలింట్లో దింపి వచ్చాను-- తరువాత తీసుకోస్తానులే-- పద-- లోపలికి -- ' వరండా మెట్లు ఎక్కి ఆగిపోయాడు రఘుపతి.
"రావోయ్ మరిదీ -- ఆగిపోయావెం -- లోపలికిరా -- మా చేల్లెలేదీ!' అన్నది ఇందుమతి అతని కెదురుగా వచ్చి .. ఆమె వెనకే మాధవరావు, సుమిత్రా కూడా వచ్చారు. పడక కుర్చీ దులిపి , అందులో ఒక దిండు వేసి, 'కూర్చో అన్నయ్యా!' అన్నది సుమిత్ర.
'అమ్మ ఎక్కడ పడుకుంది!' అన్నాడు రఘుపతి కూర్చోకుండా లోపలికి దారి తీస్తూ --
'దక్షిణం వైపు గదిలో ! పద వెడదాం! చిన్న వదిన్ని తీసుకు రాలేదేం!' అన్నది సుమిత్ర, అతని వెనకే నడుస్తూ --
'ఇక్కడ ఆవిడ కెలాంటి స్వాగతం లభిస్తుందో అనే సంశయంతో , స్నేహితురాలి యింట దిగబెట్టి వచ్చాను-- మీరంతా తీసుకు రమ్మంటే తీసుకుని వస్తాను--' అన్నాడు రఘుపతి. మాధవరావు మొహం లోకి చూస్తూ !
"నీ అంత అభ్యుదయ వాదులం కాలేకపోయినా, మాకూ కొంత పూర్వ జన్మ సంస్కారం వుంది రఘూ! ఇంట కాలు పెట్టిన నవ వధువును అవమానించేటంత వాళ్ళం కాదు-- ' అన్నాడు మాధవరావు తలఎత్తి తమ్ముణ్ణి చూసి.
"సంస్కారాలూ, అభ్యుదయాల మాట అలా వుంచు అన్నయ్యా! అమ్మ ఏమంటుందో ! ఆవిడ ఉద్దేశ్యం అడగాలి కదా! అన్నాడు రఘుపతి తల్లి మంచం దగ్గరగా కుర్చీ వేసుకుని కూర్చుని.
ఆవిడ కళ్ళు మూసుకుని పడుకుని స్పృహ వున్నదా, లేదా అన్నట్లు వుంది.
'అమ్మ నీకోసం, వదినే కోసం కలవరించింది అన్నయ్యా! మొన్న రాత్రి నీకు టెలిగ్రాం యిప్పించమని చెప్పింది. అంతే. నిన్న అసలు ప్సృహే పోయింది. అప్పటి దాకా మాట్లాడుతూనే వుంది. మొన్నటి వరకూ నిన్ను చూడాలనే కోరిక మనస్సు లోనే దాచుకుని కృంగి పోయింది. మొన్న మాత్రం ధైర్యంగా చెప్పింది. నిన్ను చూడాలని-- ఆవిడ తన పొరపాటు గ్రహించు కున్నది --' అన్నది సుమిత్ర, తల్లిని తట్టి లేపుతూ --
"చూడమ్మా! చిన్నన్నయ్యా!' అన్నది మళ్ళీ.
ఆవిడ కళ్ళు తెరిచి చూసి మళ్ళీ మూసుకున్నది. తరువాత ఎంత పిలిచినా పలుకనే లేదు.
'వెళ్లి వదిన్ని తీసుకురా అన్నయ్యా! అమ్మ ఇంకా ఎంతసేపు వుంటుందో చెప్పలేం. కోడల్ని చూసిన తృప్తి ఆవిడకి దక్కనీ! కాఫీ త్రాగి వెంటనే వెళ్ళు--' అని హెచ్చరించింది సుమిత్ర.
'పరిస్థితి ఇంత తీవ్రంగా వుంటుందని అనుకోలేకపోయాను సుమిత్రా! మీరంతా నన్ను యింత మాత్రం ఆదరిస్తారనే ఆలోచన వుంటే ఎప్పుడో వచ్చి వుండే వాణ్ణి. ఆవిడని నావెంట తీసుకెళ్ళే వాణ్ణి--'
'జరిగిపోయినదాన్ని గురించి తర్కించే టైం యిప్పుడు - లేదు -- వెంటనే వెళ్లి వదిన్ని తీసుకురా! లేకపోతె ఆవిడ స్నేహితురాలి యిల్లెక్కడో చెప్పు నేను వెళ్లి తీసుకొస్తాను-- ఈ లోపల నువ్వు కొంచెం బడలిక తీర్చుకో!' అన్నది సుమిత్ర. దువ్వెన తెచ్చుకుని జడ అల్లుకుంటూ !
'అదే మంచిది! ఇప్పుడు డాక్టర్ గారు వస్తారు-- ఏమంటారో , ఏమో! నువ్వు వుండు రఘూ, సుమిత్ర వెళ్లి మరదల్ని తీసుకొస్తుంది.' అన్నాడు మాధవరావు --
'వాళ్ళ ఇల్లు గాంధీ నగర్ లో, ఈ ఎడ్రెస్ కార్డు తీసుకుని వెడితే తేలిగ్గా కనుక్కోవచ్చు. వెళ్లిరా, సుమీ! నేను అమ్మ దగ్గర కూర్చుంటాను--' అన్నాడు రఘుపతి
విశ్వాన్నీ తీసుకుని వెళ్ళింది సుమిత్ర. ఇంతినీ, వ్యక్తినీ గుర్తు పట్టడం కష్టం కాలేదు. తనకన్న కొంచెం పొడగరి, చాయా కొంచెం ఎక్కువే. సంస్కారం వుట్టిపడే ముఖం, ఆభరణాలు చాలా వున్నా, వాటన్నిటి కన్నా చిరునవ్వే ఎక్కువగా ప్రకాశిస్తోంది.
"మీరంతా రఘు పోలికే-- చూడగానే అయన చెల్లెలను కున్నాను-- అన్నది రాధ రిక్షా ఎక్కుతూ --
'అమ్మ కేమీ బాగాలేదు-- మూడు రోజుల నుంచీ మృత్యువు కోసం ఎదురుచూస్తూ అలసిపోయింది. మీరు కనపడితే ప్రశాంతంగా కన్ను మూస్తుంది --' అన్నది సుమిత్ర , ఎటో చూస్తూ --
'అమెకింత జబ్బు చేసిందని నేను అనుకోలేదు -- పాపం! వృద్దాప్యం లో దిగుళ్ళు మనిషిని కృంగ దీస్తాయి-- ' అన్నది రాధ. ఆ సానుభూతి లో గల నిజాయితీ ని శంకించలేకపోయింది సుమిత్ర.
'చిన్నన్నయ్యకి తగిన అమ్మాయి' అని మనస్సులోనే సర్టిఫికేట్ యిచ్చేసింది.
ఇహలోక సంబంధాలన్నీ తెగిపోతూ వుండగా కట్ట కడపటి సారిగా , బంధు జనాన్నీ చూడాలన్నట్లు కళ్ళు తెరచి, చిన్న కోడల్ని చూసిన అన్నపూర్ణమ్మ గారు మరి ఆ కళ్ళు తెరవనే లేదు -- ఆవిడ కోర్కె తీరింది.
'ఈ దురదృష్ట,మంతా మనిద్దరిదే చిన్నన్నయ్యా!' అంటూ బావురుమంది సుమిత్ర.
మనస్సులో మెదిలే ఆలోచనలు, సంతోషాలు, దుఃఖాలు అన్నీ చెప్పుకుని వుపశాంతి పొందడానికి ప్రతి వ్యక్తికీ నమ్మదగ్గ స్నేహితురాలు ఒకరుండాలి. అలాంటి స్నేహితురాలుగా అమ్మ యిన్నాళ్ళూ తనని చూసింది. ఈ ఒక్క ఏడాదిలో తామిద్దరి మధ్యా దూరం పెరిగినా, ఆమెతో తనేనాడూ కలహం పెట్టుకోలేదు. చెప్పదలచుకున్న దేదో సూటిగా, నెమ్మదిగా చెప్పేది తను. ఆ గదిలో మంచం మీద పడుకుని వున్నా ఎంతో తోడుగా, నీడగా వుండేది ఆవిడ.
వృద్దులు మరణించడం సహజమే నని సరిపెట్టుకోలేక పోతోంది . డానికి కారణం ఆవిడ అమ్మ కనుక!
'ఎన్ని శుభాలు జరిగినా కలుసుకోలేని వ్యక్తులు, ఒక్క విషాద సంఘటన జరిగితే ఏకమౌతారని విన్నాను-- మనపట్ల అదే ఋజువైంది ' అన్నాడు రఘుపతి.
మాధవరావు కి ఏమీ వినడానికీ, అనడానికీ తీరలేదు. తల్లి అంతిమ యాత్రకి ఏర్పాట్లు చేయడంలో మునిగిపోయాడతను-
'మరేం అనుకోకు అన్నయ్యా! ఈ డబ్బు నీ దగ్గర వుంచు--' అంటూ పర్సు అన్నగారి చేతి కిచ్చాడు రఘుపతి.

అన్నపూర్ణమ్మ గారి మరణ వార్త తెలిసి ఊళ్ళో గల చుట్టాలు, స్నేహితులూ, పరిచయస్తులూ వచ్చారు. సాయంత్రం రాత్రి చాటుకు తప్పుకోబోతూన్నా విమల రాలేదు. అప్పుడే రెండుసార్లు ట్రంక్ కాల్ చేశాడు మాధవరావు.
'ఆవిడ మన యింటి కొచ్చి పదేళ్ళు కావచ్చింది. ఇప్పుడు తల్లిని చూసుకోలేకపోతే చాలా కష్టపడుతుంది-- కాబట్టి తెల్లవారే వరకూ వుంచడమే మంచిది-- ఒక్కరోజుకి మనం అన్నాలు తినకపొతే ఫరవాలేదు --' అన్నది ఇందుమతి.
'పోనీ ఎవర్నైనా పంప కూడదూ? విమలక్క కోసం!' అన్నది సుమిత్ర. కొంచెం సేపు అలోచించి దూరపు బంధువు ఒకాయన్ని పంపించాడు మాధవరావు.
అన్నపూర్ణమ్మ గారి అంతిమ యాత్ర ఆ రాత్రికి ఆగిపోయింది. వరండాలో గడ్డి మీద పడుకో బెట్టారు ఆవిడను. తలదగ్గర దీపం పెట్టి అక్కడే చాప వేసుకుని కూర్చుంది ఇందుమతి. అవతలి గదిలో భయంగా నిద్రపోయారు పిల్లలు.
మిగిలిన బంధువులు తాపీగా వ్యాఖ్యానాలు మొదలు పెట్టారు.
కుల భ్రష్టులకు కర్మ చేసే హక్కు లేదని తీర్మానించారు కొందరు.
'పేరుకు కులంలో ఒకమ్మాయిని భార్యగా తెచ్చుకుని , అనేక మందితో, అనేక కులాల యువతులతో అక్రమ సంబంధాలు నెరసిన పడ్డ లందరికీ కర్మలూ, నోములూ,చేసే అర్హతలు వుంటాయి. కానీ నమ్మిన ఆడదాన్ని పెళ్లి చేసుకున్న వాడికి ఆ అర్హత పోతుంది కాబోలు! అదే న్యాయమైతే కర్మ చెయ్యాలనే కోర్కె నాకేం లేదు లెండి. నాకు వాటిలో నమ్మకమూ లేదు-- నేను పరాయి వాడిలాగే వుండిపోతాను -- ' అన్నాడు రఘుపతి.
తెల్లవారుతూనే ఇందుమతి తల్లి ఊడి పడింది తుఫాను లాగ. వస్తూనే వియ్యపు రాలి దగ్గర కూర్చుని పెద్దగా కాస్సేపు ఏడ్చేసి, ఆ పైన రఘుపతిని, తిట్టడం సాగించింది. వాళ్ళని ఇంట్లో తిరగనిస్తూన్న ఇందుమతి అనాచారాన్ని అసహ్యించు కున్నది.
దహన క్రియలు కాగానే మధ్యాహ్నం భోజనాల దగ్గర ఆవిడ లేవదీసిన తుఫానుకు రాధ కంట తడి పెట్టడం చూసింది ఇంతుమతి.
'మీ అమ్మకి మరీ అంత తొందరేమిటి!' అని విసుక్కున్నాడు మాధవరావు.
'పెట్టె సర్ధుకొ రాధా! మనం వచ్చిన పని ఐపోయింది . వెడదాం' అన్నాడు రఘుపతి.
'చూడన్నయ్యా! మనం చదువుకున్న వాళ్ళం-- ఆవిడ అజ్ఞానంతో ఏదో అంటున్నదని రోషం తెచ్చుకో కూడదు-- ఈ పది రోజులూ మీరు ఇక్కడ వుండాలి-- మనం ముగ్గురం ఈ గదిలో వుందాం-- మీ ఇద్దరికీ నేను భోజనం తెచ్చి ఇక్కడ పెడతాను-- ఆవిడ వెళ్ళే దాకా ఎలాగో సర్దుకు పోదాం-- లేకపోతె వదిన బాధపడుతుంది --' అని బ్రతిమిలాడింది సుమిత్ర.
ఆ సాయంత్రం భర్త పిల్లలతో బండి దిగిన విమల మరో తుఫాను లేవదీసింది, తల్లిని యింకా అప్పటి వరకూ కూడా వుంచనందుకు....' మనం మనం సాధించుకోడానికి, తిట్టి పోసుకోడానికి అవతల చాలా టైం వుంది అక్కయ్యా-- ఇలాంటి సమయంలో దుఃఖాన్ని అందరం పంచుకోవాలి కానీ -- మనస్సులు విరగగొట్టుకోకూడదు -- పద! స్నానం చేసి పిల్లలకి అన్నం పెట్టు -- తీరిగ్గా మాట్లాడుకుందాం--' అని అక్క భుజం మీద చెయ్యి వేసి లోపలికి పంపించింది సుమిత్ర.
'ఏమో అనుకున్నాను-- నువ్వు చాలా పెద్ద దానివయ్యావు -- ' అని గొణిగింది విమల.
'మీ ఇంట్లో నిన్ను దింపానుగా! ఇక పోతున్నాను--' అంటూ ఎంత చెప్పినా వినకుండా రిక్షా ఎక్కిపోయాడు విమల భర్త సత్యానందం.
'మనలో మనకే లేని సఖ్యత పరాయి వాడి కెందుకుంటుంది-- వెళ్ళనీ!' అన్నాడు రఘుపతి విసుగ్గా!
'వెళ్ళ మానక వుండమని మీరు అంటారానుకున్నానా ఏమిటీ! ఆడపిల్లల బెడద వదిలించుకోడమే మీ సంప్రదాయం!' అంటూ తమ్ముడి ఎదుటికి వచ్చింది విమల!
'మా సంప్రదాయం ఏదైతే నీది అదే అవుతుంది!! నువ్వేం పరాయిదానివా ఏమిటి!' అన్నాడు రఘుపతి.
'రా! అక్కయ్యా! లోపలికి-- ' అంటూ చెయ్యి పుచ్చుకుని లోపలికి తీసుకుపోయింది సుమిత్ర విమలను.
* * * *
బంధువులందరూ వెళ్ళిపోయాక ఆ సాయంత్రం అన్నపూర్ణమ్మ గారి ఫోటో గోడకి తగిలిస్తూ 'ఇంకా అమ్మ యిక్కడ పడుకున్నట్లే వుంది,' అన్నాడు మాధవరావు --
';అమ్మ ఎక్కడ పడుకునేదో ఏమో! నాకేం తెలుసు! అమ్మకి నాకూ పదేళ్ళ నాడే ఋణం తీరిపోయింది.' అన్నది విమల వెంటనే.
