

"మీరు కాలేక్షేపానికేమైనా పుస్తకాలు చూడాలనుకుంటే సరస్వతి కి తాళం చెవులిచ్చాను -- చూడండి!'
'అంటే మీ పుస్తకాలు చూస్తున్నప్పుడు, మీరు ఉండగూడదా?'
'ఆహా.....నాక్కొంచెం పొలం పనుంది.'
'రాత్రంతా పొలం లో మేలుకునుండి, మళ్లీ పని కెళ్ళడమా?'
'పెద్ద పనేమీ కాదనుకోండి. రెండెకరాల విత్తనం వెయ్యాలి...నన్నయ్యా! విత్తనం కాడింకా రాలేదేం? నువ్వు నిన్న సరిగ్గా చెప్పినావా?'
అప్పుడే వస్తున్న నన్నయ్య వీధి వంక పారజూస్తూ అన్నాడు: 'సేప్పకేం, సందెకాడ గూడా సెప్పినా. సరే లెమ్మని కూశాడు. సారాయి దాగి పడుకున్నాడేమో దొంగనా కొడుకు, అట్లనే లేపుకుని పోదాం చేనికి....'
'అట్లనే పిలుచుకు పొతే వాడికి చల్ది ఎట్లా?' లోపల్నించి వస్తూన్న అనంతయ్య.
'సావనీ. ఈ రోజు సద్ది లేకపోతె రేపు బుద్ది తెచ్చుకుంటాడు.'
'పాపం రా, నాయనా! రెండడుగులు వెళ్లి చూసిరా.'
నన్నయ్య తిట్టుకుంటూ రెండడుగు లేసి, 'అదో! వాని పెళ్లా మొత్తోంది' అన్నాడు.
ఆ వాని పెళ్ళా మొచ్చేసింది. చింపిరి తలలో వేళ్ళు దూర్చి గోక్కుంటుంది. రవిక ఒక వైపు జబ్బ దగ్గర చిరిగి, భుజకీర్తుల మల్లె వేలాడుతుంది. నీలకంఠడు హాలాహాలాన్నీ అంగిట్లో నిలుపుకున్నట్లు తాంబూలం నోట్లో దాచుకుంది. ఆ గుప్త దనాన్ని చూసుకుని సంతోషంతో ఆ బుగ్గ ఉబ్బిపోయింది. నడుము నించీ మోకాళ్ళ దాకా చుట్టుకుని, ఇంకా పాదాల దాకా ఆ శరీరాన్ని కప్పడ మెట్లాగో తేలియక, అటుకులు కలుపుకున్నా చేతకాక ఆ చీరె అక్కడే ఆగిపోయింది!
'లచ్చీ! లింగడు రాలేదేం?' అడిగాడు వాసవి.
'వత్తామనే లేసినాడు, సోమీ! ఇంతలో పెసిలెంటు వచ్చినాడు, కట్టెలు కొట్టాల రమ్మన్నాడు.....'
'అనంతమయ్య గారి కిత్తనాని కేల్లాలని సేప్పలేదూ?' నన్నయ్య.
'ఎందుకు సెప్పలేదయ్యా, అందుకే వాని పాణం సగం పోయింది....'
'ప్రెసిడెంటు కొట్టినాడా?' అన్నాడనంతయ్య.
'వాళ్లకు రేపు పోదువు గానీ, నాకియ్యాల రమ్మని పట్టుపట్టినాడు....'
'కట్టెలు కొట్టడం ఆగకూడదు, విత్తనం ఆగిపోవాలి బాగుంది.'
'ఆమాటే వాడూ అన్నడు, సిన్న సోమీ! అపైన చేతికర్ర తీసుకుని బాదేసినాడు. అడ్డుకున్న నాకూ మంచి దెబ్బ తాకింది. అస్తమంతా పొంగిపోయి, ఇట్లా వంగలేదు సూడు....' వాచిపోయిన చేతిని ప్రదర్శించింది.
గోదాదేవి నిశ్చలంగా చూస్తుంది.
అనంతయ్య నిట్టూర్చాడు. 'సరే నువ్వు ఫో.'
'అయ్యగారేమనుకుంటారో సెప్పిరాయే అంటే వచ్చినా. పోయోత్తా, అయ్యగారూ?' ఆమె వెళ్ళిపోయింది.
'ఇప్పుడు విత్తనం కాడేట్లా!' నన్నయ్య.
'నేను లేనూ?' అన్నా డనంతయ్య. వాళ్ళిద్దరూ ఒక్కసారిగా చూశారు.
'అట్లా చూస్తారేం? నేను పనికి రానా!' అన్నాడు నవ్వుతూ.
'ఆహా, ఎవరన్నా దొరుకుతే....'
'మళ్ళీ అదే మాట. ఏం? నేను రైతు ను గాదూ?' కసిరాడు.
అంతా ఉత్సాహంగా సన్నాహం! పెద్ద ముత్తయిదువ భాగీరధమ్మ , గుమ్మం లో కోడెల నుదుట కుంకుమ బొట్టు పెట్టింది. నన్నయ్య కుంకుమ చేత వేయించుకుని బొట్టు పెట్టుకున్నాడు. వాసవి కొంచెం గా వంగి నవ్వుతూ పెట్టించుకున్నాడు. తరవాత అనంతయ్య! వాళ్ళంతా మామూలయినట్లు చూస్తున్నారు. గోదాదేవి అపూర్వంగా చూస్తుంది. ఆమెను గమనిస్తూ వాళ్లు నవ్వుకుంటున్నారు. సరస్వతి దోసిలి తో విత్తనం ధాన్యం తెచ్చి నవ్వుతూ అనంతయ్య ఒళ్లో పోసింది.
'ఆయనెవరో పెద్దాయన భారతం లో యుద్దానికి పయనమైనట్లుందయ్యా' అన్నాడు నన్నయ్య . అంతా పక్కున నవ్వారు.
'ఆ ముసిలాడి దెబ్బకు యువకులంతా బెదిరిపోయారయ్యా నన్నయ్యా!' అన్నాడనంతయ్య.
'సేనికాడ సేప్పాలయ్యా , ఆ కత ....' వాళ్ళు మాట్లాడుకుంటూ కదిలారు.
'ఇంక పద!' అంది సరస్వతి, గోదాదేవి కేసి చూస్తూ.
అనంతయ్య తమ దగ్గరకు వచ్చినప్పుడు కులభేదం పట్టించుకోక పోవడం గోదాదేవి చూసింది. కానీ, అదే విధంగా కుటుంబం లో , పైగా ఈ పల్లెటూళ్ళో ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు. తనకు బైట భోజనం పెడతారేమోనని, ఇంకా ఎన్నో ఊహించుకుని, అసలిక్కడికి రావటానికి ఇష్టపడలేదు. కానీ, అనంతయ్య పదేపదే అడగటం చేత, పద్మనాభయ్య బలవంతంగా ప్రయాణానికి సిద్దపర్చడం చేత రాక తప్పలేదు. వీళ్ళ ఆచారాల వల్ల తన మనస్సు నోచ్చుకున్నట్లు గానీ, అసహ్యపడినట్లు గానీ వ్యక్త పరచ గూడదని ముందుగా నిశ్చయించుకుంది అయితే, ఇక్కడ స్నేహపూరితమైన వాతావరణం, ఐక్యం చూసి ముగ్ధురాలైంది.
పళ్ళు తోముకుంటూ సరస్వతి కేసి చూస్తుంది. సరస్వతి పీట వేసుకుని ఆవు దగ్గరగా కూర్చుని, చెంబు లోకి పాలు పిండుతుంది.
పాలధార మధురంగా శబ్దిస్తూ చెంబులోకి దూకుతుంది. ఆవు నెమరు వేసుకుంటూ ఆత్మానందం లో మునిగిపోయింది. పాలు పిండటం ముగించి, లేచి కుచ్చెళ్లు విడలించుకుని కట్టుకొయ్య కున్న దూడ తలుగు విప్పి...అది ఒక్క దూకున వెళ్ళి తల్లి పొదుగు కుమ్మడం నవ్వుతో చూస్తుంది. ఆవు గోధుమ వర్ణంగా ఉంది; కాని దూడ పాల నురుగు లా ఉంది.
'మా అన్నయ్య ఈ బుజ్జిముండ కోక పేరు పెట్టాడు.'
'ఏం పేరు?'
'హిమబిందు!'
అచ్చంగా సరిపోయిందని పించింది. ఇంతలో భాగీరధమ్మ పిలుపు వినిపించింది.
'అమ్మ పిలుస్తోంది పోదాం. టిఫిన్ చేసి, కాఫీ తాగుతూనే నిన్ను పుస్తకం లో దించేసి వచ్చి వంట పని చూడాలి.'
* * * *
గోదాదేవి ఆశ్చర్యంలో మునిగిపోయింది. ఇంత అనుభవాన్ని పంచుకున్న వ్యక్తిని, ఇంతటి బృహత్తర వ్యక్తుల సాన్నిహిత్యాన్ని నిత్యం అనుభవిస్తున్న వ్యక్తిని ఒక్క నిమిషం తలుచుకుంది. ఎంత సామాన్యంగా , ఎంత నమ్మలేని నిజం గా ఉన్నాడు!
వాసవి లోని ప్రత్యేక వ్యక్తిత్వానికి సాక్ష్యమిస్తున్న వాళ్ళు సామాన్యులా? సంస్కృతాంధ్ర, ఆంగ్ల హిందీ కవులు! ఇంకా ఇతర భాషల్నించీ తెలుగులో పరిచయమైన బెంగాలీ, రష్యన్, ఫ్రెంచి , చైనీస్, రచయితలు , చయిత్రులు! పల్లెటూళ్ళో వ్యవసాయం చేసుకుంటూ ఇంత మహత్తర దశ నందుకోవటానికి కతను ఎంత కృషి చేసి ఉండాలి?
గోదాదేవి మొదటి బీరువాలోని ఒక పుస్తక మందుకుంది. అది 'రాయలసీమ రైతు" అన్న పద్య కావ్యం. అది 66 లో అచ్చయింది. రచన వాసవి. ఉపోద్ఘాతంలో విశ్వనాధ-- అది అచ్చమైన తెలుగు పల్లెటూరనీ, రైతు లో కనిపించే తెలుగుదనం వాసవి లోనూ నిండి ఉన్నదనీ, ముందు ముందు సారస్వతం లో ఉజ్జ్వలమైన స్థానముందనీ ఆశించాడు. రాయలసీమ రచయితలైన గడియారం , పుట్టపర్తి గార్ల అభినందించారు. అంకితం క్రింది పద్యం చదువుకుంది.
'చేత ముల్లుగర్ర తో చెప్పులు గూడా రక్షణ లేని కాళ్లు అలవాటుగా చేని గట్టు వెంట నడుస్తుంటే, కళ్ళెత్తి ఆకాశం కేసి చూస్తూ, వార్షుకాభ్రంకోసం తపస్సు చేసే వాన కోయిల వాడు! ప్రకృతి శక్తి నుపాసించి బ్రతుకుతూన్న అనాది భక్తుడు వాడు, పండబోయే చేను ఎండ బారితే నిట్టురుస్తూ -- 'దేవుడు కన్ను తెరవలే' దనుకునే కర్మ సిద్దాంత పోషక కర్త వాడు! ఏ ఆందోళన చెయ్యడానికీ ఓపిక లేని, రాజకీయ చతురంగం లో మూగబంటు వాడు.... అట్టి నా వానికి ఈ "రాయలసీమ రైతు" అంకితం.
ఎంత హృదయ దఘ్నమైన అనుభూతి లేకపోతె ఇలా వ్రాయడం సాధ్యమౌతుంది! ఒక్క దువ్వూరి రామిరెడ్డి గారు తప్పితే ఈ మాత్రం విలువున్న రచన ఎవరూ చేయలేదేమో?
'ఈసారి పైర్లు ఎంతో బాగున్నాయని పొంగి పోతాడు. భార్య, బిడ్డలతో భవిష్యత్తు ను గూర్చి బంగారు కలలు కంటాడు. కష్టించి పనిచేస్తే పండక ఏమౌతుందని అనుకుంటాడు. అప్పటి ధరల్నిబట్టి అంచనా వేసుకుని అప్పు ఎప్పటికి తీరుతుందో, అప్పుడేం చెయ్యాలో, భార్యా బిడ్డల కేం తేవాలో రాత్రుళ్ళు పడుకొని ఆలోచిస్తాడు. సరీగ్గా అప్పుడే ఎప్పుడూ జరుగుతూన్నాట్టే జరుగుతుంది. ఉత్తరాకార్తి ఉరువు కురవదు. హస్త కార్తి అసలు వాన చినుకు రాల్చదు. రొమ్ము విరుచుకుని వస్తూన్న పైరు సొమ్మసిల్లి పోతుంది. అప్పుడు వాని కళ్ళ కేసి చూస్తె సృష్టి కర్త సిగ్గుపడి పోవాలి. అప్పుడు వాని కుటుంబం లో ఒకళ్ళ ముఖాలోకళ్ళు భయం భయంగా చూసుకుంటారు. దిగులు దిగులుగా ఎండిన కళ్ళతో తిరుగుతారు. గాటికాడ గోడ్డరిస్తే ఉలికి పడతాడు. చిత్త చిత్తగిస్తుంది. స్వాతి చల్లగా వెళ్ళిపోతుంది. చేసేది లేక, చావబోతున్న పంటకు విముక్తి నివ్వడానికి కొడవ లందుకుంటాడు. అప్పుడు ఆకాశం లో హడావిడి గా మేఘాలు వ్యూహం పన్నుతాయి. భయంకరమైన వర్షం కురిపి, తృప్తిగా వెళ్ళిపోతుంది! ఉన్న నాలుగు గింజలు ఊడి మట్టిలో కలిసిపోతాయి. తన మేత పోయినా, పసువుల మేత కోసం తాపత్రయ పడతాడు. పాత బాకీతో, కొత్త బాకీ జమ అవుతుంది. అప్పుడు పెద్ద నిట్టుర్పు విడిచి, ముందు సంవత్సరాన్ని గూర్చి ఆలోచించడం తో మళ్ళీ అతని గాధ ప్రారంభమవుతుంది! ఆ హాలాహలం లోనే అట్టడుగున ఏవో కొన్ని అమృత బిందువులు , ఆ ఘోరంధకారం లోనే కొన్ని కొస మెరుపులు! ఆ కొస మెరుపు కోసం ఘోరాందకారం లో నిలబడి ప్రతీక్ష చేస్తున్నాడు. ఆ అమృత బిందువుల ఆశతో నిత్యానుభవమైన గరళం మింగుతూ కాలం గడుపుతున్నాడు వంద ఏళ్ళుగా!' -- ఇదీ "రాయలసీమ రైతు!"
'నా పని అయిపొయింది. ఏం చేస్తున్నావ్?' సరస్వతి.
గోదాదేవి పుస్తకం మూసేసింది. 'అప్పుడే వంట అయిందా?'
'అప్పుడే ఏమిటి? ఏం పుస్తక మది? ఓహో! రాయలసీమ రైతును చూస్తూన్నావా?'
'ఇది మీ అన్నయ్య వ్రాసింది కదూ?'
"అబ్బే! ఊరకే పేరు వేయించుకున్నాడు.'
గోదాదేవి నవ్వింది. 'మరి నువ్వు చెప్పలేదేం?'
'అదొక విశేషంగా అనుకుంటావని నాకేం తెలుసు?'
'ఊహూ....అయితే నీలోనూ ఏదో విశేషమున్నట్లే ఉంది.'
'చూసే కళ్లుంటే అందర్లోనూ ఏదో విశేషముంటుంది.'
'ఇన్ని పుస్తకాలు కొనడానికి డబ్బు బాగా ఖర్చయి ఉంటుంది.'
'అదంతా మా అన్నయ్య సంపాదనే. ఊళ్ళో రైతులకు, గొర్రూ, గుంటకా, నాగేళ్ళు చేసి ఇస్తూ ఉంటాడు. వాళ్ళిచ్చినంత డబ్బూ తీసుకుని ఇట్లా పుస్తకాలు కొంటూ ఉంటాడు. ఆ చెక్క బీరువాలు తనే చేసుకున్నాడు పుస్తకాల కోసం.'
'వడ్రంగి పని నేర్చుకున్నాడా?'
'నేర్చుకోవడం ఏం చూడలేదు. కానీ, చెయ్యడం చూస్తున్నాం....'
'అబ్బ! ఏం గొప్పలు! మీ అన్నయ్య బాపిరాజు కధానాయకుడందూ?"
'ఒకసారి అన్నయ్య అలాంటి విమర్శనే చదివాడు. బాపిరాజు కధానాయకుడు అన్ని విద్యలు నేర్చినవాడుగా ఉంటాడనీ, ఇది ప్రపంచం లో చాలా సహజమనీ అపహాస్యం చేశాడు ఆ విమర్శకుడు.'
'అది నిజమే గదా?'
'అట్లా అనుకోవడం పొరపాటనీ, అందుకు చక్కని ఉదాహరణ బాపిరాజేననీ అన్నాడు.'
'అంటే అయన గొప్ప రచయితనేనా?'
'గొప్ప రచన రెండు రకాలుగా ఉండవచ్చు. ఒక వ్యక్తిలోని చెడ్డతనం, బహుముఖాలుగా -- పరిస్థితుల వల్లనో, పరిసరాల వల్లనో విజ్రుంభించడం, దాని ప్రతిభ సమాజం పైన ప్రతిఫలించడం సహజంగా చిత్రిస్తే అది గొప్ప రచనే! అట్లాగే ఎట్లాంటి వాడి లోనూ మంచితన మున్తుందనీ, దాన్ని పెంచుకోవడం మన కర్తవ్యమని నిరూపిస్తూ హృద్యంగా చిత్రిస్తే అది గొప్ప రచన కాదనలేము. ఒకటి చెప్పవచ్చు. ప్రపంచం ఎట్లా ఉందొ యదార్ధంగా చూపిన రచనా గొప్పదే! ప్రపంచం ఎట్లా మారితే బాగుంటుందో సూచించిన రచనా గొప్పదే! కొంతవరకూ , బాపిరాజు ఆ రెండో రకం రచయిత!"
'ఈ పుస్తకాలన్నీ నువ్వూ చదివావా?'
'నా కింగ్లీషు రాదు. సంస్కృతం, హిందీ కొద్ది కొద్దిగా. అసలు నేను చదివినా అంత జ్ఞప్తి కుంచుకో లేనేమో గానీ, ఫలానా సందర్భం లో ఫలానా రచయితా ఇంత అద్భుతంగా అన్నాడనీ మా అన్నయ్య చెప్పిన విషయాలు జ్ఞప్తి కుంటాయి. అది సరే! నేను చేని కన్నం తీసుకుని పోవాలి. త్వరగా గంటలోగా వస్తాను. నువ్విక్కడే చదువుకుంటూ ఉంటావా? లేక ఇంటికొచ్చి అమ్మ దగ్గరుంటావా?'
'పోనీ, నేనూ నీతో వస్తే?'
'అద్భుతంగా ఉంటుంది. అయితే, అంత మర్యాదగా ఉండదేమో?'
'ప్చ్! మర్యాదల కోసం మంచి దృశ్యాల్నోదులుకోవడం నా కిష్టం లేదు.'
