ఐనా ఏమీ మాటాడలేకపోయాడు.
"చూడు భాసా! నీకు పెళ్ళి చెయ్యాలని, మీ నాన్నగారూ, నేనూ పోయి నేడాదే అనుకున్నాము......అయితే దురదృష్ట వశాత్త్హూ అది కలిసి-రాలేదు.......ఈ సంవత్సరమూ నేను అనేక విధాల పొరు పెడుతూనే ఉన్నాను మీ నాన్నగారితో ..... ఆయనకు వాజ్యం గోల తప్ప యిది పడితే గదా! ఐతే దేవుడు నా మొర విన్నాడు ..... ఈ రాఘవేంద్రరావుగారి ఎరికెనే ఓ మాంచి సమ్మంధం ఉన్నదట ...... పిల్లది బియ్యే ప్యాసయ్యింది..... బంగారబ్బొమ్మట. మంచి సాంప్రదాయం......"
భాస్కరం వినలేకపోయాడు.
"మరి నా చదువు అయ్యేదాకా పెళ్ళి వొద్ధన్నాను గద?" అన్నాడు కోపం దిగమింగుతూ.
"ఎలాగా ఆవేళే అవుతుంది ..... పెళ్ళంటే బొమ్మలాటా?" జానకమ్మగారు పొడిగా నవ్వింది .
"అదే నేనూ అనేది; బొమ్మలాట కాదు గదా....." భాస్కరం ఉద్వేగం తొక్కిపట్టుకున్నాడు.
భాస్కరం-మాట లామెకి ఏమీ అంతు చిక్కలేదు. "ఇంతకీ నీ ఉద్దేశం ఏమిటి? ముఫ్ఫై ఏళ్ళు వచ్చి గెడ్డాలూ మీసాలూ ముదిరేకా, అచ్చటా ముచ్చటా అయిపోయిన ఎవతెనో ఒకతెను కట్టుగుంటానంటావ్?" ఇప్పుడే పిల్లను చూడు ..... వచ్చిందీ తలవూపు.....నీ పరీక్ష లవగానే, ఆ మూడు ముళ్ళూ వేస్తే యిక గరిటే, గిన్నే దాని చేతబెట్టి నేను హాయిగా కూచుంటానం"ది-
అంత బాధలోనూ ఉన్న భాస్కరానికి నవ్వొచ్చింది. "అక్కడ వసంతకి వాళ్ళ అత్తగారు ఓ గరిటే, చీపురూ .... ఇక్కడనీవు రాబోయే కోడలికి ఓ గిన్నె, గరిటా తయారుచేసి ఉంచేరన్నమాట..."
"ఇందులో తప్పేముంది .... ఆదిని మేమూ యిలాగే మీ చెల్లిలాగ ..... రేపు నీకు రాబోయే సుగుణాల కుప్పలాగ వచ్చి యీ సంసార బాద్యత పైన వేసుకున్న వాళ్ళమే..."జానకమ్మ గారు కూరముక్కల మీద కారం జల్లి కలిపి:
"నువ్వివాళ యింతవాడివై ఎదురు చెబుతున్నావు గాని, యిరవై ఏళ్ళనాడు ఆ పీటమీద కూచోరా అంటే "మజ్జిగ తిప్పుతా, పప్పు రుబ్బుతా" నంటూ-ఈ పిన్ని ఎక్కడ అలిసిపోతుందోనని బెంగపడ్డవాడినేను" అన్నది.
భాస్కరం నిరుత్తరు డయ్యేడు. పిన్ని సరిగ్గా ప్రయోగించవల్సిన ఆయుధాన్నే ప్రయోగించింది. తను ఆమెచేత పూడిగం చేయించడానికి యిష్టపడుతున్నట్లు ఆరోపించింది.
"ఇప్పుడేనా పిన్నీ! అంత పెదాన్ని....మజ్జిగ తిప్పుతా నిలా ఇయ్యి" అన్నాడు నవ్వుతూ.
"చాల్లే! ఎవరేనా వింటే! ఎంత దారుణం! దీని సవత్తల్లిప్రాపకం మండా .....! ఈడొచ్చిన పిల్ల ఇంట ఉండగా ఆ పిల్లవాడిచేత వంట వొండిస్తున్నది అని నా మొహం ఈడుస్తారు.....అంతేగా నీ ఉద్దేశం?...."
"పిన్నీ! నువ్వు నన్ను చంపేస్తున్నావ్! ఎవరా వెధవలు! ..... చెప్పు తీసుక్కొడతాను..... రమ్మను" మండిపడ్డాడు భాస్కరం.
"వాళ్ళ నెందుకురా భసా? కొట్టడం" ఆమె చిలిపిగా అడిగింది.
"మరి ఏమిటి చెయ్యమంటావు?"-
భాస్కరం-ప్రశ్న కామె ఆవేశపడ్డట్లు చెప్పింది: "నేను సవత్తల్లినాయి వాడికి పెళ్ళేనా తలపెట్టలేదు...ఎదిగిపోతున్నాడు అన్న అపవాదు తప్పించాలి నువ్వు."
ఆమె ఆ ధోరణిలో మాటాడుతుందని భాస్కరం తలపోయలేదు.
"అదికాదు పిన్నీ! మొదట చెల్లి పెళ్ళి గురించి అంతా తెమలాలిగదా" అన్నాడు.
"నా కదంతా తెలీదు.... రేపు శుక్రవారం ఈ ఊళ్ళోనే గాంధీనగరం వెళ్ళాలి మనం......యా పిల్లని చూడు..... ఆనక నీ ఇష్టమొచ్చినప్పుడు చేసుకో...." ఆమె ఖండితంగా చెప్పి, భాస్కరం జవాబు విననూ అన్నట్లు అవతలికి పోయింది.
భాస్కరం నిర్జీవ ప్రతిమలాగ అక్కడే కూచున్నాడు. పిన్ని-కత్తికి రెండువేపులా వాడి ఉన్నది..... పోనీ, పద్మ గురించి చెబితే.....
కాని అదెంత విషమ పరిస్థితులకు దారి తీస్తుందో అతగాడికి తెల్సును. యాంత్రికంగా పోయి తన గదిలో కుర్చీలో కూలబడ్డాడు.
వసంత తల వొంచుకుని పుస్తకాల బీరువా దగ్గర కూచున్నది. ఆ పిల్ల భాస్కరం మీద అలక ప్రదర్శించింది అక్కడ అలాగే కూచుని పుస్తకాలు సవరిస్తూ ఉంటుంది.
భాస్కరం రాగానే, "అమ్మయ్య! తను బ్రతిమాల్తాడు" అనుకున్నది కాని భాస్కరం అటువంటి దేమీ చేయక కుర్చీలో కూలబడ్డంలో తలెత్తి చూసింది.
వసంతకి జ్ఞానమొచ్చిన తర్వాత భాస్కరాన్ని అంత దిగాలు-పడి ఉండగా చూడలేదు. ఒక్కసారి మాత్రం తల్లీ, అన్నా-ఇద్దరూ జగడంపడ్డం, అన్న ఇదే విధంగా కూలబడ్డం జరిగింది.
సుబ్బారావుగారేమంత చెప్పుకోతగ్గ స్థితి పరుడు కాదు. క్రిమినల్ కేసుల రాబడి కూడా అంతంత మాత్రమే- పిల్లల గారాబానికి, జానకమ్మగారి అనారోగ్యానికి, భాస్కరం చదువుక అడపాతడపా అధిక వ్యయం జరగడం ఆ ఇంటి అలవాటే. అందుచేత ఆయన కొంత ఋణం తేవల్సివచ్చింది. అది గ్రహించిన భాస్కరం బి.యస్సీ. తర్వాత మరి చదవనన్నాడు- పై చదువు లకు మరింత అప్పుపాలవడం తనకు గిట్టదన్నాడు.
"నువ్వంత పెరిగి ఈ సంసారాన్ని భరించవాల్సిన రోజు వస్తుంది గాని ఇప్పుడింకా నా అదుపు ఆజ్ఞల్లో ఉండాల్సిందే"నన్నది జానకమ్మగారు.
భాస్కరం ఉద్యోగం చేస్తానన్నాడు. సుబ్బారావుగారు తెలివైన మనిషి - 'దానిష్టం- నీ ఇష్టం" అంటూ తప్పుకున్నారు.
దాంతో తల్లీ, అన్నా-ఇద్దరూ ప్రతికక్షులై వాదించుకోవల్సివచ్చింది.
జానకమ్మగారు "ఛీ! వెధవా! సవతి తల్లిగా చూస్తానే తప్ప, నీకు నా మీద విశ్వాసంలేదు. ఈ లోకం ఎదట నన్ను పాపిష్టిదానిగా, దోషిగా నిలబెట్టడమే నీ ఉద్దేశం. మీ అమ్మే ఐతే నీకు గుండె లుండేవిరా ఎదిరించిందికీ- ఫో అవతలికి. మొహం చూబెట్టకు" అంటూ ఒకవేపు ధారాపాతంగా దుఃఖిస్తూనే భాస్కరాన్నిదూషించింది.
అప్పుడు భాస్కరం మొండిగా ఆమె ఎదుట నిలిచి "కొట్టు పిన్నీ! ఉత్త తిట్లయితే సవత్తల్లి వంటారూ" అన్నాడు. ఆమె మాతృ-వాత్సల్యానికి ముగ్ధుడైనట్లు ఐతే తన ఓటమిని స్వీకరించలేదతగాడు.
దాంతో మరింత విజ్రుంభించి జానకమ్మ "ఎందుకూ! ఆ రోడ్డుమీదికి వెళ్ళినా, సవత్తల్లి దుర్మార్గం చెప్పుకుందికేగా.....నూతిలో పడి ఛస్తా గాని నిన్ను మాత్రం నా మీద అపవాదులు వెయ్యనివ్వనం"ది నిజంగా చేతమన్న గరిటె గోడకేసి కొట్టి, కోపంతో మరొక గదిలోకి పోయింది.
ఆవేళ అన్నయ్య ఇలాగే కుర్చీలో కూలబడ్డాడు. ఆఖరికి అమ్మే గెల్చింది.
"పెద్ద చదువు చదివి, మంచి పెళ్ళాం వస్తే ఎవరికిరా ఆ సౌభాగ్యం? నాకూ, నా పిల్లలికే కాదురా?.... నువ్వు నా మాట నమ్ము..... మీ అమ్మ ఉంటే, నాకంటే ప్రేమగా చూస్తుందమన్నావేమో? ఒక్కనాటికీ చూడదు. నీలాంటి మూర్ఖుణ్ణి భరించలేక పుట్టింటికి పోతుంది!" అన్నది. అన్నం తినని అన్నయ్య-ముందు తానూ ఉపవాసముండి నిలబడి-ఆ దృశ్యం వసంత కళ్ళకు గట్టింది.
"పిన్నీ!" అని గట్టిగా ఆవేళ అన్నయ్య అరిచిన అరుపు ఇప్పటికీ వసంత చెవుల్లో గింగురు మంటుంది. వెంటనే ఆ రోజు అన్నయ్య రెండు క్షణాల్లో అక్కణ్ణించి లేచి వంట ఇంట్లో పీత మీద కూచొని "ఊఁ అన్నం పెట్టు..... తిని ఛస్తా" నన్నాడు.
పిన్ని అంత కోపమూ మరిచిపోయి నవ్వి, కన్నీళ్ళు తుడుచుకుని "చల్లారితే గాని వంట బట్టదు దొర గారికి" అంటూ వడ్డన చేసింది.
వసంతకీ అన్నయ్య మీద అంత వాత్సల్యమూ ఉన్నది. కాని ఆ క్షణం అతన్ని అదీ కదపలేకపోయింది.

8
ధనమ్మగారిది దబ్బపండు ఛాయ. మృదువైన స్థూలకాయము ఏభైయ్యోవడిలో ఉన్నా ఆమె నెవరూ వృద్దురాలని అనుమానించను కూడా లేరు. "ఏమంత లావు గనక?" - మీదంతా మొదట్నుంచి పుషికరమైన విగ్రహమే నని ఆమె శ్రేయోభిలాషులూ, హితైషులూ అను గాక! ఆమె మాత్రం తనది స్థూలకాయమేనని అంగీకరించి - అందుకు రాణించే సిల్కు చీరెలనే ధరిస్తుంది.
"ఆ ఘటం అట్లా రాజఠీవితో వెళ్ళిపోవల్సిందేను" అని నలుగురూ అనుకోవటంలోనే ఆమె కానందం ఉంటే అదేమేనా దోషమా? ఐతే ఆమె భర్త బ్రతికి ఉన్న రోజుల్లో మాత్రం ఆయన సంతృప్తి కోసరం ముతుక చీరెలు అంటే ఎనభైకవుంటు; కోయంబత్తూరు, మధుర ఇత్యాది చీరెలు కట్టవల్సివచ్చేది.
ధనమ్మగారు, రాఘవేంద్రరావుగారు, కాబోయే పెళ్ళికొడుకూ - ముగ్గురూ రావడమే తడవుగా భాస్కరం, జానకమ్మ, సుబ్బారావుగారలు ఎదురొచ్చి లోపలికి సాదరంగా తీసికెళ్ళారు. ధనమ్మగారు కుర్చీకి నిండుగా కూచున్నది కాబోయే వరుడు అంటే, ముకుందరావు మాత్రం కుర్చీ అంచునే కూచున్నాడు.
ధనమ్మగారు వసంతను రకరకాల ప్రశ్నలు వేసింది. "ఇలా రా! ఓసారి" అని దగ్గరగా పిలిచి అవయవ సౌష్ఠవం ఎలా ఉన్నది చేతులతో తడిమి మరీ చూసి, తృప్తిగా "వెయ్యేళ్ళు పసుపూ కుంకుమలతో వర్ధిల్లు "మని ఆశీర్వధించింది.
రాఘవేంద్రంగారు తనదేమీ లేదూ, తాను కేవలం నిమిత్త మాత్రున్ని అన్నట్లు కూచున్నాడు.
అంతా ధనమ్మగారే మాటాడింది. ఒక పాట పాడమన్నదామె కాని, వసంతచేత రెండు పాటలు పాదించుకొని గాని తృప్తి పొందలేదు.
"పెద్ద చదువులు చదివించలేదు గాని, చదివిస్తేనా, పిల్ల సరస్వతిని సాక్షాత్తుగా మెప్పించేది జానకమ్మగారూ!" అన్నది ధనమ్మగారు.
"అమ్మో! పిల్లదానికి ఈవిడ అటు పోగానే దిష్టి తియ్యాలీ" అనుకున్నది జానకమ్మగారు. లోపల-లోపల తన కూతురికి ధనమ్మగారు పెళ్ళి చూపుల సందర్భంలోనేనా వంకలెట్టలేకపోయి నందుకు కించిత్ గర్వపడ్డది కూడాను.
* * *
పెళ్ళి-చూపులకు వొచ్చినవారటు వెళ్ళగానే "అయితే ఈ ధనమ్మకు రాఘవేంద్రం మీద మంచి అధికారం ఉంది సుమండీ" అన్నది జానకమ్మగారు భర్తతో.
"ఔనౌను! చూడగా - చూడగా వ్యవహారం అలాగే ఉన్నది" అన్నాడు సుబ్బారావుగారు.
అవి వూరుకున్నాడా? భార్యకేసి మెప్పుగా చూస్తూ "ధనమ్మమీద, బాపడు అంటే వరుడు -వాడి తల్లిగా నీకు ఉన్నదిగా ఆ అధికారం?" అన్నాడు.
"సర్లెండి.... ఆ మాటకొస్తే ఉండాల్సిందే.....ఆ భాపడు లాంటి అల్లుడు తపస్సు జేస్తే గాని దొరకడు" అన్నదామె. "నా భాసడ"ని ఆమె అనడంలోని గర్వం నిష్కల్మషమైనది. అదే సుబ్బారావుగారి గర్వం కూడాను! ఆయన చుట్ట భగ్గు భగ్గున భేషుగ్గా కాల్చుకున్నాడు.
"బహుశా ఈ రాఘవేంద్రంగారు తన ఇల్లు ఈ ధనమ్మవద్ద క్డుహువబెట్టి ముకుందమనే తన అబ్బాయికి చదువు చెప్పించాడనుకుంటాను" అని "ఔనా?" అన్నాడు ఆయనే మళ్ళీ.
"ఏమో మరి.... మన భాస్కరం యేమంటున్నాడో తెలుసునా? ఈ పరీక్షలవితే గాని, పెళ్ళి సంగతి తలపెట్టొద్దని." జానకమ్మగారు కను బొమలు ముడిపడగా ఫిర్యాదు చేసినట్లన్నది.
"నిజమే సరి...... సరీ....."
అంతలో భార్య ఎర్రని కళ్ళల్లోనికి భయం చూసి, నోట్లోనుంచి చుట్ట గబుక్కున తీసి "ఈలోగా పిల్లని చూస్తాడూ.... అదీ ఎంత! ఏడాది. ఔనా? ఇట్టే తిరిగిరాదూ?" అన్నాడాయన భార్య ననునయిస్తున్నట్లు.
"ఏమో బాబూ! ఈ రెండు పెళ్ళిళ్ళను చేసేస్తే గాని, నాకు గుండెలమీద భారం తగ్గదు" అన్నదామె.
"సరే! ఆడకూతురు కదా! ఆ ధనమ్మ గారినే అడుగుతాను- పెళ్ళి విషయాల్లో యాచన, ఆస్తి విషయాల్లో సూచనా అడిగినా నేరం కాదుగా అనుకున్నది కూడా ఆమె.
"భాసడికి వాళ్ళ అమ్మ బ్రతికుంటే, ఈ పాటికి ఎంత అలజడి-పడేదో పెళ్ళి చెయ్యాలని...." అనుకుంటుందొక్కోసారి జానకమ్మగారు.
"ఆఁ!....అదెక్కడి మాట..... వాడికి నేను ఆవిదకంతే ఏం తక్కువ చేశాను.....ముమ్మాటికీ చెయ్యను...." అనుకుంటుంది మళ్ళీ, "ఛీ! కర్మ గాపోతే, వాడు నా కడుపునే ఎందుకు పుట్టలేదూ?" అని బాధపడుతుంది కూడా.
9
"చూడు వసంతా! ఇలా కబురు!" పిలిచేయ భాస్కరం.
వసంత చురుకుగా సంబరంగా వచ్చింది.
"అన్నయ్యా! నీకు అమ్మ చెప్పమన్నది...... రేపు ఎక్కడికి పోవొద్దు....మరేం......వొదినెను అంటే అదే పెళ్ళికూతుర్ని చూడటానికి వెళ్తాముట మనం" వసంత సరదాగా చెబుతూన్నదల్లా అన్నయ్య మొహంలోని మార్పులను చూసి వూరుకున్నది. అన్నమాటలను వీలైతే ఉపసంహరించుకుందామా? అని కూడా అనుకున్నది. ఈ బిడియానికి మొదటి కారణం అన్నయ్య, పెళ్ళీ అంటే చూపుతున్న విముఖత-రెండోది-తనూ పెళ్ళికూతురైందిగా. అన్న తనను ఆట- పట్టిస్తాడేమోనన్న సహజమైన లజ్జ.
"ఔను కాని, వసంతాలూ! నిన్నొక మాట అడుగుతాను చెప్పు...... నీకు మొన్న చూసిన సమ్మంధం యిష్టమేనా?" భాస్కరం చెల్లెలి మాటలకు సమాధానమే యివ్వలేదు. పైగా సూటిగా ఎదురు ప్రశ్న వేశాడు.
