Previous Page Next Page 
ఇందుమతి పేజి 5


                                  5
    వెంకట రత్నం గారు బ్రహ్మ సమాజవాది. కలకత్తా లో ఎమ్.ఎ. పరీక్ష కు చదువుకునే రోజుల్లో అక్కడి బ్రహ్మ సమాజం వారి ప్రభావం అయన మీద గాడంగా పనిచేసింది. రాజారామ మోహన రాయలు , కేశవ చంద్ర సేను, దేవేంద్ర నాద తాగురు మొదలయిన బ్రహ్మ సమాజ స్థాపకుల ప్రబోదాలాయన మనస్సుకు బాగా పట్టాయి. బ్రహ్మ సమాజం వారు ఏకేశ్వరోపాసకులు, విగ్రహారాధన ప్రతికూలురు. దేవుడొక్కడే అనీ, అతనికి రూపం లేదనీ, అతనిని మనః పూర్వకంగా ప్రార్ధించ వలసిందే గాని రాయి రప్పల ముందు మోకరిల్లడం తప్పనీ, క్రతువులూ, శ్రాద్దలూ ఇత్యాది పద్దతులన్నీ నిరర్ధకాలనీ , వర్ణ విచక్షణ దుష్ట మనీ, విధవా వివాహాలలో దోషం లేదనీ వారి వాదన. అంటరాని తనం మంట కలపాలని వారి ఉద్భోధన.
    ఆంధ్రదేశం లో బ్రహ్మ సమాజ వాదులు తక్కువ. కాకినాడ, రాజమహేంద్ర వరం, గుంటూరు మొదలయిన పట్టణాలలో మాత్రం కొద్ది మంది ఉండేవారు. ఆ కొద్ది మందిలో వెంకట రత్నం గారు ముఖ్యులు. ఆ మత ప్రచారానికి అయన ఎంతో తోడ్పడుతూ ఉండేవారు. కాంగ్రేసు వారి ప్రభావం కూడా ఆయనపై ఎక్కువ. ఎప్పుడూ తెల్లని ఖాద్దరు ధోవతి, ఖద్దరు చొక్కా, ఖద్దరు ఉత్తరీయమూ ధరిస్తుండేవారు. ఆయనే కాకుండా వారి ఇంట్లో అందరూ కూడా ఖద్దరే ధరించేవారు. దుప్పట్లూ, తువ్వాళ్ళూ, తేరగుడ్డలూ, బల్ల గుడ్డలూ , అన్నీ ఖద్దరువే. సంఘ సంస్కారం కోసం కృషి చేసే ప్రతి సంస్థకు అయన కొద్దో గొప్పో సహాయం చేస్తూనే ఉండేవారు.
    అయన సాహితీ ప్రియులు కూడాను. తెలుగులో అది కావ్యమైన మహాభారతం దగ్గిర నించీ నవ్య సాహిత్య పరిషత్తు ప్రచరణల వరకూ అన్ని రకాల కావ్యాలూ, గ్రంధాలూ అయన లైబ్రరీ లో ఉండేవి. భారతి, కృష్ణా పత్రిక , గృహ లక్ష్మీ , ప్రతిభ మొదలైన ఆనాటి సాహితీ పత్రికలన్నీ కూడా అయన తెప్పిస్తుండేవారు.
    ఆరోజుల్లో నెలకు పాతిక రూపాయలిస్తే గుంటూరు వంటి పట్టణాల్లో కూడా విశాలమైన ఇల్లు అద్దెకు దొరికేవి. అటువంటి ఒక పెద్ద డాబా ఇంట్లో అద్దెకు  ఉండేవారు వెంకట రత్నం గారు. ఆ ఇంటి చుట్టూ విశాలమైన ఆవరణ. ఆ ఆవరణ లో రకరకాల చెట్లూ, తీగెలూ, మొక్కలూ ఉండేవి. మామిడి, నారింజ, జామ మొదలైన ఫల వృక్షాలూ , సన్నజాజి , మల్లీ మాలతీ, మందారం , పారిజాతం, నందివర్ధనం మొదలైన పూల చెట్లూ , అనేక రకాల క్రోటను మొక్కలూ అదిగాగల వాటితో చూడ ముచ్చటగా ఉండేది. పెరడంతా. ఆ పెరట్లో వెనక పక్క ఒక చిన్న పెంకు టిల్లు ఉండేది. ఒకే గది. దాని పక్కగా వంటకు వీలుగా ఒక చిన్న వసారా. ఆ పెంకు టింట్లో వేరుగా కాపరం పెట్టారు దుర్గాప్రసాదరావు గారూ, మాణిక్యమ్మ గారూ రాజేశేఖర మూర్తి ని వెంట బెట్టుకుని.
    దుర్గాప్రసాదరావు గారికి ప్రిత్రార్జితమైన పది ఎకరాల మెరక భూమి ఉండేది, తూర్పు గోదావరి జిల్లా లోని గోవాడ గ్రామం లో. ఆ భూమి మీద వచ్చే ఆదాయమే వారికి జీవనాధారం. వచ్చిన దానితోనే క్లుప్తంగా గడుపుకుంటూ జీవనం సాగిస్తూ వచ్చారు. ప్రసాద రావు గారు, మాణిక్యమ్మ గారు ఒక్కపూటే భోజనం. రెండవ పూట ప్రసాదరావు గారు రెండు గోధుమ రొట్టెలు తినేవారు. మాణిక్యమ్మ గారు సగ్గుబియ్యపు జావ . రాజుకు మాత్రం ఏ లోటూ రానీయరు. అతనికి అన్ని కూరలూ పనికి రావు. కాకరకాయలు, సొరకాయలు, బెండకాయ మొదలయినవి కిట్టవు. ఎప్పుడూ బంగాళా దుంప, కాకపొతే వంకాయ. నాలుగైదు సంవత్సరాలుగా వెంకటా చలపతి గారింట పాలు పోస్తూ వచ్చిన వీరమ్మ రోజూ ఒక పావు సేరు పాలు రాజు కోసం ఇచ్చి పోతుంది. డబ్బు తీసుకోదు. ఆమెకు   పిల్లలు లేరు. తల్లిలేని పిల్లవాడని రాజు పై ఆమెకు అభిమానం. రాజుకు రోజూ అన్నం లో పాలూ, పంచదారా ఉండి తీరాలి.
    వెంకట రత్నం గారికి ఒక ఆడపిల్ల. ఒక మగ పిల్లవాడు. పెద్ద పిల్ల భారతి కాన్వెంటు స్కూల్లో చదువుకుంటుండేది. మగ పిల్లవాడి పేరు రవీంద్ర నాద్. రాజుకూ, రవికీ వయస్సు లో కొద్ది నెలల తేడా. బావా, బావా అనుకుంటూ ఎంతో ఆప్యాయంగా స్నేహంగా పెరాట్లో పడి ఆడుకుంటుండేవారు. అయిదో ఏట ఇద్దరికీ ఒకే మారు అక్షరాభ్యాసం అనే తంతు లేకుండానే ఆఆ లు దిద్దించటం మొదలు పెట్టారు వెంకట రత్నం గారు. ఇద్దరూ తెలివైన పిల్లలు. వెంకటరత్నం గారి క్రమశిక్షణ లో ఇద్దరూ కూడా ఒకరిని మించి ఒకరు త్వరత్వరగా తెలుగూ, ఇంగ్లీషూ లెక్కలు ఇంటి దగ్గరే నేర్చుకోసాగారు.
    అత్తగారూ మామగారూ వేరే కాపరం పెట్టిన కొత్తలో కొన్నాళ్ళు వెంకటాచలపతి గారు రోజూ ఒకమారు వచ్చి కొడుకును చూసి, క్షేమ సమాచారాలు కనుక్కొని వెళుతుండే వారు. కొన్నాళ్ళ తరవాత రోజు విడిచి రోజు రావడం మొదలు పెట్టారు. మరి కొన్నాళ్ళ కు వారానికోక రోజు వచ్చి చూసి వెళ్ళేవారు. రాను రాను నెలకొక సారి రావటం కూడా కష్టం అయింది. కాలక్రమేణా అయన భార్యా లోలుడై  అత్తగారి అంక్షలూ, ఆదేశాలూ అనుసరించవలసిన పరిస్థితికి దిగజారి పోయారు.
    వెంకాయమ్మ గారు, ఆవిడ పిల్లలూ చలపతి గారి దగ్గిరే ఉంటూ వచ్చారు. గోపాలం, గోవిందూ పల్లెటూరి లో చదువు సంధ్యలు లేక చేడిపోతున్నారన్న మిషతో వారిద్దరినీ గుంటూరు లోనే స్కూలు ప్రవేశ పెట్టారు. రాను రాను వెంకాయమ్మ గారు వియ్యపు రాలు సీతమ్మ గారి మీద కూడా యుద్ధం ప్రకటించింది. మాణిక్యమ్మ గారు ఇల్లు విడిచి వెళ్ళిపోయిన నాటి నించీ వెంకాయమ్మ గారి దృష్టి సీతమ్మ గారి మీదికి మళ్ళింది. సూటీ పోటీ మాటలతో మొదలైన తగాదాలు తరచుగా వాగ్యుద్దాల ద్వారా జుట్టూ జుట్టూ పట్టుకొనే వరకూ వచ్చాయి. తప్పంతా సీతమ్మ గారిదే నని భర్తకు నచ్చ చెప్పేది రాజేశ్వరి దేవి. ఈ తగాదాలు సరిదిద్దలేక తల్లిని వీరన్న పేట వెళ్లి అక్కడ ఉన్న స్వంత ఇంట్లో ఉండమని ఆదేశించారు వెంకటా చలపతి గారు. "నీకు వచ్చిన ఫరవాలేదు రా" అని భరోసా ఇచ్చారు సుబ్బారావు గారు. అదే మంచిదని స్వగ్రామానికి వెళ్ళిపోయింది సీతమ్మ గారు.
    ఆ విధంగా వెంకాయమ్మ గారి అధికారం సుస్థిరమై పోయింది. ఆవిడ తరపు చుట్ట పక్కాల రాక పోకలు ఎక్కువయ్యాయి. ఏ కారణం చేత నైతేనేం , వ్యాపారం లో వచ్చే లాభాల కంటే ఇంటి ఖర్చులు ఎక్కువయ్యాయి. అసలే బ్రాహ్మణ వ్యాపారం, అందులో అత్తగారి అధికారం. వెంకటాచలపతి ఆర్ధిక పరిస్థితి నానాటికి తీసికట్టు నాగం బొట్టూ అన్నట్టు అవుతూ వచ్చింది.
    రాజేశ్వరీ దేవికి కొడుకు పుట్టాడు. నక్షత్రం మంచిది కాకపోవటం చేత నవగ్రహ శాంతి చెయ్యవలసి వచ్చింది. పదకొండో రోజున శాంతీ, బారసాలా , నామకరణం అనుకున్నారు. వీరన్న పేట నుంచి సుబ్బారావు గారూ, సుభ్రద్రమ్మ గారూ సేతమ్మ గారూ వచ్చారు. నలుగురినీ భోజనాలకి పిలుచు కుందామానుకున్నారు వేంకటాచలపతి గారు. నలుగురు ఎవరున్నారు కనక? దుర్గాప్రసాదరావు దంపతులూ, రాజూ, వెంకటరత్నం గారి కుటుంబమూను. దుర్గాప్రసాదరావు దంపతులను ఏమైనా సరే పిలవటానికి వీలులేదని పట్టు పట్టింది వెంకాయమ్మ గారు.
    'అసలే నా బిడ్డ అంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటుందా చుప్పనాతి. నా బిడ్డకు ఒక నలుసు కూడా కలిగాడంటే ఇక విషమే కక్కుతుంది.  ఆవిడ ఈ ఇంట్లో అడుగు పెట్టటానికి వీల్లేదు, ఏమైనా సరే" అన్నది.
    మరునాడు బారసాల అనగా సాయంత్రం వెంకటా చలపతి గారు వెంకటరత్నం గారి ఇంటికి వెళ్లి సంగతులు విశద పరిచి వెంకటరత్నం గారినీ, అయన కుటుంబాన్ని ఆహ్వానించారు.
    "చలపతీ, మీ మామగారికి సంబంధించిన వాళ్ళమే గదా మేమంతా? అయన రాకుండా మేమెలా రాగలం? వస్తే ఏం బాగుంటుంది? అయినా భోజనాల దేముంది లే. వచ్చినా రాకపోయినా మా అందరి ఆశీస్సులు నీకూ, నీ కుటుంబానికీ ఉండనే ఉంటాయి. నీ వటువంటిదేమీ మనస్సు లో పెట్టుకోకు" అని నచ్చ చెప్పారు వెంకట రత్నం గారు.

                                    
    ఆ తరవాత దుర్గాప్రసాద రావు గారిని కలుసుకుని, సంగతులు వ్యక్తీకరించి , తన చేతకాని తనానికి క్షమించమని వేడుకున్నారు వెంకటా చలపతి గారు. ప్రసాదరావు గారి కళ్ళ వెంట నెత్తురు బొట్లే రాలాయి. "బాధపడకు, నాయనా. ఏదో విధంగా అనుకూలంగా సంసారం గడుపుకోవటమే మనకు కావలసింది. మేము రాలేకపోయినా మా మనస్సులు అక్కడే ఉంటాయి. నీకూ, నీ భార్య కూ, పిల్లవాడికీ మా ఆశీస్సులు" అని మాణిక్యమ్మ గారిని పిలిచి ఇంత పంచదార పొట్లం కట్టించి చిన్నబాబు నోట పెట్టమని వెంకటా చలపతి గారికి ఇచ్చారు.
    వెంకటా చలపతి గారు రాజును ఆ రాత్రి తీసుకు వెళ్లి మరునాడు సాయంకాలం తిరిగి తీసుకుని వస్తానన్నారు. మాణిక్యమ్మ గారు, "వద్దు, నాయనా, వద్దు. ఆవిడ అసలే మందుల మారిది. నీకేం మందు పెట్టిందో నీ మనస్సు విరిచేసింది. నా బిడ్డ పేరుగా భూమి మీద మిగిలింది ఈ ఒక్క నలుసు. ఈ నలుసును మాత్రం ఆవిడ దరిదాపు లకు కూడా తీసుకెళ్లకు" అని అడ్డు పడ్డది.
    కంట నీరు పెట్టుకుని వెళ్ళిపోయారు వెంకటా చలపతి గారు.
    దుర్గాప్రసాద రావు గారికి మాత్రం మనస్సు ఉండబట్ట లేదు. మరునాడు సాయంత్రం భారతిని తోడూ తీసుకుని, రాజశేఖర మూర్తిని వెంట బెట్టుకుని మాణిక్యమ్మ గారు వద్దని చెబుతున్నా వినకుండా, చేతి కర్ర టకటక లాడించు కుంటూ షికారుగా బయలుదేరారు వెంకటా చలపతి గారి ఇంటి వైపు. పిలవకపోయినా వచ్చిన దుర్గాప్రసాద రావు గారినీ, కొడుకునీ చూచి వెంకటా చలపతి గారు ఆనంద పరవశు లైనారు.
    "ఏం, నాయనా , అంతా సక్రమంగా జరిగిందా?"
    "మీ దయ వల్ల సక్రమంగా నే జరిగింది మామగారూ, మీరందరూ సమయానికి లేకపోయారనే కొరత ఒక్కటి తప్ప."
    "ఏం పేరు పెట్టారు?"
    "వెంకట రమణ."    
    "బాగుంది. ఆ వెంకట రమనుడే సర్వ వేళలా వాణ్ణి వెన్నంటి ఉంటాడులే."
    "మీ ఆశీర్వచనం."
    మామగారిని మంచం మీద కూర్చో బెట్టి చిన్న కొడుకుని తెచ్చి చూపించటానికి లోపలికి వెళ్ళారు వెంకటా చలపతి గారు. ఇంతలో బయటికి వచ్చిన సీతమ్మ గారు రాజుని చూసి చంకన ఎత్తుకుని, "నా నాయనే, నా తండ్రే , ఎన్నాళ్ళ కు చూశాను రా? చదువు కుంటున్నానా, బాబూ?" అని ముద్దులాడ సాగింది. సుబ్బారావు గారు ప్రసాదరావు గారిని యోగ క్షేమాలు ప్రశ్నించ సాగారు. ఇంతలో లోపలి నించి వెంకాయమ్మ గారి కేకలు పెద్దగా వినబడ్డవి. "ఏం, ఎవరాహ్వానించారుటా, తగుదు నని తయారయ్యాడు? నా కూతురు, అల్లుడూ సుఖంగా ఉంటె చూడలేరు కామోసు. ఇంకా నయమే ఆ చుప్పనాతిని గూడా తీసుకు వచ్చాడు గాదు పిల్లవాడ్నేం చూపించక్కేర్లేదు. వాణ్ణి ఇలా పది కాలాల పాటు బతకనివ్వండి."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS