"కాదు మరీ? మీకన్నీ తెలుసు." మొగమంతా నోరు చేసుకుని నవ్వాడు భుజంగం.
ధర్మారావు తన ధోరణి లో సాగిపోయాడు. "కాని, భుజంగం గారూ, దేనికైనా హద్దు ఉండాలి. పాపపుణ్య విచక్షణ ఉండాలి. నిశ్శహయుల నోళ్ళు కొట్టి అధికంగా ఆర్జించాలని చూడడం కంటే హైన్యం మరెక్కడా ఉండదు ఈ ప్రపంచంలో."
భుజంగం వదనం లో కృత్రిమ నవ్వు మాయమై, సహజమైన కఠిన క్రోదాత్మక రూపురేఖలు నిండుగా అలుముకున్నాయి. "తమరేమో కోపంగా ఉన్నట్లున్నారు " అన్నాడు సూటిగా.
మంద గంబీర స్వరంతో జవాబు చెప్పాడు ధర్మారావు. "కోపం కాదు, భుజంగం గారూ, బాధ. ఖైదీలు తింటున్న తిండిని చూచాను; నా కడుపు దహించుకు పోయింది. అది అసలు ఏమిటో నిర్ణయించు కోలేక పోయాను. అది అన్నమని అనడం అపరాధమే అవుతుంది. వారికి పెట్టించే ఆహారం లో మార్పు ఎంత త్వరలో సాధ్యమైతే అంత త్వరలో తేవాలి. రేపటి నుండే అయితే మరీ సంతోషిస్తాను. ఎటువంటి నేరం చేసినా ఖైదీలు మానవులే నని మరిచి పోకండి. ఈ విషయం చెప్పడానికే పిలిపించాను. మరి నాకు పనున్నది. తమరు వెళ్లి రండి. నమస్కారం " అంటూనే నిష్క్రమించాడు, మరి భుజంగం ముఖం వైపు చూడకుండా.
తన వెనుక భుజంగం బుస కొట్టడం అతడు గమనించనే లేదు.
7
ప్రశాంత మనోహర సంధ్య. కొద్దిసేపు వాహ్యాళి పోదలచిన ధర్మారావు ఆఫీసు దుస్తులు తీసివేసి తెల్లని పంచె, లాల్చీ ధరించి, కాలక్షేపానికి చేతిలో ఒక గ్రంధంతో బయలుదేరాడు.
'అలా చల్లగాలికి నది ఒడ్డుకు పోయి వస్తానమ్మా" అన్నాడు దయామయి దగ్గరకు పోయి.
ఒక్కసారి తల ఎత్తి చూచి, మళ్ళీ, వాల్చి వేసి "ఊ," అంది దయామయి.
"ఈ మధ్య రాత్రింబవళ్ళు ఆఫీసు దుస్తులు తీయడానికే వీలు లేకుండా ఉన్నది. ఇవాళే కాస్త తీరిక చిక్కింది. ఈ దుస్తులేలా ఉన్నాయమ్మా?" అని అడిగాడు.
"బాగానే ఉన్నాయి లెద్దూ . త్వరగా వెళ్లిరా. పొద్దు పోయేవరకూ చలిగాలి లో తిరగకు." అన్నదే కాని, ఆమె తలఎత్తి చూడలేదు.
"అమ్మా! నిన్నెంత కాలం నుంచి ఓ మాట అడగాలను కుంటున్నాను " అంటూనే పక్కన కూర్చున్నాడు.
"ఏమిటది?' ఈసారీ తల ఎత్తలేదు దయామయి.
"నేనవరిని?' సూటిగా ప్రశ్నించి, పరిశీలనగా ఆమె ముఖ కవళికలను పరీక్షించ సాగాడు. అతడాశించినట్లే ఆమె అంతరంగం లోని కలవరం అనేక రూపాల బహిర్గతమైంది.
"ఏమిటా అర్ధం లేని ప్రశ్న?' ఆమె కంఠం లో తెచ్చి పెట్టుకున్న కాఠిన్యం.!
"అర్ధం ఉన్నదనుకొనే అడుగుతున్నాను. నేనెవరినో నీకు బాగా తెలుసనే నా నమ్మకం. బొత్తిగా పుట్టు పూర్వోత్తరాలు లేని దిక్కులేని అనామకుడిని మాత్రం కాదను కొంటాను."
కొద్ది క్షణాలు కదలక మెదలక స్థాణువు లా కూర్చున్న దయామయి , ఉన్నట్లుండి పిడుగులు రాలుతున్నట్లు అన్నది; "వెనక ఒక దిక్కులేని వాడివి. ఇప్పుడు పెద్ద ఆఫీసరు వి. ఈ విషయం నాకూ తెలుసు."
ధర్మారావు చిన్నగా నవ్వి అన్నాడు : 'అది అందరికీ తెలుసు. కాని నీకు ఇంకా ఏమో తెలుసనీ నా నమ్మకం."
"అట్టే తెలివి తక్కువ ప్రశ్నలు వేసి వేధించకు నన్ను. షికారుకు పోతానంటూ వచ్చి ఏమిటీ అప్రస్తుత ప్రసంగం?"
"సరే, చెప్పవన్నమాట?' కూర్చున్న చోటు నుండి లేస్తూ అన్నాడు. "కాని, అమ్మా! నా ప్రశ్న అవివేకమైనదీ, నిరాధార మైనది కాదని నాకు తెలుసు. మొన్న ఏదో మాట అని వెనక్కు తీసుకున్నావు. పూర్తిగా చెప్పలేదు. అంతవరకూ ఎందుకూ? నన్నింత ప్రేమతో పెంచడమే కాని, ఎన్నడూ కన్నెత్తి నిండుగా చూడవు. ఏదో రహస్యం నాకు తెలిసి పోతుందని నీ సంశయం. నాకు తెలుసు."
నవ్వేసింది దయామయి. "అదా నాయనా. నీ అనుమానం? నరుల దృష్టికి నాపరాళ్ళు పగులుతాయంటారు. అసలే ఠీవిగా ఆజానుబాహువుగా ఉండే విగ్రహం. దానికి సహాయం నవ మన్మధుడి లా ముస్తాబై వస్తే ఏం చూడను? అందరి కంటే తల్లి దృష్టి దోషం మరీ చెడ్డ దంటారు."
మధురమైన మమత తో, అనిర్వచనీయమైన అనురాగను భూతితో ,మనసు నిండిపోయి, ధర్మారావు కనులు పరిపూర్ణనందాతిరేకంతో మిలమిల లాడాయి. "అమ్మా!...." అనురాగ పూర్ణమైన అంతరంగం నుండి మాటలు కరువైనాయి.
అనురాగ కదృక్కులతో, ఆర్ద్ర నయనాలతో తననే చూస్తున్న ధర్మారావు ను చూచి నవ్వుతూ, అన్నది దయామయి. "ఊ! అను. ఆగిపోయావేం? నువ్వే ఇంత ప్రేమగా ఉంటె అసలు తల్లి ఇంకెలా......"
"లేదమ్మా లేదు. " మధ్యలోనే అడ్డ్డు పడ్డాడు ధర్మారావు. 'అటువంటి తెలివి తక్కువ మాటలతో మరెప్పుడూ నిన్ను బాధపెట్టను. ప్రత్యక్ష దైవాన్ని నిన్ను వదిలి, ఎవరో తెలియని , లేనివారి కోసం అర్రులు చాచను."
"ఈ అనవసరపు మాటల కేమిలే! షికారు కని బయలుదేరి ఇక్కడే ఉండిపోయావు. వెళ్లి త్వరగా వచ్చేయి.' అంటూ లేచి వెళ్ళిపోయింది దయామయి.
నవ్వుకుంటూ పరధ్యానంగా నడుస్తున్న అతడికి ఎదురుగా ఎవరో పెద్ద బరువును మోస్తూ వస్తున్నట్టు కనిపించాడు. బరువుగా ఉన్న ఒక తట్ట నూ, ఒక పెట్టె నూ కూలీ చేత మోయించి, తెస్తున్నాడు ఒక నడి వయస్సు మనిషి.

"ఏమిటది? ఎవరు నీవు?' ప్రశ్నించాడు ధర్మారావు.
'చిత్తం. నేను భుజంగరావు గారి గుమస్తా నండి. ఇవి తమకు ఇమ్మన్నారండి."
"ఏమిటి ? ఎందుకు?" కనుబొమలు చిట్లించాడు ధర్మారావు.
"హయ్య! మామూలే కదండీ? తమరు అధికారులు. ఇంట్లో పెట్టించండి. మా అయ్యగారితో స్నేహం ఉండాలే కాని, ఇల్లంతా బంగారు పంట పండించేయరూ?' వెకిలిగా నవ్వాడతడు.
ధర్మారావు నేత్రాలు అరుణిమకు ఆలవాలమయ్యాయి. వదనం జేవురించింది. 'అయితే మీరు భుజంగం గారి మనుష్యులన్నమాట? ఇప్పుడు అయన పంపగానే వచ్చారా?' అని అడిగాడు ధర్మారావు.
"చిత్తం?" అన్నాడు సగం చచ్చి.
ఒక్కసారిగా గర్జించాడు ధర్మారావు -- "వెళ్ళండి అన్నీ తీసుకు పొండి. మళ్ళీ ఇంకెప్పుడూ ఇటువంటి అడ్డదార్లు వెంబడి రావద్దు." అని.
"మీరు కొంచెం ......." నసిగాడు గుమస్తా.
"గెటౌట్." పరిసరాలు మార్మ్రోగేలాగే అరిచాడు ధర్మారావు. "మరొకసారి ఇటువంటి పని చేస్తే పై అధికారులకు తెలియపరచ వలసి ఉంటుందని మీ భుజంగం గారితో చెప్పండి. వెళ్ళండి."
నిప్పులు కోరిసే ఆ నేత్రాలలోని తీక్షణ తను మరి భరించలేక, త్వరత్వరగా వెళ్ళిపోయారు భుజంగం మనుష్యులు.
చికాకుగా ఉన్న మనస్సుతో అదో వదను డై మందంగా అడుగులు వేస్తున్న అతడు, వచ్చి హారన్ కొడుతూ కాంపౌండు గేటు వద్ద ఆగిన కారును చూచి ఒక్క క్షణం ఆగాడు.
గేటు దగ్గర కాపలాదారు కారుకు శాల్యుట కొట్టి, పరుగెత్తి వెళ్లి కారు తలుపును తెరుస్తుండడం చూచిన ధర్మారావు ఆశ్చర్యంగా ఆటే చూస్తూ నిల్చున్నాడు. కారులో నుండి సుమారు ఇరవై ఇరవై రెండేండ్ల యువతి దిగి, పోలీసు జవాన్ల సలాములు హుందాగా అందుకుంటూ, ఆవరణ లో ప్రవేశించి, అటు వైపు గానే నడిచి రాసాగింది.
ఇద్దరి మధ్య దూరం తగ్గిన కొలది , ఆమె సౌందర్యం విస్పష్టంగా కనిపించి, చకితుడయ్యాడు. ఎన్నడూ కవిత్వం జోలికి పోనీ వాడైనా, సంపంగి పూవులా ఉన్న ఆ సౌందర్య వతిని చూడగానే మనస్సు కవితా సీమకు యెగిరి పోయి, ఏవేవో మధుర భావాలు చెలరేగాయి. అంతలోనే తానూ, తన ఉద్యోగం , ధర్మం గుర్తుకు రాగా తప్పనిసరిగా ఆమె వెంట వస్తున్న పోలీసు జవాను ను అడిగాడు -- "ఈరోజు విజిటర్ల ను ప్రవేశ పెట్టావేమిటి?" అని.
"చిత్తం . విజిటర్ కాదండి. మన ఊళ్ళో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు. తరచూ వస్తూనే ఉంటారు" అని "వీరు కొత్త సూపర్నెంటుగారు మన జైలుకు" అని ఆమెతో చెప్పాడు.
"నమస్కారం' అంటూ చుట్టూ చూచిందా యువతి. తమను నామదేయాలతో పరిచయం చేయగల అర్హత గలవారు ఆ పరిసరాలలో కనిపించలేదు. ధర్మారావు కూడా చిరునగవుతో ప్రతి నమస్కారం చేసి ఊరుకున్నాడు.
"మీరు ఎక్కడికో వెళ్తున్నట్లున్నారు ?" అంది ఆమె.
"లేదులెండి. ఊరికె అలా షికారు కు. అంతే" అంటూ ఆమెతో పాటు అడుగులు వేయసాగాడు.
"నా పేరు సత్యాదేవి. బి.ఎల్ పాసయ్యాను. ఇక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని. ఒక ఖైది ని చూడవచ్చాను" అన్నదామె , తలవంచి నడుస్తూనే.
"సంతోషం. నేను ఎమ్. ఎ. పేరు ధర్మారావు. ఇక్కడ ఉద్యోగి గా వచ్చి ఇంకా వారం రోజులు కూడా కాలేదు."
"అయినా అప్పుడే చాలా అలజడి లేపారు " అన్నది నవ్వుతూ.
"సారీ, వివరిస్తారా?' అన్నాడు ఆశ్చర్యం పైకి ప్రదర్శించ కుండా.
నవ్వి, "ఏమీ లేదు. ఖైదీ లందరూ దైవాన్ని కొలిచినట్లు కొలుస్తున్నారు మిమ్మల్ని. మీరు చాలా ఉదారంగా ఉంటున్నారని విన్నాను" అని ఊరుకుంది.
ధర్మారావు మాట్లాడలేదు.
ఆమె తిరిగి అన్నది: "పొగడ్త నాకూ ఇష్టం ఉండదు. బహుశా మీకూ అయిష్టమే కావచ్చు. ఊరికే విన్న సంగతి చెప్పానంతే. మరేమైనా మాట్లాడండి."
ఇద్దరూ తేలికగా నవ్వేసుకున్నారు. ఏమిటో దూరం లేనట్టే, ఏదో చిరకాల బాంధవ్యం ఆత్మీయత దాగి ఉన్నట్టే అనిపించింది ఇరువురికీ.
"అయితే మీ ఉద్యోగం ఎలా ఉంది?' అని అడిగాడు ధర్మారావు.
నవ్వి అంది: "కత్తి మీద సాము. చెప్పాలంటే పెద్ద కధ."
అలా మాట్లాడుకుంటూనే ఖైదీలను సమీపించారు. ఖైదీ లందరూ పనులు ముగించి కూర్చున్నారు. ఎవరిని వారి వారి గదులలో ప్రవేశ పెట్టె ప్రయత్నంలో ఉన్నారు జవానులు.
"దండాలు బాబుగారూ, నమస్కారాలమ్మాయి గారూ" అంటూ ఖైదీలంతా వారి పట్ల తమ గౌరవాన్ని వెల్లడించారు.
"అంతా బాగున్నారా?' నవ్వుతూ పలకరించింది సత్యాదేవి.
"బాగున్నాము తల్లీ."
"మీరు ఈ అందరికీ బాగా తెలుసనుకుంటాను!" కొద్దిగా ఆశ్చర్యంతో ప్రశ్నించాడు ధర్మారావు.
ఖైదీల నుండి వచ్చింది అతడికి సమాధానం. "మీలాగే దయాదాక్షిణ్యా;లు గల తల్లి. అందుకే మాకు అభిమానం."
"గౌతమ్ గారూ, కులాసానా?" ఒక మూల ప్రపంచంతో సంబంధం లేనట్టు నిలబడి ఉన్న గౌతమ్ దగ్గరగా వెళ్తూ ప్రశ్నించింది సత్య.
సొంత కుమార్తె ను చూచుకున్నంత ఆప్యాయత తొణికిసలాడింది గౌతమ్ వదనం లో.
"నా కులాసా కేం, తల్లీ? నీ నిర్ణయం ఏం చేశావు?"
నవ్వింది సత్య. "నా ఉద్యోగం విషయమేనా? రాజీనామా ఇవ్వడానికే నిశ్చయించు కున్నాను."
ఆ ప్రియమైన విషయం విన్నట్టు బాధ ప్రస్పుటమయింది గౌతమ్ వదనం లో. ధర్మారావు చూపులు కూడా ఆశ్చర్యం ప్రకటించాయి.
వారి కుతూహలం గమనించిన సత్య చిన్నగా నవ్వుతూ అన్నది : "ఈ మధ్య ఈ విషయం గురించే నాన్నగారి దగ్గరకు వెళ్లి వచ్చాను. అయననీ, నావీ పూర్తిగా బేదాభిపరాయాలు. రాజీనామా ఇవ్వను వీల్లేదని ఖండితంగా చెప్పి వేశారు. ఏం చేయాలో నిర్ణయించు కోలేకుండా ఉన్నాను."
"సొంతంగా ప్రాక్టీస్ పెట్టాలను కుంటున్నారా?" ధర్మారావు అడిగాడు.
"ఉహు. ఎందుకు, చెప్పండి? నాకు ధనార్జన ప్రధానం కాదు."
"మరి? ఎందుకు చదివి నట్టమ్మా?' గౌతమ్ జిజ్ఞాస పూర్వక ప్రశ్న.
"ఏమో! తెలిసీ తెలియని వయస్సు లో ఆ చదువు వైపు మొగ్గింది మనస్సు. న్యాయవాది నై, న్యాయ ధర్మాలతో నిరపరాదులను ఎందరినో కాపాడవచ్చునని ఊహించాను. కాని, తీరా చదువు పూర్తయి వచ్చాక, అసలు ఈ చదువెందుకు చదివానా అనిపిస్తున్నది. అసలు న్యాయానికీ, ధర్మానికి స్థానం ఉన్నట్లు కనిపించడం లేదు. అన్యాయం, అక్రమార్జనే పరమావధి గా కనిపిస్తున్నది. ఎక్కడ ధర్మం ఉన్నా, దానికి ప్రతిఘటనా , బాధావమానాలే ఎదురవుతున్నాయి కాని, శిరసున దాల్చి పూజించేవారు ఉన్నట్లే కనిపించడం లేదు. న్యాయ పీఠాలలో న్యాయం, ధర్మ మూర్తులలో ధర్మం ఎండ మావులలాగే కనిపిస్తున్నాయి."
