Previous Page Next Page 
ధర్మ చక్రం పేజి 5


    "చూడండి, బాబుగారూ! ఈ కూడెలా తింటున్నామో? ఎవరైనా చూస్తారా, అందరూ మాకు పాఠాలు చెప్పేవారే కాని? మీరే న్యాయం ఆలోచించండి దొరా!' ఖైదీలంతా ముక్త కంఠంతో అరిచారు ధర్మారావు ను చూచి.
    "నోరుయ్యండ్రా...." ఏమేమో అరవబోతున్న పోలీసులను వారించాడు ధర్మారావు.
    దగ్గరగా వెళ్లి ఖైదీలు తింటున్న భోజనం తిలకించిన అతడికి కళ్ళనీళ్ళ పర్యంతం అయింది.
    అది అన్నమా? చెబితేనే గాని , ఆ విషయం ఎవరూ తెలుసు కోలేరు. 'బందీలను కావించి, వారికి నిర్ణయమైన ఆహారం కూడా ఇవ్వకుండా బాధించడం ఎంత హృదయ విదారకమైన విషయం! ' అనేక ఆలోచనలతో, తీవ్రమైన చూపులతో గంబీరంగా నిలబడిన అతడిని చూచి మరెవరూ మాట్లాడ సాహసించ లేకపోయారు. మౌనంగా తిండ్లు పూర్తయ్యాయి.
    "జైలు కాంట్రాక్టరు తో నన్ను కలుసుకోమ్మని చెప్పండి" అని అక్కడున్న వారికి ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు ధర్మారావు. ఖైదీల వదనాలు ఆనందంతో వెలిగిపోయాయి.
    ఆ మధ్యాహ్నం తమ తమ పనులలో లీనమై ఉన్న ఖైదీల దగ్గరకు పోయి నిలబడ్డాడు. ధర్మారావు. మండు టండ లో రాళ్ళు బద్దలు కొట్టే వాళ్ళు, కాయగూరలు పండించే వాళ్ళు, నీళ్ళు మోసేవాళ్ళు, కట్టడాలు కట్టే వాళ్ళు, ఒకటేమిటి ఏ పని తెలిసిన వారు అది చేస్తున్నారు. 'ఇంత శ్రమించ వలసిన వాళ్ళకు తిండయినా సమంగా పెట్టక పొతే ఊరుకుంటారా , రెచ్చి పోక?' అనుకున్నాడు.
    "అందరూ ఇటు రండి!' ధర్మారావు కంఠస్వరం గంబీరంగా ధ్వనించడం తో ఖైదీలందరూ వచ్చి భక్తీ వినయాలతో నిల్చున్నారు.
    "బాబుగారూ. కుర్చీ తెస్తాను" అని పరుగెత్తుతున్న ఖైదీ ని "వద్దయ్యా, ఇటురా " అని వారించాడు ధర్మారావు.
    "ఎంత మర్యాదగా చూస్తున్నారు బాబూ మీరు మమ్మల్ని! ఒరేయ్, అరేయ్ అంటూ మోటుగా పిలవడమే కాని, మాబోటి నిర్భాగ్యులను మీ అంత మన్ననగా ఎవరూ పిలవగా నేను వినలేదు. పదమూడేళ్ళు గా ఈ జైలు శిక్ష అనుభవిస్తున్నాను" అంటూ గౌతమ్ కళ్ళు ఒత్తుకున్నాడు.
    "మీరిక్కడ పదమూడేళ్ళ నుంచి ఉన్నారా?' అని ప్రశ్నించిన ధర్మారావు తన మాటలకు తానె ఖైదీలందరి తో పాటు ఆశ్చర్యపోయాడు. ఒక సామాన్య ఖైదీ ని సూపర్నెంటు మీరు తమరు అని అతిగా మన్నించడమా!
    చూడగానే గౌతమ్ పై తనకు అంత పూజ్య గౌరవ భావాలేలా కలిగాయో ధర్మారావు కు అర్ధం కాలేదు. తనకు తెలియకుండానే తన నాలుక అతడిని గౌరవిస్తున్నది; మనస్సు పూజిస్తున్నది.
    గౌతమ్ కూడా అటువంటి ఆలోచనలతోనే ఉండి ఇంకా తేరుకోలేదు. ఏవేవో భావాలతో హృదయం కదలాడి పోయింది.
    "మీరిక్కడ ఏ నేరంతో ఉన్నారు?' ధర్మారావతడిని ప్రశ్నించాడు.
    "ఖర్మ బాబూ. ఏదైతే ఏమిటి?"
    "మీరు చెప్పక పోయినా రికార్డు చేసి నేను తెలుసుకోగలను."
    గౌతమ్ మాట్లాడలేదు.
    'దేశ ద్రోహం !" ఒక గొంతు పలికింది.
    "ఆ!!!"
    ధర్మారావు ఆశ్చర్యం నుండి కోలుకోవడానికి కొన్ని క్షణాలు పట్టింది గౌతమ్ వదనం వాడిపోయి వాలిపోయింది. నేత్రాల నుండి చెక్కిళ్ళ మీద సెలయేళ్ళు జాలు వారుతుండగా , చూపరులకు దీనంగా కన్పట్టుతూ నేలపై కూర్చుండి పోయాడు. అంతా నిశ్శబ్దం అలముకున్నది.
    పది నిమిషాల పాటు కదలక నిలబడిన ధర్మారావు ప్రయత్నపూర్వకంగా తన సహజ గంబీర్యాన్ని నిలదొక్కు కోగలిగాడు.
    "చూడండి, మీ అందరి తోనూ నేనొక ముఖ్య విషయం మాట్లాడాలని వచ్చాను" అంటూ హటాత్తుగా సంభాషణ మర్చి వేశాడు.
    దానితో అందరూ భక్తీ వినయాలాతో చేతులు కట్టుకొని నిలబడ్డారు. అతడి మాటలకు ఆత్రంగా ఎదురు చూస్తూ.
    "నాకు మీ కష్ట నిష్టురాలన్నీ బాగా తెలుసు. వాటిని తగ్గించడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను."
    శ్రోతలతో సంతోష పూర్వక కలనాదాలూ హాసాలు చెలరేగాయి.
    తిరిగి ధర్మారావు ప్రారంభించాడు. "అయితే ఇది చాలా వ్యవధి తీసుకుంటుంది. త్వరలో సాధ్యమయ్యేది కాదు. ఎన్నో ఆటంకాలు, ఎదురవుతాయి. ఎందరి సహకారమో కావాలి. అన్నిటికీ అడుగడుగునా అధికారుల ఆమోదాలు, అనుజ్ఞలు పొందవలసి ఉంటుంది. ఇందుకు చాలా ఒర్మీ అవసరం.
    "మీరు అసహనం ప్రదర్శించి , ఎదురు తిరిగితే మీకు లభించేవి చావు దెబ్బలూ, అధిక శిక్షలూ అది మినహా ప్రయోజనం శూన్యం."
    ఊపిరి బిగపట్టి వింటున్నారు ఖైదీలందరూ .
    అందరినీ పరీక్షగా చూస్తూ "ఏయ్ సెవెంటీ సెవెన్! ఇలారా" అని పిలిచాడు. పిలువబడిన ఖైదీ పిల్లిలా వచ్చి నిలబడ్డాడు ధర్మారావు ఎదుట.
    "నీవు రాత్రి పారిపోవడానికి ప్రయత్నించావు. "మేఘ గర్జనె!
    నిర్బయంగా నిలబడి వింటున్న వారందరూ ఒక్కసారి ఉలిక్కి పడ్డారు, అతడి కంఠం లోని హటత్కఠీన్యం గమనించి.
    "దొరా! ఇంటి కాడ...."చేతులు రాచుకొంటూ దీనంగా ఏమేమో విన్నవించు కొబోయిన ఆ ఖైదీ కి అధికంగా మాటలకు అవకాశ మియలేదు ధర్మారావు.
    "ఎందుకు పారిపోయావని నేనడగడం లేదు. ఉంటాయి -- అనేక కారణాలూ, బాధలూ, అవసరాలూను. మనస్సు ఎప్పుడూ నీవారి వైపే లాగుతుంటుంది. నాకు తెలుసు. కాని ఒక శిక్షా స్మృతి కింద నీవు బందింపబడినప్పుడు విధిగా శిక్షను అనుభవిస్తూ గడపాలి. శిక్షా కాలమంతా ఇలా అక్రమంగా నీవు పారిపోవడం వల్ల కాపలా దారులకూ, అధికారులకూ ఎందరికి ఏమాట వస్తుందో, ఎందరి ఉద్యోగాలు ఊడి పోతాయో , అందువల్ల ఎన్ని ప్రాణాలు నీ మానాన పడి ఉసూరు మంటాయో నీకేమైనా తెలుస్తుందా?"
    ఆ ఖైదీ నోట మాట రాలేదు.
    "ఏం లాభం? పారిపోతుండగా పట్టుబడితే చావు దెబ్బలు, అధిక శిక్ష. పట్టుపదకుండా పారి పోయినా తాత్కాలికమే. పోలీసుల వల నుండి ఎన్నటికీ తప్పించు కోలేరు. ఎక్కడున్నా గాలించి లాక్కుని వస్తారు. శిక్ష మరింత ఎక్కువ కావడం ఎలానూ తప్పదు. ఇక పారిపోయి ఏమిటి సాధించినట్టు? పైగా ,మీకు మీరే తెలియకుండా అపకారం చేసుకుంటున్నారు.
    శ్రద్దగా వింటున్న ఖైదీలు తిరిగి ధర్మారావు కంఠస్వరాన్ని నూతన కర్కశత్వం అవరించడం తో అలజడి చెందారు.
    "నాకు మీ కష్ట సుఖాలతో పాటు, విధి నిర్వహణ కూడా తెలుసు. ప్రభుత్వం వారి ఉద్యోగి గా నేను నెరవేర్చావలసిన ధర్మం నాకు ప్రాణం కన్నా మిన్న. నా మనస్సు నవనీత సదృశ్యమే కాదు. వజ్ర కఠోరం కూడా. ఇటు మానవత్వపు దయా దాక్షిణ్యాల తో పాటు, అటు నా కర్తవ్య నిర్వహణకు అవసరమైన కాఠినత్వం కూడా నాలో ఉన్నది. నేను మీ యెడల ప్రదర్శిస్తున్న మంచితనాన్ని లోకువగా తీసుకుని, అవకాశంగా వినియోగించు కొని, మిమ్ము బాగు పరచడానికి ప్రయత్నించిన నన్ను మోసగించాలని చూస్తె మాత్రం పూర్తిగా మోసపోతారు మీరు."
    "చిత్తం.........చిత్తం" సన్నగా అనలేక అన్నాయి కొన్ని కంఠలు.
    ఒక్కొక్కరి వదనం లో ఒక్కొక్క భావం లాస్యం చేస్తున్నది. కొన్ని గౌరవంగా, కొన్ని అర్ధం చేసుకుంటున్నట్లుగా , కొన్ని కోపంగా , కొన్ని నిస్సహాయంగా ఉన్నాయి ఖైదీ ముఖాలు.
    అవేమీ గమనించనట్టు తన ధోరణి లో గంబీరంగా సాగిపోయాడు ధర్మారావు. "మీరు ఖైదీలు. అధర్మ ప్రవర్తన అనే ఆరోపణ ను మోస్తూ ఇక్కడ ఉన్నారు. మీపై అధిక దయా దాక్షిణ్యాలు ప్రదర్శించ వలసిన అగత్యం ఎక్కడా లేదు. మీరిక్కడ కష్ట పడవలసిందే. కానీ.... నా దృష్టి వేరు. నా ఆలోచన వేరు. మానవత్వాన్ని కోల్పోతున్న మీలో ఆత్మ గౌరవాన్ని రేకెత్తించి, మీ మీ ధర్మాలను గుర్తింప జేసి, మంచితనం పోసి తిరిగి మనుష్యులుగా బయటి ప్రపంచం లోకి పంపించాలని నా ప్రయత్నం. ఇందుకు మీ సహన సహకారాలు ఎంతైనా అవసరం. చెప్పండి, అది మీకు ఇష్టమేనా? లేక నన్నూ పూర్వం వారి వలెనె చూచీ చూడనట్లు, అంటీ అంటనట్లు ప్రవర్తించమంటారా?"    
    "వింటాము బాబూ, మీ మాట వింటాము" అన్నారు అధిక సంఖ్యాకులు.
    "సరే" ధర్మారావు దర్పంగా తల పంకించాడు అందరినీ పరీక్షగా తిలకిస్తూ. "మీకై మైనా కష్టాలు, ఫిర్యాదు లూ ఉంటె నాతొ చెప్పండి. అంతేకాని హద్దులు మీరి అలజడి చేయద్దు. మీరు చెప్పుకోనవలసినవి ఉంటె నాకు నివేదించు కొండి. నేను చూస్తాను. నా ఈ పద్దతిలో గల అంతర్యమూ , మంచీ మీరు గ్రహించ లేకపోతె -- అదుగో , మీలో పెద్దలు, విద్యావంతులూ గౌతమ్ గారి వంటి వారిని అడిగి తెలుసుకోండి."
    మాటలు ముగించి ర=ఠీవిగా వెళ్ళిపోతున్న ధర్మారావు గౌతమ్ వదనం లోని కదలికల నూ, నేత్రాలలోని అశ్రువులనూ గమనించలేదు.

                                       6
    "నన్ను పిలిపించారట?" అంటూ కాంట్రాక్టరు వచ్చి సవినయంగా నిలబడ్డాడు.
    "ఓ! వచ్చారా'? రండి కూర్చోండి." తీరికగా కూర్చున్న ధర్మారావు తిన్నగా సర్దుకు కూర్చుని ఆహ్వానించాడు భుజంగాన్ని.
    పుష్టిగా ,తెల్లగా, అడ్డ కురచగా ఉన్న విగ్రహం , పంచె కట్టు, లాల్చీ, బట్టతల , మోటు కళ్ళద్దాలు , కృత్రిమ నవ్వుతో వచ్చిన భుజంగం సార్ధక నాముడుగా కనిపించాడు ధర్మారావు కు ప్రధమ వీక్షణ లోనే.
    "తమరు కొత్తగా వచ్చారు. బాగా చిన్న వయస్సు లాగున్నది!" వెటాకారం కొలిపే నవ్వుతో పరామర్శించాడు భుజంగం.
    ఆ తెచ్చి పెట్టుకొన్న కలుపుగోలు తనం , ఎక్కువ చనువూ, అనవసరమైన వాగుడూ చూడగానే మనిషిని చాలా దూరంలో ఉంచాలనే నిశ్చయానికి వచ్చాడు ధర్మారావు.
    "ఇంకా తను కాంట్రాక్టు కాలం ఎంతవరకు ఉంది?' అని అడిగాడు ఎటో చూస్తూ.
    ఆ సూటి ప్రశ్నకు భుజంగం కలవరపడ్డాడు.
    "ఆ! ఉంది లెండి రెండేళ్ళు. ఉండటమేమిటి? అలా తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ నేనే తీసుకుంటూ ఉంటాను."
    "ఇప్పటికి ఎంత కాలంగా చేస్తున్నారు మీరు?"
    "పన్నెండేళ్ళు . ఏమండీ? ఎందుకలా అడుగుతున్నారు?"
    "అయితే, మీరు చేసే పనిని గురించి ఎన్నడైన కాస్త ఆలోచించు కుంటారా మీరు?"
    'అంటే?" అర్ధం కాక, నవ్వుతూ అడిగాడు భుజంగం.
    మనస్సులోని అసహనం వదనం లో ప్రతిబింబించకుండా ప్రయత్నిస్తూ కుర్చీ నుంచి లేచి పచార్లు సాగించాడు ధర్మారావు.
    తప్పనిసరిగా భుజంగం కూడా కుర్చీ నుంచి లేచాడు.
    "మీకు ఈ కాంట్రాక్టు లలో ఎంత మిగులుతుంది?"
    "అంటే?' నసిగాడు భుజంగం.
    "అంటే -- ఈ జైలు ఖైదీలకు భోజనం సరఫరా చేస్తున్న ఈ కాంట్రాక్టు లలో . వివరాలు నే అడగలేదు."    
    "ఆ...ఏదో ఉంటుంది లెండి. ఎంతోనా?" తేలికగా చప్పరించేశాడు భుజంగం.
    మనిషి మనస్తత్వాన్ని బాగా అర్ద్ఘం చేసుకున్న ధర్మారావు మనసులోనే క్షణాలలో నిర్ణయించుకున్నాడు, అతడితో మాట్లాడవలసిన తీరును, కంఠం లోని కరుకుదనం, గంబీర్యం తెచ్చుకున్నాడు.
    "చూడండి , భుజంగం గారూ! ఎవరూ ఏ పనీ ఊరికే చెయ్యరు. నాకు తెలుసు. అది మీకొక ఉద్యోగం వంటిది. మీరు పెడుతున్న పెట్టుబడికీ, పడుతున్న శ్రమకూ ప్రతిఫలం దక్కాలి; కొంత మిగలాలి. అదే మీకు జీతం, భత్యం."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS