Previous Page Next Page 
అర్పణ పేజి 5


    
    అందరి చేతా గౌరవనీయులని పించుకున్నా వారి జీవితంలో మాత్రం కొన్ని లోటు పాట్లు, అసంతృప్తి తప్పలేదు. పార్వతిని కన్న తర్వాత కొన్నాళ్ళ కు అయన భార్య పరలోక గతురాలయింది. అప్పటి నుంచి అయన స్వభావం లో మార్పు వచ్చింది. మునుపు, ఆమె బతికి ఉన్న రోజుల్లో అయన వదనం లో ఎప్పుడూ కొత్త కళలు కనిపించేవని ఎరిగిన వారంటారు. అటు తర్వాత ముభావం, గంబీర్యం మాత్రమే ముఖంలో మిగిలినా, తన బిడ్డలను గాడమైన వాత్సల్యంతో , ప్రాణ పదంగా చూచుకోనేవాడు. నరసింహ మూర్తి గారికి వయసు పై బడుతున్న కొద్దీ మానవ జీవితం చాలా చిత్రంగా కనిపించేది. దీని నంతటి నీ నడుపుతున్న విశ్వశక్తి ని అంతరంగం లోనే ఆరాధించే వాడు. క్రమేణా ఆ దృష్టి లో ఆయనను అమితంగా ఆకర్షించినదీ, సాక్షాత్కారించిన మాతృదేవిలా తోచినది దుర్గామాతే. సర్వసృష్టీ ఆవిడదే అనిపించేది. హృదయంలో ఆ భక్తీ పెంపు వల్ల తగిన మనశ్శాంతి లభించేది. స్త్రీలను దేవీ స్వరూపాలు గా భావిస్తూ తన బిడ్డలు ముగ్గురికీ ఆ దేవీ పేర్లే పెట్టుకున్నాడు.
    పెద్ద కుమార్తె లక్ష్మీ అందగత్తె. డానికి తోడూ అదృష్ట వంతురాలు కూడా. పుట్టింటికి చాలా దూర ప్రాంతంలో ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్న భర్తతో సౌఖ్యంగా జీవితం గడుపుతున్నది. తండ్రి కోసం ఆందోళన చెందుతూ, నిరంతరం ఉత్తరాలు వ్రాయడమే ఆమెకు మరో వ్యాసంగం.
    సుఖప్రదమైన అవిడ జీవితం గురించి ఆలోచన లేకపోయినా, సరస్వతి జీవితం అధ్వాన్న మయి పోయినందుకే అదొక రకం వ్యాకులత పట్టుకున్నది నరసింహ మూర్తి గారికి. తన బిడ్డలు అదృష్ట వంతులని భావిస్తూ మురిసే ఆయనకు అదొక గర్వభంగం అనిపించింది. సరస్వతి భర్త కారు ప్రమాదం లో చనిపోయాడనే ఆశని పాతం లాంటి వార్త రాగానే అయన నవనాడులూ జీవశక్తి ని కోల్పోయాయి. సరస్వతయినా కొన్నాళ్ళు ఏడ్చి ఊరుకున్నదేమో గాని, అయన మనసు స్థిమిత పడలేదు. తర్వాత కుమార్తె ముఖంలో ధైర్యమూ, ఆనందమూ కనిపించినప్పుడంతా మరింత కుమిలిపోసాగాడు. కానీ, సరస్వతి గుండె దిటవు తో జీవితాన్ని తండ్రి సేవలో గడిపి , తర్వాత ఏమైనా అయిపోవచ్చు ననే నిశ్చయానికి వచ్చింది. ఆ అభిప్రాయం కలగగానే ఆమెకు దైర్యం కలిగింది. దుఃఖం చాలా వరకు దూరమై, రోజులు దీర్ఘమైనవనిపించ లేదు. చివరి అమ్మాయి పార్వతి నరసింహ మూర్తి గారి దగ్గర పెరిగే అవకాశం లేకపోయింది. ఆ పిల్ల పొత్తిళ్ళ లో ఉండి తల్లిని కోల్పోయిన  సమయంలో అన్నగారి ఊరికి భర్తతో సహా వచ్చిన జానకమ్మ పార్వతి ని తన బాధ్యత లోకి తీసుకుంది. భార్యా వియోగ వేదన ఇంకా ఆరని నరసింహ మూర్తి గారికి ఇది ఇంకొక బాధను రగుల్కొలిపింది. క్షణ క్షణమూ ఎదురు తిరిగే మనసు తోనే ఉత్తమోత్తమాలు ఆలోచించాడు. ఏమైనా అనుభవం గల స్త్రీ అండలోనే పార్వతి చక్కగా పెరగ గలదని తోచింది.
    జానకమ్మ భర్త రామనాధం గారు కూడా సాలోచనగా నరసింహ మూర్తి గారి వైపు చూస్తూ , దేవుడు అట ఆడించక పొతే, విధి లిఖితం తిన్నగా ఉంటె పార్వతిని తన కోడలుగా చేసుకోవడానికి అన్ని విధాల ప్రయత్నిస్తానంటూ చేతిలో చెయ్యి వేసి చెప్పారు. అత్మీయులైనా ప్రేమవాత్సల్యాలు సమధికంగా చూపించి నప్పుడు హృదయం పొందే స్పందన, ఆనందం వర్ణనా తీతం. అటువంటి నిష్కల్మషమూ, కళంక రహితమూ అయిన బంధు ప్రేమను ఓదార్పు ను పొందుతున్నప్పుడు నరసింహ మూర్తి గారు కూడా విచిలిత మైన తనువును అదుపులోకి తెచ్చుకో గలిగారు. నిర్మలమైన అంతః కరణ తో మనిషి ఏ కోరిక నైనా భగవంతుడ్నే కోర నక్కరలేదు. మనసును కోరినా అది నేరువేరుతుందట. ఈ నిర్ణయం విని, తప్పకుండా జరుగుతుందన్నారు నరసింహ మూర్తి గారు.
    ముగ్గురు బిడ్డలలో నూ సరస్వతి కోసం అయన పడిన ఆవేదన ఇంతా అంతా కాదు. ఎప్పుడూ ఆలోచనల్లో ఉంటూ బంధువులతో నైనా, స్నేహితులతో నైనా విధవా విహహాలను గురించే ప్రసంగిస్తాడాయన. వితంతువుల పునర్వివాహాలను సమర్ధించే గ్రంధాలు ఎన్నో తెప్పించి చడువాడు. మనసులో తను ఆ విధానాలను ఆచరణ లో పెట్టాలని కోరిక పుడుతున్నా , తానై బంధువులను అడగడానికి సాహసం కలగలేదు. అతులిత  భాగ్య భోగాలతో , మహా గౌరవంతో ఇంతవరకూ గడిచిన జీవితం అపవాదం, అనామకం అయిపోతుందేమో, కీర్తీ లతలన్నీ సడలి పోతాయేమోనని భయం కలిగింది. ఎప్పుడూ ఆయనలో కలిగేది ఈ భావ సంచలనమే. అందుచేతనే వయసు సంధ్య వాలుతున్న సమయంలో కన్నులు అరమోడ్పు చేసి , కర్తవ్యమేమిటో అని అంతులేకుండా అన్వేషిస్తుంటాడాయన.
    తండ్రి పెదవుల మధ్య కాలుతున్న లంక పుగాకు చుట్టాను తమాషాగా చూస్తూ , "నాన్నా, పిలిచావా?' అని మేల్కొలిపింది పార్వతి. అయన ఉలికిపడి కళ్ళు తెరిచి , నోట్లో నుండి చుట్టను పైకి తీసి మసి రాలుస్తూ , "అలా కూర్చో , అమ్మా!" అన్నాడు.
    కొంతసేపయాక "ఇవాళ వెళ్తున్నావట కదూ?' అని అడిగాడు పార్వతి వంక చూచి.
    "నిన్న చెప్పాను కదు , నాన్నా? మరిచి పోయావా?" అన్నది, అయన వైపు విచిత్రంగా చూస్తూ పార్వతి. తండ్రిని 'నువ్వు' అనడమే అలావాటు.
    "ఆ. అదే! అసలు సంగతేమీటంటే------మీ మామయ్య ఉత్తరం వ్రాశాడు......"
    పార్వతి ఎగిరిపడింది . "ఏమిటి నాన్నా, ఏ ఉత్తరాలోచ్చినా నా చేతికివ్వవూ?"
    "నన్ను చెప్పనియ్యవే, అమ్మాయ్! అందులో మామయ్య వ్రాసిన విషయం -- ఇంకొక రెండు మూడు నెలల్లో రాజుకి పెళ్లి చేసెయ్యాలని నిశ్చయించు కున్నాడట. నీతో ఆ సంగతి మాట్లాడమని వ్రాశాడు. బావని పెళ్ళాడటం నీ కిష్టమే కదూ?"
    తండ్రి అలా సూటిగా అడగగానే సిగ్గు మాట అటుంచి, చిరుకోపం వచ్చింది పార్వతికి.
    "ఆ విషయం నాతోనే చెప్పాలేమిటి> అక్కయ్య తో చెప్పకూడదూ?" అని రుసరుస లాడుతూ లోపలికి వెళ్ళిపోయింది.
    "పిచ్చి మొద్దు!' అనుకుంటూ, తృప్తిగా నవ్వుకున్నాడాయన.

                                        
    
                                    4
    పార్వతి రైల్లో కూర్చుంది. గబగబా తన చుట్టూ సామాను పెట్టేసుకుని హాయిగా కిటికీ లో తల ఆనించి బయటకు చూడసాగింది. బండి మెల్లగా కదిలింది. దూరంగా వెళ్లి పోతున్న తండ్రిని చూస్తుంటే బాధ అనిపించింది. "ఇంత ఎండలో ఎందుకు రావాలి, వద్దంటుంటే? అని తండ్రి పైన విసుక్కుంది మనసులో.
    జోరుగా ముందుకు పరిగేడుతున్నది రైలు. వేసవి కావడం వల్ల వేడి గాలి కొడుతున్నా చుట్టూ ఆకూ పచ్చగా కనిపిస్తున్న చెట్ల నూ, దూరంగా చెదిరిన నీలపు రంగులో గోచరిస్తున్న కొండలనూ చూస్తుంటే దాహం తీరినట్టుగా ఉంది. సెకండ్ క్లాస్ కంపార్టు మెంటు కావడాన ఎక్కువ మంది జనం లేరు. ఉన్నవాళ్ళ లో నిద్రపోతున్న వాళ్ళేక్కువ. బండి ఆగకుండా పరిగెడుతుంది. మధ్యాహ్నం వేళ నిశ్శబ్ధత ఆ కంపార్టు మెంటు నూ వదల్లేదు.
    పార్వతి పక్కకు తిరిగి చూసింది. ఒక చిన్న అబ్బాయి అల్లరి చేస్తే తల్లి లేచి మంచి నీళ్ళు ఇచ్చి అరిటి పండు చేతి కందించింది. పార్వతి కి ఎడమ చేతి వైపు అడ్డంగా ఉన్న మరొక సీటులో ఒకామె కూర్చొని ఉంది. నీలం చీర కట్టుకున్న ఆవిడ చేతిలో రవీంద్ర కవీంద్రుడి బొమ్మ ఉన్న ఏదో పుస్తకం , ఆ పుస్తకాన్ని ఒళ్లో పెట్టుకుని, దగ్గరగా ఉన్న తల్లీ పిల్లలని దీక్షగా చూస్తున్న ఆ యువతి పార్వతి వైపు చూసింది, చటుక్కున ఇటు తిరిగి -- స్టేషన్ గాని వచ్చిందనుకుందేమో! కాని తన వైపు చూస్తున్న పార్వతి కంట బడింది ఆమెకు. పట్టుబడి పోయినట్టుగా ఉలిక్కిపడిన పార్వతి మళ్ళీ దృష్టి ని పరిభ్రమిస్తున్న చెట్టు పుట్టల మీదికి మళ్ళించింది. భయం వేసింది. ఆవిడేవిటి అలా చూస్తుండి? అంత పరిశీలనగా! ముఖం అంత గంబీరంగా పెట్టకపోతే వచ్చిన ప్రమాదమేమిటో?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS