Previous Page Next Page 
అపరిష్కృతం పేజి 5

 

                                  
    మరునాడు కాలేజీ లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
    శేఖర్ అంతు తేల్చాలని చాలామంది, రక్షించాలని కొందరూ, బోనులో పులులు లాగా తిరుగుతున్నారు.
    అంతు తెలుద్దామని ఉద్రేక పడుతున్న విద్యార్ధులకు నారాయణశాస్త్రి నాయకుడు.
    సుకన్య శవం ఊరికి రెండు ఫర్లాంగుల దూరాన ఉన్న మోటబావి లో కనుపించింది.
    ఎందుకు నీళ్ళలో దూకి చనిపోవలసి వచ్చిందో ఎవరికి తెలియదు. విద్యార్ధి లోకం లో ఊహాగానాలు బయలుదేరాయి.
    క్రితం రోజున శేఖర్ నాయుడు గారితో మాట్లాడటం చర్చకు వచ్చింది.
    వెంటనే శాస్త్రి -- "నేను చెప్పేది సవ్యమైన కారణం అయి ఉంటుంది. నిన్న మన మొనగాడు నాయుడి గారితో తగువు పెట్టుకున్నాడు. నాయుడు గారు బాధ్యత తెలిసినవారు. సుకన్య గారు వయసు వచ్చిన అమ్మాయి. వాళ్ళ బ్రతుకులు వాళ్ళే సరిదిద్దుకోగల స్తోమత గలవారు. వాళ్ళిద్దరూ ఆధునికంగా ప్రేమించి పెండ్లి చేసుకొందామని అనుకొంటున్నారు. ఇందులో తప్పేముందయ్యా? రోజుకో రకంగా కాలం మారి పోతుంటే ఇంకా గురువనీ, శిష్యులని పెట్టుకొంటే ఎట్లా? అసలు ఈయన కెందుకయ్యా ఈ సంగతులన్నీ? సుకన్య గారి పెద్ద వాళ్ళున్నారుగా? ఆవిడ బాగోగులు చూసుకోవటానికి వాళ్ళుండగా మధ్య మన వేలేందుకు? రాను రాను శృతి మించి రాగాన పడుతున్నది ఈ శేఖర్ వ్యవహారం! ముందు మన తప్పులు దిద్దుకొనే స్తోమతు లేదు గాని, ఊళ్ళో వాళ్ళనీ, లెక్చరర్ల నీ ఉద్దరించటానికి బయలుదేరారు. ఇట్లాంటి వాళ్ళ అంతు తెలిస్తే గాని ఈ కాలజీ బాగుపడదు!' అని పెద్దగా ఉపన్యసించాడు.
    యువకరక్తం! రోజూ కాలేజీ కి పోవడం, లెక్చర్లు వినడం, చదువుకోవడం -- కాలేజీ లో గడిపే బ్రతుకంతా ఇట్లా చప్పగా, ఎలాంటి మార్పు లేకుండా మహా విసుగ్గా ఉంది. ఈవేళ అవకాశం చిక్కేటప్పటికి అంతా ఎంతో ఉత్సాహంతో గుమికూడారు. ఒక్కరి చేతిలో కూడా పుస్తకం లేదు.
    తొమ్మిదిన్నరకంతా ప్రిన్సిపల్ వచ్చారు. సాధారణంగా అయన వచ్చేవేళకు ఇట్లా గుంపులు గుంపులుగా ఎవరూ ఉండరు. ఆయనంటే భయంతో పాటు భక్తీ, గౌరవం కూడా ఉన్నాయి.
    గుంపులుగా ఉన్న పిల్లలను చూసి ప్రిన్సిపాల్ ఆశ్చర్యపడ్డాడు. సుకన్య మరణించిన సంగతి అయన కింకా తెలియదు.
    "హలో! గుడ్ మార్నింగ్, బాయిస్!" అంటూ అయన ఆశ్చర్యాన్ని బయటికి కనిపించనివ్వకుండా అతి సహజంగా తన గదిలోకి వెళ్ళిపోయారు.
    అయన అట్లా కూర్చున్నారో లేదో వెంటనే బయటి నుండి -- "మే ఐ కమిన్, సర్?' అని ప్రశ్న వినిపించింది.
    "కమిన్. ఏమిటి విశేషం?' లోపలికి ఆహ్వానించారు.
    నారాయణ శాస్త్రి అయన రూమ్ ;లోకి ప్రవేశించాడు.
    ప్రిన్సిపల్ తో శాస్త్రి నాయుడు గారి , సుకన్యల ప్రణయం సంగతీ, శేఖర్ తలపోగరు తో నాయుడు గారిని మందలించిన సంగతి , ఆ అవమానం భరించలేక సుకన్య ఆత్మహత్య చేసుకొన్నదని తాము ఊహిస్తున్న సంగతీ వివరించాడు.
    మొదట ఆశ్చర్యంతో విన్న ప్రిన్సిపల్ కళ్ళలో రాను రాను అపనమ్మకం ప్రతిఫలించింది.
    ఒక విధంగా అయన ఎంతో కించ పడ్డారు. తన కాలేజీ లో జరిగిన సంగతి, ఇంత జరిగే దాకా తనకు తెలియనే లేదు! ఇది తన అసమర్ధత కు నిదర్శనం కాదూ?
    అంతలోనే అయన తన్ను తాను ఊరడించుకొన్నారు. కాలేజీ లో జరిగే అన్ని సంగతులూ తన కెట్లా తెలుస్తాయి? ఎవరైనా చెప్పాలి గాని!
    పైకి ఏమీ తోణకుండా -- "చూడు, మిస్టర్ శాస్త్రీ! ఆ అమ్మాయి చనిపోవటానికి శేఖర్ బాధ్యుడవడం న్యాయం కాదేమో! అసలా పిల్ల ఎందుకు ప్రాణాలు తీసుకుందో ! నేనన్నీ విచారిస్తాను" అన్నారు ప్రిన్సిపల్.
    అంతకంటే నిబ్బరంగా శాస్త్గ్రి-- "ఇది తప్పకుండా శేఖర్ పనే నండి. మా కళ్ళ ముందు డెమాన్ స్ట్రేటర్ గారిని ఎన్ని మాటలన్నాడు? వెనక సుకన్య గారిని కూడా ఏవో అనే ఉంటాడు! లేకపోతె ఆమె ఆత్మహత్య ఎందుకు చేసుకుంటుంది? తప్పకుండా శేఖర్ దే దోషం. ఇంటువంటి విద్యార్ధి ,మన కాలేజీ లో ఉండడం కాలేజీ కే అవమానం! మీరు వెంటనే అతణ్ణి డిబార్ చేయ్యాలి. ఇది మా విద్యార్ధుల కోరిక. కోరికే కాదు, పట్టుదల కూడా!" అన్నాడు.
    ఎన్నో ఏళ్ళ అనుభవంతో విద్యార్ధుల మనస్తత్వాన్ని క్షుణ్ణంగా జీర్ణం చేసుకొన్న ప్రిన్సిపల్ గారికి శాస్త్రి మాటలలోని అంతర్యం స్పష్టమైంది.
    విద్యార్ధులు శేఖర్ అనే కుర్రాడిని కాలేజీ నుండి బహిష్కరించక[పొతే సమ్మె చేస్తారన్న మాట!
    వందల సంఖ్యలో ఉన్న విద్యార్ధులలో శేఖర్ అనే కుర్రాడు తనకు అంత బాగా తెలియకపోయినా, ఆ శేఖర్ మీద ఆయనకు జాలి కలిగింది.
    వెంటనే ఇంకో ఊహ కూడా అనుభవాలతో పండిన అయన మెదడులో కదిలింది.
    చదువుకోవటానికి కాలేజీ లో చేరి పక్క దారులు తొక్కిన సుకన్య అనే అమ్మాయి మీదా, పాఠాలు చెప్పడానికి కాలేజీ లో చేరి, ప్రేమ పాఠాలు చెబుతున్న నాయుడి మీదా, వీళ్ళ కేమీ కక్ష లేదు! వాళ్ళకు బుద్ది చెప్పబోయిన శేఖర్ దే తప్పన్న మాట!
    నిజమే! స్వేచ్చాప్రవృత్తి మా జన్మ హక్కు అనే భావన నేటి విద్యార్ధులలో చాలావరకు పాతుకుపోయింది. వాళ్ళు చెప్పినది సరికాదనీ, అన్యాయమనీ సహేతుకంగా విమర్శించినా వాళ్ళు ఒర్చలేక పోతున్నారు. మాట్లాడితే - సమ్మె! దౌర్జన్య చర్యలు! ఎక్కడుంది లోపం? బుద్ది నేర్పుతున్న పెద్దలలోనా? లేక విద్య నేర్చుతున్న పిల్లలలోనా?
    ప్రిన్సిపల్ కు  ఇంకో సంఘటన గుర్తుకు వచ్చింది. తన స్నేహితుడు రామారావు కాలేజీ ప్రిన్సిపల్ గా ఉన్నప్పుడు బి.ఎ . చదివేవిద్యార్ధులలో ఒకడు పరీక్షలు కారణం లేకుండానే ఎగగోట్టాడు. అంతేకాదు, క్లాసు లకు కూడా సరిగా హాజరు కావటం లేదనీ, అతని ప్రవర్తన అంత బాగా లేదనీ కూడా లెక్చరర్లు చెప్పారు. రామారావు ఆ కుర్రాడిని పిలిచి మందలిస్తే, ఆ అబ్బాయి తల పొగరుగా, "అదంతా నా స్వవిషయం. మీ కెందు" కని వాదించాడు. రామారావు కు కోపం వచ్చి, "యూ ఆర్ నధింగ్ బట్ ఏ ఫూల్!" అన్నాడట. అంతే! "ఫూల్' అన్నందుకు ప్రిన్సిపల్ ఆ కుర్రాడిని అందరి ముందూ క్షమాపణ కోరాలని, లేకపోతె ప్రిన్సిపల్ కాలేజీ వదిలి పోవాలని ఆ కుర్రాడూ, మిగతా విద్యార్ధులూ నానా హంగామా చేశారు. అంతేగాని ఆ కుర్రాడిని చీవాట్లు పెట్టిన వాడెవడూ లేడు.
    "మీరు ఏదో ఆలోచిస్తున్నట్లున్నారు. ఇక నేను వెడతాను, సార్! ఒక్క మాట. ఈ కాలేజీ లో మేమన్నా ఉండాలి . లేదా శేఖర్ అన్నా ఉండాలి!" అన్నాడు శాస్త్రి. ఒక అడుగు వెనక్కి వేస్తూ.
    ప్రిన్సిపల్ ఆలోచనలో నుండి ఇంకా తేరుకోలేదు. పరధ్యానంగా టేబుల్ పైన ఉన్న టపాల్ ను కదిపారు.
    టపాల్ లో అయన పేరిట ఒక కవర్ ఉంది. అయన దృష్టి ని అది ఆకర్షించింది. దాన్ని చించి చదవడం మొదలు పెట్టారు.
    అంతవరకూ పరధ్యానంగా ఉన్న అయన జాబును చదివిన రెండు క్షణాలకు తనకు తెలియకుండానే నిటారుగా కూర్చుని శ్రద్దగా జాబును చదవసాగారు. ముఖంలో ఆసక్తి స్పష్టమైంది.
    ప్రిన్సిపల్ పెర్మిషన్ ఇవ్వకుండా వెళ్ళడం అవిధేయత ఏమో అని సందేహిస్తూ నిలబడిన శాస్త్రి ప్రిన్సిపల్ ముఖంలో కలిగే మార్పులను గమనించి, వెడతాను అడగటం కూడా మరిచి అట్లాగే నిలుచుండి పోయాడు.
    మరో నిమిషానికి ప్రిన్సిపల్ జాబు చదివి , తల పైకెత్తాడు.
    అయన కళ్ళలో కనిపించిన కోపానికి, బాధకు శాస్త్రి అకులాగా వణికి పోయాడు.
    "మిస్టర్! నీవు వెళ్ళి నాయుడి గారిని నేను రమ్మన్నానని చెబుతావా?" అర్ధించినట్లు ఆజ్ఞాపించారాయన.
    అక్కడి నుండి తప్పించుకు పొతే చాలన్నట్లుగా శాస్త్రి పరుగు లాంటి నడకతో గబగబా వెళ్ళిపోయాడు.    
    ప్రిన్సిపల్ గారు మళ్ళీ జాబు చదివారు. అయన ముఖంలో కనపడే భావాలు వర్ణనాతీతం గా ఉన్నాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS