Previous Page Next Page 
శాంతినికేతన్ పేజి 5


    రాజా చూపులు చిత్రాన్ని పరీక్ష చెయ్యడం లేదు, శాంతి సౌందర్యాన్ని ఆమె కలవరపాటు గుర్తించి తనూ మెల్లగా దృష్టి త్రిప్పుకున్నాడు. చేతిలోని లెదర్ బాగ్ లో నుంచి న్యూస్ పేపర్ చుట్టిన ఒక పాకెట్టును తీసి శాంతి చేతిలో ఉంచాడు. అనాలోచితంగానే శాంతి హస్తాలు ముందుకు సాగి ఆ పాకెట్టు అందుకున్నాయి. ఆ తర్వాతా ఏమిటిదీ అనే మీమాంస, వితర్కజ్ఞానం అంతరంగంలో మేల్కొన్నాయి. సందేహంగానే దానికి చుట్టిన దారం తీయబోతూండగా చేతులతోనే వద్దని వారించాడు రాజా. "ప్లీజ్. ఉంచండి మీదగ్గర. తర్వాత చూద్దురుగాని. నేను చాల మనఃపూర్వకంగా తెచ్చానని."
    శాంతి విశాలనేత్రాలు ఒక్కసారి ఆశ్చర్యంగా పరికించాయి రాజాను. ఆ నేత్రాలలో ఏ బలీయ మైన శక్తి దాగి ఉందో మరి! శాంతి అతడి అభ్యర్ధన త్రోసివేయలేకపోయింది.
    ఒక్కక్షణం ఆలోచించి మౌనంగా ఆ పాకెట్ ను డ్రాయర్ సొరుగులో ఉంచేసి తాళం వేసింది. కాని అదేమిటో కూడని పని చేసినట్టుగా గుండెలు దడదడలాడాయి. అయిదు నిమిషాల వరకు ఆ కలవరం సర్దుకోలేదు. మెల్లగా తేరుకొని కళ్ళెత్తేసరికి రాజశేఖరం, రాధామాధవ చిత్రపటాన్ని పరీక్షగా చూస్తూ ప్లేట్ లో రంగులు కలుపుతున్నాడు. ఆశ్చర్యంగా వెళ్ళి ప్రక్కన నిలుచుంది శాంతి. అతడు కుంచె కోసం వెదుకుతూ ప్రక్కకు చూచి శాంతిని గమనించి చిన్నగా నవ్వాడు. అదే నవ్వు! శాంతిని బంధించివేసే నవ్వు! కుంచె తీసి అందిస్తూ, "తప్పులున్నాయా?" అని ప్రశ్నించింది మెల్లగా శాంతి. రాజా సమాధానం చెప్పలేదు. ముందు నెమలికన్ను రంగుకు షేడ్ మార్చాడు. "చూశారా? మీరు వేసినదానికంటే యిలా బాగుంటుంది. అచ్చు నెమలికన్ను వర్ణాలు వస్తాయి" అంటూ ఆ షేడ్ తేవడాని కేయే రంగులు మిశ్రమం చెయ్యాలో చెప్పాడు.
    శాంతి ఆ సవరణను హృదయపూర్వకంగా ఆమోదించినట్లు ఆమె నేత్రాలే చెప్పుతున్నాయి.
    "ఈ రాధ నేత్రాలు చూడండి. ఇలా విప్పారితంగా కాక మురళీ గానానికి పరవశమై, శ్రీకృష్ణ సాన్నిధ్యానికి పులకరించినట్టు అరమోడ్పుగా చిత్రిస్తే ఇంకా బాగుంటుంది" అంటూ జాగ్రత్తగా దిద్దాడు. అర్ధనిమీలత నేత్రయైన రాధ ఈసారి యింకా క్రొంగ్రొత్త సొంధర్యం చేకూర్చింది చిత్రానికి.
    "చూశారా, శరీరం వర్ణం అంతా ఒకే షేడ్ ఇచ్చారు. మెడక్రిందా, మోచేతుల దగ్గరా నీడ పడినట్లు కొంచెం ముదురు రంగు కలపాలి" అంటూ చకచకా ఆవిధంగా చేసి చూశాడు.
    చేతులు తుడుచుకుంటూ తృప్తిగా వెనుదిరుగుతూంటే నవ్వుతూ చూస్తూన్న శ్రీహరీ, పద్మా కనిపించారు.
    "దానికి గురువువైపోయావేమిటి?" అని నవ్వాడు శ్రీహరి.
    "చల్లారిపోతున్నాయి. ఇకనైనా వీటి నుద్ధరించండి" అని ఉప్మా ప్లేట్ చేతికందించింది ఫద్మ.
    "ఇంకా మీ మిగిలిన చిత్రా లేవీ?" కాఫీ తీసుకుంటూ అడిగాడు రాజా.
    "అన్నీ మావూళ్లోనే వున్నాయి. ఏమీ తీసుకురాలేదు. మళ్ళీ వెళ్ళిపోయేదాన్నేగా?" అంది నవ్వి శాంతి.
    పద్మ అందుకొంది: "అబ్బో! ఆవిడ గది చూసి తీరాలి. మేడమీద ప్రత్యేకం తూర్పు వైపున రెండు గదులు ఆవిడని. ఒకటి డ్రెస్సింగ్ అండ్ బెడ్ రూమ్. రెండవది ప్రత్యేకం ఈ చిత్రాలకోసం, చదువుకుందుకు. అది మా మామగారి గది. ఎప్పుడూ కొడుకుల్ని కూడా అందులో అడుగు పెట్టనివ్వడాయన గారాల కూతురడగ్గానే యిచ్చేసి ఆయన క్రింది గది తీసుకున్నారు. అందమైన ఉషస్సులు, సుందర సంధ్యారాగాలు తిలకించడానికి కీ శాంతమ్మగారి కా గదే బాగుంటుందట."
    "అదృష్టవంతురాలు! పిచ్చి అలవాటని తీసిపారెయ్యకుండా కళకి అంత దోహదమిచ్చే పెద్దలుండటం అదృష్టమే" అన్నాడు రాజా.
    శ్రీహరి అన్నాడు: "మా నాన్నగారలా కాదు, రాజా. పిల్లలలో ఏ చదువుమీద, నీ కళమీద ఎవరికీ ఎక్కువ ఆసక్తి వుందో గ్రహించి వాళ్ళ నా మార్గంలోనే వృద్దిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. మమ్మల్నీ అలాగే చూశారు. కాని, శాంతి అంటే మరీ గారాబం. అందుకే దాని మాట కస లెదురు చెప్పరు."        
    "ఆయనకేం? మగవారు. నిశ్చింత. అత్తగారు మాత్రం, ఇంకా పెళ్ళి చెయ్యడంలేదని బాధ పడతారు" అంది పద్మ.
    "వదినా" అంది కోపంగా శాంతి.
    శ్రీహరి నవ్వాడు. "కోపమెందుకు, శాంతీ? అదీ నిజమేగా!" అంటూ రాజాతో, "మా అమ్మ అయినా అంత పట్టుదల మనిషి కాదు. చివరకు అందరి మాటతో ఏకీభవిస్తుంది" అన్నాడు.
    "అందుకే ఇరవయ్యేళ్ళు దాటినా బొమ్మలు, తిమ్మెలు అంటూ మా శాంతమ్మగా రింత స్వేచ్చగా తిరుగుతున్నాను" అంది పద్మ.
    "ఛ, నీకస లేం తెలియదు. అసలు తొందరంతా నీకు. అమ్మమీద త్రోస్తావు!" మన రుసలాడుతూ లేచి వెళ్ళిపోతూన్న శాంతిని నవ్వుతూ మాటలతోనే అడ్డంపడి ఆపాడు రాజా. "లేచి వెళ్ళిపోవడ మేం మర్యాద? ఇష్టం లేకుంటే విషయం మార్చండి. లేదా వదినకదా, మీరింకో నాలుగవవచ్చు. ఆవిడని. మీ అన్నయ్య మద్దతు మీకుండనే వుంది."
    నవ్వేసింది శాంతి. "అయినా మా వదిన నాలుగు శతాబ్దాల వెనుక పుట్టవలసినది. ఇప్పుడు కాదు."
    "మరిన్ని శతాబ్దాలముందు పుట్టినా నాలో నేనేమిటి, యించుమించు మన దేశంలో - ప్రతి స్త్రీ యిలాగే వుంటుందని నా అభిప్రాయం" అంది పద్మ బింకంగా.
    "కాదు, ముమ్మాటికీ కాదు. నీలా పెళ్ళీ, పిల్లలూ అంటూ తపించేవాళ్ళు తక్కువౌతారావాటి కావాడు."
    అందుకు జవాబు రాజా ఇచ్చాడు. "లేదు, శాంతీ! మీ వదిన మాటే నిజం. ఎన్ని శతాబ్దాలు గతించినా, నాగరకతా విజ్ఞానా లెంత అభివృద్ధి చెందినా అవి కేవలం వేష బాషలలోను, జీవన సౌకర్యాలమర్చుకోవడంలోనూ. అంతే. కాన్ మన అంతర్గత సంస్కృతి మనం పురాణేతిహాసాలలో చదివినట్లే వుంది. దేశవాసుల నరనరాలలోనూ జీర్ణించుకుపోయిన ఈ జాతి సంస్కృతి కేవలం బాహ్యాడంబరాలవల్లా, శుష్కవాదాలవాళ్ళా, పరదేశ విద్యలవల్లా కడుక్కుపోయేది కాదు. ఎక్కడో మాటికి ఎగిరెగిరిపడే నలుగురైదుగుర్ని మినహాయిస్తే మిగిలిన అందరూ ప్రాచీన భారతీయులే నవ్య వేషధారణులై కన్పిస్తున్నారంటాను నేను. ఎంత చదివినా, ఎంత నేర్పినా పురుషుని ఆధిక్యాన్నీ, ఆశ్రయాన్నే కోరి, ఆ ఘట్టంలోనే తన విధినిర్వహణ ఒనరించి, తరించ కోరుకుంటుంది స్త్రీ. అర్ధాంగినుండి సేవాలాలన లాలిత్యాలే కోరుకుంటాడు పురుషుడు. ఏదో సాధిద్దామనుకోమ్తూ ఇందుకు భిన్నంగా నడిచేవారి అవస్థలు చూస్తూనే వున్నాం."
    శాంతి మాట్లాడలేదు, నేలవేపు చూస్తూ కూర్చుంది.
    "ఏం? కోపమొచ్చిందా?" అన్నాడు రాజామెల్లగా.
    "ఊహు." తల అడ్డంగా ఊపింది. "కాని మీ అభిప్రాయాలతో ఏకీభవించలేను."
    శ్రీహరి కలుగచేసుకున్నాడు. "పోనీరా. వాదనలవల్ల అభిప్రాయాలు మరింత బలపడతాయే కాని చలించవు. జీవితంలోని కొన్ని కఠోర సత్యాలు అనుభవపూర్వకంగా తెలిసిన నాడు మార్పు దానంతటదే లభిస్తుంది. ఈ వ్యర్ధ వాదాలు కట్టిపెట్టి ఎటైనా షికారు వెళ్దామా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS