ఇంట్లోకి వచ్చి, టేబుల్ లాంప్ వేసి తండ్రికి ఇన్ లాండ్ లెటర్ రాసింది. అలాగే నాలికతో అంటించి జాగ్రత్తగా పర్సులో పెట్టింది. భర్త నిశ్చింతగా నిద్రపోతున్నాడు.
లైటు ఆర్పేసింది.
4
ఉదయం ఏడున్నర. సీతాపతి పేపరు చదువుతున్నాడు. అతను ఈ మధ్య పెందరాళే లేస్తున్నాడు. పరీక్షలొచ్చేస్తున్నాయి, చదువే కావటం లేదని బాధ పడుతున్నాడు. తండ్రి ఉబ్బసం కోసం డాక్టరుచుట్టూ తిరగటంవల్లా, తల్లికి ఆపరేషన్ అవటంవల్లా డబ్బు చాలా ఖర్చవుతూందే అనే బెంగతో ఉన్నాడు.
కాఫీ ఇస్తూ "పాప వస్తున్నది, స్టేషన్ కెడతారా?" అనడిగింది తులసి.
"రై లెన్నింటికి?" అన్నాడు సీతాపతి.
"తొమ్మిదింటికట."
పేపరులోంచి తల తియ్యకుండానే, "సరే" అన్నాడు. తులసి అతడివైపు కృతజ్ఞతగా చూడటం అతడు గమనించలేదు. అప్పటిదాకా ముభావంగా ఉన్నదల్లా గబగబా మాట్లాడటం మొదలెట్టింది తులసి. "పిచ్చిముండ. ఇదే మొదటిసారి రావటం. నన్నెప్పుడు రమ్మంటావక్కా? అని ఎన్నిసార్లు అడిగిందో అదొస్తే నాకు పనిలోకూడా కొంచెం ఆసరాగా ఉంటుంది."
"వెడతానన్నానుగా" అన్నాడు సీతాపతి ఆమెను మధ్యలోనే ఆపేస్తూ.
"ఇవాళ టిఫిన్ ఏం చెయ్యమంటారు?" అంది తులసి వెంటనే.
"ఏమీ వద్దు. మళ్ళీ ఆ సంగతులన్నీ ఇప్పుడెందుకు?" అన్నాడు సీతాపతి.
"బాగుంది. ఎన్నాళ్ళేమిటి ఈ కోపాలు. మా పాప కూడా చూసిందంటే మరీ బాగుండదు. ఇంక అవన్నీ మనం మాట్లాడుకోవద్దు సుమండీ" అంది భర్త దగ్గిరకు వచ్చి.
అతడు మట్లాడలేదు సరికదా ఈమె వైపైనా చూడలేదు.
"మరికొంచెం కాఫీ ఉంది, తేనా?" అంది తులసి.
అతడినించి దేనికీ సమాధానం లేదు. ఖాళీగ్లాసు అక్కడినించి తీసుకెళ్ళి మరికొంచెం కాఫీ అందులోనే పోసి పట్టుకొచ్చింది.
అతడింకా మౌనం వదల్లేదు.
"ఎందుకండీ అంత మౌనం? ఏ మాలోచిస్తున్నారు?" అంది తులసి ప్రాధేయపడుతూ.
"నేను స్టేషన్ కు వెళ్ళనంటే ఏం చేసేదానివో ఆలోచిస్తున్నాను" అన్నాడు సీతాపతి.
"ఏం చేసేదాన్ని? బ్రతిమాలేదాన్ని, బామాలేదాన్ని, కాళ్ళు పట్టుకునేదాన్ని. మరి నా అవసరంకదా తప్పుతుందా? ఐనా నాకు తెలుసు, మీరు వెళతారని' అంది.
సీతాపతి గుడ్డలు వేసుకుని, సైకిల్ తీసుకుని స్టేషన్ కు బయలుదేరాడు. తులసి వంటపనిలో మునిగి పోయింది.
"అమ్మాయ్, ఈ కన్ను కాపుకుంటాను, ఇంత గోధుంపొట్టు వేయించు" అంది అత్తగారు.
"అలాగేనండీ" అని తులసి పెనం స్టౌ మీద పెట్టింది.
అత్తగారు అక్కడే పీట వేసుకుని కూర్చుంది.
"మామగారు ఇంకా లేవనట్టుంది" అంది తులసి.
"ఊఁ ఆయనకేం, పడుకున్నారు హాయిగా! ఏమంటే ఉబ్బసమంటారు" అందామె విసుక్కున్నట్టుగా.
"ఔనుగానీ, వీడెక్కడి కెళ్ళాడూ ఇంత పొద్దున్నే?" అంది మళ్ళీ.
"మా పాప వస్తున్నదని చెప్పానుగదండీ, స్టేషను కెళ్ళారు" అంది తులసి.
"అవునుగదూ, మరిచేపొయ్యాను. మీ చెల్లెలు ఇప్పుడేం చేస్తుందన్నావు, ఇంకా చదువుతోందా, లేక చదువు పూర్తి చేసి ఇంట్లో కూర్చున్నదా?" ఆమె గొంతులో తన చెల్లెలి పట్ల ఏదో ఏవగింపు, కొంత అయిష్టం కనిపించాయి తులసికి.
"కూరలో తాలింపు మరిచిపొయ్యాను" అని తిట్టుకుంటూ లేచింది.
అత్త కాసేపు కూర్చుంది. కోడలు మాట్లాడక, పనిలో నిమగ్న మవటం చూసి చేసేది లేక, చేతిలోని 'వెంకటేశ్వర సుప్రభాతం' పుస్తకాన్ని నిమురుకుంటూ వెళ్ళిపోయింది.
వంట పూర్తయింది.
ఇంటిముందర రిక్షా చప్పుడైంది. తులసి వెంటనే లేచి మెట్లు దిగింది. రెండు చేతుల్లోనూ సంచులతో పాప నిల్చుంది. వెనక సీతాపతి రిక్షా వాడికి డబ్బులిచ్చి, రిక్షాలోని మరో మూటను తీసుకుని వచ్చాడు.
చెల్లెలు ఇంట్లోకి రాగానే సంచులందుకుని, ఇంట్లో పెట్టి, చెల్లెల్ని కౌగిలించుకుంది.
"ఏమే, బావున్నావా, చిక్కిపోయావు చూడు. అమ్మా, నాన్నా కులాసాయేనా?" అంది.
"అమ్మా, నాన్నా కులాసాయే. కాని చిక్కిపోయింది నువ్వా, నేనా?" అంది పాప. సన్నగా, పొడుగ్గా, గుండ్రటి మొహంతో, నవ్వుతూ, వసపిట్టలా వాగుతూ ఉండే తన చెల్లెల్ని చూస్తే తులసికి ఎక్కడలేని తృప్తి కలిగింది. పాప ఇంత అందంగా ఉందని తను మొదటి సారిగా చూస్తూంది. రెండేళ్ళ క్రితం చూసింది కాని అప్పుడింకా చిన్నపిల్ల. ఇప్పుడో - బాగా ఎదిగింది. కౌగిలించుకున్నప్పుడు తెలిసింది - కౌగిల్లో ఎలా అమిరిందో, తనకన్నా వెయ్యిరెట్లు అందంగా ఉంది తన పాప.
"మీ ఆప్యాయతంతా గుమ్మంలోనే ఒలికిపోతే ఎలా, ఇంట్లోకి పదండి" అన్నాడు సీతాపతి తన చేతిలోని మూటను కింద పెడుతూ.
"ఇవన్నీ ఏమిటే?" అంది తులసి మూటను చూపుతూ.
"పల్లెటూరినించి మొదటిసారి రావటంగా ఇవన్నీ మామూలు లక్షణాలే" అన్నాడు సీతాపతి.
"సరేలెండి. మీరు మహా పట్నవాసులు నేను వస్తున్నానని అమ్మ కాసిని వడియాలు, పొళ్లు, కొంచెం శీకాయపొడి, పసుపూ పంపింది. అవన్నీ డబ్బాల్లో పోసి..." అంటున్న పాపతో-
"కావడికుండలంత మూటలు రెండు చేసి" అన్నాడు సీతాపతి.
"అవునవును. వాడుకునేప్పుడు తెలియదు ఇప్పుడేమో పెద్ద మూటలుగానే కనిపిస్తాయి" అంది. తులసి పాపను ఇంట్లోకి తీసికెళుతూ.
"ఏమండీ, చెల్లెలొచ్చిన సంతోషంలో మమ్మల్ని మరిచిపోకండి. ఆఫీసుకు టైమైపోతోంది" అన్నాడు సీతాపతి.
"పదండీ, నేనూ వెళ్ళాలిగా. త్వరగా స్నానం కానిచ్చుకోండి మరి" అంది తులసి.
అత్త, మామలకు నమస్కరించి పాపకాళ్ళు కడుక్కుని వచ్చింది. తులసి కాఫీ పెట్టి ఇచ్చింది మొదట. కాఫీ తాగుతూ, "ఇల్లు బావుందక్కా. పక్క నింకెవరో ఉంటున్నారల్లే ఉందే" అంది పాప.
తులసి చెప్పింది.
"పాపం, నువ్వూ, బావా ఆఫీసుకెళ్ళిపోతే అత్తయ్య కెటూ తోచదట. మామయ్యేమో ఎటో లైబ్రరీకి వెడతాడట. తనకు తోడు దొరికానని సంతోషపడుతోంది" అంది పాప.
తులసి ఊఁ కొట్టింది.
"ఆపరేషన్ అప్పుడే వస్తే ఎంత బావుండేది, నాకు సాయంగా ఆస్పత్రిలో ఉండేదానివి" అంది అత్తయ్య.
పాప ఆ పద్ధతిలో మాట్లాడటం తులసికి నచ్చలేదు.
సీతాపతి హడావిడిగా ఒళ్ళు తుడుచుకుంటూ వచ్చి, "అన్నం పెట్టెయ్యండి" అన్నాడు.
పాప లేచింది.
"నువ్వూ కూర్చోవోయ్. పాపా, నాతోపాటు తినేయ్" అన్నాడు సీతాపతి.
"నే నిప్పుడే తినను" అంది పాప.
"అరె, పాప అప్పుడే పెద్దదయిపోయిందే, సిగ్గు పడుతోంది చూశావా, తులసీ" అన్నాడు సీతాపతి.
"ఊఁ, మరి పెద్దది కాలేదూ, మెట్రిక్యులేషన్ పూర్తి చేసింది. టైప్ నేర్చుకోబోతోంది" అంది తులసి.
"ఐతే ఇంక మొగుడే తరువాయి. సరే, నువ్వూ తిను మరి" అన్నాడు తులసితో.
"నేనూ, పాపా తింటాం" అంది తులసి.
"వద్దక్కా నువ్వూ, బావా తినెయ్యండి. మామయ్య భోజనం చేసిం తర్వాత నేనూ, అత్తయ్యా తింటాం" అంది పాప.
"అదీ మరదలంటే" అన్నాడు సీతాపతి.
పాప అక్కడే పీట వేసుకుని కూర్చుంది.
"అప్పుడే వెడతారేమిటక్కా, అంత హడావిడిగా తినేస్తున్నారు" అంది.
"అప్పుడే అంటావేమిటి, మరదలూ, పదైతేనూ" అన్నాడు సీతాపతి.
కంచాలు కడిగేసి, చీర మార్చుకుని, టిఫిను తీసుకుని, పర్సులో చిల్లర చూసుకుని, మరోసారి అద్దంలో మొహం చూసుకుని, చెల్లెలితో, "వస్తాను మరి" అంది తులసి.
* * *
సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు కొన్ని పువ్వులూ, పళ్ళూ పట్టుకొచ్చింది తులసి.
పాప అప్పటికే వంటప్రయత్నంలో ఉంది.
"అదేమిటే, వంట చేస్తున్నావా?" అంది తులసి ఆశ్చర్యంగా.
"ఏం, సాయంత్రాలు మీరు భోజనంచెయ్యరా?" అంది పాప.
"అదికాదే, నువ్వెందుకు చేసేస్తున్నావు, నేను చేసేదాన్నిగా" అంది తులసి.
"సరేలే. నాకు పొద్దు గడవటమెట్లా, అదీగాక నా చేతిరుచి బావగారికి చూపించాలని" అంది పాప.
"చూపుదువుగానిలే, ఇప్పుడే వండిపెడితే ఆయనొచ్చేటప్పటికి చల్లారిపోతుందికూడా" అంది తులసి.
పాపకు అర్ధం కాలేదు. తులసి ఆ విషయం విశదంగా చెప్పి, "సాయంత్రం కాఫీ తాగేవా?" అనడిగింది పాపను.
"నాలిగింటికే కాఫీ పెట్టి, వాళ్ళ కిచ్చి నేనూ తాగేశాను" అంది పాప.
"ఆవిడేదీ?" అంది తులసి.
పక్కవాటాలో ఉందని వేలితో చూపించింది పాప.
"మధ్యాహ్నం వాళ్ళింటి కెళ్ళి కూర్చుంటే కమల గారు కాఫీ ఇస్తానన్నదక్కా. నేను తీసుకోలేదు" అంది పాప.
తులసి నవ్వింది.
"ఏమంటూంది నీతో?" అంది తులసి అత్తగార్ని సంబోధిస్తూ పాపతో.
"ఏమీ అనలేదు. నా చదువుగురించీ, అమ్మ గురించీ అడిగింది. ఇక్కడి కెందుకొచ్చాననికూడా అడిగింది" అంది పాప.
గొంతు తగ్గించి పాపతో, "నా ఇష్టం. మా అక్కదగ్గిర కొచ్చానని చెప్పు. ఏమైనా సూటీపోటీగా మాట్లాడితే ఏడుస్తూ కూర్చోక వెంటనే జవాబియ్యి. తెలిసిందా?" అంది తులసి.
పాప తల ఊపింది.
"వచ్చే నెలనించి నువ్వుకూడా ఓ రెండు గంటలు అలా ఇన్స్టిట్యూటుకు వెళ్ళిరా. అక్కడ టైపూ, షార్టు హాండూ నేర్పుతారు" అంది తులసి.
"అక్కయ్యా, కమలగారింట్లో కాలెండర్లు చూశావా..." అంటున్న పాపతో, "నోర్మూసుకో ఇంక. ఆ దేభ్యం వాగుడే వద్దు. ఇది మన ఊ రనుకోకు. ఇక్కడ ప్రతి మాటా తూచి తూచి మాట్లాడాలి. నువ్విలా ప్రతి మనిషి దగ్గిరా వాగితే నిన్ను వట్టి వాజమ్మకింద జమకడతారు" అంది తులసి.
* * *
"పాప అప్పుడే పడుకుందా?" అన్నాడు సీతాపతి.
"ఊఁ, మరీ ఇంత ఆలస్యమైందేం?" అంది తులసి.
"మామూలే" అన్నాడు సీతాపతి.
"ఈ ఫస్టు నించీ పాపను టైపు నేర్చుకొమ్మన్నాను" అంది తులసి.
"మంచిదేగా, అప్పటిదాకా కూడా ఎందుకు? వెంటనే చేరమనకపొయ్యావా?" అన్నాడు సీతాపతి.
"వద్దులెండి. కొంచెం అలవాటుకానీండి. చూశారా, పాప అప్పుడే పక్కింటి కమలను అక్కయ్యను చేసేసుకుంది. వీళ్ళిద్దరూ రోజూ వాళ్ళింట్లో తిష్ఠ వేస్తారట. పాపం, ఆవిడ వీళ్ళ బోరు భరించలేకుండా ఉంది కాబోలు" అంది తులసి.
"అందాకా బాగానే ఉంది. వెనకఉన్న స్టూడెంట్సును కూడా మచ్చిక చేసుకుందంటేనే కొంప మునుగుతుంది" అన్నాడు సీతాపతి.
"ఛీ! అలాగంటారేం" అంది తులసి. "ఓ సారి అలా జూకూ, గండిపేటకూ, మ్యూజియంకూ, ఎగ్జిబిషన్ కు కూడా తిరిగొచ్చామంటే దాని సరదా తీరుతుంది."
"రెండు మూడు సినిమాలు" అన్నాడు సీతాపతి.
"తప్పుతుందా?"
"వచ్చే నెల అమ్మకు కళ్ళద్దాలు తీసుకోవాలి. డాక్టరు మరికొన్ని ఇంజక్షనులు కూడా రాసిచ్చాడు. నాన్న వెళ్ళి పోతానంటున్నాడు. అందువల్ల ఆయనకూ కొన్ని టానిక్కుసీసాలు కొనిస్తే సంతోషిస్తాడు. బిల్లు చాలా అవుతుంది" అన్నాడు సీతాపతి.
"నేను సంక్రాంతికి ఫెస్టివల్ అడ్వాన్సు తీసు కుంటున్నానుగా. సర్దుకోవచ్చు" అంది తులసి.
"లాభం లేదు, తులసీ. నువ్వూ, నేనూ ఎన్ని అడ్వాన్సులు తీసుకున్నా ఈ ఇక్కట్లు తీరవు. పైగా, అడ్వాన్సు అడ్వాన్సే గాని అలవెన్సు కాదుగా. ఆ మరుసటి నెలనించీ కట్ అవుతుంటుంది. అప్పుడెలా?" అన్నాడు సీతాపతి.
తులసి నిట్టూర్చింది.
"లేవండి, పదకొండు అవుతున్నది. ఇది ఒక్కనాటిది కాదు" అంది కంచాలు తీస్తూ.
* * *
కప్పుకోడానికి తాము వేసుకునే రెండు బ్లాంకెట్స్ లోనూ ఒకటి పాప కప్పుకుంది. పరుచుకునే గుడ్డలు కూడా తగ్గాయి. చలేసింది. ఇద్దరి సుఖమైన కాపరానికి కొనుక్కున్న గుడ్డలు అయిదుగుర్ని సుఖపెట్టలేవు గద.
ఆ రాత్రి సీతాపతి చేతుల్లో ఎంత వెచ్చగా ఒదిగి పడుకున్నా తులసికి ఎక్కడో అనుమానం తొలిచింది. అతడి చేతుల్లోని ఆ నులివెచ్చని అనురాగం తనను నమ్మించి, జోకొట్టి నిద్రపుచ్చగలదు. కాని ఆ బిగువు ఎప్పుడు సడలుతుందో అని తన భయం.
కమలను అక్కయ్య నెందుకు చేసుకుంది పాప, వదిన నెందుకు చేసుకోలేదు? స్టూడెంట్సు దగ్గిర పుస్తకాలెందుకు తెచ్చుకుంటుంది? అసలు వాళ్ళతో ఎందుకు మాట్లాడటం?
ఛీ! పాపకేం తెలుసు. అది వచ్చి ఒక్క రోజన్నా గడవలేదు. అనవసరంగా తను, తన మనసు ఇంత పని చేస్తూంది.
తులసి కళ్ళు మూసుకుంది.
* * *
