Previous Page Next Page 
ప్రేమించు ప్రేమకై పేజి 5


    కొత్తగడ్డ మీద యీతని అనుభూతి చేదుగానే తోచినా కారు పోతున్న దారిలోని సుందర దృశ్యాలకి ఉప్పొంగి పోకుండా ఉండలేక పోయింది లలిత. బారులు తీరిన చెట్లు, దూరంలో కనీ కనిపించని కొండలు. స్వచ్చంగా నీలి  తెరలాగా ఉన్న ఆకాశం.....కన్నుల పండువుగా ఉన్నాయి. పట్నం లో ఉంటె ఇటువంటి ప్రక్రుతి సౌందర్యానికి ముహం వాచిపోక తప్పదు. ఎంతో అనాగరికంగా ఉండే ఇళ్ళ వరసలు- బారులు తీర్చిన పెట్టెలలాగా ఉంటాయి. వైర్లకి అడ్డు అంటూ చెట్లు నరికేస్తారు. ఇళ్ళ ముందు తోటలు కూడా అంతంతగానే ఉంటాయి. పూర్వం భవంతులకి సువిశాల మైన కాంపౌండు లుండేవి. వాటి నీనాడు ఇళ్ళ స్థలాలుగా అమ్మేసి డబ్బు చేసుకుంటున్నారు-- ఇంటి అందం ఏమైతేనేం?....ఇక్కడీ వాతావరణం కళ్ళకి చల్లగా ఉంది. చెట్ల మానుల సందుల లోంచి దూరంలో పంట చేలు తలలూగిస్తూ వీస్తున్న గాలిని గుర్తు చేస్తున్నాయి. మనసులో ఎలా ఉన్నా ఇంత అందమైన పరిసరాలలోంచి కారు సాగిపోతుంటే మనస్సులో రేగిన ఆనందాన్ని అణచి పెట్టలేక పోయింది. పట్నవాసం చూసిచూసి మసకలు కమ్మిన కళ్ళకి దృశ్యం స్వర్గ ద్వారాలు తెరచి నట్టనిపించింది. 'ఇక్కడ కొన్నాళ్ళు ఉంటె ఈ ప్రాంతాలన్నీ తిరిగి చూడాలి. హాయిగా ఆ కొండ కొనలలో పరుగులు పెట్టి, అట పాటలు పాడినా ఎవరూ పట్టించుకోరనుకుంటాను. అనుకుంది లలిత -- తనలో చెలరేగిన ఊహలకి పైకే సన్నగా నవ్వుతూ . నీలాకాశాన్ని సన్నని కుంచె తో కడిగినట్లు ఎండ పరచు కుంటుంది. ప్రకృతి సర్వస్వం పరిశుభ్రంగా స్పష్టంగా కనపడుతుంది. తను బయలుదేరినప్పుడు సర్వం నిస్త్రాణగా నిరుత్సాహంగా అనిపించింది. మనసులోనూ ప్రకృతి లోనూ కూడా వసంతం అన్నదేదో మిద్యగా తోచింది. కాని టాక్సీ కిటికీ లోంచి కన్పిస్తున్న ప్రకృతి సౌందర్యం మబ్బులు లేని నీలాకాశం, బంగారు చాయలతో ప్రకృతి ని పరచుకుంటున్న సూర్యకాంతి అంతా కలిసి మనసులోని నిరుత్సాహాన్ని లలితకి తెలియకుండానే తరిమి కొట్టాయి. ఎంత చక్కని రోజు-- అనుకుంది.
    కారు సాఫీ రోడ్డు మీద అర్జెంటు గా సాగిపోతుంది. అక్కడా అక్కడా పెద్ద పెద్ద భవంతులు తోటల మధ్య కన్పిస్తున్నాయి. టాక్సీ డ్రైవరు అక్కడక్కడ పేరు తెలిసిన ఇళ్ళు చూపెడుతున్నాడు. "మీరు వెళ్లబోయే యిల్లు కూడా ఈ ప్రాంతాలలో చాలా పేరు గాంచినదేనమ్మగారూ. శాస్తుల్లు గారు అందరి మీదా కోపం చేసుకుంటారు -- మిమ్ముల్ని కల్సుకోడానికి ఎవరూ రాలేదని తెలిస్తే -- అయ్యగారికి కోపం వస్తే ఎలా ఉంటుందో చాలాసార్లు విన్నానండి!" అన్నాడు తనలో తను నవ్వుకుంటూ . 'చాలా మంచివారే కాని కోపం వస్తే మనిషి కాదంటారు.' అన్నాడు ఎంతో గౌరవంతో.
    ఇంకా ఎన్నో విశేషాలు అడగాలనిపించింది లలితకి. కాని అడగడం సభ్యత కాదని కోరికని అణగద్రొక్కుకుంది. కంటికి కన్పడుతున్న సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ మౌనంగానే కూర్చుంది. కారు ప్రయాణం ప్రారంభం అయి ఓ ముప్పావు గంట అవుతుంది. ఎత్తుగా ఉన్న ప్రహరీ గోడలతో చూడ గంబీరంగా ఉన్న ఓ ఇంటి కేసి కారు మళ్ళించాడు డ్రయివరు. పెద్ద గేటు మూసి వుంది. హారన్ వేశాడు. కారు కిటికీ లోంచి కుతూహలంగా బయటికి తొంగి చూసింది లలిత -- గేటు పక్క బోర్డు మీద ఏమైనా రాసి ఉందా అని. అంత పెద్దవి కాని అక్షరాలతో 'కీర్తి పతాక' అని మాత్రమే రాసి ఉంది. బహుశా ఇంటికా పేరు పెట్టారు కాబోలు -- అనుకుంది -- గేటు కొంచెంగా తెరుచుకుని యెర్రని చీర ఎత్తి కట్టిన ఓ మనిషి తొంగి చూసింది. 'ఎవరూ?' అంది గమ్మత్తుగా సాగతీస్తూ ఇంతట్లో కిటికీ లోంచి చూస్తున్న లలిత కనబడ్డట్టుంది--' అయ్యబాబో అమ్మాయి గారు వచ్చేసినట్టుంది కొంప మునిగింది.' అంటూ గేట్లు బార్లా తెరిచి తోటలో ఓ పక్కగా ఉన్న చిన్ని ఇంట్లోకి పరుగెత్తింది "రంగయ్య మామా' అంటూ అరుస్తూ. కారు ముందికి సాగింది. వెళ్లి తిన్నగా పోర్టికో లో ఆపాడు డ్రయివరు. తన కళ్ళ ఎదుట కనబడుతున్న సుందర దృశ్యాన్ని ఓ పట్టాన నమ్మలేక పోయింది లలిత. పురాతనమైన కట్టడం -- రకరకాల పూతీగలు అల్లుకుని పైపైకి పాకిపోయి గుత్తులు గుత్తులుగా పూసి గుభాళిస్తూన్నాయి. ఎత్తుగా ఉన్న మెట్ల కి ఇటూ అటూ పూల కుండీలు అమర్చి ఉన్నాయి. పైన వరసగా పూల తాళ్ళు వేలాడదీసి ఉన్నాయి -- వాటిలోంచి నాజూకుగా క్రిందికి వేలాడుతున్నాయి-- అందమైన ఆకులూ  పూవూలూ, కింద నిలబడి చూస్తె అదంతా ఎవరో అద్రుశ్యులు అదృశ్య హస్తాలతో ఎత్తి పట్టిన దండలాగా తోచింది లలితకి. సామాన్లు దింపి సలాం కొట్టాడు డ్రయివరు. యాంత్రికంగా డబ్బు యిచ్చి మెట్లెక్క సాగింది లలిత. ఇంతట్లో కే గేటు దగ్గిర చూసిన మనిషి ఇంకో మనిషిని వెంట పెట్టుకుని పరుగు పరుగున వచ్చింది -- "రండమ్మాయి గోరూ, రండి . అయ్యా బాబో మీరెప్పుడో వత్తారన్నారండీ' అంటూ హడలి పోయింది. ఆ అయ్యబాబో యీవిడ గారికి ఊత పదం కాబోలు అనుకుని నవ్వింది లలిత. "నీపెరేమిటి?" అంది చేతికి తగిలిన పూల గుత్తిని వంగి ఓసారి వాసన చూస్తూ.
    "రత్తి ఆమ్మాయి గోరూ' వాడు రంగయ్య మామ. మేం తోటోళ్ళం. మీరేమో మీదుటికి కాక మాపటి కొత్తారని చెప్పారండి. ఇల్లంతా ఒకటే హడావుడి. ఇక సరళమ్మగారైతే చెప్పనే అక్కర లేదు. సరస్వతమ్మ గారోకటే "ఊరుకోవే' అన్నా ఏదేదో చెప్తూనే ఉండారు -- ' అంటూ ఆగింది.
    "వీళ్ళంతా ఎవరు?' కుతూహలంగా అడిగింది లలిత 'సరస్వతమ్మ గారు అయ్యగారికి అత్తవుతారు. అయ్యమ్మగోరి అమ్మాయి గారే సరళమ్మ. పట్నం లో చదివింది. మాబాగా ఉంటారండి.' అంటూ గబగబా అడుగులేస్తూ ముందుకి సాగింది. 'మీరుండండమ్మా , నే వెళ్లి వంటావిడకి చెప్పి మీ గదులు తెరిపిస్తాను.' అంటూ లోపలికి అదృశ్య మైంది. రంగయ్య చూడబోతే చాలా నెమ్మదస్తుడిలా ఉన్నాడు. ఒక్కమాట కూడా మాట్లాడలేదు. సామానంతా పైకి తెచ్చి తన పనైనట్టు తలగుడ్డ విదిలించి మళ్ళీ వచ్చిన దారినే వెళ్ళిపోయాడు.
    
                                     3
    లలిత ఆ సువిశాలమైన వరండాలో వంటరిగా మిగిలిపోయింది. వరండా లో అక్కడా అక్కడా కుర్చీలు సోఫాలు అమర్చి ఉన్నాయి. వరండా ఇంటి చుట్టూ ఉన్నట్టుంది -- అందంగా ఒంపులు తిరిగి -- చుట్టూ అందంగా పిట్టగోడ ఉంది-- పిట్ట గోడ మీదకి తొంగి చూస్తూ తోట లోని పూల చెట్లు ఉన్నాయి. ఎంతో అందంగా పూసిన ఓ చెట్టు కొమ్మ మరీ కిందికి వంగి వరండా లోకే చూస్తున్నట్టుంది. లలిత వెళ్లి అక్కడ నించుని కొమ్మ అందుకుంది. అలాగే నిలబడి పరిసరాలని పరిశీలిస్తుంది...' ఇంత అందాన్ని ఇక్కడ ఎలా కట్టి పడేశారు? ఇదంతా నన్ను కట్టేసుకుంది. ఇంత అందం మనసులోని విషాదాన్ని పారదోలుతుంది.  ప్రాణం విసుగానిపించడం లేదిక్కడ' అనుకుంటూ -విప్పారిన కళ్ళతో అన్ని వైపుల చూస్తూ సర్వం మరచి నిలబడి పోయింది లలిత.
    అప్పుడే ఎవరిదో అడుగుల చప్పుడు విన్పడింది. ఒక్క ఉదుటున వెనక్కి తిరిగి చూసింది--అవతలి వైపు నుండి ఇటు వచ్చిన ఆ వ్యక్తిని చూసి క్షణం స్తంభించింది లలిత. ఆకుల చాటు నుండి సూర్యకాంతి వింత నీడలు పరుస్తూ చిలిపిగా ఆదుకుంటుంది. కొంచెం సేపు ఎండ వెల్గు వారిద్దరి మధ్యా నిలిచి కదలింది. ఆ వింత జిగేలు మనడంతో పొడవైన ఆ కృతి మాత్రం చూడగల్గింది లలిత . అతను కూడా రెండడుగులు ముందుకి వేసి పిట్టగోడ దగ్గిరికి వచ్చి నిల్చాడు. శిల్పి చేక్కినట్టున్న ఆ వ్యక్తిని కన్నార్పకుండా  చూస్తూ ఉండిపోయింది లలిత. అతని చూపు కూడా తీక్షణంగా ఉంది. 'ఎంత అందగాడు!' అనుకుంది లలిత కాని మరుక్షణమే - 'ఒక్క అందగాడే కాదు-- చాలా హుందా అయిన వ్యక్తీ లా ఉన్నాడు. కఠినుదు కూడా కావచ్చు -- ఆ దవడ చూడు' అనుకుంది.
    అప్పుడే ఆ చామం చాయిగా ఉన్న పోత విగ్రహం మాట్లాడింది. కనుబొమలు ఆశ్చర్యంతో కొంచెం పైకి లేచాయి.
    "ఎవరి కోసమైనా చూస్తున్నారా?'
    "అవును....' తొట్రు పడింది లలిత. హటాత్తుగా ఎక్కడ లేని సిగ్గు భయం ముంచుకు వచ్చాయి. 'శాస్త్రి గారి ప్రాంతాలలో ఉంటారా?' అంది ఎలా చెప్పాలో తెలియక.
    "ఉంటారే ' అన్నాడతను. సన్నని చిరునవ్వు అతని పెదవుల పై వెల్గింది. ఆ నవ్వుతో అతని ముఖానికి కొత్త అందం వచ్చింది, అనుకుంది లలిత.
    "నా పేరు శాస్త్రీ' అన్నాడు.
    వింతపడి చూసిందతని కేసి ....'కాదు నే చూసే శాస్త్రిగారు మీరై ఉండక పోవచ్చును... నాకోసం ఎదురుచూసే శాస్త్రి గారిల్లు ఇదేనని స్టేషను లో చెప్పారు, ఇది బలరామ శాస్త్రి గారిల్లు కాదా?' అడిగింది.
    అతని ముఖ కవళికలు  పూర్తిగా మారిపోయాయి.
    అది ఆశ్చర్యమా? అయిష్టతా? ఏదైనదీ ఆ మార్పును బట్టి చెప్పలేక పోయింది... మళ్ళీ అతనే ... ఆ చక్కని కంఠం తో అన్నాడు.
    "నేనే బలరామ శాస్త్రిని."
    స్తబ్దురాలై నిలబడి పోయింది లలిత .... అతని కేసే అలా చూసి చూసి ....నాది పొరపాటు అయి వుంటుంది....ఇది సంభవమా? లాయరు గారు పోరపడ్డారా? ఈయన నాకు గార్డియన్ అయి ఉండడు ! అనుకుంది.
    ఆమె ఆశ్చర్యానికి కారణాలు చెప్పడం సులభం కాదు. ఆమె గుండెలు త్వరితగతిని కొట్టుకోడానికి కారణాలు చెప్పడం సులభం కాదు. ఆమె ఎదురు చూసిన గార్డియన్ ఓ ముసలాయన అయి వుండాలి. అది కాకపోవడమే ఆమె బిత్తర పోడానికి కారణం. ఎంత ఊహించుకుందామన్నా తన సంరక్షకుడియిన అన్న నమ్మకం కల్గలేదు లలితకి. అత్తయ్య కట్టడి లోంచి ఓరకంగా ఇంకో రకపు మామయ్య కట్టడి కి ట్రాన్స్ పరవుతున్నానన్న ఊహ బలంగా నాటుకుపోయిన లలితకీ వ్యక్తీ ఎదురవడం -- వింతే. పట్టుమని ముప్పయి అయిదేల్లేనా ఉండని ఈ వ్యక్తీ సంరక్షకుడేమిటి .' అనుకుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS