Previous Page Next Page 
నన్ను నన్నుగా ప్రేమించు పేజి 5


    "అమ్మా!" అని పెద్ద కేక వేసింది లీల మళ్ళీ.
    ఎవరో కడుపులో చెయ్యి పెట్టి కెలికేస్తున్నారు...చేపల కోసం మడుగులో దిగి కాళ్ళతో కుమ్మేసినట్లు దేవేస్తున్నారు..... వాళ్ళకేం కావాలి? తన కడుపులో రత్నాలు దోచుకుంటున్నారు....
    అదుగో, ప్రభాకరం.....తనని రక్షిస్తాడు....అదేమిటి అంత కోపంగా ఉన్నాడు?..." నేనేం తప్పు చెయ్యలేదండీ?.....జయప్రద ఇచ్చిన పుస్తకాలు నే చదవలేదు.... నాకు బాబు కావాలి.... పోనీ, పాసైనా సరే..." "నువ్వు నా మాట లెక్క చెయ్యలేదు....అంతంత సేపు పన్లు చెయ్యద్దన్నావా?" "లేదండీ. నేను కులాసాగా తిరుగుతున్నాను." "నా ఆశ నిరాశ చెయ్యకు, లీలా. నా వంశోద్దారకులు నా లోపల. నీ లోపల ఉన్నారు. వాళ్ళకి లోకం చూపించు. నీ కేం భయం లేదు, నే నున్నాను."
    మళ్ళీ స్పృహ వచ్చేసరికి గదిలో ఎవ్వరూ లేరు. గదిలో ఒక మూల నిశ్శబ్దంగా వెలుగుతున్న దీపం సాయంకాలమైందని తెలియజేస్తూంది. పైన పంకా చాలా తక్కువ స్పీడులో తిరుగుతూంది. ఎవరైనా ఆపేస్తే బాగుండును. కాని అంత మరీ ఎక్కువ చలిగా లేదు...
    హఠాత్తుగా మధ్యాహ్నం నుంచి జరిగిన ఆపద జ్ఞాపకానికి వచ్చింది. అప్రయత్నంగా కడుపు తడిమి చూసుకుంది లీల... తేడా ఏమీ కనిపించలేదు. తేడా అంతా జరిగిపోయినదానిలో ఉంది.... ఏవో తీపులు... చెవి మెలి పెట్టినప్పుడు చెవిబాధ తట్టుకో లేక మనిషంతా గిర్రున తిరిగిపోయినట్లు-అలాటి తిరుగుడేదో జరిగినట్టుంది...
    ఒక మహా స్వప్నం కరిగిపోయింది.....
    
                               *    *    *

    ఒక ఏడాది గడిచింది....
    ఏదో పనిమీద రాజమండ్రి వెళ్ళివచ్చిన ప్రభాకరం వెనకాల కూలివాడితో పెద్ద అట్టపెట్టె ఒకటి మోయించుకొచ్చాడు.
    "అదంతా ఏమిటండోయ్?"
    లీల అట్టపెట్టె కటూ ఇటూ చూసింది.
    "చూపిస్తా నాగు మరీ!"    
    ఆ పెట్టె తెరవగా వచ్చిన ప్రపంచం - బాల ప్రపంచం అనవచ్చు దాన్ని. కీ ఇస్తే తిరిగే బొమ్మలు, కీ ఇవ్వకుండానే కదిలే బొమ్మలు, గాలికి డాన్స్ చేసే డాల్సూ, బోసినోరు తెరిచి నవ్వుతున్న పాప కేలండరు, గా కోబేబీ, ఏబ్డెక్ డ్రాప్స్ బేబీ-రకరకాల చప్పుళ్ళు చేసే ప్లాస్టిక్ బొమ్మలు-దాదాపు పాతిక రకాలు.
    "నీ కోసం తెచ్చాను."
    "నా కోసమా?" నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని నవ్వింది లీల.
    "నయం, ఇంకో పదేళ్ళు పోయాక తెచ్చారు గాదు.... నేను ఈ బొమల్తో ఆడుకోనాండీ, ఈ వయసులో?"
    "ఇంచుమించు అంతే." ప్రభాకరం నవ్వాడు. "మనకి బాబు పుట్టేదాకా నువ్వే ఆడుకోవాలి. ఆ తరవాత బాబు ఆడుకుందికి ఇచ్చెయ్యాలి."
    "బలేవారండీ..."
    "అంటే...నువ్వివ్వక్కకపోతే బాబుకి కొత్త బొమ్మలు కొంటాననుకో. కాని ప్రస్తుతం నువ్వు ఆడననడానికి వీల్లేదు-అదీ కథ."
    "వెర్రి కుదిరింది; రోకలి తలకు చుట్టమన్నాడుట-ఇదే కాబోలు."
    "ఎవరి వెర్రి వారికి ఆనందం కదా."
    "ఎంత వెర్రైనా ఇదేమిటండీ ఈ విపరీతం? నే నాడుకోవడమేమిటి, బొమ్మల్తో?....ఎవరైనా వింటే నవ్వుతారు."
    "వింటేకాదు, చూసినా నవ్వకుండా నే నేర్పాటు చేస్తాను. నీ కోసం మేడమీద హాలంతా ఖాళీ చేయించేస్తాను అక్కడి కెవరూ వెళ్ళకుండా."
    "ఎవర్నేనా కాపలా పెడతారా?"
    "ఎవర్నో ఏం ఖర్మం, నే నుంటాను!"
    "చాల్చాల్లెండి."
    "ఆ తరవాత ఇవన్నీ ముందేసుకుని, ఇంకా అందమైన బొమ్మలు, కేలండర్లు తెచ్చి వేలగడ్తాను, అవి చూస్తూ నువ్వు కులాసాగా కాలక్షేపం చెయ్యాలి. నా స్నేహితుడొకాయన లండన్ నించి రకరకాల ఫిలిమ్స్ తెప్పించాడు. అతని దగ్గర పదహారు మిల్లీమీటర్ల ప్రొజెక్టర్ కూడా ఒకటుంది. అందులో పిల్లలకి సంబంధించిన సినిమాలు తెచ్చి నీకు చూపిస్తాను. వాటన్నిటివల్లా వచ్చే మధురమైన అనుభూతులు నీ హృదయంలో భద్ర్రపరుచుకో. నీకు ఆరోగ్యం, బలం కల బాబు పుడతాడు...."
    "చాలా బాగుందండీ మీ వరస. ఆలూ లేదు చూలూ లేదు కొడుకుపేరు సోమలింగం అన్నట్టు నెల తప్పేసరికి ఈ ఏర్పాట్లన్నీ ఏమిటండీ! ఎవరేనా వింటే నవ్వరూ?"
    "ఆలూ ఉంది, చూలూ ఉంది. నువ్వు కొడుకుని కను. వాడికి సోమలింగం అని పేరుకూడా  కావాలంటే పెట్టుకుందా.... కాని నే నిందాక చెప్పినట్టు చేసి తీరాలి, నువ్వు మాత్రం..."
    "ఎందుకో?"
    "ఎందుకో ఏమిటి? లండన్ నుంచి వచ్చిన నా ఫ్రెండొకతను చిన్నపిల్లల వైద్యం మీద, శిశు జననం మీద పెద్ద పెద్ద పరిశోధనలు చేశాడు. అతను నన్ను గుర్తుపట్టి యోగక్షేమం కనుక్కున్నాడు. నిన్నరాత్రి అతనితోనే గడిపాను. నీ సంగతంతా చెప్పి ఓ సారి తణిఖీ చెయ్యడానికి రమ్మన్నాను. రావడానికి తీరుబాటు లేదని ఈ సమాహాలు మాత్రం ఇచ్చేడు.... రెండు సార్లు ఎబార్షన్ అయిందని నే నప్పటి పరిస్థితులూ, విశేషాలూ చెప్పాను. అయిదో నెలనుంచీ వాడవలసిన మందులుకూడా కొన్ని శాంపిల్స్ ఇచ్చేడు. ముఖ్యంగా అతను చెప్పిందేమిటంటే శారీరకంగానేకాక, మానసికంగా నువ్వు సిద్ధం కావాలి. నా లోంచి శిశువు ఉదయిస్తాడు; నేను సైతం సృష్టి చర్యకు యథాశక్తి కష్టపడగలను అని నువ్వు నీ మీద నమ్మకం ఏర్పరచుకోవాలన్న మాట. అంతేకాని అయ్యో రెండు సార్లు ఎబార్షన్నయ్యాయి - మూడోసారికూడా ఎబార్షనే అవుతుందో, నేనే చచ్చిపోతానో అని బెంగపెట్టుకోకూడదన్న మాట."
    లీల ఆశ్చర్యపడింది. ప్రభాకరానిది చాదస్తం అనుకొనేది తను. అతనికి పిల్లలమీదనే కాదు, తనమీద కూడా ఎనలేని ప్రేమ అన్నది స్పష్టమౌతూంది.

                              *    *    *

              

                                  5

    "మూడేళ్ళయి మనం కలవడమే పడలేదు.
    చాలా చిక్కిపోయావు-తెలుసా?"అంది జయప్రద.
    "నే నేం చిక్కిపోలేదు. పైగా దుక్కతన్నేనని అందరూ అంటున్నారు."
    "ఎవరుం అందరూ అంటే? మీ ఇంట్లో అద్దం ఉందా? పద, చూపిస్తాను."
    "అక్కర్కేదు. రోజూ చూస్తూనే ఉన్నానుగా!"
    "అది సరేగాని. నాతో నిజం చెపుతావా?"
    "చెప్పడానికి వీలున్న సంగతైతే చెపుతాను."
    "నిజం నువ్వు చెప్పకపోయినా నే కనుక్కోగల ననుకో కానీ మీ ఆయన్ని బాగా వల్లో వేసుకొన్నావే!"
    లీల తెల్లబోయింది.
    "ఏమిటీ బాబూ నువ్వనేది?"
    "హరికథలు చెప్పకు. పిల్లలూ, బొమ్మలూ, చాకొలెట్లూ, బిస్కత్తులూ అంటూ తిరిగే వాడే మీ అయన-ఏం మంత్రం వేసి ఆయన్ని ఆ ధోరణిలోంచి తప్పించేవు?"
    "ఏడిసినట్టుంది..."
    "చెప్పు... పిల్లలు పుట్టకుండా ఉండడానికి మీరేం చేస్తున్నారు? నే నిచ్చిన పుస్తకం ఇంత మంచి పని చేస్తుందని నే ననుకోలేదు సుమా!"
    లీలకు ఏమనాలో అర్ధం కాలేదు. "అదికాదే, జయా, జరిగింది వేరు."
    "ఏమిటి వేరు?"
    లీలకి నీరసం వచ్చినట్లయింది. ఏదో కష్టమైన సంగతి జ్ఞాపకం వచ్చినట్లు ఆమె మనస్సు వాలిపోయింది. దేహం చెప్పినట్లు వినడం మానేసింది. "చెబుతా నిలా రా" అని హాల్లోంచి గదిలోకి తీసుకుపోయింది.
    మంచానికి దూరంగా రెండ కుర్చీలున్నాయి. అవికాక ఒక ఈజీ చైర్ గోడకు ఆనుకొని ఉంది. ఆ ఈజీచైర్ వాల్చుకొని కూర్చుంది లీల. "మూడు ఎబార్షన్లు అయేయి-తెలుసా?"
    మెల్లిగా తన కథంతా చెప్పుకొచ్చింది. పెళ్ళాడిన మూడో నాటి నుంచీ పిల్లల కోసం తనను ప్రార్ధించి నట్లు వేటాడడం, తనతో చెప్పలేక చెప్పలేక చెప్పడం, ఆయనని ప్రతిఘటించడానికే వీలులేక, జయ ఇచ్చిన పార్సెల్ చాలా రోజులదాకా ఊడదియ్యకపోవడం, చివరికి ఏది జరగకూడదో అదే జరగడం, ఆయనే ముందుగా పార్సెల్ విప్పడం-అన్నీ చెప్పింది.
    "అవన్నీ చూసి ఏమన్నా రాయన?"
    "ఏమైనా అంటే బాగానే ఉండేది!"
    "తిట్టాడా?" అన్నది జయప్రద నవ్వుతూ.
    "ఎవర్నీ?"
    'నన్నే."
    "నిన్నూ తిట్టలేదు, నన్నూ తిట్టలేదు. నిశ్శబ్దంగా కుర్చీలో పేపరు చదువుతూ కూర్చున్నారు. సినిమాకి వెడదామని టిక్కెట్లుకూడా కొన్నారు. రా నంటే రానని మొండికేశారు. నాకా రోజు బలే భయం వేసిందనుకో."
    "భయం దేనికే?"
    "అంటే ఆయ నేమంటారేమోనని."
    "ఇంకా నయం! చాల్చాల్లే. నే నేదో ప్రెజెంటేషన్ ఇవ్వడం, అది ఆయనగారికి నచ్చకపోతే నిన్ను తిట్టడం ఒకటా? సుశీల రాజారావుని పెళ్ళి చేసుకొన్నప్పుడు సుశీల బావగారు బొంబాయినించి వచ్చాడు - జ్ఞాపకం ఉందా?"
    "ఉంది."
    "అతను రాజారావు కేమి టిచ్చేడో తెలుసా?"
    "ఏమో నా కేం తెలుసు?"
    'చిన్న పిస్టల్ ఇచ్చేడు. ఆడుకొనేది కాదు-నిజంగా పేల్చుకొనేదే. వైల్డ్ వెస్ట్ సినిమాల్లో వాడుతారు చూడూ, అలాంటి దన్న మాట. చిన్నప్పుడు దీన్ని నేను పెళ్ళిచేసుకుందాం అనుకొనే వాన్నండీ. నన్ను చేసుకుంది కాదు. దాన్ని షూట్ చెయ్యాలని పిస్తోలు తెచ్చాను తీరా మిమ్మల్ని చూసేక మంచివాన్నే ఏరుకుంది కదా అని షూట్ చెయ్య బుద్ధి కావడం లేదు- అని పిస్తోలు ఆయన కిచ్చేసేడు. కొత్తదే, మేరేజి గిఫ్టు కోసం అంతకుముందే కొన్నాడు."
    "సుశీలకి కావలసిందే!"
    "నువ్వూ మీ ఆయనలాగే ఆలోచిస్తున్నావు. పిస్తోలు సుశీల మీద ప్రయోగించమని ఇచ్చాట్టే వెర్రి మొహమా?"
    "లేదనుకో...."
    "కానీ, నే నిచ్చినవి నీ మీద ప్రయోగించమనే." జయప్రద పకపక నవ్వింది. "అందుచేత, అంటే నన్ననాలి గాని నిన్నే మంటాడు మధ్యన?"
    "నిన్ను గురించి మాత్రం ఆయన చెడ్డగా అనుకోవడం నాకు మంచిదా?"
    "నన్ను గురించి చెడ్డగా అనుకొనేవాళ్ళు కూడా కొందరు ఉండడం నాకు మంచిదే. ఒక్కసారి మా ఊరు వచ్చి చూడు- జయప్రద కొంపలు తీసే కొరివి అంటూనే ఉంటారు .... ఎప్పుడేనా చేతులు కాలితే నా దగ్గరికే వస్తారు."
    "నీతో నేను మాట్లాడలేనే, తల్లీ!"
    "నాతో నిన్నెవడు మాట్లాడమన్నాడు? ఆయన గారితో మాట్లాడు. పెట్టెలో పెట్టి దాచుకొందుకు కాదు నా ప్రెజెంటేషన్. రోజూ పారాయణ చెయ్యడానికి ఇచ్చిన భగవద్గీత లాంటి పుస్తకం ఒకటి ఇచ్చావే!"
    "ఏం కాదు..."
    "కాకపోవడమేమిటి? అవన్నీ మూల పారెయ్యడం. ఏమిటి, ఈ ఎబార్షన్లేమిటి? నే చెపుతూనే ఉన్నాగా- నీ ఒంటికి పడదే అంటూ అని. నా మాట పెడచెవిని పెట్టావు. ఇదంతా ఆరోగ్యం అనుకొంటున్నా వేమిటి?"
    హఠాత్తుగా పభాకరం గదిలోకి వచ్చాడు. "ఎక్స్ క్యూజ్మీ! ఏవో ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుంటున్నట్టున్నారు. సారీ!" అని వెళ్ళబోయాడు.
    లీల లేచి నించుంది. జయప్రద కూర్చునే ఉంది. నవ్వుతూ, "బావగారు కోపం లేకుండానే కొడదామని చూస్తున్నారు" అంది. లీల నిశ్శబ్ధంగా అవతలికి వెళ్ళింది.
    "సారీ.....కొడదామని కాదు." ప్రభాకరం నీళ్ళు మింగాడు. కూర్చున్నాడు.
    "కూర్చోండి. మీతో మాట్లాడి చాలా రోజులైంది. ఆ మధ్య మీ ఊరి స్కూలు మాస్టారు గారొకాయన మా నర్సింగ్ హోమ్ కొచ్చారు."
    "ఎవరూ-కృష్ణ శర్మగారా?"
    "అవునండి. వాళ్ళమ్మాయిని కాకినాడలో ఇచ్చారు గదండీ? మా నర్సింగ్ హోమ్ లోకే కన్ సైన్ మెంటుకి తీసుకువచ్చారు. బాబు పుట్టాడండి."
    "అబ్బా ... దేనికి అంతదైందన్న మాట!"
    "అంత దవట మేంటండోయ్, బాబుకి నాలుగో నెల. మళ్ళీ ఆ అమ్మాయి గర్భినండీ. మొన్న పరీక్ష చేయించటానికి తీసుకొచ్చారు."
    "అందులో తప్పేముందండీ? అంటే, క్షమించండి - మన అభిప్రాయాలు ఈ విషయంలో వేరేమో?"
    "అందులో తప్పేంలేదండీ. కాన్పుల ఆస్పత్రి నడిపే వాళ్ళం మేం వేరే విధంగా అనటానిక్కూడా వీల్లేదు గదండీ!"
    మా అభిప్రాయం వ్యక్తపరిస్తే మా బిజినెస్ కే దెబ్బ అన్నట్టుగా నవ్వింది జయప్రద.
    "కానీ, మీ కత్తికి రెండు వేపులా పదునుంటుందండీ" అని ప్రభాకరమూ నవ్వాడు.
    'మీకు ఎబార్షన్ స్పెషలిస్టుకూడా' అని ఆ మాట జయప్రద కర్ధమైంది. ఠకీమని సమాధానం చెప్పడానికి, నోరు రాక కాదు, మనసు రాక ఆగింది. "ఏమిటో, విచిత్రంగా మాట్లాడతారండీ మీరు.... కాకినాడ రావడమే మానేశారుగా!"
    "అవునండీ, మార్కెట్ అంతా రాజమండ్రి..."
    "అదిగాదండి. ఓ సారి లీలని తీసుకొని రా రాడండి?"
    "లీలకి మీ దగ్గరికి వచ్చే యోగ్యత పట్టలేదింకా!"
    "నర్సింగ్ హోమ్ కి రాకపోతే ఇంటికి రావచ్చు గదండీ?"
    "మీకు ఎప్పుడూ ఇంటి దగ్గర దొరకరండీ."
    "అయ్య బాబోయ్.....చావ గొట్టేస్తున్నారు. ఏమో అనుకున్నాను....లీల నా కేం చెప్పలేదండీ-మీ రింత గమ్మత్తుగా మాట్లాడుతారని..."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS