Previous Page Next Page 
మొగలి పొదలు పేజి 5


    'నాకేవీ కోపం లేదు. చూడు శ్రీవారి నీతో ముఖ్యంగా మాట్లాడాలనే వచ్చాను. నువ్వు నాకు మాట యివ్వాలి.'
    'ఏవిటో అది?'
    'వీల్లేదు. ముందు మాట యిచ్చేక గానీ చెప్పను నేను.'
    ఘోల్లున నవ్వాడు శ్రీహరి: 'పిచ్చి సరస్వతి. అడిగిందుకు నీకే అంత సమస్య గా వుంటే యింక మాట యివ్వ గలనో లేనో దీన్ని బట్టి వూహించలేనా నేను.'
    'అంటే నువ్వు మాట యివ్వ నంటావు.'
    'యింక వేరే అనేది యేముంది?' శ్రీహరి చటుక్కున సరస్వతి ని దగ్గరికి లాక్కున్నాడు. సరస్వతి గొంతులో మాటలు మెల్లగా వినిపిస్తున్నాయి. 'ఈ బంధం నువ్వు శాశ్వతంగా చేయాలని యిది నాకు యెప్పటికి స్వంతం కావాలనీ అడిగేందుకు వచ్చాను. చెప్పు నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటే ఏం?'
    శ్రీహరి చేతులు పట్టు తప్పాయి, చాలా శాంతంగా అన్నాడు. 'అమ్మా నాన్నలకి యిష్టం అయితే నాకు అభ్యంతరం ఏముంటుంది ? నిజంగా నువ్వంటే నాకు యిష్టం వుంది. చిన్నప్పటి నుంచి వొకే కంచంలో తిని యింత పెద్ద వాళ్ళం అయ్యాం. నేను నిన్ను వదులు కోలేనేమో.'
    సరస్వతి తలెత్తింది. 'అమ్మా, నాన్నల యిష్టం. చాలా చిత్రంగా మాట్లాడుతున్నావు శ్రీహరి. ఈకాలంలో కూడా నీలాంటి వాళ్ళు వుండే వుంటారు. అందుకే నాలాంటి వాళ్ళు యిలా అధోగతి అయిపోతున్నారు.'
    మసక చీకట్లు క్షణం లో వ్యాపించేసి గదిని క్రీ నీడలో ముంచేత్తేస్తున్నాయి. నీలి నీలి నీడలు యేటవాలుగా వచ్చేసి గీతలు గీతలుగా సరస్వతి మొహం మీద పడుతున్నాయి. శ్రీహరికి మరీమరీ చూడాలని పిస్తున్నా నిగ్రహంతో నిలదొక్కుకున్నాడు. సరస్వతి అలా చూస్తుంటే ఆవిడ  వేసే ప్రశ్నలకి తను సమాధానం యివ్వలేడు. సరస్వతి తనకు యెంత వరకూ అవసరమో అర్ధం కాకుండా ఉంది.
    'చెప్పు శ్రీహరి. నీ తరపు నుంచి వచ్చే సమాధానం మీద భవిష్యత్ ఉంది నాకు. అత్తకి నేనంటే ప్రాణం. ఆ సంగతీ నీకు కూడా తెలుసును. నువ్వే పట్టుబడితే అత్త కాదంటుందంటావా?'
    'అది కాదు సరస్వతి.'    
    'యేది కాదు? బ్రతుకు లో మనకి అవసరం అయ్యేది ఏవిటో అర్ధం చేసికోలేని పాపాయిలం కాదు కదా!'
    'అందుకు కాదు సరస్వతీ. నాన్న మండి పడతాడు. మీ అమ్మ కులం కానిదని ఆయనకు చాలా.........'
    సరస్వతి కళ్ళు యెర్ర బడిపోయాయి. 'ఛీ! నీకెంత బుద్ది లేదు: నేను చదువుకోలేదు వొప్పు కుంటున్నాను. చదువూ -- సంస్కారం పుట్టుక తోటే వొంట బట్టాయి నీకు. అంతేకాదు. ఆలోచించే శక్తి కూడా వుంది అమ్మ కులం కానిది అంటే ఆవిడకు అసలు కులమే లేడను కుంటున్నావా. ఆ మాటకు వొస్తే మా అమ్మ కులం కన్నా మీది గొప్పదే అనుకుంటూన్నావా?'
    'నా మాట కాదు సరస్వతీ. నాన్న నన్ను నిలువ నీయడు. సంఘం నన్ను చాలా నీచంగా చూస్తూ వుంటే....'
    'నువ్వు భరించ లేవు. అంతేనా. చిన్నప్పటి నీ మాటలు అప్పటి ఆటలూ అవన్నీ నాటకం లో కొన్ని క్షణాల పాత్రల్లా మిగిలి పోయాయి. పోన్లే శ్రీహరి గోప్పదాన్నే నాకన్నా అన్నిటా మించినదాన్నే చేసుకుంటావు. నీకు అన్ని అర్హతలూ వున్నాయి.'
    'నాకు అందం తప్ప మిగతావి యేమీ లేవు. నాన్న అంతకట్నం యిచ్చుకోలేడు. చదువుకున్న వాడిని చేసుకునేందుకు కనీసం ఎనిమిదో క్లాసు ను కూడా పూర్తీ చేయలేదు నేను.
    'అయినా నాకుగా నేను వచ్చి నిన్ను అడగడం ఛా! యెంత పొరబాటు చేశాను? వస్తాను. నీ దగ్గరికి రానంత సేపూ ఏదో ఆశ. కానీ యిప్పుడు ఆశే లేదు కొత్త సంగతి తెలుసుకున్నాను నీ వల్ల. నన్ను చేసుకుండు కి యెవరూ సాహసించరనే మాట. అవన్నీ యెందుకు? నేను వస్తాను.' సరస్వతి వెళ్లి పోతుంటే శ్రీహరి కిటికీ లోంచి చూస్తుండి పోయాడు. అతని గుండెల్ని యెవరో నలిపి వేస్తున్నారు కసిగా. సరస్వతి యెన్ని మాటలు అంది? తన స్వభావం తెలీదా సరస్వతి కి. కొంచెం వుద్రేకం వున్న తనని నెమ్మదిగా యెందుకు తేలేదు రాజీకి? 'సరస్వతీ వొక మాట విని వెళ్ళు,' శ్రీహరి మనసులో మాటలు యెంత ప్రయత్నించినా పైకి రావడం లేదు.
    చీకటి కమ్ముతూ సరస్వతీ నీడని మింగేస్తుంటే కిటికీ వూచలు పట్టుకుని చూస్తుండి పోయాడు డీలా పడిపోతూ.

                          *    *    *    *
    సుభద్ర అద్దంలో చూసుకుంది. వొకటికి రెండు సార్లు -- గుండ్రని ముఖానికి మెరిసి పోయే రెండు అందమైన చేప పిల్లల్ని పొందిక గా అమర్చి వున్నట్లున్నాడు భగవంతుడు. చక్కని కళ్ళల్లో గిరి గీసిన గర్వం కనిపిస్తోంది. అదే లేకపోతె సుభద్ర ని ప్రపంచం కన్నెత్తి చూడటం మాట అటుంచి పన్నెత్తి పలకరించడం కాదేమో?
    తెల్లని చీర, ఆ తెలుపుకు పోటీ పడుతూ అదే రంగు జాకెట్లు తల్లో మల్లెలు ఫక్కు మంటుంటే పలు వరుసలు తళుక్కు మంటున్నాయి. సుభద్ర స్త్రీ. అందరి ఆడవాళ్ళు చేసే పనే తనూ చేసింది. అందంగా అలంకరించుకుని భర్త కోసం కాపు కాయడం లో తనేవీ కొత్తగా, వింతగా చేయలేదు.
    ప్రొద్దు పోతుంటే గోపాలం వచ్చాడు. కాళ్ళకు నీళ్ళు అందించి భర్త వైపు చూసింది. గోపాలం హడావుడి గా వచ్చేసి వంట యింట్లో పీట మీద కూర్చుండి పోయాడు! 'చాలా ఆకలిగా వుంది సుభద్రా! కొంచెం అన్నం పెట్టు!"
    సుభద్ర ఆశ్చర్యంగా అంది: 'ఎటూ కాని వేళ యెద్దు యీనిందన్నట్టు గా కొంచెం ఆగండి. శ్రీనివాస్ కూడా వచ్చే వేళ అయింది. కలిసి తిందురు గాని?'
    గోపాలం తలదించుకుని లోపలికి అడుగు వేశాడు. అతని వెనకాలే అడుగు వేసింది . పట్టే మంచం మీద వెనక్కు వాలి పడుకున్న భర్తకి దగ్గరగా వచ్చింది . సరస్వతి యింకా రానే లేదు. శ్రీనివాస్ చీకటి పడితే గానీ రాడు. అయినా ఈడేరిన పిల్లలు సాహసంగా, సంస్కారం లేనట్టుగా రానే రారు. అందులో శ్రీనివాస్ విషయం వేరే చెప్పనవసరం లేదు నిశ్చింతగా భర్త వున్న ఆ గదిలో ఆలోచిస్తూ కూర్చుంది. ఉన్నట్లుండి అతని గుండెల మీద తల ఆన్చి మెడ చుట్టూ చేతులు వేసి చాలా ఆశగా, ఆత్రంగా చూసింది సుభద్ర. గోపాలం కళ్ళు మూసుకున్నాడు. 'ఎంతపని చేశాను నిన్ను. యింత పసిదాన్ని కట్టుకుందుకు నాకు మనసు యెలా వోప్పింది? యే దేవుడు రాశాడమ్మా నీ ముఖాన యిటు వంటి రాత? పోనీ నిన్ను మరెవరైనా.....' గోపాలం మరీ సాహసించి ఆలోచించలేక పోయాడు. అతని గుండెల్లో భయం అంకురించి శరీరాన్నీ మెదడు నీ ఆవరిం చేసి అతన్ని మాట్లాడనీయడం లేదు.
    "యేవండీ వొంట్లో బాగు లేదా?'  సుభద్ర నెమ్మదిగా అడిగింది.
    అతను పక్కకి తిరిగి పడుకున్నాడు. 'నిజమే సుభద్రా నాకే ఏమిటో చాలా నీరసంగా ఉంది. అందుకే ఆకలి అంటూ వచ్చాను. అది ఆకలి కాదేమో అసలు నాకు కాళ్ళలో శక్తి లేకుండా పోతోంది!' అతనికి సుభద్ర మొహంలోకి చూసేందుకే భయంగా వుంది.
    'కొంచెం కాఫీ పెట్టి యివ్వనా? అమృతాంజనం రాయమంటారా? ఏం చెయ్యమంటారు నన్ను, సుభద్ర కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయి. భర్త కి ఏ విధంగానూ సహాయం చేయలేక పోతున్నానేమో అనిపిస్తోంది. కాలు కాలిన దానిలా పదేపదే తిరుగుతోంది. గోపాలం మనసు మరిగి పోతోంది 'నేను నిన్నింక సుఖ పెట్టలేను ' నీ బాధ ని అర్ధం చేసుకోవాలను కున్నా నిన్ను ముట్టుకుంటే నే సరస్వతి జ్ఞాపకం వస్తోంది. నాకు చావాలని వుంది. నిన్నింత అన్యాయం చేయలేక పొతే ఏం? అని. కానీ అదీ చేత కావడం లేదు. పిరికివాడిని బ్రతికినన్నాళ్ళూ దాని వుసురు పోసుకున్నాను. యిప్పుడు నీ వుసురు తగలకుండా వుంటుందా నాకు. అతని మాటలు గొంతు తెగి రావడం లేదు, బయటికి!' నిన్ను తాకాలని లేదు, నాకు వట్టి దౌర్భాగ్యుడిని నేను.' గోపాలం మంచం మీద లేచి కూర్చుని శూన్యం లోకి చూస్తుంటే సుభద్ర వచ్చి అతని మొహం లోకి చూచింది.
    గోపాలం కళ్ళు నిశ్చలంగా అలాగే వున్నాయి. సుభద్ర వేడి నిట్టుర్పు లూ, నిరాశగా నొచ్చు కోవడం అతని చెవి వరకూ వెళ్ళినా వాటిని మెదడు గ్రహించడం లేదు.
    వుండ బట్టలేక అంది ఆఖరికి! 'యేవండీ నేనంటే మీకు యిష్టం లేదా? ఆ రోజు అన్నిటికీ వొప్పుకుని చేసుకున్నారు. నాతొ మాట్లాడండి!'
    గోపాలం అన్నాడు : 'నీకు యెవరు చెప్పారు నిన్ను వుపేక్ష చేస్తూ మాట్లాడడం లేదని? ఈ మధ్య నాకు మనసు బాగు లేదు సుభద్రా.'
    'కళ్ళు మూసుకున్నా తెరచినా జానకే కనిపిస్తోంది. నిన్ను యెందుకు చేసుకున్నానో అర్ధం లేకుండా.'
    తలెత్తి నిర్ఘాంత పోయింది. అంటే.... అంటే?'
    'నన్ను మన్నించు సుభద్రా. నీ ఇష్టంతో నువ్వేది చేసినా నాకు యిష్టమే అవుతుంది అది. నేను నీకు చేసిన అన్యాయానికి నువ్వేది చేసినా భరిస్తాను. అప్పుడు గానీ, శాంతి వుండదు నాకు.'
    సుభద్ర శరీరంమీద వుండి వుండి నిప్పులు కురిపిస్తుంటే వాటి తాలుకూ సెగలూ, పొగలూ గోపాలాన్ని చుట్టేశాయి. వూపిరి సలుపుకోనివ్వకుండా అతను కోలుకోలేక పోతున్నాడు అందులోంచి.
    'బ్రతుకంటే యెంత చులకన మీకు? మీరు ఆడదాన్ని యింత కన్నా యెలా అర్ధంచేసుకోగలరు? అక్కయ్య పోయి అదృష్ట వంతు రాలై పోయింది. నేను చేసింది మీకు యిష్టం కాక  మరేమౌతుంది? మీరు తిరగని భోగం వీధి లేదు. మీకు లేని వ్యసనం అంటూ లేదు. ఈ వ్యసనాల వున్నవాళ్ళు యిచ్చే సలహాలు యింత కన్నా అమోఘంగా వుంటాయా వేర్రిగాని? మీరు చేసింది చాలా ఘనకార్యం అనుకుని వుంటారు. అందుకే ఇంత అన్యాయంగా మాట్లాడారు.
    'నేను నలుగురినీ పిలిచి నలుగురి చేతా....ఛీ! యెంత మాట అన్నారు. నన్ను అందరూ నడిచిన దారిలో పడేసి మీరు చూసి ఆనందించా లను కుంటున్నారు.'
    'ఈ పని 'మీ సరస్వతి చేత చేయించండి. నన్ను మా నాన్న దిక్కు లేక పంపలేదు మీ యింటికి. మీ నీడన గౌరవం వుంటుందని, మంచి ఆశ్రయంతో బాటు సంఘం లో వున్న గౌరవాన్ని నన్ను దక్కించు కోమని చెప్పారు గానీ.....
    ఒక్కసారి మీ పితృ హృదయాన్ని తెరిచి మీ సరస్వతి కి యిలాగే మరో వ్యక్తీ చేయమంటే ఏం చేస్తారో చెబుతారా ? మాట్లాడరేం?'
    'నిజమే సుభద్రా. ఆ మనసు తోటే నిన్ను ఏదో చెయ్యమనే అన్నానే గాని ఇటు వంటి అర్ధాలు వస్తాయని నేను అనుకోలేదు.
    'సరస్వతి ని చూస్తున్నట్లే నిన్ను చూస్తుంటే నాకు మనసు లో భయం పుట్టుకు వస్తోంది. నేను ఎన్నో యిళ్ళ కి వెళ్లాను. ఎందరి నో నాకోసం నాశనం చేశాను. ఇదంతా జానకి అనారోగ్యం తరువాత. ఆ యిళ్ళ కి వెళ్ళేప్పుడు యెప్పుడూ అనిపించలేదు నాకు సరస్వతి మీద నున్న మమత. కానీ దురదృష్టం నిన్ను ఎందుకు చేసుకున్నానా అని బాధపడని క్షణం లేదు. నన్ను ఏం చేయ మంటావు?'
    సుభద్ర నవ్వింది చాలా హేళనగా. అంతకంత కు ఆవిడ లో బాధ ఉప్పెనలా పొంగుకు వస్తోంది. 'నిజమే, మీకు అలాగే అనిపిస్తుంది. అందరి యిళ్ళూ పావనం చేసి వొళ్ళు గుల్ల చేసుకుని మీకు మగతనం లేకుండా....యింకా ఏదో....'
    సుభద్ర చెంప అడిరిపోలేదు. గోపాలం కళ్ళల్లో నీళ్ళు సుళ్ళు తిరిగాయి. 'నువ్వు ఏమనుకున్నా ఫరవాలేదు. ఆ మాటలు వింటుంటే ఏదో తృప్తి. నీ చేత యింకా యింకా అనిపించు కుంటేనే నాకు మనశ్శాంతి.'
    శ్రీనివాస్ అడుగుల చప్పుడు వినిపిస్తుంటే సుభద్ర నోరు మూత వేసుకుంది. కడుపులో నరనర నరకం అనుభవిస్తూ ఏదీ చేయలేక, చేతకాక పిచ్చిదానిలా కొట్టుకు పోతోంది మనసులో చికాకు తోటి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS